కౌటాల: సాగు, తాగునీటి అవసరాల కోసం రైతులు, ఇతరులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూగర్భంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వందల ఫీట్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇలా డ్రిల్లింగ్ చేసిన వాటిలో 70శాతానికి పైగా విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అవగాహన కల్పించాలి్సన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అవసరానికి మించి..
నీటి లభ్యత, వాడకంపై అవగాహన లేని కొంతమంది రైతులు పంటలకు అవసరానికి మించి నీరందిస్తున్నారు. దీంతో నీటి కొరత ఏర్పడుతుండడంతో బోర్లు తవ్వాలని ఆరాటపడుతున్నారు. బోరు వేసేందుకు నిపుణులైన జియాలజిస్టులను సంప్రదించకుండా బాబాలు, గురువులను ఆశ్రయిస్తున్నా రు. టెంకాయ, తంగెడు పుల్లలతో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అప్పుల పాలవుతున్నారు. బోరులో నీళ్లు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారు. బోర్‌వెల్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కో బోరుబావిని దాదాపు 200 మీటర్ల లోతు వరకు తీస్తున్నారు. అందుకు రూ. 50వేల నుంచి రూ. 60 వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారు.
పరీక్షలకు స్వస్తి..
భూగర్భ జలాల లభ్యతపై ప్రతీ మండలంలో అధికారులు ఏటా పరీక్షలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, అంతకు ముందు నమోదైన వర్షపాతంపై ఆధారపడి భూగర్భ జలమట్టం మారుతుంది. నీటి లభ్యత పరీక్షల అనంతరం, అధికారులు తక్కువ నీళ్లున్న గ్రామాల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న జీపీల్లో కొత్త బోరుబావుల తవ్వకాన్ని నిషేధించాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా అసలు ఈ పరీక్షలే నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం బోర్లు, బావులు తవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. మీ సేవ ద్వారా చలానా తీసి రెవెన్యూ అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారుల ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. నీటి లభ్యత వంద గజాల దూరంలో ఉంటేనే అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే రూ. లక్ష జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది.
అనుమతులు తీసుకోకుండానే..
భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా బోరుబావులు తవ్వకూడదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బోరు లారీలు వచ్చి మండలాల్లోని ఆయా గ్రామాల్లో జోరుగా అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్లు వేసే యజమానులు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు స్పందించి అనుమతుల్లేని బోరు తవ్వకాలు నియత్రించి రాబోయే తరాలకు నీటి కరువు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment