అడవి బిడ్డలకు ఐఐటీ అవకాశాలు | IIT opportunities for tribal students Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అడవి బిడ్డలకు ఐఐటీ అవకాశాలు

Published Tue, Oct 19 2021 3:57 AM | Last Updated on Tue, Oct 19 2021 3:57 AM

IIT opportunities for tribal students Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అడవి బిడ్డలు 2014లో సాధించిన ఐఐటీ సీటు ఒక్కటంటే ఒక్కటే. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా 30 మంది ఐఐటీ, 59 మంది ఎన్‌ఐటీ సీట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. 2019లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 20 సీట్లు, 2020లో 48 సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులు ఈ ఏడాది 89 సీట్లు సాధించి విద్యారంగంలో పెను సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. వారి ప్రతిభా పాటవాలు కొండకోనల మధ్య అణగారిపోకుండా రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు తాజాగా విడుదలైన జేఈఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి.

గిరిజన గురుకుల కళాశాలలకు చెందిన 225 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారు. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా కళాశాలలు మూసివేయటంతో వారికి ఇబ్బంది కలగకుండా డిజిటల్‌ మాధ్యమాల ద్వారా అధ్యాపకులు శిక్షణ కొనసాగించారు. ప్రధానాచార్యులు, అధ్యాపకులు సైతం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి స్టడీ మెటీరియల్‌ అందించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అయ్యేటట్టు గిరిజన సంక్షేమ అధికారులు ప్రోత్సహించారు. ఇటువంటి గట్టి ప్రయత్నాల కారణంగా 225 మంది విద్యార్థుల్లో 214 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు.

వారిలో 9 మంది నేరుగా ఐఐటీకి అర్హత సాధించారు. మరో 21 మంది విద్యార్థులకు ప్రిపరేటరీ కోర్స్‌ (ఏడాదిపాటు ఐఐటీ నిపుణులతో శిక్షణ) అనంతరం మళ్లీ ఎటువంటి అర్షత పరీక్ష లేకుండా నేరుగా ఐఐటీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. మరో 59 మంది విద్యార్థులు 7 వేల లోపు ర్యాంకులు సాధించారు. వీరికి జేఈఈ మెయిన్స్‌ ద్వారా వచ్చిన ర్యాంకులతో ఎన్‌ఐటీకి అర్హత లభించింది.

సాంకేతిక సహకారం అందిస్తాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండె ప్రోత్సాహంతో రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించడం ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన గిరిజన గురుకులాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు. ఐఐటీ, ఎన్‌ఐటీ సీట్లుకు అర్హత సాధించిన గిరిజన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పొరపాటున కూడా అవకాశాలు కోల్పోకుండా చూసేలా సాంకేతిక సహకారం అందిస్తాం. మాక్‌ కౌన్సెలింగ్‌లో నిపుణులతో తగిన సాంకేతిక తోడ్పాటును అందించి అవగాహన కల్పిస్తాం. ఐఐటీ, ఎన్‌ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు మొదటి ఏడాది ఫీజు చెల్లించడంతోపాటు ల్యాప్‌టాప్‌ కూడా అందిస్తాం. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోను ప్రభుత్వం అందించిన సహకారంతో రాణించిన విద్యార్ధులందరూ జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించి మంచి భవిష్యత్‌ పొందాలి.         – కె.శ్రీకాంత్‌ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement