డ్రాగన్ పిండి కలిపిన ఉత్పత్తులు
అధికంగా యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం, ఇంకా ఇతర పోషకాలతో కూడిన డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల కాలంలో సూపర్ ఫ్రూట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రారంభమైన 5–7 ఏళ్లలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాటు మరో 9 రాష్ట్రాలకు డ్రాగన్ సాగు విస్తరించింది. పింక్/రెడ్, వైట్ పల్ప్ రకాలు సాగవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు ‘కమలం’ అని పేరుపెట్టింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్) గత ఏడాది డ్రాగన్ జ్యూస్ ఉత్పత్తి సాంకేతికతను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా, రెడ్/పింక్ డ్రాగన్ ఫ్రూట్‌తో పౌడర్ (పిండి)ని తయారు చేసే టెక్నాలజీని రూపొందించింది. కర్ణాటకలోని కొడగు జిల్లా చెట్టల్లిలోని ఐఐహెచ్‌ఆర్‌కు చెందిన కేంద్రీయ ఉద్యాన పంటల ప్రయోగ కేంద్రం ఈ టెక్నాలజీ అభివృద్ధికి వేదికైంది.
డ్రాగన్ పండ్లతో పిండిగా మార్చే ప్రక్రియలో రెండు పద్ధతులున్నాయి. స్ప్రే డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ. 4 వేలు, ఫ్రీజ్ డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ.12 – 15 వేల ధర పలుకుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పిండిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే, ఇందులో సగం ఖర్చుతోనే డ్రాగన్ పిండిని ఉత్పత్తి చేసే టెక్నాలజీని బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్ ఇటీవల రూపొందించింది.
మార్కెట్‌లో ఉన్న డ్రాగన్ పిండి కంటే అత్యంత పోషక విలువలతో ఉండే విధంగా ఈ టెక్నాలజీతో డ్రాగన్ పిండిని తయారు చేయవచ్చని, ఈ పిండిని సహజ రంగు పదార్థంగా అనేకప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల్లో కలపవచ్చని ఐఐహెచ్‌ఆర్ తెలిపింది. ఐస్‌క్రీమ్‌లు, మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, కేకులు, బిస్కట్లు, టీ బ్యాగ్స్, మఫిన్స్ తయారీలో డ్రాగన్ పిండిని విస్తృతంగా వాడుతున్నారు. ఐఐహెచ్‌ఆర్ రూపొందించిన డ్రాగన్ పొడి సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మెరుగైన ఆదాయం తెప్పించేందుకు వాణిజ్య సంస్థలు/ ఎఫ్‌పిఓలు/ కోఆపరేటివ్‌లు కృషి చెయ్యాలి.
Comments
Please login to add a commentAdd a comment