రెండేళ్లు దాటినా మంజూరు కాని గురుకుల డిగ్రీ కళాశాల
ఇంటర్‌తో ఇంటిముఖం పడుతున్న గిరిజన విద్యార్థులు
అమలు కాని జీవో
మన్యంలో ఉన్నత విద్య అటకెక్కుతోంది. ఏటా ఐదువేల మంది గిరిజన విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులవుతున్నారు. వారిలో 3000 మంది వరకు ఇంటర్‌లో చే రుతున్నారు. అయితే ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ చదివేవారు కనీసం 25 శాతం కూడా ఉండడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇంటర్‌తో ఇంటిముఖం పడుతున్నారు. రాష్ట్రంలో గురుకులం తరపున డిగ్రీ కళాశాలలు లేకపోవడమే ఇందుకు కారణం. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులం నుంచి బాలికల డిగ్రీ కళాశాలను గూడెంకొత్తవీధిలో ఏర్పాటుకు అనుమతి ఇస్తూ జీవో 25ను విడుదల చేసింది. ఆర్థికశాఖ క్లీయరెన్స్ కూడా అయింది. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. - కొయ్యూరు
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న గిరిజనులు త క్కువనే చెప్పాలి. మెరిట్ ఉన్నవారికి గురుకుల జూనియర్ కళాశాలల్లో సీట్లు వస్తున్నాయి. లేని వారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నారు. అక్కడ వారికి స్కాలర్ వస్తుంది తప్ప మరేం ఉండదు. గురుకుల కళాశాలల నుంచి ఇంటర్ పూర్తి చేస్తున్న వారు డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు గురుకుల డి గ్రీ కళాశాలలు లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివితే గిరిజన విద్యార్థులకు స్కాలర్ మినహా ఇతర సౌకర్యాలు ఉండవు. దీంతో పేదరికంలో ఉండేవారు డిగ్రీ చదవకుండానే ఇంటర్‌తో ఆపేస్తున్నారు. ఇలా ఆపేస్తున్నవారి సంఖ్య75 శాతం వరకూ ఉంది. అదే గురుకుల డిగ్రీ కళాశాల ఉంటే ఎక్కువమంది చదువుకునే వీలుంది. అన్ని సౌకర్యాలు అందుతాయి. గురుకుల తరఫున డిగ్రీ కళాశాల ఉండాలని ఎప్పట్నుంచో అనేక మంది వినతులు ఇస్తున్నారు. బాలరాజు మంత్రిగా ఉన్న సమయంలో గూడెంకొత్తవీధిలో డిగ్రీ కళాశాల గురుకులం నుంచి ఏర్పాటు చేస్తూ అనుమతి ఇచ్చారు. దీనిపై జీవో 25ను విడుదల చేశారు. ఆర్థిక శాఖ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా అనుమతి ఇచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అది అటకెక్కింది. ముందు ప్రభుత్వం ఇచ్చిన దానిని కూడా నిలిపివేసింది. రాష్ట్రంలో గురుకులం తరపున కూడా డిగ్రీ కళాశాలలు లేవు. మొదటిసారిగా మన్యంలో ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూలపేట పంచాయతీ మర్రిపాలెంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉంది. బాలరాజు మంత్రిగా ఉండగా దానిని గూడెంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. గురుకులం నుంచి డిగ్రీ కళాశాలను ప్రతిపాదించామని, దీనికి అనుమతులు రావలసి ఉందని ఆ శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు సాక్షికి తెలిపారు.
నిలిపివేత దారుణం
బాలికలు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష ్యంతో గూడెంలో గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేశాం. అయితే ప్రభుత్వం మారిన తరవాత దాని నిర్మాణాన్ని నిలిపివేసింది. ఈ ప్రాంతంలో డిగ్రీ క ళాశాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకుంటే ఇంటర్‌తో బాలికలు చదువును మానేస్తున్నారు. -పి.బాలరాజు, మాజీ మంత్రి
అసెంబ్లీలో లేవనెత్తుతా
గురుకులం నుంచి బాలికలకు డిగ్రీ కళాశాల అవసరం ఉంది. దీనిని ఏర్పాటు చేస్తే ఉన్నతవిద్యను అభ్యసించే గిరిజన బాలికల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం వెంటనే దీనిని ఏర్పాటు చేయాలి. త్వరలో జరిగే పాలకవర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రస్తావిస్తా. -గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే
విద్య అటకెక్కుతోంది
Published Sat, Jul 16 2016 2:35 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement