Andhra Pradesh: గిరి బాలల ఆటల సంబరం | Andhra Pradesh hosts National Tribal Students Games | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: గిరి బాలల ఆటల సంబరం

Published Sat, Dec 17 2022 5:53 AM | Last Updated on Sat, Dec 17 2022 7:42 AM

Andhra Pradesh hosts National Tribal Students Games - Sakshi

సాక్షి, అమరావతి: గిరి బాలల ఆటల పోటీలకు రాష్ట్రం సిద్ధమైంది. శనివారం గిరిజన విద్యార్థుల క్రీడా సంబరం ప్రారంభమవుతోంది. ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల మూడో జాతీయ క్రీడలు–2022కు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 22 వరకు నిర్వహిస్తున్న ఈ క్రీడల ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర శుక్రవారం సమీక్షించారు. జాతీయ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (ఎన్‌ఈఎస్‌టీఎస్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలకు 22 రాష్ట్రాల నుంచి దాదాపు 4,328 మంది విద్యార్థులు విజయవాడకు తరలివచ్చారు.

ఈ పోటీలు విజయవాడ, గుంటూరు నగరాల్లో జరుగుతాయి. ప్రారంభ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శనివారం జరుగుతాయి. ఈ వేడుకలకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ సరుట హాజరై సాయంత్రం 5 గంటలకు స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు మార్చ్‌ ఫాస్ట్, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉపముఖ్యమంత్రి రాజన్నదొరతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

మస్కట్‌గా కృష్ణ జింక.. ‘ఏక్తా’గా నామకరణం
ఈ  జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జంతువు కృష్ణ జింకను మస్కట్‌గా ఎంపిక చేశా­రు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని ప్రతి­బిం­బించేలా మస్కట్‌కు ‘‘ఏక్తా’’గా నామకరణం చేశారు. ్రప్రతి రోజూ 7 వేల మందికి భోజ­నాలు అందించేలా ప్రత్యేక బృందాన్ని నియమించారు. క్రీడాకారులను వేదికలకు తరలించేందుకు దాదాపు 50 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. 

పోటీలు ఇలా..
ఈనెల 18 నుంచి 21 వరకు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాల, ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం, సీహెచ్‌కేఆర్‌ ఇండోర్‌ స్టేడియం, వీఎంసీ జింఖానా స్విమ్మింగ్‌ పూల్‌లో క్రీడా పోటీలు జరుగుతాయి. 15 వ్యక్తిగత, 7 టీమ్‌ ఈవెంట్స్‌ ఉంటాయి. అండర్‌–14, అండర్‌–19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా ఈవెంట్లు ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement