కొమరం భీమ్: ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లిన యువకుడు అక్కడ వేసిన డ్రాగన్‌ఫ్రూట్ పంటను చూడడంతో తనకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. తమ చేనులో కూడా డ్రాగన్ ప్రూట్ పంట వేయాలనుకుని విషయం తన అన్నతో చెప్పాడు. అతను కూడా సై అనడంతో పంట సాగుకు ముందుకు వచ్చారు. ఏడాదిక్రితం పంట వేయగా ప్రస్తుతం ఫలాలు ఇస్తుంది.
హాంకాంగ్‌లో చూసి ఆలోచన
జన్నారం మండలం దేవునిగూడ గ్రామానికి చెందిన కల్లెం రవీందర్‌రెడ్డి, జమున దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో తల్లి జమున కూలిపని చేస్తూ వారిని డిగ్రీ వరకు చదివించింది. పెద్ద కుమారుడు శివకృష్ణారెడ్డి వ్యవసాయం వైపు వెళ్లగా సాయికృష్ణారెడ్డి ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లాడు. అక్కడ ఎక్కువశాతం మంది డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తుండడంతో పంట గురించి తెలుసుకున్నాడు.
జగిత్యాల రైతు వద్ద అవగాహన
జగిత్యాల జిల్లా అంతర్‌గావ్‌కు చెందిన రైతు శుభాష్‌రెడ్డి డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నట్లు శివకృష్ణారెడ్డి యూట్యూబ్‌లో తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి రైతు వద్ద పంట గురించి పూర్తిగా తెలుసుకుని తమ్మునికి వివరించాడు. అతను సరే అనడంతో తమకున్న ఎకరం 10 గుంటల భూమిలో 2022 డిసెంబర్‌లో అదే రైతు వద్ద నుంచి రూ.80కి ఒక మొక్క చొప్పున 2 వేల మొక్కలు కొనుగోలు చేశారు. 500 సిమెంటు దిమ్మెలు తీసుకువచ్చారు. ఒక్కో దిమ్మె చుట్టూ నాలుగు మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీటిని అందించారు. మొత్తంగా రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు.
అందుతున్న ఫలాలు
గతేడాది డిసెంబర్‌లో మొక్కలు నాటగా 2023 నవంబర్‌లో కాయలు కాశాయి. మొదటి దశలో ఆశించినంత కాయకపోవడంతో వాటిని సొంతానికి వాడుకున్నారు. ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు పంట చేతికి వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలోకు రూ.150 ఉందని, ఎకరం పది గుంటల్లో సుమారు 2 టన్నుల పంట వచ్చే అవకాశం ఉందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 20 సంవత్సరాల వరకు ఫలాలు వస్తుంటాయని, మొక్క పెరిగిన కొద్దీ కత్తిరిస్తూ ఉంటే ఏటా పంట చేతికి వస్తుందన్నారు. ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
కొత్త ఆలోచనతో సాగు
ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లా. అక్కడ ఆన్‌లైన్ పనిచేస్తూ అప్పుడప్పుడు బయటకు వెళ్లగా ఎక్కువగా డ్రాగన్‌ఫ్రూట్ పంట కనిపించేది. అదే పంటను మా భూమిలో కూడా వేయాలని కొత్త ఆలోచనతో వచ్చింది. అన్నతో చర్చించి మా భూమిలో మొక్కలు నాటాం. ఇప్పుడు మొదటి క్రాపు చేతికి వచ్చింది.
– సాయికృష్ణారెడ్డి
సబ్సిడీ ఇవ్వాలి
మా తమ్మునికి వచ్చిన ఆలోచనతో ఎకరం పది గుంటల్లో మొక్కలు నాటాం. డ్రిప్‌తో నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు రూ.6 లక్షలు ఖర్చు వచ్చింది. వచ్చే జూన్ వరకు రెండో క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయిల్‌పాం పంట మాదిరి డ్రాగన్‌ఫ్రూట్ పంటకు కూడా సబ్సిడీ ఇస్తే బాగుండు. ఖర్చులు తగ్గుతాయి.
– శివకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment