tribal students
-
గిరిజన విద్యార్థినులకు తప్పిన ప్రాణాపాయం
సాక్షి,పాడేరు: కలుషిత ఆహారం తిని ఆస్వస్థతకు గురైన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు ప్రాణాపాయం తప్పింది. అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రితో పాటు కిల్లోగుడ పీహెచ్సీ వైద్యబృందం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం 61మంది విద్యార్థినులు అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. 26మంది విద్యార్థినులు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. గుడ్డుకూర, రసంతో కూడిన అన్నం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు 79మంది తీవ్ర అçస్వస్థతకు గురైన ఘటనపై శనివారం ఉదయం కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్ విచారించారు. ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణ సక్రమంగా లేదంటూ గిరిజన సంక్షేమ డీడీ కొండలరావు పనితీరుపై కలెక్టర్ మండిపడ్డారు. జామగుడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు ఆస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడంతో మిగిలిన విద్యార్థినులను వారి తల్లిదండ్రులు శనివారం ఇళ్లకు తీసుకెళుతున్నారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: అరకు ఎంపీ అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమపాఠశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్‌పాయిజన్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఆమె శనివారం పరామర్శించారు. ఆమె డాక్టర్ కావడంతో స్టెతస్కోప్‌తో విద్యార్థినులను పరీక్షించారు. ఆస్పత్రిలో అన్ని వార్డులను సందర్శించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
చిట్టి బుర్రలు..గట్టి ఆలోచనలు
రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు): చిట్టి బుర్రల్లో ఆధునిక ఆలోచనలు మొలకెత్తాయి. స్పీడ్‌గా వెళ్తున్న ట్రైన్‌కు ట్రాక్‌పై ఏదైనా అడ్డంకి ఏర్పడితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సడన్‌గా ఆగిపోయే ఇంటెలిజెంట్ ట్రైన్ ఇంజిన్.. చిన్న బటన్ సహాయంతో నడిచేలా దివ్యాంగుల కోసం రూపొందించిన స్మార్ట్ వీల్ చైర్.. మనిషికి అవసరమైన వివిధ పనులు చేసి పెట్టే ఎనిమిది రకాల రోబోలు ఆవిష్కృతమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అద్దంపడుతున్నాయి. పలువురి అభినందనలు అందుకున్నాయి. కాగా, ఇటీవల ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో నిర్వహించిన రోబోటిక్ వర్క్‌షాప్‌లో మూడు రోజుల పాటు 7, 8, 9, పది తరగతుల విద్యార్థులు శిక్షణ పొందారు. అనంతరం వారు రూపొందించిన వివిధ రకాల రోబోలను శనివారం ప్రదర్శించారు. వీటిలో స్మార్ట్ వీల్ చైర్, స్మార్ట్ షాపింగ్ ట్రాలీ, కెమెరాతో పనిచేసే స్పై రోబో, సెర్వింగ్ (ఆహార పదార్థాలు వడ్డించే) రోబో, అగ్రికల్చర్‌కు సంబంధించి హార్వెస్టింగ్ రోబో, ఇంటిలిజెంట్ ట్రైన్ ఇంజన్ తదితర ఎనిమిది రకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
అన్నం పెడ్తలేరు.. ఆరోగ్యం పట్టించుకోరు
ఆసిఫాబాద్‌రూరల్: ‘మెనూ ప్రకారం భోజనం పెడ్తలేరు.. అన్నంలో పురుగులు వచ్చినా పట్టించుకుంటలేరు.. నైట్ వాచ్మెన్ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు’ అంటూ గిరిజన విద్యార్థినులు కన్నీమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల బాలికలు సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. సుమారు ఆరు గంటలపాటు వివిధ చోట్ల నిరసన తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 600 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి పట్టించుకోకుండా వేధిస్తున్నా రని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం పాఠశాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ఎండలోనే బైఠాయించారు. విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో భోజనం సక్రమంగా పెట్టడం లేదని, నైట్ వాచ్మెన్ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. డార్మెంటరీలు శుభ్రంగా లేవని, రెండు రోజులుగా నీళ్లు రావడం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఇష్టారీతిన తమను తిడుతూ భయపెడుతుందని వి లపించారు. ఈ విషయం ఆర్సీవో దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న తమ బా ధను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రి న్సిపాల్‌ను తొలగించే వరకూ గురుకులానికి వెళ్లమ ని భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఓ విద్యార్థిని తండ్రి అరటి పండ్లు, వాటర్ప్యాకెట్లు తీసుకొచ్చి వారి ఆక లి తీర్చడం గమనార్హం. పోలీసులు, పాఠశాల టీచ ర్లు ఎంత బతిబాలినా విద్యార్థినులు మొండికేయడం.. ఎండలో విద్యార్థినుల అవస్థలు గమనించిన టీచర్లు సైతం కన్నీరుపెట్టుకున్నారు. టీచర్లను చూసి విద్యార్థినులూ కన్నీటిపర్యంతమయ్యారు. కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థినులు వెనక్కి తగ్గకుండా ఆమెకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వివిధ విద్యా సంఘాల నాయకులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సురేశ్ ఘటన స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు వినలేదు. అయితే విద్యార్థినులను సముదాయించి తీసుకురావాలని అధ్యాపకులు, ఉపాధ్యాయులపై ప్రిన్సిపాల్ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కొంత మంది అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థినులతో మాట్లాడి గురుకులానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా విద్యార్థినులు ‘భోజనం చేయమని.. ప్రిన్సిపా ల్ తొలగించే వరకు ఇక్కడే కూర్చుంటాం’ అని గేటు ఎదుట బైఠాయించారు. అనంతరం పోలీసులు వారిని సముదాయించి లోపలికి పంపించారు. కొద్దిసేపు చెట్ల కింద కూర్చున్న విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పాఠశాలలోకి వెళ్లారు. విద్యార్థినుల ఆరోపణలపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్షి్మని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తలేరు.. ప్రిన్సిపాల్‌కు చెప్పినా సమస్యలను పట్టించుకోవడం లేదు. జ్వరం వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదు. ప్రస్తుతం ఓ విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. – స్వాతి, ఇంటర్ అన్నంలో పురుగులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయి. ప్రిన్సిపాల్‌కు చెప్పినా అదే తినాలి అని చెబుతున్నారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – ఆర్తి, తొమ్మిదో తరగతి వేరే కళాశాలలో చేర్పిస్తా మా పాప నిఖిత గిరిజన గురుకులంలో ఇంటర్ చదువుతోంది. కళాశాలలో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నానని ఏడుస్తోంది. టీసీ తీసుకుని వెళ్లి వేరే కళాశాలలో చేర్పిస్తా. – రమేశ్, విద్యార్థిని తండ్రి -
ఆకాశమే హద్దుగా ప్రతిభ చాటండి
సాక్షి, అమరావతి: కృష్ణానది ఒడ్డున, దుర్గా మాత ఒడిలో గిరిజన బాలల జాతీయ క్రీడోత్సవాలు జరగడం పెద్ద సంబరమని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుట చెప్పారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీలు ప్రకృతిలో భాగమని, ఆకాశమే హద్దుగా ఆటలాడి ప్రతిభ చాటాలని, ప్రఖ్యాత క్రీడాకారులుగా రాణించాలని చెప్పారు. ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల మూడో జాతీయ క్రీడలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రేణుకా సింగ్, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర క్రీడా జ్యోతిని వెలిగించి జాతీయ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నేటి కాలంలో ఏకలవ్యుడి వంటి శిష్యులు ఎంతో మంది ఉన్నారని, మరెందరో ద్రోణాచార్యులు కూడా ఉన్నారని అన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి రేణుకా సింగ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మన రాష్ట్రంలో జరగడం గర్వకారణం గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో జరగడం గర్వించే విషయమని పీడిక రాజన్న దొర అన్నారు. గిరిజనులంటే సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో ప్రేమ అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల ఏర్పాటే ఇందుకు నిదర్శనమన్నారు. గిరిజన బాలలను విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించడానికి ఐదు జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆరు పథకాల ద్వారా గిరిజన విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. 1.26 లక్షల గిరిజన కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద 2,48,887 ఎకరాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే వి.కళావతి, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ క్రీడా పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 4344 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఏపీ గిరిజన బాలలతో ‘ధింసా’ నృత్యం కాగా ఏపీకి చెందిన గిరిజన బాలలు ప్రదర్శించిన ధింసా, లంబాడీ నృత్యాలు, తెలంగాణ బాలల గుస్సాడీ నృత్యం అందరినీ అలరించాయి. క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు దేశంలోని 22 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం పంపిన సందేశాన్ని డిప్యూటీ సీఎం రాజన్న దొర చదివి వినిపించారు. ‘స్వచ్ఛమైన మనసుతో నిర్మలంగా జీవించే గిరిజనులంతా నా కుటుంబ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉన్నతికి, అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తోంది. నవరత్నాల ద్వారా వారి అభివృద్ధి కాంక్షిస్తోంది. క్రీడాకారులకు, కోచ్‌లకు, అధికారులకు, ఈఎంఆర్ఐ స్కూల్స్ సిబ్బందికి నా శుభాభినందనలు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
Andhra Pradesh: గిరి బాలల ఆటల సంబరం
సాక్షి, అమరావతి: గిరి బాలల ఆటల పోటీలకు రాష్ట్రం సిద్ధమైంది. శనివారం గిరిజన విద్యార్థుల క్రీడా సంబరం ప్రారంభమవుతోంది. ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల మూడో జాతీయ క్రీడలు–2022కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 22 వరకు నిర్వహిస్తున్న ఈ క్రీడల ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర శుక్రవారం సమీక్షించారు. జాతీయ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్టీఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలకు 22 రాష్ట్రాల నుంచి దాదాపు 4,328 మంది విద్యార్థులు విజయవాడకు తరలివచ్చారు. ఈ పోటీలు విజయవాడ, గుంటూరు నగరాల్లో జరుగుతాయి. ప్రారంభ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరుగుతాయి. ఈ వేడుకలకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుట హాజరై సాయంత్రం 5 గంటలకు స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉపముఖ్యమంత్రి రాజన్నదొరతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మస్కట్‌గా కృష్ణ జింక.. ‘ఏక్తా’గా నామకరణం ఈ జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింకను మస్కట్‌గా ఎంపిక చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని ప్రతిబింబించేలా మస్కట్‌కు ‘‘ఏక్తా’’గా నామకరణం చేశారు. ్రప్రతి రోజూ 7 వేల మందికి భోజనాలు అందించేలా ప్రత్యేక బృందాన్ని నియమించారు. క్రీడాకారులను వేదికలకు తరలించేందుకు దాదాపు 50 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. పోటీలు ఇలా.. ఈనెల 18 నుంచి 21 వరకు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాల, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, సీహెచ్‌కేఆర్ ఇండోర్ స్టేడియం, వీఎంసీ జింఖానా స్విమ్మింగ్ పూల్‌లో క్రీడా పోటీలు జరుగుతాయి. 15 వ్యక్తిగత, 7 టీమ్ ఈవెంట్స్ ఉంటాయి. అండర్–14, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా ఈవెంట్లు ఉంటాయి. -
మోహన్ లాల్ ఉదారత.. ఆ విద్యార్థులకు 15 ఏళ్లపాటు ఉచిత విద్య
Mohan Lal Vintage Project Provide 20 Students 15 Years Free Education: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ఉంటారు. సినిమాలతో అలరిస్తున్న ఈ కంప్లీట్ యాక్టర్ తన పెద్ద మనసుతో ఉదారత చాటుకున్నారు. ఏకంగా 20 మంది విద్యార్థులకు 15 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. గిరిజన తెగకు చెందిన 20 మంది స్టూడెంట్స్‌ను సెలెక్ట్ చేసుకుని 15 ఏళ్ల పాటు వారి చదువుకయ్యే ఖర్చులను భరించనున్నారు. ఈ విద్యకు అయ్యే ఖర్చును 'విశ్వశాంతి ఫౌండేషన్'కు చెందిన వింటేజ్ పతకం ద్వారా చెల్లించనున్నారు. అలాగే వారికి నచ్చిన కోర్సుల్లో చదివిస్తామని విశ్వశాంతి ఫౌండేషన్ ప్రకటించింది. మొదటి దశగా ఈ ఏడాది 20 మందిని ఎంపిక చేశామని మోహన్ లాల్ తెలిపారు. 'విశ్వశాంతి ఫౌండేషన్ చొరవతో 'వింటేజ్' ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో మేము అట్టప్పాడికి చెందిన గిరిజన గ్రామాల్లో ఆరో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులను స్పెషల్ క్యాంప్స్ ద్వారా సెలెక్ట్ చేశాం. వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు వచ్చే 15 ఏళ్లు ఉత్తమ విద్య, వనరులు అందిస్తాం. ఈ ప్రాజెక్టులో మద్దతు ఇచ్చిన ఈవై గ్లోబల్ డెలివరీ సర్వీసెస్ కెరీర్స్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పిల్లలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాం.' అంటూ ఫేస్బుక్ పేజీలో మోహన్ లాల్ పేర్కొన్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో మోహన్‌లాల్, మల్లిక.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ -
అడవి బిడ్డలకు ఐఐటీ అవకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అడవి బిడ్డలు 2014లో సాధించిన ఐఐటీ సీటు ఒక్కటంటే ఒక్కటే. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా 30 మంది ఐఐటీ, 59 మంది ఎన్ఐటీ సీట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. 2019లో ఐఐటీ, ఎన్ఐటీల్లో 20 సీట్లు, 2020లో 48 సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులు ఈ ఏడాది 89 సీట్లు సాధించి విద్యారంగంలో పెను సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. వారి ప్రతిభా పాటవాలు కొండకోనల మధ్య అణగారిపోకుండా రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు తాజాగా విడుదలైన జేఈఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి. గిరిజన గురుకుల కళాశాలలకు చెందిన 225 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా కళాశాలలు మూసివేయటంతో వారికి ఇబ్బంది కలగకుండా డిజిటల్ మాధ్యమాల ద్వారా అధ్యాపకులు శిక్షణ కొనసాగించారు. ప్రధానాచార్యులు, అధ్యాపకులు సైతం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి స్టడీ మెటీరియల్ అందించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అయ్యేటట్టు గిరిజన సంక్షేమ అధికారులు ప్రోత్సహించారు. ఇటువంటి గట్టి ప్రయత్నాల కారణంగా 225 మంది విద్యార్థుల్లో 214 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. వారిలో 9 మంది నేరుగా ఐఐటీకి అర్హత సాధించారు. మరో 21 మంది విద్యార్థులకు ప్రిపరేటరీ కోర్స్ (ఏడాదిపాటు ఐఐటీ నిపుణులతో శిక్షణ) అనంతరం మళ్లీ ఎటువంటి అర్షత పరీక్ష లేకుండా నేరుగా ఐఐటీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. మరో 59 మంది విద్యార్థులు 7 వేల లోపు ర్యాంకులు సాధించారు. వీరికి జేఈఈ మెయిన్స్ ద్వారా వచ్చిన ర్యాంకులతో ఎన్ఐటీకి అర్హత లభించింది. సాంకేతిక సహకారం అందిస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండె ప్రోత్సాహంతో రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించడం ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన గిరిజన గురుకులాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు. ఐఐటీ, ఎన్ఐటీ సీట్లుకు అర్హత సాధించిన గిరిజన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పొరపాటున కూడా అవకాశాలు కోల్పోకుండా చూసేలా సాంకేతిక సహకారం అందిస్తాం. మాక్ కౌన్సెలింగ్‌లో నిపుణులతో తగిన సాంకేతిక తోడ్పాటును అందించి అవగాహన కల్పిస్తాం. ఐఐటీ, ఎన్ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు మొదటి ఏడాది ఫీజు చెల్లించడంతోపాటు ల్యాప్‌టాప్ కూడా అందిస్తాం. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోను ప్రభుత్వం అందించిన సహకారంతో రాణించిన విద్యార్ధులందరూ జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించి మంచి భవిష్యత్ పొందాలి. – కె.శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ -
తిరియాటి.. సదవాటి.. రాసాటి!
కేంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కొండకోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజనులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది. 6 భాషలు.. 920 పాఠశాలల్లో అమలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది. చింతూరు మండలం చట్టి పాఠశాలలో కోయ భాషలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ), శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో (సవర), విశాఖపట్నం జిల్లాలో (కొండ, కువి, ఆదివాసీ), కర్నూలు, అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1 నుంచి 3వ తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60 లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు. యవ్వ.. ఇయ్య భాషలోనే.. కోయ భాషలో అమ్మను యవ్వ అని.. నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా.. అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని.. కోడి పుంజును గొగ్గోడు అని.. పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమాణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా), బాత్ కుసిరి (ఏం కూర), దెమ్ము (పడుకో), ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు), మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతోపాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇతర భాషలపై పట్టు సాధించేందుకే.. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొందించారు. మాతృభాషలో బోధన వలన డ్రాపౌట్లు కూడా తగ్గుతాయి. – ఆకుల వెంకటరమణ, పీవో, ఐటీడీఏ, చింతూరు మాతృభాషా బోధన మంచి నిర్ణయం మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. – ముర్రం దూలయ్య, ఉపాధ్యాయుడు, జీపీఎస్ పాఠశాల, చట్టి, చింతూరు మండలం కోయభాషలో బోధన ఎంతో అవసరం కొత్తగా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయభాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబుతుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవుతుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది. – తుర్రం బాయమ్మ, గిరిజన విద్యార్థి తల్లి, చింతూరు -
సారూ.. నీకు హ్యాట్సాఫ్: 14 కిలోమీటర్లు.. రెప్పపాటు క్షణాలు
గురువు లేని విద్య గుడ్డిదని అంటారు పెద్దలు. అయితే పిల్లలపై వేధింపులకు పాల్పడే కీచకులే కాదు.. వాళ్ల బంగారు భవిష్యత్తు కోసం వ్యయప్రయాసలకూ ఓర్చే గురు బ్రహ్మలు ఉంటారనే విషయాన్ని నిరూపించారు కేరళకు చెందిన ఓ టీచర్. బయటి ప్రపంచం ముఖం ఎరుగుని గిరిజనుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి అడవి గుండా రోజూ సాగిస్తున్న ఆయన 14 కిలోమీటర్ల ప్రయాణం పదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. కొచ్చి: సుకుమారన్ టీసీ.. ఒక ఉపాధ్యాయుడు అనడం కంటే బంగారం లాంటి మనసున్న వ్యక్తి అనడం మేలు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించే మనుషుల మధ్య.. అడవిలో బతికే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం కోసమే సుకుమారన్ ఎన్నో త్యాగాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందుకే అక్కడి పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు ఆ గురువును దైవంగా గౌరవించుకుంటారు. భయపడ్డ వాళ్లతోనే.. అది జనవరి 1వతేదీ, 2001. ఆరు నెలల క్రితమే ట్రైనింగ్‌లో చేరి.. శిక్షణ పూర్తి చేసుకున్న సుకుమారన్‌కి జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం కింద వయనాడ్ జిల్లా పూలపల్లిలో పోస్టింగ్ ఇచ్చారు. అది చెక్కడీ ప్రాంతంలో బయటి మనుషులతో ఏమాత్రం సంబంధం లేని కట్టునాయ్కర్ గిరిజన ప్రజలు బతికే చోటు, పైగా 750రూ. జీతం మాత్రమే. వద్దని తల్లిదండ్రులు బతిమిలాడినప్పటికీ.. కొన్ని రోజులు చూద్దామనే ఆలోచనతో అక్కడికి చేరుకున్నాడు సుకుమారన్. ఓ సహాయకుడితో ఆ గూడెంకి చేరుకోగానే.. అక్కడి ప్రజలంతా వీళ్లను చూసి భయంతో గుడిసెల్లోకి దూరి కన్నాల్లోంచి తొంగిచూశారట. చివరికి కాళి అనే ఓ పెద్దావిడ ధైర్యం చేసి ఆరోజు తనతో మాట్లాడిందని సుకుమారన్ గుర్తు చేసుకున్నాడు. చివరికి సుకుమారన్ ఉద్దేశం తెలిశాక ఆమె సర్దిచెప్పడంతో మిగతా వాళ్లు వాళ్ల పిల్లల్ని సుకుమారన్ దగ్గరికి పంపడానికి ఒప్పుకున్నారు. 14 కిలోమీటర్లు.. రెప్పపాటు క్షణాలు సుకుమారన్ అక్కడే ఉండిపోవడానికి కారణం.. వాళ్ల అమాయకత్వం, మంచితనం. ఆ తండాలో స్కూల్ లేదు. ఆరేండ్లపాటు చెట్లకిందే పాఠాలు.. అదీ ఒక్కడే నేర్పించాడు సుకుమారన్. పూలపల్లిలో అతని రూం. అక్కడి నుంచి కట్టునాయ్కర్ తండా ఏడుకిలోమీటర్లు. రోజూ రానూ పోనూ మొత్తం 14 కిలోమీటర్లు ప్రయాణమన్నమాట. అది కూడా దట్టమైన అడవి గుండా. గజరాజులు తిరిగే ఆ ప్రాంతం గుండా వెళ్లడానికి ఫారెస్ట్ రేంజర్లే వణికిపోతుంటారు. కానీ, సుకుమారన్‌కి అది అలవాటైన ప్రయాణం. ఈ పదేళ్లలో ఎన్నోసార్లు ఏనుగుల గుంపులు, వన్యప్రాణులు తన దారికి అడ్డుపడ్డాయని అంటాడాయన. మామూలుగా అయితే అడవి ఏనుగులు మనుషులు కనిపిస్తే దాడి చేయకుండా వదలవు. కానీ, సుకుమారన్ విషయంలోనే ఇంతవరకూ అలాంటి ఘటనలు జరగకపోవడంపై అక్కడి తండా ప్రజలు ఆయన అదృష్టంగా భావిస్తున్నారు. శుభ్రతతో మొదలై.. పిల్లలపై సుకుమారన్ బాధ్యత కేవలం చదువుతోనే సాగలేదు. అక్కడి పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు శుభ్రతను పరిచయం చేసింది కూడా ఈయనే. మొదట్లో పిల్లలకు స్వయంగా గోర్లు, జుట్టు కత్తిరించడం కూడా చేసేవాడాయన. అంతేకాదు మధ్యాహ్నాభోజన పథకంలో కేరళ ప్రభుత్వం ఆ స్కూల్‌ను చేర్చే వరకు.. ఓ ఎన్జీవో సహకారంతో స్వయంగా ఆయనే వండి.. పిల్లలకు భోజనం వడ్డించేవాడు. అలాగే అక్కడి వాళ్లలో చాలామందికి బర్త్ సర్టిఫికెట్స్ లేవు. దీంతో స్థానిక అధికారులతో మాట్లాడి.. అందరికీ బర్త్ సర్టిఫికెట్లు, ఆపై చెక్కడి వార్డు పరిధిలో రేషన్ కార్డులు అందేలా కృషి చేశాడు. సుకుమారన్‌కి భార్య, ముగ్గురు పిల్లలు. కానీ, ఆ తండా పిల్లల్ని తన బిడ్డలుగానే భావిస్తుంటాడాయన. అందుకే టెంపరరీ టీచర్ సర్వీసులో ఉన్న ఆయనకు రెండుమూడుసార్లు అక్కడి నుంచి వెళ్లిపోయే ఛాన్స్ వచ్చినా.. కావాలనే వదిలేసుకున్నాడు. ‘సర్’ అని అప్యాయంగా వాళ్లు పిలుస్తుంటే.. తన నడక బాధను, మూడు నాలుగు నెలలకొకసారి ఆలస్యంగా జీతాలు అందుకుంటున్న విసుగును సైతం మరిచిపోయి సంతోష పడుతుంటానని చెప్తున్నాడాయన. చదవండి: సదువు కోసం అరిగోస -
బువ్వపెట్టించండి సారూ..
సాక్షి, ఏటూరునాగారం: గిరిజన యువతీ, యువకులను వృత్తి నైపుణ్యులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐటీడీఏ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2019 సెప్టెంబర్‌లో జీఎన్ఎం, డీఓటీ, డీఎంఎల్టీ కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానించారు. దరఖాస్తుదారులనుంచి 58 మందిని ఐటీడీఏ అధికారులు అక్టోబర్ 5న ఎంపిక చేశారు. ఇందులో 40 మందిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి జీఎన్ఎం, డీఎంఎల్టీ కోర్సుల్లో శిక్షణ నిమిత్తం పంపించారు. మిగతా వారిని వరంగల్, కరీనంగర్ వైద్య కోర్సులకు పంపించారు. అయితే హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని గిరిజన హాస్టల్స్‌లో నాలుగు నెలలుగా 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి భోజనం, వసతితోపాటు ఉపకార వేతనాలు, హాస్టల్‌కు మెస్‌చార్జీలు కూడా అందించాల్సి ఉంది. నాలుగు నెలల నుంచి ఇవ్వకపోవడంతో అక్కడి నిర్వాహకులు విద్యార్థులను చిన్న చూపు చూడడం, అందులో ఉండే డిగ్రీ విద్యార్థులకు మాంసం భోజనాలు పెట్టి వీరికి పెట్టకపోవడంతో చిన్నబుచ్చుకున్న విద్యార్థులు చదువు కూడా ఒంటబట్టని పరిస్థితి నెలకొంది. అయితే వారికి విద్యార్థులకు కావాల్సిన భోజన బిల్లులను ఐటీడీఏ నుంచి రాకపోవడంతో అక్కడున్న నిర్వాహకులు భోజనం, పాలు, టిఫిన్ వడ్డించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. మెస్‌చార్జీలు ఇస్తేగాని సరైన భోజనం పెట్టని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు లేక హాస్టల్స్ నుంచి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోజు పోయి రావడానికి బస్సు చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో బస్‌పాస్‌లు కల్పించాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏమిచేయలేక ఇంటి దగ్గర నుంచి డబ్బులు అందక కాలేజీకి పోలేని పరిస్థితి నెలకొంది. ఇటు మెస్‌చార్జీలు చెల్లించక, ఉపకార వేతనాలు అందక విద్యార్థులు కంటి నిండ నిద్ర, కడుపు తిండిలేకుండానే రోజులు వెళ్లదీస్తున్నారు. వృత్తి కోర్సులను నేర్పించడానికి తీసుకెళ్లిన అధికారులు విద్యార్థులు అలాన పాలన చూసుకోకుండా చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, పెరిగిన ఊరును వదిలేసి పట్టణంలో ఉంటున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని వినతి ఐటీడీఏ అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించి మెస్‌చార్జీలు ఇస్తేగానీ భోజనం పెట్టే పరిస్థితి లేదని విద్యార్థినులు వాపోతున్నారు. సోమవారం ఐటీడీఏ పీఓ హనుమంత్ కె జెండగేకు విన్నవించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు, బస్‌పాస్, పుస్తకాలు, యూనిఫాం, సరైన వసతులు కల్పించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. స్పందించిన పీఓ ఏపీఓ వసంతరావు ద్వారా హైదరాబాద్‌లోని హాస్టల్ వార్డెన్‌కు ఫోన్లో మాట్లాడమని ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా బిల్లులను అందించడానికి చర్యలు చేపడుతున్నామని, మా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీఓ వార్డెన్‌ను ఫోన్లో కోరారు. -
గిరిజనులకు మాతృభాషలో పాఠాలు
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే పాఠాలు బోధించడం సత్ఫలితాలను ఇస్తోంది. స్కూళ్లలో హాజరు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 920 పాఠశాలల్లో సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ‘మాతృభాష ఆధారిత బహు భాషా విద్య’ (మదర్ టంగ్ బేస్డ్ మల్టీ లింగ్విల్ ఎడ్యుకేషన్–ఎంటీఎంఎల్‌ఈ) పేరుతో ఇది అమలవుతోంది. ఒకటి, రెండు, మూడు తరగతుల్లోని దాదాపు 18,975 మంది గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలో పాఠాలు బోధిస్తున్నారు. సవర, కొండ, ఆదివాసీ, కోయ, సుగాలి పిల్లలు సొంత భాషలోనే పాఠాలు చదువుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సవర భాషలో.. విజయనగరం జిల్లాలో కొండ, కువి, ఆదివాసీ ఒడియా భాషల్లో.. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోయభాషలో.. కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో సుగాలి, లంబాడి భాషల్లో బోధన జరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్ల గిరిజన విద్యార్థులకు ఆయా భాషల్లో రూపొందించిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ టీచర్లకు స్థానిక భాషల్లో బోధనకు సహకరించేందుకు మల్టీ లింగ్విల్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా(ఎంఎల్ఈ) ఆయా భాషలు వచ్చిన వారిని పాఠశాలల్లో నియమించారు. విద్యావంతులైన స్థానిక గిరిజన యువతనే ఎంఎల్‌ఈలుగా ఎంపిక చేశారు. ఎంఎల్‌ఈలుగా ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఆయా గిరిజన భాషలు మాట్లాడగలిగే 1,027 మందిని ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.5 వేల వరకు వేతనం ఇస్తున్నారు. గిరిజన భాషల్లో బోధనకు ప్రభుత్వం రూ.42 లక్షలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తోంది. సంప్రదాయాలు, పొడుపు కథలు గిరిజన విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాల్లో ఆయా గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే అంశాలను, పొడుపు కథలను చేర్చారు. విద్యార్థులు వాటిని ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. గిరిజన భాషల్లోనే బాలసాహిత్యాన్ని అభివృద్ధి పర్చడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు ఒక్కో భాషకు రూ.13.33 లక్షల చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆరు గిరిజన భాషల్లో పొడుపు కథలు, బాలల కథలు, బొమ్మలతో కూడిన నిఘంటువులను, పదకోశాలను రూపొందిస్తున్నారు. సత్ఫలితాలు వస్తున్నాయి ‘‘ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషల్లో బోధన సాగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాం. ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే ఆయా భాషల్లో బాలసాహిత్యం, ఇతర అంశాలతో కూడిన పుస్తకాలు సిద్ధం చేస్తున్నాం’’ – వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ గిరిజన విద్యార్థుల్లో కొత్త వెలుగులు ‘‘గిరిజన విద్యార్థులకు వారి సొంత భాషలోనే పాఠాలు బోధించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. గతంలో వారికి ఆయా పాఠాలు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు సులభంగా నేర్చుకుంటున్నారు. బిడ్డలకు తల్లిపాలు ఎంత ప్రయోజనకరమో తల్లిభాషతో బోధన కూడా అంతే ఉపయోగకరం. ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో మార్పు గమనిస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం గిరిజన విద్యార్థుల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆకాంక్షిస్తున్నాం’’ – పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు, విజయనగరం జిల్లా మా పిల్లలకు ఎంతో మేలు ‘‘మా పిల్లలు గతంలో బడులకు వెళ్లినా పాఠాలు అర్థంకాక ఏమీ నేర్చుకోలేకపోయేవారు. తరగతులకు వెళ్లకుండా ఆటల్లో మునిగిపోయేవారు. ఇప్పుడు మా సవర భాషలోనే పాఠాలు చెబుతుండడంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్తున్నారు. మా సొంత భాషలోనే పాఠాలు చెబుతుండడంతో మా పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది’’ – పత్తిక సుశీల, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం జిల్లా -
‘గిరిజన విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించండి’
సాక్షి, విజయనగరం : గిరిజన విద్యార్థుల వసతి గృహాల్లో భోజన సదుపాయం కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ సక్రమంగా అమలు చేయకపోతే సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి హెచ్చరించారు. శనివారం ఆమె గిరిజన విద్య,వైద్యంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి, విద్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారన్నారు. గిరిజన విద్య కోసమే రాష్ట్ర బడ్జెట్లో రూ. 1245 కోట్లు కేటాయించిన ఎకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. గిరిజన వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
సూపర్ 60@ ఐఐటీ
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : గిరిజన విద్యార్థులకు ఐఐటీ కోచింగ్ ఇప్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.ఎం.సాయికాంత్ వర్మ తలపెట్టారు. ‘సూపర్ 60’ పేరుతో బ్యాచ్‌ను తయారు చేసి శ్రీకాకుళం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న వైటీసీలో నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం తన చాంబర్లో విలేకరుల సమావేశంలో పీఓ ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఐఐటీ, ఎన్ఐఐటీ తదితరఇంజినీరింగ్కోర్సులకు ఒక్క గిరిజన విద్యార్థి కూడా ఎంపిక కాలేదని, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తే తప్పక విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు. శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అధ్యాపకులను ఈనెల 14న ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో వారికి ప్రత్యేక పరీక్ష, వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులు బోధిస్తున్న అధ్యాపకుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. సబ్జెక్టుకు ఇద్దరు లెక్చరర్లను నియమిస్తామన్నారు. ఎంపికైన అధ్యాపకులకు డిప్యుటేషన్ పద్ధతిలో తీసుకుని వారికి వచ్చే జీతానికి అదనంగా రూ.20 వేల పారితోషికం ఇస్తామన్నారు. విద్యార్థులు ఐఐటీకి ఎంపికైతే వారి సంఖ్యను బట్టి ప్రోత్సాహంగా మరికొంత పారితోషికం ఇస్తామన్నారు. జిల్లాలో ఏ ప్రభుత్వ కళాశాల నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం 9573844699 నంబరుకు ఫోన్ చేసి ట్రైబల్ వెల్ఫేర్ డీడీని సంప్రదించవచ్చన్నారు. గురుకులం, పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక ఎంట్రన్స్ టెస్ట్‌ను పెట్టి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 60మంది, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఏనుగులను కవ్వించొద్దు... సీతంపేట ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగులకు ఎటువంటి కవ్వింపు చర్యలు చేపట్టవద్దని ఐటీడీఏ పీఓ సాయికాంత్ వర్మ తెలిపారు. చాలామంది యువకులు ఏనుగులను చూడాలని వాటి వద్దకు వెళ్లి ఫొటోలు వంటివి తీస్తున్నారని, ఇది ప్రమాదకరమన్నారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలను ట్రాకర్లు ఎప్పటికప్పుడు గమనించి సమాచారాన్ని గిరిజనులకు చేరవేస్తున్నారన్నారు. దాని బట్టి గిరిజనులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు చెప్పిన సూచనలు పాటించాలన్నారు. ఏనుగులను తరలించడానికి ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించడం జరగిందన్నారు. దీనిపై మరికొన్ని రోజుల్లో పరిష్కారం ఉంటుందన్నారు. గిరిజన అటవీ ఉత్పత్తులైన ఫైనాపిల్, పసుపు, జీడి వంటి వాటికి మార్కెట్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. -
‘రాజ’ముద్ర’ ‘సిరి’పుత్రులు
సాక్షి, సీతానగరం (పార్వతీపురం): కొండకోనల్లో నివాసం. నాగరిక సమాజానికి దూరం. పేదరికం శాపం. అక్షర జ్యోతులు వెలగవు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవు. శతాబ్ధాల తరబడి గిరిపుత్రుల సంక్షేమం కాగితాలకే పరిమితం. అడవి బిడ్డల బతుకుల్లో వెలుగులు పూయించాలి. విద్య సుగంధాలు గుబాళించాలి.. అదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకాంక్షించారు. అనుకున్నదే తడవు ఆచరణలో పెట్టారు. ఆ మహానుభావుడు ఏర్పాటు చేసిన విద్యాలయాలు గిరిజన యువతకు బంగారుబాట పరిచాయి. సీతానగరం మండలం జోగింపేటలో ఏర్పాటు చేసిన గిరిజన ప్రతిభా విద్యాలయ సముదాయం ఎందరో అడవి బిడ్డల బతుకుల్ని తీర్చిదిద్దుతోంది. తమను ఉన్నతంగా తీర్చిదిద్దిన రాజన్న రుణం తీర్చుకోలేమంటున్న గిరిపుత్రుల అంతరంగమిది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లోని గిరిపుత్రుల వెనుకబాటుకు కారణం విద్య లేకపోవడమేనని రాజన్న గుర్తించారు. సీతానగరం మండలంలో ఖాళీగా ఉన్న జోగింపేట పట్టు పరిశ్రమ కేంద్రం స్థలాల్లో గిరిజన ప్రతిభా విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పుణ్యమా అని ఉత్తరాంధ్రలోని గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యాధికారులు, బ్యాంక్ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో వెలుగుతున్నారు. బిడ్డల ప్రయోజకత్వానికి వారి కుటుంబాలు మురిసిపోతున్నాయి. అట్టడుగున ఉన్న తమను ఉన్నత స్థాయికి తెచ్చిన రాజన్నకు కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాయి. ఏటా రూ.12 లక్షల వేతనం మాది పేద గిరిజన కుటుంబం. చదివించే స్తోమత లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 2007 నుంచి 2010 వరకూ జోగింపేట ప్రతిభా విద్యాలయంలో 8 నుంచి 10 వరకూ చదివాను. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివి బీటెక్ చేశాను. ప్రస్తుతం నేను అహ్మదాబాద్‌లో ఎనలిస్ట్ మెడి ట్యాబ్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఏటా రూ.12 లక్షల వేతనంపై పని చేస్తున్నాను. – సవర గోవింద్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాతుపురం, సోంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వ్యయప్రయాసల కోర్చి ప్రాథమిక విద్యనందించారు. జోగింపేటలో ఏర్పాటు చేసిన ప్రతిభా విద్యాలయంలో 2008– 2012 విద్యాసంవత్సరంలో చదివాను. అప్పట్లో నిట్‌లో చదవడానికి అవకాశం వచ్చింది. ప్రస్తుతం దుర్గాపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నా. దివంగత ముఖ్యమంత్రి దయతో ఏటా రూ.9 లక్షలు జీతం అందుకుంటున్నాను. మేమంతా రాజన్నకు రుణపడి ఉంటాం. – పి.ప్రసాద్, కళ్ళికోట, కొమరాడ మండలం డెంటిస్టుగా సేవలు నా తల్లిదండ్రులు పోడు వ్యవసాయం చేస్తూ నన్ను ప్రాథమిక పాఠశాలలో చదివించారు. రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ప్రతిభా విద్యాలయంలో చదువుకున్నాను. అనంతరం ఆంధ్ర వైద్య కళాశాలలో బీడీఎస్ వైద్య కోర్సు చదివి.. ప్రస్తుతం విశాఖలో డెంటిస్టుగా సేవలందిస్తున్నాను. – డాక్టర్ ఎ.కనకాలమ్మ, బొద్దాపుట్, పెదబయలు, విశాఖ జిల్లా వైద్యాధికారిగా.. జోగింపేట ప్రతిభా విద్యాలయంలో 2009– 2012 విద్యాసంవత్సరంలో చదువుకుని రంగరాయ వైద్య కళాశాలలో వైద్యాధికారిగా సేవలందిస్తున్నాను. పేద కుటుంబంలో జన్మించిన నన్నింతటి వాడిని చేసిన రాజన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. – సిహెచ్.లక్ష్మణ్‌నాయక్, కనిమెర్ల, మైలవరం మండలం, కృష్ణా జిల్లా యూనియన్ బ్యాంక్‌లో ఏబీఎం మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. జోగింపేట గిరిజన విద్యాలయంలో చదివిన అనంతరం బీటెక్ చేశాను. యూనియన్ బ్యాంక్ ఏబీఎంగా ఉద్యోగం సంపాదించాను. నా తోబట్టువులను కూడా చదివిస్తున్నాను. – ఆర్.రమేష్‌రెడ్డి, పి.ఎర్రగొండ, రామవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా -
‘గిరిజనులకు’ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభ, మేధో సంపత్తిని వెలికి తీసేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందిన గిరిజన విద్యా సంస్థల విద్యార్థులను బుధవారం సచివాలయంలో మంత్రి సత్కరించారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థల్లో గిరిజన విద్యార్థులు ప్రవేశం పొందేలా ఉన్నత పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గత విద్యా సంవత్సరంలో 47 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ పరీక్షల్లో ప్రవేశం పొందగా, ఇటీవల జరిగిన ఐఐటీ పరీక్షల్లో ఎస్టీ కేటగిరీలో వందలోపు మూడు ర్యాంకులను సాధించడం గొప్ప విషయమన్నారు. 24 మంది గిరిజన విద్యార్థులు నీట్ పరీక్షలో మంచి ర్యాంకును సాధించి డాక్టర్లు కాబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో పాఠశాల ఎక్స్‌లెన్సీ కేంద్రాలున్నాయని, భవిష్యత్తులో పాత జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
జేసీ దివాకర్ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలి
సాక్షి, కర్నూలు : తెలుగు దేశం పార్టీ ‘‘మహానాడు’’ కార్యక్రమంలో ఎరుకలి కులస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలని ‘‘ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్’’ సభ్యులు డిమాండ్ చేశారు. జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలో జేసీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు బిర్లాగేట్ సర్కిల్ వద్ద ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జేసీ దివాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. -
ఆశ్రమ విద్యార్థులకు కోడికూర!
సీతంపేట : గిరిజన విద్యార్థులకు సక్రమమైన మెనూ అందించి వారిలో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఐటీడీఏ సన్నాహాలు చేస్తోంది. గతేడాది ఆగస్టులో ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ చొరవతో ఆశ్రమ పాఠశాలల విద్యార్థులందరికీ ప్రతి ఆదివారం చికెన్ కూర పెట్టేలా మెనూలో చేర్చారు. దీన్ని విద్యా సంవత్సరం ముగిసే వరకూ పక్కాగా అమలు చేశారు. ప్రతి విద్యార్థికీ వంద గ్రాముల చొప్పున చికెన్ కూర అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వారంలో రెండు రోజు చికెన్ కూర పెట్టేలా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సబ్‌ప్లాన్ మండలాలు 20 ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 14 వేల మంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులు మూడు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. పాఠశాలకు సరాసరి 250 నుంచి 650 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ చదువుతో పాటు రోజూ సరైన మెనూ అందించాలని అధికారులు నిర్ణయించారు. మిగతా ఐటీడీఏలకు భిన్నంగా కోడి కూరను వండిపెట్టారు. ఈ తరహా మెనూ సక్సెస్ కావడంతో వచ్చే విద్యాసంవత్సరంలో వారంలో రెండు సార్లు నెలకు 8 సార్లు కోడికూర ఆశ్రమ విద్యార్థులకు పెట్టనున్నారు. జూన్ 12 నుంచి అమలుకు సన్నాహాలు వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే కొత్త మెనూ అమలు చేసేలా పీవో శివశంకర్ చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో 150 మంది వరకు సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్నారు. మరో 500 మంది వరకు రక్త హీనతతో ఉన్నారు. గతంలో వైద్యశాఖ సర్వేలో విద్యార్థుల్లో కొంతమంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని గుర్తించారు. ఐదువేల మంది వరకు రక్తహీనతతో బాధపడవచ్చుననేది అనధికారిక అంచనా. విద్యార్థుల్లో ఈ తరహా లోపాలను అధిగమించడానికి రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సీతంపేట ఐటీడీఏలో నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక రోజు చికెన్ కూర పెట్టడానికి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలల్లో అమలౌతున్నది లేనిది తెలుసుకోవడానికి ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖఈలు కూడా చేశారు. పక్కాగా అమలౌతుందని గుర్తించిన పీవో ఈసారి అన్ని ఆశ్రమపాఠశాలల్లో వారంలో రెండుసార్లు చికెన్ కూర పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. పక్కాగా అమలుకు చర్యలు నెలనెలా వెన్నెలా కార్యక్రమం అనేది వినూత్న పథకం. దీనిలో భాగంగా విద్యార్థులకు గతేడాది ఆగస్టు నుంచి కోడికూర వారంలో ఒక రోజు పెట్టడం జరిగింది. ఇప్పుడు వారంలో రెండురోజులు పెట్టడానికి గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు పెట్టాం. ఇందుకు గిరిజన సంక్షేమశాఖ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తాం. – లోతేటి శివశంకర్, ఐటీడీఏ పీవో -
అమ్మను మించిన అమ్మ
తాము జన్మనిచ్చిన ఒకరిద్దరు పిల్లల్ని ఉదయం నిద్రలేపడం.. వారి అల్లరిని భరించి స్నానం చేయించడం.. టిఫిన్ తినిపించి.. హోం వర్క్ చేయించి బడికి పంపేటప్పటికే అమ్మలు అలసిపోతున్నారు. సాయంత్రం మళ్లీ పిల్లలు ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్లను నిద్రపుచ్చే వరకు అమ్మ అవస్థలు చెప్పలేం. కానీ పదకొండేళ్లుగా అనాథలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న వారిని 300 మంది ఆలనాపాలన చూస్తోంది ఈ అమ్మను మించిన అమ్మ. కేకేనగర్: వేలకు వేలు ఫీజులు పోసి చదివిస్తున్న పాఠశాలలకు వచ్చే పిల్లలు క్రమశిక్షణగా ఉండకపోతే వెంటనే ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ పంపుతున్నారు. అలాంటి రోజుల్లో అనాథ పిల్లలకు తల్లి, తండ్రి.. గురువు.. దైవం.. అన్నీ తానై నిలుస్తోంది ఓ ప్రేమమూర్తి. ఆమె తిరువణ్ణామలై జిల్లా జవ్వాదు పర్వత ప్రాంతంలోని హాస్టల్‌తో కూడిన ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి. ఈ పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు హాస్టల్లో బసచేసి చదువుతున్నారు. వారిలో చాలామంది అనాథలు. మరికొందరు సమీప ప్రాంతంలోని గిరిజనుల బిడ్డలు. 2006వ సంవత్సరంలో మహాలక్ష్మి ఈ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా వచ్చారు. మొదటిరోజు బడిలో పిల్లలన్ని చూస్తే అంతా జుట్టు పెంచుకుని, మాసిన బట్టలతో కనిపించారు. అందరూ శుభ్రంగా క్రాప్ చేసుకుని, ఉతికిన బట్టలు వేసుకుని రావాలని ఆమె పిల్లలకు చెప్పారు. మరుసటి రోజు నుంచి సగం మంది పిల్లలు స్కూలుకు రావడం మానేశారు. అసలు సంగతి ఏంటని వాకబు చేశారు. వారందరికీ క్రాప్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసింది. దీంతో ఆమె తల్లిడిల్లిపోయింది. మరుసటి రోజు నుంచి పిల్లలకు ఆమే స్నానం చేయించడం.. గోరుముద్దలు తినిపించడం.. పాఠశాల సమయం అయిపోయాక వారిని ఆడించడం మొదలుపెట్టారు. వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. చివరకు జుట్టు పెరిగి ఉన్న పిల్లలకు తానే క్రాప్ చేయడం ప్రారంభించారు. మొదట్లో తెలిసినట్లు ఎలాగో జుట్టు కత్తిరించారు. ఒకరికి క్రాప్ చేసేందుకు అరగంట పట్టింది. అయినా సరిగ్గా రాకపోవడంతో ఆమె సంతృప్తి చెందలేదు. కొద్దిరోజులు సెలూన్‌కు వెళ్లి క్రాప్ చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత పది నిమిషాల్లో క్రాప్ చేసి వారికి స్నానం చేయిస్తున్నారు. పిల్లల మొహంలో చిరునవ్వు చూడాలని.. తల్లిదండ్రులు లేని అనాథలు.. అమ్మానాన్న ఉన్నా వారికి దూరంగా ఉన్న వారిలో చిరునవ్వు చూడాలనుకున్నాను. పాఠశాలలో వారికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు.. వారికి అమ్మా నాన్న లేని లోటు తీర్చాలనుకున్నాను. వారికి సేవ చేయడంలో నాకు ఎంతో తృప్తిగా ఉంది. వారంతా నా బిడ్డలుగానే భావిస్తున్నాను. – మహాలక్ష్మి -
డిగ్రీ గురుకులాల్లో చేరాలి
► గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు రాంజీనాయక్ నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: గిరిజన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో డిగ్రీ చదువుకునే అవకాశం కల్పించిందని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రాంజీనాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటుచేసిన విద్యా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పదోతరగతి అయ్యాక చదువు మాన్పించి పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతారన్నారు. బాల్య వివాహాలు బారిన పడకుండా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీతారాం, ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల ముసుగులో మహిళా సంఘాలు
గిరిజన యువతను మావోయిస్టుల్లో చేర్పించడమే వాటి పని కొయ్యూరులో వెలసిన కరపత్రాలు కొయ్యూరు(పాడేరు) : మొదటిసారిగా మహిళా సం ఘాలపై తీవ్ర ఆరోపణలతో కరపత్రాలు వెలువడ్డాయి. స్థానిక మండల పరిషత్ ఆవరణలోని గోడపై ఈ కరపత్రం వెలుగుచూసింది. వాటిని ఎవరు అంటించారో తెలియకపోయినా విద్యార్థిని చైతన్య సంఘం పేరిట అంటించారు. మహిళా సంఘాలు కొన్ని మావోయిస్టుల ముసుగులో పనిచేస్తున్నాయని, దీనిని గిరిజన విద్యార్థులు గుర్తించాలని పేర్కొన్నారు. కళాశాల లేదా హాస్టళ్లకు చైతన్య మహిళా సంఘం, ప్రగతి శీల మహిళా సమాఖ్య తరఫున కార్యక్రమాలు చేసేందుకు బృందాలు గా వస్తారని, స్త్రీశక్తి, లేదా మహిళా చైతన్యం అంటూ మాయమాటలు చెబుతారని పేర్కొన్నా రు. ‘మీతో పాటు పాడించి వారి వెంట తిప్పు కుంటారు. సమాజంలో ఉండాల్సిన మిమ్మల్ని అడవిబాట పట్టిస్తారు.. వారి మాటల ఒరవడి, పాటల పల్లవిలో మీరంతా శ్రుతులు మాదిరిగా కలిసిపోయేలా చేస్తార’ని పేర్కొన్నారు. అమాయకంగా ఉండే పేద విద్యార్థులను ఎన్నుకుని వారికి పాఠాలు చెబుతారని, పరీక్షలు పెడతారని, తరువాత బహుమతులు ఇస్తారని ఆరోపించారు. ఇదంతా చైతన్యమని దానిని అందుకోడానికి అరుణతార మహిళా మార్గం లాంటి పుస్తకాలను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. మీ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడి పిల్లలకు భరోసా ఇస్తామని చెబుతారని, అయితే ఈ సంస్థలన్నీ కూడా మావోయిస్టు ముసుగు సంఘాలని, మిమ్మల్ని చదువు మాన్పించి అడవుల్లో తిప్పుకోవడమే వారి లక్ష్యమని తీవ్ర ఆరోపణలు చేశారు. వారి మాటలు, పాటలు కూడా విషపూరితాలని, వారి బోధన మార్గం నయవంచనేనని, తేనె పలుకులు కురిపించే చేతనలు.. పాలిచ్చే నెపంతో విషమిచ్చే పూతనలు అంటూ ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. పోస్టర్లపై సత్రజ్, దేవేంద్ర, రాజేశ్వరి, వరలక్ష్మి, శిల్ప పద్మ, సిపోరా, అన్నపూర్ణ, ఇందూ, రాధ అని పేర్కొంటూ ఫొటోలను సైతం ముద్రించారు. -
గిరిజన విద్యార్థులపై నిర్లక్ష్యమా..?
ఆగ్రహించిన కలెక్టర్ కృష్ణభాస్కర్ మరిమడ్ల(కోనరావుపేట) : ‘గిరిజన విద్యార్థులకు సరైన వసతులు లేవు. భోజనం సక్రమంగా పెట్టడంలేదు.. కనీసం విద్యాబుద్ధులు కూడా నేర్పించడంలేదు.. ఒక్క గణిత సమస్యకూ విద్యార్థులకు సమాధానం చెప్పడం లేదు. రోజూ ఏం చదు వు చెబుతున్నారు..? మీరేం చేస్తున్నారు.. గిరి జన విద్యార్థులంటే ఇంత నిర్లక్ష్యమా..?’ అని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పదో తరగతి విద్యార్థులను గణితశాస్త్రంపై ప్రశ్నలు అడిగారు. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వంటశాలలో భోజనం తయారీని పరిశీలించారు. ఎంతమంది విద్యార్థుల కోసం భోజనం తయారు చేస్తున్నారని ప్రశ్నించగా సిబ్బంది, ప్రిన్సిపాల్ సరైన సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాల పైనే దృష్టి పెట్టారని, సిబ్బంది, నిర్వాహకులు ఇలా నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఈవో రాధాకిషన్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రాయ్ ఉన్నారు. -
ఇక పాఠశాలలు లేనట్టే?
సీతంపేట : ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు ప్రాథమిక విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయేలా ఉంది. వీరి కోసం ప్రత్యేక పాఠశాలలంటూ చెప్పిన ప్రభుత్వం విఫలమైంది. పది మందిలోపు విద్యార్థులున్న గ్రామాల్లో పాఠశాలలు మంజూరు చేయడంలో సర్వశిక్షాభియాన్ చేతులెత్తేసింది. దీంతో గిరిజన గ్రామాల్లో చిన్నారులు డ్రాపౌట్లు సంఖ్య పెరుగుతుంది. గతంలో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ(నాన్‌రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్) కేంద్రాలను ఏజెన్సీలో ప్రవేశపెట్టి డ్రాపౌట్లను నివారణకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఫలితం లేదు. ఈ కోవలోనే 46 వరకు ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలు మంజూరయ్యాయని ఐటీడీఏలో విద్యాశాఖాధికారులు ఇటీవల చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో 10 నుంచి 20 మంది విద్యార్థులున్న చోట 21 పాఠశాలలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టనున్నామని చెబుతున్నారు. పది మందిలోపు విద్యార్థులున్న గ్రామాలే ఏజెన్సీలో 50కి పైగా ఉంటారుు. ఆయా గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంతో వీటిలో దాదాపు ఐటీడీఏ పరిధిలో 1500ల మంది వరకు డ్రాపౌటు విద్యార్థులు ఉంటారు. వీరికి మరి చదువులు చదువుకునే పరిస్థితి లేదు. ఎదురు చూపులు విద్యా సంవత్సరం ఆరంభమై ఆరు నెలలవుతున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు చదువులు లేకపోవడం శోచనీయం. కొండ శిఖరాల గ్రామాల్లో విద్యార్థులు మైదాన ప్రాంతాలకు పాఠశాలలకు వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో పాఠశాల ఉండి తప్పనిసరిగా బడిఈడు పిల్లలంతా బడిలో ఉండాలనే నిబంధనలున్నాయి. పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులంతా పశువుల కాపరులు, తల్లిదండ్రులతో పోడు పనులకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్.ద్వారబందం అనే గ్రామంలో 12 మంది, రంగంవలస, నాయికమ్మగూడ, చాపరాయిగూడ, మందస మండలంలోని కొంటిసాయి, చింతవీధి, కొత్తూరు మండలంలో చిన్నరాజపురం, దాపకులగూడ, ఉల్లిమానుగూడ, మెళియాపుట్టి మండలంలో రామచంద్రాపురం, భామిని మండలంలో బాండ్రాసింగి, నడింగూడ, కొత్తగూడ, గేదెలగూడ, మాండ్రంగూడ, బూర్జ మండలంలో గోపిదేవిపేట, బొమ్మిక తదితర గ్రామాల్లో పాఠశాలల్లేవు. దాదాపు 70 గ్రామాల్లో పాఠశాలలు లేవంటే ప్రాథమిక విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో అర్ధమవుతుంది. -
చెంచు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వనవాసి కల్యాణ పరిషత్‌లో మంగళవారం అనాథ చెంచు విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పరిషత్ అధ్యక్షుడు కోట దశరథం 65వ జన్మదినం సందర్భంగా అనాథ చెంచు విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు తన కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. పరిషత్ ఆవరణలో 10 మొక్కలు నాటారు. కార్యక్రమంలో దశరథం, యాదమ్మ, దశరథం కుమారులు యాదగిరి, భాస్కర్, రాజేందర్, కిషోర్ ఉన్నారు. -
విద్య అటకెక్కుతోంది
రెండేళ్లు దాటినా మంజూరు కాని గురుకుల డిగ్రీ కళాశాల ఇంటర్‌తో ఇంటిముఖం పడుతున్న గిరిజన విద్యార్థులు అమలు కాని జీవో మన్యంలో ఉన్నత విద్య అటకెక్కుతోంది. ఏటా ఐదువేల మంది గిరిజన విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులవుతున్నారు. వారిలో 3000 మంది వరకు ఇంటర్లో చే రుతున్నారు. అయితే ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ చదివేవారు కనీసం 25 శాతం కూడా ఉండడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇంటర్‌తో ఇంటిముఖం పడుతున్నారు. రాష్ట్రంలో గురుకులం తరపున డిగ్రీ కళాశాలలు లేకపోవడమే ఇందుకు కారణం. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులం నుంచి బాలికల డిగ్రీ కళాశాలను గూడెంకొత్తవీధిలో ఏర్పాటుకు అనుమతి ఇస్తూ జీవో 25ను విడుదల చేసింది. ఆర్థికశాఖ క్లీయరెన్స్ కూడా అయింది. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. - కొయ్యూరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న గిరిజనులు త క్కువనే చెప్పాలి. మెరిట్ ఉన్నవారికి గురుకుల జూనియర్ కళాశాలల్లో సీట్లు వస్తున్నాయి. లేని వారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారు. అక్కడ వారికి స్కాలర్ వస్తుంది తప్ప మరేం ఉండదు. గురుకుల కళాశాలల నుంచి ఇంటర్ పూర్తి చేస్తున్న వారు డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు గురుకుల డి గ్రీ కళాశాలలు లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివితే గిరిజన విద్యార్థులకు స్కాలర్ మినహా ఇతర సౌకర్యాలు ఉండవు. దీంతో పేదరికంలో ఉండేవారు డిగ్రీ చదవకుండానే ఇంటర్‌తో ఆపేస్తున్నారు. ఇలా ఆపేస్తున్నవారి సంఖ్య75 శాతం వరకూ ఉంది. అదే గురుకుల డిగ్రీ కళాశాల ఉంటే ఎక్కువమంది చదువుకునే వీలుంది. అన్ని సౌకర్యాలు అందుతాయి. గురుకుల తరఫున డిగ్రీ కళాశాల ఉండాలని ఎప్పట్నుంచో అనేక మంది వినతులు ఇస్తున్నారు. బాలరాజు మంత్రిగా ఉన్న సమయంలో గూడెంకొత్తవీధిలో డిగ్రీ కళాశాల గురుకులం నుంచి ఏర్పాటు చేస్తూ అనుమతి ఇచ్చారు. దీనిపై జీవో 25ను విడుదల చేశారు. ఆర్థిక శాఖ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా అనుమతి ఇచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అది అటకెక్కింది. ముందు ప్రభుత్వం ఇచ్చిన దానిని కూడా నిలిపివేసింది. రాష్ట్రంలో గురుకులం తరపున కూడా డిగ్రీ కళాశాలలు లేవు. మొదటిసారిగా మన్యంలో ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూలపేట పంచాయతీ మర్రిపాలెంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉంది. బాలరాజు మంత్రిగా ఉండగా దానిని గూడెంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. గురుకులం నుంచి డిగ్రీ కళాశాలను ప్రతిపాదించామని, దీనికి అనుమతులు రావలసి ఉందని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. నిలిపివేత దారుణం బాలికలు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష ్యంతో గూడెంలో గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేశాం. అయితే ప్రభుత్వం మారిన తరవాత దాని నిర్మాణాన్ని నిలిపివేసింది. ఈ ప్రాంతంలో డిగ్రీ క ళాశాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకుంటే ఇంటర్‌తో బాలికలు చదువును మానేస్తున్నారు. -పి.బాలరాజు, మాజీ మంత్రి అసెంబ్లీలో లేవనెత్తుతా గురుకులం నుంచి బాలికలకు డిగ్రీ కళాశాల అవసరం ఉంది. దీనిని ఏర్పాటు చేస్తే ఉన్నతవిద్యను అభ్యసించే గిరిజన బాలికల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం వెంటనే దీనిని ఏర్పాటు చేయాలి. త్వరలో జరిగే పాలకవర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రస్తావిస్తా. -గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే -
చదవాలంటే నడవాల్సిందే..
పై చదువులకోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజన విద్యార్థులు మెదక్‌రూరల్: చదువుపై మక్కువతో గిరిజన విద్యార్థులు కిలో మీటర్ల మేర నడుస్తున్నారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..పాఠశాలకు సమయానికి చేరుకోవాలనే ఆత్రుతతో కాలినడకన పరుగులు పెడుతున్నారు. తం డాల్లో ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్న గిరిజన విద్యార్థులు పై చదువులు చదవాలంటే కిలో మీటర్ల పాదయాత్ర తప్పడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా..గిరిజన తండాలకు రవాణా సౌకర్యం మాత్రం కల్పించడం లేదు. దీంతో గిరిజన విద్యార్థులు కిలో మీటర్ల మేర దూరం నడుస్తూ విద్యాభ్యాసం చేస్తున్న మెదక్ మండలంలోని గిరిజన విద్యార్థుల చదువుల గోసపై సాక్షి కథనం.. మెదక్ మండలం హవేళి ఘణాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలో హవేళి ఘణాపూర్ తండా, శేరిగడ్డ తండా, భరతమాత తండా, ఉప్పుతండా, బద్యాతండా, ఔరంగాబాద్ తండాలున్నాయి. శుక్లాల్పేటతండా, సుల్తాన్పూర్ తండా, శాలిపేట, బి.భూపతిపూర్, అవుసులపల్లి, బ్యాతోల్ లింగ్సాన్‌పల్లి గ్రామాలున్నాయి. ఆయా తండాలతోపాటు గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్న విద్యార్థులు సుమారు 300మంది హవేళిఘణాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వస్తుంటారు. గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం లేక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన వస్తుంటారు. కొద్దిమంది మాత్రం సైకిళ్లపై వస్తుంటారు. మెదక్ మండలంలోని అన్ని మారుమూల గ్రామాలు, తండాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వర్షం కురిసినా...ఎండలు మండిన విద్యార్థులు నానా పాట్లు పడుతూ పాఠశాలకు చేరుకుంటున్నారు. ఇక విద్యార్థినులు అవస్థలు అన్నిఇన్నీ కావు. కిలో మీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో అంతదూరం నడవకలేక మధ్యలోనే మానేస్తున్నారు. ప్రచారమే తప్ప..కనీస వసతులు లేవు ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపాలంటూ బడిబాట కార్యక్రమంలో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మారుమూల గ్రామాలు, గిరిజన తండాల విద్యార్థుల సౌకర్యార్థం రవాణా సౌకర్యం కల్పించడం లేదు. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు బస్సులను మారుమూల గ్రామాలకు, తండాలకు నడిపిస్తుండటంతో పోషకులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో అప్పులపాలవుతున్నప్పటికీ పిల్లల భవిష్యత్‌కోసం భారం మోస్తున్నారు. ప్రభుత్వం మారుమూల గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఆరుకిలోమీటర్లు నడుస్తున్నా.. హవేళిఘణాపూర్ జెడ్పీహెచ్ఎస్లో 7వ తరగతి చదువుతున్నా. తండా నుంచి ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తూ బడికి వస్తున్నా. వర్షంపడితే తడిసిపోవాల్సి వస్తోంది. పుస్తకాలు కూడా తడిసిపోతున్నాయి. ఇబ్బందులుపడాల్సి వస్తోంది. -గణేష్, 7వ తరగతి, ఔరంగాబాద్తండా అలసి పోతున్నాం.. హవేళిఘణాపూర్‌లోని జెడ్పీహెచ్ఎస్లో 6వ తరగతి చదువుతున్నా. సమయానికిపాఠశాలకు చేరుకోవాలని ఉదయాన్నే బయల్దేరినప్పటికీ పరుగులు పెట్టాల్సి వస్తోంది. పాఠశాల నుంచి ఇంటికి ఆరు కిలోమీటర్లు. దీంతో కాళ్లు నొప్పులు పెడుతున్నాయి. ఇంటికి వెళ్లే సరికి అలసి పోతున్నాం. ప్రభుత్వం మాలాంటి వారికోం స్కూల్ బస్సులు వేస్తే బాగుంటుంది. -అంబిక, 6వ తరగతి, ఔరంగాబాద్ -
బంజారాల ప్రగతికి కృషి
► గిరిజనతండాల్లో ఇంటింటికీ తాగునీరు ► ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ► పంచాయతీలుగా గిరిజన తండాలు: జూపల్లి షాద్‌నగర్: బంజారాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈడెన్ప్లాజాలో ఏర్పాటు చేసిన బంజారా భేరి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బంజారాలు పోషించిన పాత్ర ఎంతో కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు కోరినవి, కోరని ఎన్నో హామీలను అమలు చేస్తుందన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతుందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఒకే సంవత్సరం 50 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. పేదలకు ఉచితవైద్యం... రాష్ట్రంలోని పేదలకు ఉచిత వైద్యం అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొం దిస్తుందని మంత్రి ఈటల ఈ సందర్భంగా తెలపా రు. ప్రమాదవశా త్తు కా ర్మికులు మరణిస్తే వారికి రూ. 6 లక్షల బీ మాను అందచేస్తుందన్నారు. బం జారా పూజారులకు జీతాలు అందచేయాలని నా యకులు కోరారని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇ ప్పటి వరకు ప్రభుత్వం 206 జీఓలు విడుదల చేస్తే అందులో 100పైగా జీఓ లు పేదవారి సంక్షేమం కోసం విడుదల చేసినవేనన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట: మంత్రి జూపల్లి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే యోచనతో రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామన్నారు. రిజర్వేషన్శాతం పెంచాలి: ఎమ్మెల్సీ రాములునాయక్ అనంతరం ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్‌ను పెంచాలని కోరారు. గిరిజన తండాల్లో ఉన్న దేవాలయాలకు దూప దీప నైవేద్యాలు లేవన్నారు. సబ్‌ప్లాన్ సక్రమంగా అమలు కావాలంటే తండాల్లో డెవలప్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ గిరిజనులు శ్రమజీవులు, వారికి కేటాయించిన పథకాలను సద్వినియోగం చేసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీస్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టూనాయక్, జిల్లా కన్వీనర్ రాంబాల్‌నాయక్, మంగులాల్‌నాయక్, వీర్లపల్లి శంకర్, జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ, ఎంపీపీ బుజ్జి, అందెబాబయ్య, కందివనం సూర్యప్రకాష్, వెంకట్రాంరెడ్డి, ఎంఎస్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల కోసం వర్కింగ్ హాస్టళ్లు!
► హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలలో పది హాస్టళ్ల నిర్మాణం ► పురుషులు, మహిళల కోసం అయిదేసి చొప్పున ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: గిరిజనుల కోసం త్వరలోనే వ ర్కింగ్ మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న గిరిజనుల కోసం ఈ హాస్టళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తమ సొంత ప్రాంతాలకు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆయా పట్టణాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ హాస్టళ్లను నిర్మించాలనే ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 10 వర్కింగ్ హాస్టళ్లను నిర్మించనుండగా, వాటిలో సగం పురుషులకు, సగం మహిళలకు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ నగరాలు, రంగారెడ్డి పరిసర ప్రాంతాలు, ఖమ్మం జిల్లాలో వీటి నిర్మాణానికి స్థలాన్ని గుర్తించడంపై గిరిజనసంక్షేమ శాఖ దృష్టిని నిలిపింది. హైదరాబాద్‌లో మహిళల కోసం 3, పురుషుల కోసం 3, వరంగల్‌లో మహిళల కోసం 1, పురుషుల కోసం 1, ఖమ్మం జిల్లాలో పురుషులకు 1, మహిళలకు 1 హాస్టల్ నిర్మించనున్నారు. ఒక్కో హాస్టల్లో 200 మంది భోజన, వసతి సౌకర్యాలను పొందేలా ప్రణాళికలను రూపొందించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎస్టీసంక్షేమ అధికారులు, వరంగల్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2016-17 బడ్జెట్లో నిధులు కూడా కేటాయించేలా ఎస్టీ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. విదేశీ వర్శిటీ ప్రవేశ పరీక్షలకు శిక్షణ విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి అర్హత పొందేందుకు ఎస్టీ విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు శిక్షణాసంస్థలను ఎంపిక చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎస్టీ సంక్షేమ అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చారు. ఓవర్సీస్ విద్యానిధి కింద విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు సంబంధించి అన్ని ఐటీడీఏల పరిధిలో, అన్ని జిల్లాల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని, అర్హులైన ఎస్టీ విద్యార్థులంతా దీనికి నమోదు చేసుకునేలా చూడాలని ఐటీడీఏ పీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా ఎస్టీసంక్షేమ అధికారులకు సూచించారు. ప్రభుత్వ భవనాల్లోకి పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లను ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఐటీడీఏ పీవోలు, డిప్యూటీడెరైక్టర్లు, డీటీడబ్ల్యూవోలకు ఎస్టీశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. నిర్మాణంలో ఉన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవనాలను త్వరితంగా పూర్తిచేసి పీవోలు, డీడీలు, డీటీడబ్ల్యూవోలకు అందజేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. వీటి నిర్మాణానికి స్థలం దొరకని చోట జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని అవసరమైన భూమిని గుర్తించి సేకరించాలని, కొత్త హాస్టళ్ల అవసరం ఉన్నచోట అందుకు అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను ఎస్టీశాఖ ఆదేశించింది. -
రూ. 1549 కోట్లు ప్లీజ్!
సాక్షి, చెన్నై : ఆది ద్రావిడ, గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యా సహాయక ప్రోత్సాహక నగదు రూ. 1549 కోట్లను మంజూరు చేయాలని సీఎం జయలలిత కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ విభాగాల ద్వారా ఆ సామాజిక వర్గ విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యా సహాయక ప్రోత్సాహక నగదు గురిం చి ప్రస్తావించారు. 2015-16కు గాను రూ. 1295 కోట్ల మేరకు విద్యార్థులకు చెల్లించాల్సి ఉం దని, ఇందులో కేంద్రం వాటా రూ. 942 కోట్లు అని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, విద్యార్థులకు సకాలంలో నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్రం తన వంతు సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రూ.567 కోట్లు మాత్రమే మంజూరు చేసి, మిగిలిన మొత్తాన్ని బకాయిగా ఉంచారని నివేదించారు. ప్రస్తుతం రాష్ట్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని తక్షణం విడుదల చేయించాలని కోరారు. అలాగే, ఇది వరకు రూ. 1175 కోట్ల మేరకు ఈ ప్రోత్సాహక నగదు బకాయి ఉందని, పాత బకాయి మొత్తం రూ. 1549 కోట్లుకు చేరి ఉందని వివరించారు. ఈ మొత్తాన్ని తక్షణం విడుదల చేయించి, తమకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఆది ద్రావిడ, గిరిజన సామాజిక వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
'గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలి'
శ్రీశైలం ప్రాజెక్టుః గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని, వారి చదువుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని ఐటీడీఏ పీఓ ఈసా రవీంద్రబాబు అన్నారు. శనివారం ఉపాధ్యాయుల శిక్షణా తరగతుల కార్యక్రమం జరిగింది. ఐటీడీఏ తరుపున నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న జీపీఎస్ పాఠశాలలపై వరాల జల్లు కురిపించారు. స్థానిక స్వచ్చంద సంస్థ నల్లమల సొసైటీ తమ సేవలను అందిస్తున్నారని ఉపాధ్యాయులు సక్రమంగా వినియోగించుకుని వారి సూచనల మేరకు విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాఠశాలలలో మేజర్ల రిపేర్లు ఐటీడీఏ చేయిస్తుందని, వాటికి సంబంధించిన వివరాలు, ప్రతిపాదనలు వారంలోగా పంపాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులతో సత్కరించే ఆలోచనలో ఉన్నామన్నారు. అలాగే బాలల దినోత్సవం రోజున ప్రతి పాఠశాలలో బాలల దినోత్సవాన్ని జరపాలని, స్థానిక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులను, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా చేయాలని సూచించారు. వివిధ పాఠశాలలో అవలంభిస్తున్న అసెంబ్లీ, ప్రార్థన గీతాలు, జాతీయగీతం తప్పనిసరిగా అమలు చేయాలని, వీటి కోసం అవసరమైన సంగీత వాయిద్య పరికరాలను ఐటీడీఏ సమకూరుస్తుందన్నారు. ఉపాధ్యాయులు వ్యక్తిగత సెలవులపై అధికారులు అనుమతిని తమ దృష్టికి తీసుకురావాలని నెలలతరబడి పాఠశాలలకు రాని ఉపాధ్యాయులపై అధికారులు, ఆధారాలతో తెలియజేయాలని సూచించారు. ఆలా తెలియజేస్తే క్రమశిక్షణ చర్యలలో భాగంగా వేతనాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. అయితే చెంచు విద్యార్థులు విద్యాభివృద్ధి జరగాలనే ఆశయంతోనే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. -
మార్గదర్శకాలు లేని ఉపకారవేతనాలు
కేంద్ర, రాష్ట్ర వైఖరులతో గిరిజన విద్యార్థులకు అవస్థలు సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతలేని వైఖరితో వ్యవహరించడంతో వేలాదిమంది అవస్థలు పడుతున్నారు. దీనిపై సమన్వయం కొరవడి దరఖాస్తు గడువు చేరువవుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంనుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణమని రాష్ట్ర అధికారులు అంటున్నారు. వాస్తవంగా దరాఖాస్తుదారుల్లో 40శాతం మందికే కేంద్రం ఉపకారవేతనాలను తనవంతుగా చెల్లిస్తుంది. అయితే అందుకు సంబంధించి గైడ్‌లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంతో కాకుండా కేంద్రమే వీటిని నేరుగా అందించాలన్న భావనతోనే జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. దీంతో రాష్ట్రప్రభుత్వాల భూమిక ఎలా ఉండాలన్నది తెలియడం లేదని ఇక్కడి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌మెట్రిక్‌స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల (జూలై) 31 ఆఖరు తేదీ కాగా రాష్ట్రం నుంచి నేషనల్ పోర్టల్‌లో ఒక్కశాతంమంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇక ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దర ఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీగా కేంద్రం ప్రకటించింది. 2015-16లో ఈ విద్యార్థులకు నేరుగా స్కాలర్షిప్లను వారి బ్యాంక్‌ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పథకాన్ని ఏ విధంగా అనుసంధానిస్తారనే దానిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో రాష్ట్రాలకు ఎటూ పాలుపోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ‘నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్’ ద్వారా www.scholarships.gov.in వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం నిర్దేశించగా, రాష్ట్రంలో 2008 నుంచి, ఇప్పుడు తెలంగాణ, ఏపీలలో ఈ-పాస్ విధానాన్ని అమలుచేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో ఢిల్లీలో వర్క్‌షాపును నిర్వహించగా తెలంగాణ, ఏపీ నుంచి ఎస్టీశాఖ ఉన్నతాధికారులు హాజరై తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను గురించి వివరించారు. అయితే ఇప్పటికీ కేంద్రంనుంచి ఉపకార వేతనాలపై స్పష్టమైన వైఖరితో ఆదేశాలు లేక గిరిజన విద్యార్థులు కలవరపడుతున్నారు. -
నిషేధం వేటు... సమానతకు చేటు
ఐఐటీలతోపాటు, కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ వ్యతిరేక విద్వేషం పెల్లుబుకుతోంది. అవమాన భారానికి పలువురు దళిత, ఆదివాసీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మగౌరవం కోసం నిలిస్తే చాలు... ఇంటర్నల్స్‌లో కోత, ఫెయిల్ చేయడం, బహిష్కరణలు పరిపాటిగా మారాయి. మద్రాసు ఐఐటీ వేధింపు మరో రకం. ఆలోచనలకు నిషేధపు సంకెళ్లు తొడగడం. చెన్నై ఐఐటీలో వ్యక్తమైనది కంటికి కనిపించే పొగ మాత్రమే. రాజుకుంటున్న కుల వివక్షత, విద్వేషం అనే నిప్పు చాలా విద్యాసంస్థలను దహించేస్తోంది. ‘‘భారతీయులు రెండు భిన్నమైన అభిప్రాయాలతో సహజీవనం చేస్తు న్నారు. రాజ్యాంగం పీఠికలో పేర్కొన్నట్టు రాజకీయంగా స్వేచ్ఛ, సమాన త్వం, సోదర భావాలను గౌరవిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ వారి మతం బోధించే సామాజిక అసమానతల సిద్ధాంతం స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం భావాలను దరిదాపుల్లోకి రానివ్వదు’’ అని డాక్టర్ బి.ఆర్. అంబే డ్కర్ అన్నమాటలు నేటి భారత సామాజిక గమనానికి అద్దం పడుతున్నాయి. మేధో సామ్రాజ్య మణిమకుటంగా కీర్తిగాంచిన ఐఐటీల్లో కుల వివక్షతో కూడిన కుటిల రాజకీయాలు ఎన్నడో పాతుకుపోయి, నేడు ఊడలు చాచి అంతటికీ విస్తరిస్తున్నాయి. విజ్ఞానంతో, వివేచనతో ప్రగతిశీలమైన, చైతన్య వంతమైన భవిష్యత్ తరాన్ని అందించాల్సిన ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు కులం జబ్బుతో కునారిల్లుతున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇటీవల చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎస్సీ, ఎస్టీ తదితర అణగారిన వర్గాల విద్యార్థులు నిర్వహిస్తున్న ‘‘అంబేడ్కర్- పెరి యార్ స్టడీ సర్కిల్’’పై విధించిన నిషేధమే. స్టడీ సర్కిల్ విద్వేషాలను రెచ్చ గొడుతోందని, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ సంస్థ యాజమాన్యం ఈ నిరంకుశ చర్యకు పాల్పడింది. ఇది మచ్చుకి ఒకటే. నిజానికి దేశంలోని ఐఐటీలతో పాటు, పలు కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ వ్యతిరేక విద్వేషం కట్టలు తెంచుకుంటోంది. అవమాన భారాన్ని భరించలేక పలువురు దళిత, ఆదివాసీ విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తలెత్తి నిలిస్తే చాలు... ఇంటర్నల్ మార్కుల కోతలు, ఫెయిల్ చేయడం, క్రమశిక్షణ సాకుతో బహి ష్కరణ పరిపాటిగా మారాయి. మద్రాసు ఐఐటీ వేధింపు మరో రకం. ఆలోచ నలకు నిషేధపు సంకెళ్లు తొడగడం. ప్రశ్నల కొడవళ్లను మొగ్గలోనే తుంచేయ డం. హక్కుల కోసం సంఘటిత మయ్యే విద్యార్థులను బెదిరించి లొంగదీసు కునే కుటిలయత్నం. చెన్నై ఐఐటీలో వ్యక్తమైనది కంటికి కనిపించే పొగే. రాజుకుంటున్న కుల వివక్షత, విద్వేషం అనే నిప్పు చాలా విద్యాసంస్థలను దహించేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులం భారతీయులంతా ఒక్కటే ననే భావన మెదళ్లలోకి ఎక్కకుండా అడ్డగిస్తోంది. సాటి మనిషిని ప్రేమించి, ఆదరించడమనే మానవ స్వభావాన్నే ధ్వంసిస్తున్నది. పర్యవసానంగానే ఐఐటీ, ఐఐఎమ్, ఏఐఐఎమ్మెస్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కుల విద్వేషం కట్టలు తెంచుకుంటోంది. మన మేడిపండు ‘ప్రతిభ’ ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదనే వాదనతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రవేశాల నాటి నుండే వెలివేసి, అవమానాలకు గురి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రవేశం వల్లనే ఈ సంస్థల ప్రతిష్ట దిగజారుతోందని ప్రచారం సాగుతోంది. మన ఐఐటీల చరిత్ర తెలిస్తేనైనా ఇలా ప్రతిభ గురించి విర్రవీగేవారికి కనువిప్పు కావొచ్చు. అవన్నీ ఇతర దేశాల దయాదాక్షిణ్యాలతో ఉనికిలోకి వచ్చినవే. యునెస్కో సహకారంతో సోవియెట్ యూనియన్ మొట్ట మొదట బొంబాయి ఐఐటీని స్థాపించింది. చర్చనీయాంశంగా మారిన మద్రాసు ఐఐటీ నాటి పశ్చిమ జర్మనీ సహకారంతోనూ, కాన్పూర్ ఐఐటీ అమెరికా సహాయంతోనూ 1959లో ఏర్పడ్డాయి. ఢిల్లీ ఐఐటీ 1961లో బ్రిటన్ సహాయంతో ఏర్పాటైంది. నేటికీ ఇవన్నీ కేంద్రం సహా ఇతర దేశాల సహాయ సహకారాలతోనే నడుస్తున్నాయి. పోనీ పరిశోధనలోనో, నూతన ఆవిష్కర ణలలోనో గొప్ప ప్రావీణ్యాన్ని చూపుతున్నాయా? అంటే అదీ లేదు. ‘‘అమె రికా లాంటి దేశాల్లో లాగా మన దేశంలో శాస్త్ర, సాంకేతిక సంస్థలు కొత్త ఆవిష్కరణలకు పూనుకోవడం లేదు. ఇది మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన లోపం’’ అని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పల్లె రామారావు ఇటీవలే నిర్మొహమాటంగా అన్నారు. ఏ రంగంలో ఎవరు మంచి ఫలితాలను, ప్రగ తిని సాధించినా వాటిని ఇతరులకు అందించడం ద్వారానే సమాజం సమ గ్రాభివృద్ధిని సాధిస్తుంది. అయితే కుల సమాజాన్ని పెంచిపోషిస్తున్న హిందూ సమాజం తమకు అందివచ్చిన ఫలాలను ఇతరులకు పంచడానికి ముందుకు రావడం లేదు. అందుకే ఈ దుస్థితి. అసమాన పోటీలో... ఇక ఎక్కువ మార్కులు సంపాదించిన వారే ప్రతిభావంతులనే వాదననూ ముందుకు తెస్తున్నారు. ఎంట్రన్స్ టెస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ మార్కులు వచ్చినా అడ్మిషన్ వచ్చేస్తోందని, రిజర్వేషన్ల వల్లే తమతో ‘సరితూగనివాళ్లు’ తమ పక్కన కూర్చుంటున్నారనే వ్యతిరేకత ఇతర కులాల విద్యార్థుల మన స్సుల్లో బలంగా ఉన్నది. ఇలాంటి దురభిప్రాయాలను కొందరు మేధావులు పనిగట్టుకొని పెంచిపోషిస్తున్నారు. ఈ ఏడాది ఐఐటీ ఎంట్రన్స్‌కు హాజరైన 13 లక్షల మందిలో కనీసం 10 లక్షల మంది కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది ఉంటారు. ఒక్కొక్కరు సగటున లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టి ఉంటారు. ఇంత తాహతు ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడెది? లక్షలు ఖర్చు పెట్టి సీటు సంపాదిం చిన వారితో, సర్కారు బళ్లలో చదివిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పోటీపడాల్సి వస్తోంది. ఈ అసమాన పోటీని అర్థం చేసుకుని, సరిదిద్దాల్సిన బాధ్యత సమా జంపైనే ఉంది. కానీ హిందూ సమాజ కులవ్యవస్థ అందుకు అనుమతించదు. వీటన్నిటితోపాటూ నిత్యం ఎదుర్కోక తప్పని కుల వివక్ష ఎస్సీ, ఎస్టీ విద్యార్థులలో ఆత్మన్యూనతను పెంపొందింపజేస్తోంది. ఏ విద్యాసంస్థలోనైనా మొదట ప్రవేశించినప్పుడు ఏ విద్యార్థికైనా బెరుకు తప్పదు. కానీ, గ్రామీణ ప్రాంతాల, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు మరింత భయంగా సంస్థలోకి అడుగుపెడతారు. ఆ భయానికి ప్రొఫెసర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడలేక విద్యార్థులు నోరు తెరవడానికే భయపడతారు. ప్రొఫెసర్ల. విద్యార్థుల చిన్న చూపునకు గురవుతారు. పైగా వారికి సరైన గెడైన్స్ కూడా దొరకదు. అధ్యాపకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు తగినప్రాతి నిధ్యం ఉండకపోవడం మరో కీలకాంశం. ఒకవేళ ఎవరో ఒకరిద్దరున్నా దళిత విద్యార్థులకు మద్దతుగా నిలిచే సాహసం చేయలేరు. ఈ పరిస్థితి ఐఐటీలకే పరిమితమైనది కాదు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా దళితులు, ఆదివాసుల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతున్నది. గత పదేళ్లలో కొన్ని పదుల మంది విద్యార్థులు బహిష్కృతులయ్యారు. ఎందరో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వివక్ష బలిపీఠాలపై... అలాంటి వారిలో ఐఐటీ విద్యార్థులే అత్యధికం! ఒక్క కాన్పూర్ ఐఐటీలోనే గత ఐదేళ్ళలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన సుమన్. ఎంటెక్ చేసిన ఆ విద్యార్థి 2010 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు హైదరాబాద్‌కు చెందిన మాధురి. శ్రీకాంత్ అనే మరో తెలుగు విద్యార్థి ముంబై ఐఐటీలో చదువుతూ 2007లో అలాగే బలైపోయాడు. వెలుగులోకిరాని వేన వేల వేధింపులు ఎన్నో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూల్లోని వేధింపులను గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అక్కడా ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మ హత్యల ఘటనలు చాలానే ఉన్నాయి. దేశంలోనే పేరుమోసిన హెచ్‌సీ యూలో వెంకటేష్ అనే పీహెచ్డీ విద్యార్థికి ఏళ్లు గడచినా గైడ్‌ను కేటాయిం చలేదు. చదువులో ఎంతో మంచి రికార్డు ఉన్న వెంకటేష్‌కు ఆర్థికంగా ఇబ్బం దులూ లేవు. యాజమాన్యం చూపిన వివక్షకే వెంకటేష్ నిండు ప్రాణాలు బలైపోయాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, లింగంపల్లి గ్రామా నికి చెందిన వెంకటేష్ తండ్రి పోలీసు కానిస్టేబుల్. 2013 నవంబర్‌లో హాస్టల్ గదిలోనే జరిగిన ఈ ఆత్మహత్యపై సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నిజని ర్ధారణ కమిటీని వేసి, నివేదికను జాతీయ మానవహక్కుల సంఘానికి అందించింది. ఇటీవల విచారణ జరిపిన ఎన్హెచ్ఆర్సీ వెంకటేష్ కుటుం బానికి యూనివర్సిటీ చేత ఏడు లక్షల నష్టపరిహారం ఇప్పించింది. ఇది కంటితుడుపు చర్య మాత్రమే. అదేవిధంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర విద్యాలయాల్లో ‘సెం టర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ పేరిట విడిగా ప్రత్యేక స్వయంప్రతిపత్తి సంస్థలను నెల కొల్పుతున్నారు. క్రమశిక్షణ ముసుగులో వాటిలో విద్యార్థులను, ముఖ్యంగా దళిత, ఆదివాసీ విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని వెంటనే రద్దుచేసి ఒక ప్రజాస్వామిక వాతావర ణాన్ని ఈ విశ్వవిద్యాలయాల్లో కల్పించాల్సి ఉంది. మద్రాసు ఐఐటీ వివాదం తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నిపుణుల కమిటీని వేసి విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 9705566213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
విదేశాల్లో గిరిజన విద్యార్థుల చదువుకు అవకాశం
పార్వతీపురం : అంబేద్కర్ ఓవ ర్సీస్ విద్యానిధి పథకం ద్వారా గిరిజన విద్యార్థులు ఇతర దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించుటకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం నుంచి గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద 100 మంది అర్హత గల గిరిజన విద్యార్థులకు జనాభా ప్రాతిపదిక ఆధారంగా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదువడానికి అవకాశం కల్పించిందన్నా. ఆసక్తి గల గిరిజన విద్యార్థులు ఈపాస్ ఆన్లైన్ ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. దీనికి గాను(హెచ్‌టీటీపీ// డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ . ఏపీ సోషల్వెల్ఫేర్ .సీజీజీ.జీఓవీ.ఇన్)లో ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులు జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, సంబంధిత అధికారులు జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం (వయస్సు 1 జూలై 2013 నాటికి 35 సంవత్సరాలు లోపు ఉండాలి). ఆధార్ కార్డు, ఈపాస్ ఐడి నెంబర్, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు కాపీ, పదవ తరగతి/ ఇంటర్/ డిగ్రీ/ పీజీ లెవల్‌మార్కుల జాబితా, జీఆర్ఇ/జిమేట్ తత్సమాన పరీక్ష పాసైన ధ్రువీకరణ పత్రం, మార్కుల జాబితాకార్డు, టోఫెల్/ ఐ.ఇ.ఎల్.టి.ఎస్ స్కోర్‌కార్డు, ఫారెన్‌యూనివర్సిటీల నుంచి వచ్చిన అడ్మిషన్ ఆఫర్ లెటర్ (తత్సమానమైన), ఇటీవల కట్టిన టేక్స్ అసెస్మెంట్ కాపీ, జాతీయ బ్యాంకులో ఖాతా పుస్తక వివరాలు, ఫోటోస్కాన్‌చేసి అప్లోడ్ చేయాలి. విద్యార్హతలు: (పోస్టుగ్రాడ్యుట్ కోర్సులు 60శాతం మార్కులు ఉండవలెను, పీహెచ్డీ కోర్సులు 60శాతంమార్కులు ఉండవలెను), ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తించును.. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2,50,000 మించి యుండరాదు. అమెరికా, ఇంగ్లాండ్, అస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలలో మాత్రమే చదువుటకు అవకాశం కలదు. స్కాలర్షిప్ మంజూరు చేయు మొత్తము రూ. 10 లక్షలు రెండు వాయిదాలలో చెల్లింపు జరుగుతుందన్నారు. -
‘ఉపకారం’ హుళక్కేనా ?
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలోని వందలాది మంది గిరిజన విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం గిరిజన సంక్షేమ శాఖకు కోట్లాది రూపాయలు మంజురు చేస్తుంటే.. వాటిని విద్యార్థులకు అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు మంజురైన రూ.1.86 కోట్ల నిధుల్లో రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు చేయగా, మిగితా రూ.1.74 కోట్లువెనక్కి మళ్లాయంటే వారి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి8వ తరగతి వరకు చదువుతున్న గిరిజన పేద విద్యార్థులకు ఆర్థికంగా దోహదపడేందుకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తోంది. ఇందుకోసం 2014-15 సంవత్సరానికి రూ.1కోటి 86 లక్షలు కేటాయించింది. జనవరిలో గిరిజన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలి. అంతేకాక అందరికీ తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం చేయడంతో దరఖాస్తుల విషయం చాలామందికి తెలియలేదు. తెలిసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు రెండు నెలలకు పైగా పట్టింది. ఎందుకంటే చదువుతున్న పాఠశాల నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం, కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువ పత్రాలు తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలా సుమారు వెయ్యి మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, అందులో 960 మందికి స్కాలర్షిప్లు అందజేశారు. అదే అంతకుముందు సంవత్సరం రెండు వేల మందికి అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు దాదాపు నాలుగు వేలకు పైగా ఉంటారని విద్యా శాఖ అధికారుల అంచనా. ఈ లెక్కన చూస్తే ఇంకా కనీసం మూడు వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులు పెద్ద మొత్తంలో రాకపోవడానికి గిరిజన సంక్షేమాధికారులు ప్రచారం నిర్వహించకపోవడం, పాఠశాలల ప్రధానోపాద్యాయులకు సకాలంలో సమాచారం అందించకపోవడమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. వందలాది గిరిజన పేద విద్యార్థులకు విషయం తెలియక, ధ్రువపత్రాలు సమయానికి అందకపోవడంతో ఒక సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులకు అక్షింతలు...! పేద గిరిజన విద్యార్థులకు అందిచే స్కాలర్షిప్ నిధులను కనీసం యాబై శాతం కూడా ఖర్చు చేయకపోవడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, కమిషనర్ మహేశ్ ఎక్కా, ప్రిన్సిపల్ సెక్రెటరీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తుంటే పేద విద్యార్థులకు అందించకపోవడం చూస్తే మీ నిర్లక్ష్యం ఏంటో తెలిసిపోయిందని మండిపడ్డట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రూ.1కోటి 86 లక్షలు ఇస్తే అందులో 960 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు ఖర్చు చేయడంపై సీరియస్ అయ్యారని తెలిసింది. ఇప్పటికైనా పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించినట్లు సమాచారం. -
గిరిజన విద్యార్థులను కాపాడండి
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండురంగాచార్యులు కొత్తగూడెం అర్బన్: ఓ కళాశాల యూజమాన్యం మోసపూరిత ప్రచారంతో గిరిజన విద్యార్థులను చేర్చుకుని చదువు చెప్పకుండా, హాస్టల్లో సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులపాలు చేస్తున్నదని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొదమసింహం పాండురంగచార్యులు చెప్పారు. ఆయన శుక్రవారం కొత్తూగూడెం రైటర్ బస్తీలోని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక లక్ష్మీదేవిపల్లిలోని శ్రీమాన్విత ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ అండ్ పీజీ ప్రైవేటు కళాశాల యాజమాన్యం వారు హాస్టల్, లైబ్రరీ ఉచితమని చెప్పి గిరిజన విద్యార్థులను నమ్మించి చేర్చుకున్నారని చెప్పారు. ముందుగా ఒకొక్కరి నుంచి రూ.2000 వసూలు చేశారని అన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.4500, రెండవ సంవత్సరం వారికి రూ.6000, మూడవ సంవత్సరం వారికి రూ.6500 చొప్పున గిరిజన విద్యార్థుల పేరు చెప్పి ఐటీడిఏ నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. గిరిజనుల పేరు చెప్పి ఐటీడిఏల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలాల యాజమాన్యాలు ఇలా డబ్బు తీసుకుంటున్నాయని అన్నారు. శ్రీమాన్విత కళాశాల వారు కూడా పరీక్షల ఫీజు రూ.400 అని చెప్పి రూ.1500 వసూలు చేసినట్టు చెప్పారు. హాస్టల్లో విద్యార్థులే వంటలు చేసుకుంటున్నారని, గ్లర్స్ హాస్టల్‌కు కనీసం వార్డెన్ కూడా లేదని, వరుసగా మూడు రోజులపాటు ఒకే రకం కూర పెడుతున్నారని చెప్పారు. ఈ కళాశాలకు కనీసం సైన్స్ ల్యాబ్ కూడా లేదని, కరెంట్ బిల్లు కూడా విద్యార్థులే కట్టుకోవాలని కళాశాల యాజమాన్యం చెబుతోందని అన్నారు. ఇందులో కళాశాల యాజమాన్యంతోపాటు ఐటీటీఏ అధికారుల లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. ఐటీడీఏలో అధికారులను కళాశాల యూజమాన్యం ‘కొనుగోలు’ చేసిందని ఆరోపించారు. కళాశాల విషయాలు బయటకు చెబితే హాల్ టికెట్ ఇచ్చేది లేదని యూజమాన్యం బెదిరిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీమాన్విత కళాశాలతోపాటు అనేక కళాశాలల యూజమాన్యాలు ఇలాగే గిరిజన విద్యార్థులను మోసగిస్తున్నాయని అన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పరీక్షలు జరిగేంతవరకు విద్యార్థులకు వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వసతి, భోజనం కల్పిస్తామని కొదమసింహం అన్నారు. ఈ కళాశాల విద్యార్థుల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి భీమా శ్రీధర్, జిల్లా ప్రచార కార్యదర్శి పులి రాబర్ట్ రామస్వామి, మండల అధ్యక్షుడు కందుల సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్, పట్టణ నాయకులు కంభంపాటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మా మంచి పోలీసు
మెదక్ రూరల్: నిందితులను దండించడమే కాదు..అభాగ్యులకు అండగా కూడా నిలుస్తామని చాటాడో పోలీసు అధికారి. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన నలుగురు గిరిజన విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువులు పూర్తయ్యే వరకు తానే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చి తన ఔదర్యాన్ని చాటడంతో పాటు నలుగురికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెలితే... మెదక్ మండలం రాజిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి గిరిజన తండాకు చెందిన సంగీత, అనితలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు దూరమయ్యారు. సంగీత రాజ్‌పల్లి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి పూర్తిచేసి గొర్రెల కాపరిగా మారగా, అనిత మెదక్ పట్టణంలోని బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేసి గొర్రెలు కాస్తోంది. వీరికి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యారని, ఎవరైనా సాయం చేస్తే వీరి భవిత భరోసా దక్కుతుందని జనవరి 10న‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ‘మాకు చదువుకోవాలనుంది సారూ’ శీర్షికతో ప్రచురితమైన ఈ కథనాన్ని చదివిన మెదక్ రూరల్ ఎస్ఐ వినాయక్‌రెడ్డి గిరిజన బాలికలను చదివించాలని నిర్ణయించారు. ఈ మేరకు 10 రోజుల క్రితం తండాకు వెళ్లి ఆరా తీసిన ఆయన, తండాలో మరో ఇద్దరు బాలికలు కూడా చదువుకు దూరమయ్యారని తెలుసుకున్నారు. ఆ సమయంలో బాలికలు లేకపోవడంతో సోమవారం ఉదయం మరోసారి తండాకు వెళ్లారు. గిరిజనులతో సమావేశమై చదువుకు దూరమైన సంగీత, అనితలతో పాటు ఇంటర్ తొలి సంవత్సరం పూర్తి చేసి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన దివ్య, లక్ష్మిలను కూడా తాను దత్తత తీసుకుంటున్నానని, వారి చదువులు పూర్తయ్యే వరకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అప్పటికప్పుడు చేగుంట కస్తుర్బాగాంధీ పాఠశాల ప్రిన్సిపాల్‌తో ఫోన్లో మాట్లాడి సంగీతను చేర్చుకోవాలని కోరారు. అప్పటికప్పుడు సంగీతకు రూ.1000 ఇచ్చి చేగుంటవెళ్లి పాఠశాలలో చేరాలని సూచించారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంతో చదువులు మానేసిన అనిత, దివ్య, లక్ష్మిలకు ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించి కళాశాలలో చేర్పిస్తానని తెలిపారు. అంతేకాకుండా వారికి బుక్స్, బస్‌పాస్‌లతో పాటు వారికి చదువుకు అయ్యేపూర్తి ఖర్చును తానే భరిస్తానని హామీఇచ్చారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం తండా వాసులతో ఎస్ఐ వినాయక్‌రెడ్డి మాట్లాడుతూ. బడీడు పిల్లలను తప్పకుండా చదివించాలన్నారు. ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబానికే మేలు జరుగుతుందన్నారు. అంతేకాకుండా అన్ని సంక్షేమ పథకాలు అందుకోగలుగుతారన్నారు. ఎస్ఐ వెంట టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నాగరాజు తదితరులు ఉన్నారు. -
ఘోరం...
మేలిమి బంగారు తల్లులు..ఎండ పొడ సోకితేనే కందిపోయే పిల్లలు..అభం...శుభం ఎరుగని బావిభారత పౌరులు.. వారికి ప్రపంచ జ్ఞానం చెప్పి, ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన మాస్టార్లు వారి పాలిట యముళ్లలా తయారవుతున్నారు. పిల్లల మానసిక స్థితిని తెలుసుకోకుండా వారి పాలిట కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. బయటికి చెప్తే టీసీ ఇచ్చి పంపేస్తా మని భయపెడుతూ వారిని జైళ్లలో ఖైదీల మాదిరిగా పరిగణిస్తున్నారు. ఈ స్థితిలో ఎంతో పెద్ద సమస్యలైతేగాని విద్యార్థులు, తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. పండగ సెలవులు పూర్తయిన వెంటనే పాఠశాలకు రాకుండా ఆలస్యంగా వచ్చారని..ఆడపిల్లలని కూడా చూడకుండా మోకాళ్లపై వారిని నడిపించి తీవ్రగాయాల పాలయ్యేలా చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల తెలుగు మాస్టార్ ఎం.రవి అనే ప్రబుద్ధుడు విధించిన ఈ శిక్ష ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం: సంక్రాంతి సెలవులకు ఇంటికెళ్లిన విద్యార్థినులు గిరిజనులు జరుపుకొనే కొత్తల పండగ పూర్తి చేసుకుని పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. దీనిపై ఆగ్రహించిన ఆ పాఠశాల తెలుగు మాస్టార్ మూటక రవి పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన ఒక్కో విద్యార్థిని రూ.150 ఫైన్ కట్టాలని, లేదంటే గ్రౌండ్లో ఆరు రౌండ్లు మోకాళ్లపై నడవాలని ఆదేశించారు. అయితే వారంతా నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లలు కావడంతో రూ.150 కట్టలేక ఆరు రౌండ్లు మోకాళ్లపై నడిచారు. సుమారు 130 మంది పిల్లలను అలా నడిపించారు. ఇందులో కొంతమంది పిల్లలకు మోకాళ్లపై చర్మం ముక్కలూడి పుళ్లుగా మారాయి. కొంతమంది మోకాళ్లు వాచిపోయి నడవలేని స్థితికి చేరుకున్నారు. అయితే పువ్వల అశ్విని అనే విద్యార్థినికి నొప్పులు అధికం కావడంతో స్థానిక పీహెచ్సీలో చూపించారు. అక్కడ తగ్గకపోవడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి ఆదివారం తరలించారు. ఈనేపథ్యంలో ఆ విద్యార్థిని మోకాళ్ల నొప్పులతోపాటు మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించామని వైద్యాధికారి డా.వెంకటరావు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న ఐద్వా నాయకురాలు రెడ్డి శ్రీదేవి, విద్యార్థి సంఘ నాయకులు అశోక్, ముఖేష్, రవి, గిరిజన సంక్షేమ సంఘ నాయకులు పి.రంజిత్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినిని పరామర్శించారు. ఈసందర్భంగా డీడీ కేవీవీ రమణ రాయుడు తదితరులు ఏరియా ఆస్పత్రికి చేరుకుని విద్యార్థిని ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే ఎవరైనా వచ్చి అడిగితే మేమే నడిచాం...ఆలస్యంగా పాఠశాలకు వచ్చినందుకు మాకు మేమే పనిష్మెంట్ విధించుకున్నామని చెప్పాలని తెలుగు మాస్టార్తోపాటు తోటి మాస్టార్లు పిల్లలను బెదిరించినట్లు సమాచారం. ఇంతే కాకుండా బాలికల ఆశ్రమ పాఠశాలలో వయస్సు మళ్లిన ఉపాధ్యాయులకే నియామకాలు ఇవ్వాల్సి ఉండగా యువకులైన ఉపాధ్యాయులు పనిచేస్తుండడం గమనార్హం. ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఏటీడబ్ల్యూఓ ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పి.ఆమిటి ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థిని పత్తిక అశ్విని విషయంపై సమాచారం తెలుసుకున్న గుమ్మలక్ష్మీపురం ఏటీడబ్లూఓ వరలక్ష్మీ ఆదివారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు నిమిత్తం వచ్చానని, నివేదికను తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. హెచ్ఎం ఏమన్నారంటే.. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.చిన్నారావును వివరణ కోరగా ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు మోకాళ్లపై నడవడం వాస్తవమేనన్నారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులెవరూ విద్యార్థులను మోకాళ్లపై నడిపించలేదన్నారు. పాఠశాలకు సెలవుల అనంతరం ముందుగా వచ్చిన విద్యార్థులే, లేటుగా వచ్చిన విద్యార్థులను మోకాళ్లపై నడిపించారని చెప్పారు. అలాగే విద్యార్థులను మోకాళ్లపై నడిపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు మూటక రవిని వివరణ అడగగా విద్యార్థులు మోకాళ్లపై నడిచేటప్పుడు ఉన్నాను కానీ..విద్యార్థులను మోకాళ్లపై నడవమని చెప్పలేదన్నారు. పాఠశాలలో అన్ని విషయాల్లో తాను ముందుండడం వల్ల తానే నడిపించానని విద్యార్థులు తన పేరు చెబుతుంటార న్నారు. తెలుగు మాస్టార్‌ను సస్పెండ్ చేయండి విద్యార్థినులను మోకాళ్లపై నడిపించి అనారోగ్యానికి కారకుడైన తెలుగు మాస్టార్ ఎం.రవిని సస్పెండ్ చేయాలని ప్రజా, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘ నాయకులు పి.రంజిత్ కుమార్, విద్యార్థి సంఘ నాయకులు ఎ.అశోక్, ఐద్వా నాయకురాలు రెడ్డి శ్రీదేవి తదితరులు ఆదివారం ఐటీడీఏ ఇన్చార్జి డీడీ కేవీవీ రమణ రాయుడ్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా అస్వస్థతకు గురైన పువ్వల అశ్విని తల్లిదండ్రులు పువ్వల కళావతి, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చినందుకు రూ.150 ఫైన్ కట్టమన్నారని పాప చెప్పగా, కట్టేద్దామని చెప్పినా...మోకాళ్లతో నడిచేస్తానంటూ...అనారోగ్యాన్ని తెచ్చుకుందని వాపోయారు. అటువంటి ఉపాధ్యాయుడ్ని పాఠశాల నుంచి తొలగించాలని వారు కోరారు. ఈ విషయమై డీడీ మాట్లాడుతూ జరిగిన సంఘటన నేపథ్యాన్ని డీఈఓ, ఐటీడీఏ పీఓలకు ఫైల్ పెట్టామని తెలిపారు. -
చెరకు సీజన్లో ‘బడి’ని వదిలేస్తున్న గిరిజన విద్యార్థులు
జోగిపేట మార్కెట్ గంజ్ ఆవరణ.. సేదతీరుతున్న గిరిజన కుటుంబాలు..పుల్కల్ మండలంలో చెరకు కొట్టేందుకు వెళుతూ మార్గమధ్యలో వారు ఆగారు. అలా ఆగిన వారిని ‘సాక్షి’ పలకరించింది. ఆ వలసజీవులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పిల్లల్ని పాఠశాలకు పంపాలని ఉందని..అయినా తాము ఒక చోట పిల్లలు మరోచోట కష్టమనే ఇలా వెంట తీసుకె ళ్తున్నామన్నారు. చదువు మానేసిన బడిపిల్లల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మానేసిన బడిపిల్లల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చెరుకు సీజన్లో గిరిజన పిల్లలు వారి చదువులకు తప్పనిసరి పరిస్థితుల్లో దూరం అవుతున్నారు. వీరి భవిష్యత్తుపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావంతులు అంటున్నారు. ప్రతి సీజన్లో ఇలా విద్యకు దూరం కావడం వల్ల భవిష్యత్తులో వారు పూర్తి స్థాయిలో విద్యావంతులు కావడానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చెరకు సీజన్లో గిరిజనులు తమ కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తరలివెళుతుంటారు. అయితే ఇంట్లోని వారందరూ నెలల పాటు ఉండరు కాబట్టి పిల్లల్ని ఎక్కడ ఉంచేందుకు అవకాశం లేక వారిని వెంట తీసుకువెళుతున్నారు. దీంతో వారు రెండు నెలల పాటు పాఠశాలలకు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. రెండో తరగతి నుంచి 8,9 తరగతులకు చెందిన విద్యార్థులు కూడా వీరిలో ఉన్నారు. ఎక్కువగా ఈ వలసజీవులు ఎడ్లబళ్లపై అందోలు, పుల్కల్ మండల ప్రాంతాల్లో చెరకును కొట్టేందుకు వెళుతుంటారు. పాఠశాలలకు డుమ్మా ప్రతి చెరకు సీజన్లో గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలకు దూరం అవుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కంగ్టి, కల్హేర్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గం పరిధిలోని రేగోడ్ మండలానికి చెందిన వందల సంఖ్యలో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రుల వెంట చెరకు కొట్టే ప్రాంతాలకు తరలివెళుతున్నారు. దీంతో ఆయా విద్యార్థులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. తల్లిదండ్రులకు తోడుగా.. చెరకు కొట్టేందుకు వెళ్లి ఆ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. చెరకు కొట్టే సమయంలో తండ్రులకు, వంట పనులు చే సే సమయంలో తల్లులకు ఆ విద్యార్థులు సహకరిస్తుంటారు. తండ్రులు చెరకును కొట్టి ఎడ్లబళ్లపై ఫ్యాక్టరీకి తరలించే సమయంలో తల్లుల వద్ద వారి పిల్లలు తోడుగా ఉంటున్నారు. కొంత మేరకు తల్లిదండ్రులకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నా పాఠశాలను వదిలి చదువుకు దూరంగా వెళ్లడం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మా పిల్లలు చదువుకోవాలని ఉన్నా.. మా పిల్లలు చదువుకోవాలనే మాకుంటుంది, కానీ సీజన్లో కేవలం పిల్లలను ఇంటి వద్ద వదిలేసి రావడం కుదరదు. మా తండాల్లో హాస్టళ్లు లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకు వెళ్తున్నాం. పెద్ద తండాలో 60 మంది విద్యార్థులున్నా ఒకే టీచర్ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కూడా పిల్లలకు సరైన ఆహారాన్ని అందించడం లేదు. -
వైద్యులపై చర్యలు తీసుకోవాలి
కురుపాం: వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ గిరిజన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు రహదారిపై ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కురుపాం పంచాయతీ పరిధిలోని కస్పా గదబవలస గిరిజన గ్రామానికి చెందిన వంజరాపు అన్నపూర్ణ, వెంకటిల కుమార్తె వం జరాపు జయలక్ష్మి (17) పాచిపెంట మండలంలోని పి.కోనవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఈ నెల14న ఆమెకు జ్వరం రావడంతో సాలూరు సీహెచ్‌ఎన్‌సీలో కళాశాల సిబ్బంది చేర్చారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వి.ధనరాజు సిబ్బంది కలిసి విద్యార్థిని మృతదేహాన్ని స్వగ్రామానికి అంబులెన్స్‌లో మధ్యాహ్నం తీసుకు వచ్చి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో మృతదేహాన్ని చూసిన తల్లి అన్నపూర్ణ స్పృహ కోల్పోగా బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి గ్రామ సమీపంలోనే రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ జయలక్ష్మి మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారిపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చే శారు. విషయం తెలుసుకున్న కురుపాం, చిన్నమేరంగి, జియ్యమ్మవలస ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: అధికారుల హామీ మృతిచెందిన వంజరాపు జయలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఏటీడబ్ల్యూఓ మారుతి బాయి, తహశీల్దార్ ఎం. ప్రకాష్, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి ఐటీడీఏ పీఓ ప్రతినిధులుగా వచ్చి ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు, గిరిజన సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగమిస్తామని, ట్రైకార్ లోన్ ఇప్పిస్తామని మృతికి కారకులపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన కారులు శాంతించారు. అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వి. ధనరాజు సిబ్బందితో కలిసి వచ్చి మృతురాలి కుటుంబసభ్యులకు రూ.60 వేలు పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఆందోళన లో గిరిజన సంఘం నాయుకులు కోలక లక్ష్మణమూర్తి, గొర్లి తిరుపతిరావు, కోలక అవినాష్, విద్యార్థి సంఘం నాయకుడు పల్ల సురేష్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మృతిపై తహశీల్దార్ ఆరా పి.కోనవలస(పాచిపెంట):గిరిజన విద్యార్థిని జయలక్ష్మి మృతికి గల కారణాలను పాచిపెంట ఇన్చార్జి తహశీల్దార్ గిరిధర్ వైస్ ప్రిన్సిపాల్ కృష్టవేణిని అడిగి తెలుసుకున్నారు. జ్వరం సమయంలో ఏ ఆస్పత్రులకు తీసుకు వెళ్లారని ప్రశ్నించారు. దీనికి వైఎస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 14న జ్వరం వస్తే పాచిపెంట పీహెచ్‌సీకి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించామని మళ్ళీ 18న సాలూరు సీహెచ్‌సీకి తరలించామని వైద్యం పొందుతుండగా మృతి చెందినట్లు తెలిపారు. తహశీల్దార్ వెంట పి.కోన వలస వీఆర్ఓ శ్రీనివాసరావు విచారణలో పాల్గొన్నారు. -
వస్తువులు పెట్టేదెక్కడ!
ఉట్నూర్ : ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించి.. వారి విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెబుతున్న ఐటీడీఏ మాటలు క్షేత్రస్థాయిలో ఎక్కడా రుజువు కావడం లేదు. విద్యా సంవత్సరం ఆరంభమై ఏడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇంతవరకు ట్రంకు పెట్టెలు అందించిన దాఖలాలు లేవు. అదీకాక ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. అవసరం 11,406.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 38,963 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు పెట్టెలు తీసుకుని ఐదేళ్లు దాటిన విద్యార్థులకు కొత్త ట్రంక్ పెట్టెలు అందించాల్సి ఉంది. ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరంలో సుమారు 11,406 ట్రంకు పెట్టెలు అవసరమని తేల్చి ఒక్కో పెట్టెకు రూ.550 చొప్పున రూ.62 లక్షల 73 వేల 300 అవసరమని ప్రణాళికలు సిద్ధం చేసి ఆగస్టులో ప్రభుత్వానికి నివేదించారు. కానీ.. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమ శాఖకు నిధులు విడుదల కాకపోవడంతో ట్రంకు పెట్టెలకు టెండర్లు నిర్వహించలేదు. బడ్జెట్ వస్తేగానీ టెండర్లు నిర్వహించి పెట్టెలు విద్యార్థులకు అందించలేమని అధికారులు వాపోతున్నారు. విద్యార్థుల ఇబ్బందులు.. గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని 123 ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 4,500 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వీరందరికీ ఐటీడీఏ ఉచిత భోజన వసతితోపాటు నిత్యావసర వస్తువులు, మౌలిక వసతులు కల్పిస్తోంది. ఏటా ఆశ్రమాల్లో కొత్తగా చేరే విద్యార్థులకు, చేరి ఐదేళ్లు దాటిన విద్యార్థులకు కొత్త ట్రంకు పెట్టెలు అందిస్తోంది. ఈసారి ఇంతవరకూ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు, ప్లేట్, గ్లాస్, బట్టలు, పెన్నులు, చద్దర్లు, ఇతర సామగ్రి ఎక్కడ భద్రపరుచుకోవాలో తెలియక బాధలు అనుభవిస్తున్నారు. ఆర్థికంగా ఉన్న విద్యార్థులు ఇళ్ల ఉంచి పెట్టెలు కొనుగోలు చేసుకున్నారు. కొందరు తోటి విద్యార్థుల పెట్టెల్లో సామగ్రి దాచుకుంటున్నారు. అలా అవకాశం లేని విద్యార్థులేమో దుకాణాల్లో లభించే అట్టపెట్టెలను కొనుగోలు చేసి అందులో సామగ్రి పెడుతున్నారు. పిల్లలకు అన్నిరకాల వసతులు కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో ఐటీడీఏ విఫలమవుతోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
గొంతు..గొంతు ఒక్కటి చేసి..
తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నా ప్రయోజకులమవ్వాలన్న విద్యార్థుల ఆకాంక్షను పాలకులు, అధికారులు దూరం చేస్తుం టే..అక్షరాలు చదవాల్సిన గిరిజన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పాఠాలు వల్లె వేయాల్సిన నోటితో నినాదాలు చేశారు. మండుటెండలో నడిరోడ్డుపై కూర్చుని అయ్యా...మా సమస్యలు పరిష్కరించండంటూ ప్రాథేయపడ్డారు.చేయి.. చేయి..కలిపి, గొంతు..గొంతు ఒక్కటి చేసిన గిరిజన విద్యార్థులు..ఆందోళనను తీవ్రం చేశారు. వారిని వారించే పనిలో పోలీసులు తమ బలాన్ని చూపించారు. అంతే పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం సోమవారం రణరంగాన్ని తలపించింది. పార్వతీపురం: దశాబ్దాల తరబడి వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు సోమ వారం చేపట్టిన ‘ఛలో ఐటీడీఏ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేక, తమను తల్లిదండ్రుల్లా చూసుకునేందుకు పర్మినెంట్ వార్డెన్లు లేక, మరుగుదొడ్లు, నీరు, మంచాలు, వైద్యసదుపాయం తదితర మౌలిక సదుపాయాలు అందక అవస్థలు పడుతున్న విద్యార్థులు సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా విద్యార్థి సంఘ నాయకులు ఎ.అశోక్, ఎం.గణేష్ తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి బెలగాం మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేపట్టారు. దీనిలో భాగంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని వసతిగృహాలు, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కోరారు. గ్రీన్ చానెల్ ద్వారా 3 నెలలకొకసారి మెస్ బిల్లు చెల్లించాలన్నారు. పర్మినెంట్ వార్డెన్లను నియమించాలన్నారు. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో ఎగిరిపోయిన బాత్రూమ్ తలుపులు, గదుల పైకప్పులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. జీఎల్‌పురంలో పాలిటెక్నికల్ కళాశాలతోపాటు పర్మినెంట్ డీడీని నియమించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల పట్ల కనీస స్పందన లేని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చే స్తూ పాటలు పాడారు. అనంతరం పీఓ వచ్చి తమ సమస్యలు వినాలని పట్టుబట్టారు. దీంతో సీఐ బి.వెంకటరావు విద్యార్థి నాయకుల్ని పీఓ వద్దకు పంపించారు. విద్యార్థుల సమస్యలు విన్న పీఓ రజత్ కుమార్ సైనీ సమస్యల పరిష్కారం తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేయడంతో, ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనను కొనసాగించారు. ఈసందర్భంగా ఎండను తట్టుకోలేక గుమ్మలక్ష్మీపురం కళాశాలకు చెందిన బిడ్డిక మహిష్మ అనే విద్యార్థిని సొమ్మసిల్లిపడిపోవడంతో సీఐ వెంకటరావు ఆ విద్యార్థినిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించారు. అనంతరం విద్యార్థులు మూకుమ్మడిగా కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు వాహనాల్లో పడేశారు. విద్యార్థినులు పో లీసుల వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు. ఈ సందర్భంగా సీఐ వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చే శారు. అయినప్పటికీ విద్యార్థులు ససేమిరా అనడంతో కొంతమందిని రూర ల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో మిగ తా విద్యార్థులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సహచర విద్యార్థులను విడిచిపెడితేనే తాము వెళ్తామని విద్యార్థులు మొండిపట్టుపట్టారు. ఈ నేపథ్యంలో మెయిన్‌రోడ్డుపై కొంతసేపు పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడు తూ సమస్యల పరిష్కారం కోరితే పో లీసులతో తరిమి కొట్టించారని వాపోయారు. చివరకు 30 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని మిగిలిన విద్యార్థులను చెదరగొట్టి పంపించివేశారు. -
8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి పర్యటన
విశాఖ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 8, 9 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఖరారైన పర్యటన కొద్దిమార్పులు చేర్పులతో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 9న ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహించనున్న గిరిజనోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజన విద్యార్థులు, కళా బృందాలు రానున్నాయని, నగరంలో వేదిక ఖరారు కావలసి ఉందని వివరించారు. -
గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్య
ఉట్నూర్ : పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తున్న విషయం తెలిసిందే. 2014-15 విద్యా సంవత్సరానికి గాను ఐటీడీఏ పరిధిలో 92 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత వి ద్య అందించడానికి ప్రభుత్వం అనుమతించింది. దీం తో గిరిజన సంక్షేమ శాఖ పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించడానికి చర్యలు చేపట్టింది. కార్పొరేట్ కళాశాలలకు ఎంపికైన విద్యార్థులకు రెండేళ్లపాటు ఇంటర్మీడియెట్ ఉచిత విద్య, ఇతర సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అర్హులెవరంటే.. ఎస్టీ(గిరిజన) విద్యార్థులై ఉండాలి. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.రెండు లక్షలలోపు ఉండాలి. పదో తరగతలో సాధించిన ప్రతిభ ఆధారంగా కార్పొరెట్ కళాశాలల్లో ఎంపిక విధానం ఉంటుంది.ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల్లో చదివిన వారికి 50 శాతం, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి 20శాతం, జెడ్పీఎస్ఎస్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం, బెస్టుఅవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం చొప్పున సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడం ఇలా.. కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు ఈ-పాస్ అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ తెరువగానే కార్పొరేట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అందులో విద్యార్థి పదో తరగతి హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీంతో సదరు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారం వస్తుంది. దరఖాస్తు ఫారంలో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, విద్యార్థి పదో తరగతిలో సాధించిన గ్రేడింగ్, కులం, ఉప కులం, తల్లిదండ్రుల వృత్తి, చిరునామా వంటి వివరాలు పొందుపర్చాలి. దరఖాస్తులో విద్యార్థి ఫొటో ముందుగానే ఉంటుంది. దానికి ముందు ఆధార్ కార్డు(యూఐడీ), ఈఐడీ, రేషన్‌కార్డు నంబర్లు జత చేయాలి. మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు స్కానింగ్ చేసి అంతర్జాలంలో అప్లోడ్ చేయాలి. గడువు.. జూన్ 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి ఉప సంచాలకులు భీమ్ తెలిపారు. జిల్లాలో ఉన్న కళాశాలలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉన్న కార్పొరేట్ కళాశాలల వివరాలు అంతర్జాలంలో కనిపిస్తాయి. విద్యార్థులు ఏ కళాశాలలో చదవాలనుకుంటున్నారో దరఖాస్తులో ఆ కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థులో పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా అధికారులు 23వ తేదీన ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి కళాశాలలు కేటాయిస్తారు. ఉపకార వేతన దరఖాస్తు కోసం.. కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో సీటు రాని విద్యార్థుల దరఖాస్తు ఉపకార వేతన దరఖాస్తుగా మారిపోతుంది. ఇంటర్మీడియెట్‌లో విద్యార్థి ఏ కళాశాలలో చేరినా అందుకోసం మళ్లీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉపకార వేతనం పొందే అవకాశం ఉంది. -
క్రీడలకు నిధులు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ ఆధీనంలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.48.68 లక్షలు కేటాయించింది. అధికారులు టెండర్లు నిర్వహించి విద్యార్థులకు క్రీడా సామగ్రి అందించనున్నారు. క్రీడా సామగ్రి అందుబాటులో ఉండనుండటంతో విద్యార్థులు క్రీడల్లో రాణించే అవకాశం ఉంది. కేటగిరీలవారీగా నిధులు విడుదల జిల్లా వ్యాప్తంగా 123 ఆశ్రమ పాఠశాలల్లో దా దాపు 37,613 గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలను ఏ, బీ గ్రేడుల కింద 113 ఆశ్రమాలను ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో ఆశ్రమ పాఠశాలకు దాదాపు రూ.43,082 వెచ్చించి పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ప్రతీ ఆశ్రమ పాఠశాలకు ఇన్డో ర్ క్రీడల కోసం ఆరు రకాలు, ఔట్ డోర్ క్రీడల కు ఎనిమిది రకాల క్రీడా వస్తువులు, అథ్లెటిక్ క్రీడల పరికరాల్లో గ్రేడ్-ఏ ఆశ్రమాలకు 12రకా లు, గ్రేడ్-బీ ఆశ్రమాలకు 14 రకాల కీడ్రా వస్తువులు ఐటీడీఏ అందించనుంది. నిధులను కూ డా ప్రభుత్వం ఆశ్రమాలను ఏ,బీ కేటగిరీలుగా విభజించి కేటాయించింది. జిల్లాలో కేటగిరీ- ఏ కింద 19 బాలుర ఆశ్రమ పాఠశాలలను గుర్తిం చి రూ.9,99,970, కేటగిరీ-బీ కింద 57 బాలుర ఆశ్రమాలను గుర్తించి రూ.25,41,060, కేటగిరీ -ఏ కింద 22 బాలికల ఆశ్రమాలను గుర్తించి రూ.8,24,340, కేటగిరీ-బీ కింద 15 బాలికల ఆశ్రమాలు గుర్తించి రూ.5,02,950 చొప్పున విడుదల చేయనుంది. ఖాళీలు భర్తీ అయితేనే.. ప్రభుత్వ నిర్ణయం బాగుంది. ఆశ్రమ పాఠశాలల్లో గ్రేడ్-2 ఫిజికల్, పీఈటీ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ అయితేనే విద్యార్థులకు క్రీడల్లో న్యాయం జరిగే అవకాశం ఉంది. పీడీ, పీఈటీ పొస్టులు భర్తీ లేకుండా క్రీడా పరికరాలు ఇస్తే ఫ లితం ఉండదు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆశ్రమా ల్లో ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు 69ఉండగా కేవలం 19మంది విధులు నిర్వహిస్తున్నారు. 50పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. అలాగే పీఈటీ పోస్టులు 22 ఉండగా 8 మంది విధులు నిర్వహిస్తుండగా, మిగతా 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికితోడు గత ఆగస్టులో ప్రభుత్వం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో భాగంగా 28 పీడీ, 17 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. ఆశ్రమాల్లో పూర్తిస్థాయిలో పీడీ, పీఈటీ పోస్టులు భర్తీ అయితేనే క్రీడల్లో న్యాయం జరుగుతుందని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పేర్కొంటున్నారు.