జోగింపేట గిరిజన ప్రతిభా విద్యాలయ సముదాయం, కళాశాల భవనం
సాక్షి, సీతానగరం (పార్వతీపురం): కొండకోనల్లో నివాసం. నాగరిక సమాజానికి దూరం. పేదరికం శాపం. అక్షర జ్యోతులు వెలగవు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవు. శతాబ్ధాల తరబడి గిరిపుత్రుల సంక్షేమం కాగితాలకే పరిమితం. అడవి బిడ్డల బతుకుల్లో వెలుగులు పూయించాలి. విద్య సుగంధాలు గుబాళించాలి.. అదే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకాంక్షించారు. అనుకున్నదే తడవు ఆచరణలో పెట్టారు. ఆ మహానుభావుడు ఏర్పాటు చేసిన విద్యాలయాలు గిరిజన యువతకు బంగారుబాట పరిచాయి. సీతానగరం మండలం జోగింపేటలో ఏర్పాటు చేసిన గిరిజన ప్రతిభా విద్యాలయ సముదాయం ఎందరో అడవి బిడ్డల బతుకుల్ని తీర్చిదిద్దుతోంది. తమను ఉన్నతంగా తీర్చిదిద్దిన రాజన్న రుణం తీర్చుకోలేమంటున్న గిరిపుత్రుల అంతరంగమిది.
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లోని గిరిపుత్రుల వెనుకబాటుకు కారణం విద్య లేకపోవడమేనని రాజన్న గుర్తించారు. సీతానగరం మండలంలో ఖాళీగా ఉన్న జోగింపేట పట్టు పరిశ్రమ కేంద్రం స్థలాల్లో గిరిజన ప్రతిభా విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పుణ్యమా అని ఉత్తరాంధ్రలోని గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వైద్యాధికారులు, బ్యాంక్ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో వెలుగుతున్నారు. బిడ్డల ప్రయోజకత్వానికి వారి కుటుంబాలు మురిసిపోతున్నాయి. అట్టడుగున ఉన్న తమను ఉన్నత స్థాయికి తెచ్చిన రాజన్నకు కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాయి.
ఏటా రూ.12 లక్షల వేతనం
మాది పేద గిరిజన కుటుంబం. చదివించే స్తోమత లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 2007 నుంచి 2010 వరకూ జోగింపేట ప్రతిభా విద్యాలయంలో 8 నుంచి 10 వరకూ చదివాను. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివి బీటెక్ చేశాను. ప్రస్తుతం నేను అహ్మదాబాద్‌లో ఎనలిస్ట్ మెడి ట్యాబ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఏటా రూ.12 లక్షల వేతనంపై పని చేస్తున్నాను.
– సవర గోవింద్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బాతుపురం, సోంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యా
మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వ్యయప్రయాసల కోర్చి ప్రాథమిక విద్యనందించారు. జోగింపేటలో ఏర్పాటు చేసిన ప్రతిభా విద్యాలయంలో 2008– 2012 విద్యాసంవత్సరంలో చదివాను. అప్పట్లో నిట్‌లో చదవడానికి అవకాశం వచ్చింది. ప్రస్తుతం దుర్గాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నా. దివంగత ముఖ్యమంత్రి దయతో ఏటా రూ.9 లక్షలు జీతం అందుకుంటున్నాను. మేమంతా రాజన్నకు రుణపడి ఉంటాం.
– పి.ప్రసాద్, కళ్ళికోట, కొమరాడ మండలం
డెంటిస్టుగా సేవలు
నా తల్లిదండ్రులు పోడు వ్యవసాయం చేస్తూ నన్ను ప్రాథమిక పాఠశాలలో చదివించారు. రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ప్రతిభా విద్యాలయంలో చదువుకున్నాను. అనంతరం ఆంధ్ర వైద్య కళాశాలలో బీడీఎస్ వైద్య కోర్సు చదివి.. ప్రస్తుతం విశాఖలో డెంటిస్టుగా సేవలందిస్తున్నాను.
– డాక్టర్ ఎ.కనకాలమ్మ, బొద్దాపుట్, పెదబయలు, విశాఖ జిల్లా
వైద్యాధికారిగా..
జోగింపేట ప్రతిభా విద్యాలయంలో 2009– 2012 విద్యాసంవత్సరంలో చదువుకుని రంగరాయ వైద్య కళాశాలలో వైద్యాధికారిగా సేవలందిస్తున్నాను. పేద కుటుంబంలో జన్మించిన నన్నింతటి వాడిని చేసిన రాజన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
– సిహెచ్.లక్ష్మణ్‌నాయక్, కనిమెర్ల, మైలవరం మండలం, కృష్ణా జిల్లా
యూనియన్ బ్యాంక్‌లో ఏబీఎం
మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. జోగింపేట గిరిజన విద్యాలయంలో చదివిన అనంతరం బీటెక్ చేశాను. యూనియన్ బ్యాంక్ ఏబీఎంగా ఉద్యోగం సంపాదించాను. నా తోబట్టువులను కూడా చదివిస్తున్నాను.
– ఆర్.రమేష్‌రెడ్డి, పి.ఎర్రగొండ, రామవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment