
వచ్చే నెల నుంచి నేరుగా అందుబాటులోకి విమాన సర్వీసులు
ఆమ్‌స్టర్‌డ్యామ్, అడిస్ అబాబా, రియాద్ తదితర నగరాలకు...
ఈ ఏడాది చివరి నాటికి పారిస్, ఆస్ట్రేలియా, హోచిమిన్‌లకు కూడా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి హాంకాంగ్‌కు నేరుగా విమాన సర్వీసులు వచ్చే మార్చి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హాంకాంగ్‌కు వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్‌ల మీదుగా రాకపోకలు సాగించేవారు. హైదరాబాద్ నుంచి ఏటేటా అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 20 నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి.
రానున్న 18 నెలల్లో దశలవారీగా మరిన్ని అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌తోపాటు అడిస్ అబాబా, ఆమ్‌స్టర్‌డామ్, రియాద్‌లకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది జూన్‌లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ అడిస్ అబాబాకు విమానాలు నడపనుంది. సెప్టెంబర్‌లో ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. రియాద్‌కు కూడా త్వరలోనే సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మరిన్ని నగరాలకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ నుంచి పారిస్, ఆస్ట్రేలియా, హోచిమిన్ సిటీ, హనోయ్, క్రాబీ, కఠ్మాండు, మదీనా నగరాలకు కొత్తగా విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పలు విమానయాన సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019–20 సంవత్సరంలో 32 లక్షల మంది విదేశాలకు రాకపోకలు సాగించగా, 2023–24 నాటికి ఈ సంఖ్య 42 లక్షలకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment