అన్నం పెడ్తలేరు.. ఆరోగ్యం పట్టించుకోరు | Asifabad Gurukul Hostel Students Protest At Collectorate | Sakshi
Sakshi News home page

నైట్‌ వాచ్‌మెన్‌ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు..

Published Thu, Aug 31 2023 9:06 AM | Last Updated on Thu, Aug 31 2023 6:49 PM

Asifabad Gurukul Hostel Students Protest At Collectorate - Sakshi

ఆసిఫాబాద్‌రూరల్‌: ‘మెనూ ప్రకారం భోజనం పెడ్తలేరు.. అన్నంలో పురుగులు వచ్చినా పట్టించుకుంటలేరు.. నైట్‌ వాచ్‌మెన్‌ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు’ అంటూ గిరిజన విద్యార్థినులు కన్నీమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల బాలికలు సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కారు. సుమారు ఆరు గంటలపాటు వివిధ చోట్ల నిరసన తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 600 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ప్రిన్సిపాల్‌ జ్యోతిలక్ష్మి పట్టించుకోకుండా వేధిస్తున్నా రని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం పాఠశాల నుంచి బయటికి వచ్చిన విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్‌ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

 అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్‌ వద్ద ఎండలోనే బైఠాయించారు. విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో భోజనం సక్రమంగా పెట్టడం లేదని, నైట్‌ వాచ్‌మెన్‌ అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. డార్మెంటరీలు శుభ్రంగా లేవని, రెండు రోజులుగా నీళ్లు రావడం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ ఇష్టారీతిన తమను తిడుతూ భయపెడుతుందని వి లపించారు. ఈ విషయం ఆర్సీవో దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న తమ బా ధను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రి న్సిపాల్‌ను తొలగించే వరకూ గురుకులానికి వెళ్లమ ని భీష్మించుకు కూర్చున్నారు. 

మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఓ విద్యార్థిని తండ్రి అరటి పండ్లు, వాటర్‌ప్యాకెట్లు తీసుకొచ్చి వారి ఆక లి తీర్చడం గమనార్హం. పోలీసులు, పాఠశాల టీచ ర్లు ఎంత బతిబాలినా విద్యార్థినులు మొండికేయడం.. ఎండలో విద్యార్థినుల అవస్థలు గమనించిన టీచర్లు సైతం కన్నీరుపెట్టుకున్నారు. టీచర్లను చూసి విద్యార్థినులూ కన్నీటిపర్యంతమయ్యారు. కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న ప్రిన్సిపాల్‌ జ్యోతిలక్ష్మి విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థినులు వెనక్కి తగ్గకుండా ఆమెకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వివిధ విద్యా సంఘాల నాయకులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. 

డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సురేశ్‌ ఘటన స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు వినలేదు. అయితే విద్యార్థినులను సముదాయించి తీసుకురావాలని అధ్యాపకులు, ఉపాధ్యాయులపై ప్రిన్సిపాల్‌ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కొంత మంది అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థినులతో మాట్లాడి గురుకులానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా విద్యార్థినులు ‘భోజనం చేయమని.. ప్రిన్సిపా ల్‌ తొలగించే వరకు ఇక్కడే కూర్చుంటాం’ అని గేటు ఎదుట బైఠాయించారు. 

అనంతరం పోలీసులు వారిని సముదాయించి లోపలికి పంపించారు. కొద్దిసేపు చెట్ల కింద కూర్చున్న విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పాఠశాలలోకి వెళ్లారు. విద్యార్థినుల ఆరోపణలపై ప్రిన్సిపాల్‌ జ్యోతిలక్షి్మని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. 

ఆస్పత్రికి తీసుకెళ్తలేరు..
ప్రిన్సిపాల్‌కు చెప్పినా సమస్యలను పట్టించుకోవడం లేదు. జ్వరం వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదు. ప్రస్తుతం ఓ విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.              
– స్వాతి, ఇంటర్‌ 

అన్నంలో పురుగులు
మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయి. ప్రిన్సిపాల్‌కు చెప్పినా అదే తినాలి అని చెబుతున్నారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం.
– ఆర్తి, తొమ్మిదో తరగతి 

వేరే కళాశాలలో చేర్పిస్తా
మా పాప నిఖిత గిరిజన గురుకులంలో ఇంటర్‌ చదువుతోంది. కళాశాలలో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నానని ఏడుస్తోంది. టీసీ తీసుకుని వెళ్లి వేరే కళాశాలలో చేర్పిస్తా.
– రమేశ్, విద్యార్థిని తండ్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement