Underground Water
-
జోరుగా బోర్ల తవ్వకం
కౌటాల: సాగు, తాగునీటి అవసరాల కోసం రైతులు, ఇతరులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూగర్భంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వందల ఫీట్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇలా డ్రిల్లింగ్ చేసిన వాటిలో 70శాతానికి పైగా విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అవగాహన కల్పించాలి్సన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరానికి మించి.. నీటి లభ్యత, వాడకంపై అవగాహన లేని కొంతమంది రైతులు పంటలకు అవసరానికి మించి నీరందిస్తున్నారు. దీంతో నీటి కొరత ఏర్పడుతుండడంతో బోర్లు తవ్వాలని ఆరాటపడుతున్నారు. బోరు వేసేందుకు నిపుణులైన జియాలజిస్టులను సంప్రదించకుండా బాబాలు, గురువులను ఆశ్రయిస్తున్నా రు. టెంకాయ, తంగెడు పుల్లలతో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అప్పుల పాలవుతున్నారు. బోరులో నీళ్లు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారు. బోర్వెల్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కో బోరుబావిని దాదాపు 200 మీటర్ల లోతు వరకు తీస్తున్నారు. అందుకు రూ. 50వేల నుంచి రూ. 60 వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారు. పరీక్షలకు స్వస్తి.. భూగర్భ జలాల లభ్యతపై ప్రతీ మండలంలో అధికారులు ఏటా పరీక్షలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, అంతకు ముందు నమోదైన వర్షపాతంపై ఆధారపడి భూగర్భ జలమట్టం మారుతుంది. నీటి లభ్యత పరీక్షల అనంతరం, అధికారులు తక్కువ నీళ్లున్న గ్రామాల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న జీపీల్లో కొత్త బోరుబావుల తవ్వకాన్ని నిషేధించాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా అసలు ఈ పరీక్షలే నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం బోర్లు, బావులు తవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. మీ సేవ ద్వారా చలానా తీసి రెవెన్యూ అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారుల ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. నీటి లభ్యత వంద గజాల దూరంలో ఉంటేనే అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే రూ. లక్ష జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. అనుమతులు తీసుకోకుండానే.. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా బోరుబావులు తవ్వకూడదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బోరు లారీలు వచ్చి మండలాల్లోని ఆయా గ్రామాల్లో జోరుగా అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్లు వేసే యజమానులు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు స్పందించి అనుమతుల్లేని బోరు తవ్వకాలు నియత్రించి రాబోయే తరాలకు నీటి కరువు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
భూగర్భ జలాలను సంరక్షించాలి: అనిల్
సాక్షి, విజయవాడ : భూగర్బజల వ్యవస్థలో సవాళ్లకి జాతీయ సదస్సు ద్వారా సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీ భూగర్బ జలాలు, జలగణనశాఖ స్వర్ణోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంది. ప్రతీ నీటిబొట్టుని వినియోగించండంపై దృష్టిసారించాలి. భవిష్యత్‌లో పెరగనున్న నీటి అవసరాలని దృష్టిలో పెట్టుకుని భూగర్బజలాల సంరక్షణ ఉండాలి’’ అన్నారు మంత్రి అనిల్. ‘‘రాష్ట్రంలో భూగర్బ జలాల లభ్యత... వినియోగంపై శాస్త్రవేత్తలు ఎప్పటికపుడు చేస్తున్న పరిశోధనలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు కొరత లేకుండా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలపై దృష్టి సారించారు. వైఎస్సార్ జలకళ ద్వారా రైతులకి ఉచితంగా బోర్లు తవ్వే పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాయలసీమలోనూ సాగు, తాగు నీటి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాం’’ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. చదవండి: ‘ఆ దిక్కుమాలిన గ్రంథం మా దగ్గర లేదు’ -
విశాఖకు ఉప్పుద్రవం!
నగరానికి ప్రకృతి అమర్చిన నగలా భాసిల్లుతోంది అతి పొడవైన సాగరతీరం. విశాఖ ఎదుగుదలకు పారిశ్రామికంగా, పర్యాటకంగా దోహదం చేస్తోంది. కానీ ఇదే సాగర తీరం భవిష్యత్తులో నగరానికి పెను ఉపద్రవంగా పరిణమించనుందా?.. ఈ ప్రశ్నకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.అదేమిటీ.. సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న విశాఖ సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి కూడా సురక్షితంగా ఉంటుందని కదా ఇప్పటి వరకు ధైర్యంగా ఉంటున్నాం.. అని అంటారా!..అది కరెక్టే గానీ.. భవిష్యత్తులో కమ్ముకొచ్చే ముప్పు మరో రూపంలో ఉంటుందన్నది నిపుణుల హెచ్చరిక.. సాగర జలాలు చాపకింద నీరులా నగర పరిధిలోని భూగర్భంలోకి చొచ్చుకొచ్చి పాతాళగంగను ఉప్పుతో నింపేస్తున్నాయి. దీని వల్ల మరికొన్నేళ్లలో నగరం తీవ్రమైన తాగునీటి ఎద్దడితో తల్లడిల్లిపోనుందని అంటున్నారు. అదెలా అంటే.. భూగర్భ జలమట్టాలు పుష్కలంగా ఉంటే నగరానికి ఆనుకొని ఉన్న సాగర జలాలను రాకుండా అడ్డుకుంటాయి. కానీ గత కొన్నేళ్లుగా అరకొర వర్షాలు, నగర పరిధిలోని భూమిలో సుద్ద మట్టి వల్ల నీరు భూమిలోకి ఇంకకపోవడం వంటి పరిస్థితులతో భూగర్భం వట్టిపోతోంది. ఆ ఖాళీ స్థలాల్లోకి సాగరజలాలు చొచ్చుకొస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాల్లో ఉప్పు నీరు కలిసిపోతోంది. మొత్తం భూగర్భ నీటివనరులను ఉప్పుమయం చేసేస్తోంది. ఇప్పటికే సాగరతీరాన్ని ఆనుకొని ఉన్న పలు ప్రాం తాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భాన్ని రీచార్జ్ చేసే చర్యలను ముమ్మరం చేయకపోతే భవిష్యత్తులో నగరం మొత్తం ఉప్పునీటి కయ్యగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఉప్పునీటి కయ్యగా విశాఖ నగరం ► అక్షరాలా మనిషి స్వయంకృతం ► ఆందోళన కలిగిస్తున్న పరిణామం ► రాబోయే కాలంలో నీరు పూర్తిగా నిరుపయోగం ► ఇంకుడుగుంతలే పరిష్కారం ముప్పులు ఎన్నో విధాలు.. వాటిలో ఉప్పు ముప్పు విశాఖను భయపెడుతోంది. చాపకింద నీరన్నది అక్షరాలా విశాఖను ఉప‘ద్రవం’లా కలవరపెడుతోంది. దీనిని ఉప్పుద్రవం అనాలేమో. ఎందుకంటే నగరంలో భూగర్భ జలాల పరిమాణం తగ్గిపోతూ ఉంటే.. ఆ స్థానాన్ని సముద్రం నుంచి లవణ జలాలు ఆక్రమిస్తూ ఉండడంతో నగరం ఉప్పునీటి కయ్యగా మారిపోయే ప్రమాదం వెంటాడుతోంది. సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖనగరం.. నవ్యాంధ్రకు ఆర్థిక రాజధాని...ఉత్తరాంధ్ర ముఖద్వారం....23 లక్షలకు పైగా జనాభా కలిగి.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ప్రతిరోజు నాలుగైదులక్షల ఫ్లోటింగ్ జనాభాతో నిత్యం కిటికట లాడే పారిశ్రామిక రాజధాని.. ఉక్కునగరంగా... సాగరనగరంగా.. స్మార్ట్ సిటీగా ఎన్నో విశిష్టతలు కల్గిన ఈ మహానగరానికి పెనుముప్పు పొంచి ఉంది.భవిష్యత్తులో విశాఖ నగరాన్నే ఖాళీ చేయాల్సిన పరిస్థితులు దాపురించబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖ నగరం..బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న సాగరనగరం.ఇప్పుడు ఆ సాగరమే విశాఖకు శాపంగా మారనుంది. ఈ నగరానికి ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ స్థాయిలో నీటి ఇక్కట్లు ఎదురవలేదు. కారణం ఈ నగరం సముద్రం కంటే ఎత్తులో ఉండడమే. సాధారణంగా సాగరం పక్కనే ఉండే నగరాలు, ప్రాంతాల్లోని ఉప్పునీటి శాతం ఎక్కువగా ఉండడం వలన ఆ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు వాడేందుకు ఏమాత్రం ఉపయోగపడవు. కానీ విశాఖనగరం సముద్రం కంటే ఎత్తులో ఉండడం.. సముద్ర నీరు నగర భూగర్భపొరల్లోకి చొచ్చుకొచ్చేపరిస్థితులు లేకపోవడం వలన ఇన్నాళ్లు గ్రౌండ్ వాటర్ కోసం పెద్దగా ఇబ్బందిపడిన దాఖలాలు లేవనే చెప్పాలి. వేసవిలో 15–20 రోజులు కాస్త భూగర్భ జలాలు అడుగంటినా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ సమీప భవిష్యత్తులో విశాఖ నగరం మహాముప్పును ఎదుర్కోబో తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంజరు భూముల్లా రిజర్వాయర్లు నగర దాహాన్ని తీర్చే ఒయాసిస్సులా ఉండే ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి రిజర్వాయర్లు వేసవి ప్రారంభంలోనే ఎండిపోయి బంజరు భూములను తలపిస్తున్నాయి. రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలు అక్రమ కట్టడాలు, ఆక్రమణలతో నిండిపోయాయి. మిగిలిన రిజర్వాయర్లు సైతం ఏళ్లతరబడి పేరుకుపోయిన సిల్ట్ వల్ల వాటి 60 శాతానికి పైగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయి నగరానికి తీవ్ర నీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలా కొనసాగిస్తే మరో పదేళ్లలో చుక్కనీరు దొరకని పరిస్థితి నెలకొంది.రాబోయే గడ్డు పరిస్థితి నుంచి విశాఖ బయటపడాలంటే నగరంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన జీవనశైలిని అవలంబించాలని నిపుణులు అంటున్నారు. ఉపరితల నీటి వనరులతో పాటు భూగర్భ నీటి సమతుల్యత, శాస్త్రీయ పర్యవేక్షణ, నీటి యాజమాన్యం ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం ఎప్పటికప్పుడు శాస్త్రీయమైన నీటి యాజమాన్య విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు. రిజర్వాయర్లలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించడం... క్యాచ్మెంట్ ఏరియాల్లో ఆక్రమణలు తొలగించడం.యుద్ధ ప్రాతిపదికన పెద్దఎత్తున ఇంకుడు గుంతలు నిర్మించడం.. నీటిని పొదుపుగా వాడుకోవడమే మన ముందున్న మార్గాలని స్పష్టం చేస్తున్నారు. చొచ్చుకొస్తున్న సముద్రపునీరు విశాఖలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా మాయమై..చాపకింద నీరులా సముద్రపు ఉప్పనీరు చొచ్చుకొస్తుండడమే అసలు సమస్య. ఇప్పటికే ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, అప్పూగర్, కురుపాం టూంబ్స్, సాగర్‌నగర్ భీమిలిలలోని పలు ప్రాంతాల్లో భూగర్భ అంతర్భాగంలోకి సముద్రపునీరు ఊహ కందని రీతిలో చొచ్చుకొచ్చినట్టు పరిశోధనల్లో తేలిందని నిపుణులు అంటున్నారు. నగరంలో లెక్కాపత్రం లేకుండా ఇష్టమొచ్చినట్టుగా బోర్లు వేయడం.. మోతాదుకు మించి భూగర్భ జలాలు విపరీతంగా వాడేస్తూ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు అడ్డూ అదుపూ లేకుండా లక్షల గ్యాలెన్ల నీటిని తోడేస్తున్నారు. ఇలా తోడేసిన నీటిని రీచార్జ్ చేసేందుకు వీలుగా ఆ స్థాయిలో తగినంత వర్షపాతం లేకపోవడం ఈ పరిస్థితికి కారణమవుతోంది.ఒకవేళ వర్షం కురిసిన ప్పటికీ నగరమంతా కాంక్రీట్ జంగిల్ కావడంతో నీరుభూమిలోకి ఇంకకుండా నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. నగరంలో చాలా ప్రాంతం ఎత్తయిన కొండలపైనే ఉంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా నగరమంతా మడతభూములపైనే ఉంది. నగర విస్తీర్ణంలో చాలా వరకు సుద్దరాయి కావడంతో వర్షపునీరు భూమి పొరల్లోకి వెళ్లకుండా సముద్రంలోకి పంపించేస్తుంది. తగ్గుతున్న భూసారం నగర భూమిపొరల్లో మంచినీరు పుష్కలంగా ఉన్నంత కాలం సముద్రపు నీరుని నగరంవైపు రానీయ కుండా వెనక్కి నెడుతుంది.భూగర్భ జలాలు ఏమాత్రం అడుగంటినా భూమి పొరల్లోకి ఖాళీ ప్రదేశంలోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తుంది. ఒక్కసారి సముద్రపు నీరు చొచ్చుకొస్తే ఆ తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా ఉప్పునీటితోనే నిండిపోతుంది. భూ అంతర్భాగంలో ఉప్పునీరు చేరడం వలన ఆ నేల సారాన్ని కోల్పోతుంది. ఆ ప్రాంతంలోని భవనాలు, కట్టడాలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 23లక్షల నగర జనాభాతో పాటు ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం ఉత్తరాంధ్ర, ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి వచ్చే మరో నాలుగైదు లక్షల మంది అవసరాలు తీర్చే స్థాయిలో తాగునీటి వనరుల్లేవు. దీంతో అన్ని అవసరాలకు భూగర్భ జలాలపై ఆధార పడాల్సిన పరిస్థితి. భారీ అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ సముదాయాలు పెరిగి పోవడంతో ఒకే ప్రాంతంలో లెక్కకు మించి బోర్లు తవ్వి నిరంతరాయంగా భూగర్భ జలాలు తోడేస్తుండడంతో చుట్టుప్రక్కల కిలోమీటర్ల మేర చుక్కనీరు దొరకని దుస్థితి కన్పిస్తోంది. వర్షపు నీరు ఇంకే ప్రాంతాల గుర్తింపు.. ఉద్దానం కిడ్నీ వ్యాధి మూలకారణాలపై ఆరేళ్లుగా పరిశోధన చేసి ప్రభుత్వానికి పరిష్కారమార్గాలను చూపిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోజ్ నలనాగుల ‘ఉప్పుద్రవ’ సమస్యపై లోతైన పరిశోధన చేశారు. మొట్టమొదటిసారిగా కాంటూర్ మ్యాపింగ్ విశ్లేషణలతో నగరంలో 200కు పైగా వర్షపునీరు ఇంకే ప్రాంతాలను గుర్తించారు. ఈ పరిజ్ఞానంతో వర్షం నీరు ఎక్కడ నుంచి ఎక్కడకు, ఎం త ప్రవహిస్తోందో స్పష్టంగా తెలుసు కోవచ్చు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. నీరు ఒక ద గ్గరకు చేరే గృహసముదాయ ప్రాంతాలను గుర్తించి.. భూగర్భ నీటి యాజమాన్య పద్ధతుల్ని చేపటొ ్టచ్చు. నగరంలో ఇలా కాంటూర్ మ్యాపింగ్ ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ వలన నగర నీటి భద్రతను పెంచగలమని ప్రొఫెసర్ మనోజ్ చెబుతున్నారు.అవసరమైతే రోడ్డు కూడలిలో.. రోడ్డు మధ్యలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించుకోవచ్చంటున్నారు. ఏడాది పొడవునా ఇంకుడు గుంతల నిర్వహణ, పర్యవేక్షణను జీవీఎంసీ చేపట్టాలని సూచిస్తున్నారు. కఠిన నిబంధనలు అవసరం నగరంలో లెక్కకు మించి వేస్తున్న బోర్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో బోర్లు ఎన్ని ఉన్నాయో.. వాటి ద్వారా రోజూ ఎంత పరిమాణంలో భూగర్భ జలాలను తోడుతున్నారో.. గణాంకాలు సేకరించి వాటి వినియోగంపై నియంత్రణ విధించాలి. నగరంలో ఎన్ని బోర్లు ఉన్నాయో జీవీఎంసీ దగ్గర కూడా పూర్తి లెక్కలు లేవు. కనీస సమాచారం కూడా లేకుండా రిగ్‌లు వేసేస్తున్నారు. ఈ పరిస్థితి లేకుండా బోర్ల తవ్వకాలపై కచ్చితమైన నియమ నిబంధనలు విధించాలి. సిటీ పరిధిలో బోర్లున్న ప్రతి ఒక్కరూ వర్షపునీటిని సంరక్షించి భూగర్భ జలాలు రీచార్జి చేసేట్టు నిబంధనలు విధించాలి. ఇందుకు ఎన్నో సులువైన పద్ధతులున్నాయి. డాబా పైన పడే వర్షపు నీటికి కిందకు తెచ్చే గొట్టాల మధ్య మామూలు ఫిల్టర్లను అమర్చుకుంటే.. ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగించకోవచ్చు. మిగిలిన నీటిని బోరు కనెక్షన్‌కు ఇస్తే అది నేరుగా భూగర్భంలోకి వెళ్తుంది. – కేఎస్ శాస్త్రి, డెప్యుటీ డైరెక్టర్, భూగర్భ జలవనరుల శాఖ మినీ రిజర్వాయర్లు ముఖ్యం నగరంలో ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది. ఏయూ, రైల్వే, పోర్టు ఏరియాల్లో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న చెరువులు మాదిరిగా మినీ రిజర్వాయర్లు నిర్మించాలి. వర్షపు నీటిని దాంట్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు చేయాలి. తద్వారా ఆ నీటిని నగర వాసులు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా భూగర్భపొరల్లోకి చేరి భూగర్భ జలాలు పెరిగేందుకు కూడా ఈ రిజర్వాయర్లు దోహదపడతాయి. – శీలబోయిన సత్యనారాయణ, రిటైర్డ్ సీఈ, నీటిపారుదల శాఖ -
తక్కువ ఖర్చు.. వెంటనే నీటి భద్రత!
మెట్ట భూముల్లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు మీటరు వెడల్పున.. కందకాలు తవ్వుకోవడం వల్ల.. అతి తక్కువ ఖర్చు (ఎకరానికి రూ. 2–3 వేల)తో తవ్విన కొద్ది నెలల్లోనే సాగు నీటి భద్రత సాధించవచ్చని నల్లగొండ మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు, విశ్రాంత ప్రిన్సిపల్ పాలవరపు భగవంతరెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు చిన్న రైతుల మెట్ట భూముల్లో కందకాలు తవ్విస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆయన సూచిస్తున్నారు. నల్లగొండకు 5 కి.మీ. దూరంలోని తమ 13 ఎకరాల ఎర్ర భూమిలో తవ్విన రెండు బోర్లకు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను 2016 జూన్‌లో భగవంతరెడ్డి సంప్రదించారు. వారు స్వయంగా పొలానికి వచ్చి వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. 13 ఎకరాలకు కలిపి రూ. 30 వేలకన్నా తక్కువే ఖర్చయింది. 2016 వర్షాకాలంలో కందకాలు 4,5 సార్లు నిండాయి. కందకాలు తవ్విన 3,4 నెలల్లోనే భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని భగవంతరెడ్డి తెలిపారు. 2017 వర్షాకాలంలో కూడా కందకాలు 2,3 సార్లు నిండాయి. దీంతో ఎండాకాలం కూడా నీరు పుష్కలంగా ఉండటంతో నిశ్చింతగా కూరగాయ తోటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పక్కన పొలంలో వరి సాగు చేస్తున్న రైతుల బోర్లలో నీరు రాక పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రెండు నెలల పాటు తమ బోర్ల నుంచే నీటిని ఉచితంగా ఇచ్చామని, ఆ రైతుకు మంచి దిగుబడి రావడం తమకూ సంతోషాన్నిచ్చిందని వివరించారు. ఈ ఏడాది తమ ఇరుగు పొరుగు రైతుల బోర్లలో కూడా నీటి లభ్యత పెరిగిందని ఆయన సంతోషంగా చెప్పారు. ఇది తమ పొలంలో తవ్విన కందకాల వల్ల భూగర్భంలోకి ఇంకిన వర్షపు నీటి వల్లనే సాధ్యపడిందన్నది నూటికి నూరు శాతం వాస్తవమన్నారు. అయితే, రైతులకు కందకాలతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన లోపించిందని, చిన్న రైతుల భూముల్లో ప్రభుత్వమే కందకాలు తవ్వించడం చాలా అవసరమని భగవంతరెడ్డి(94404 05082) సూచిస్తున్నారు. భగవంతరెడ్డి -
కందకాలే కరువుకు విరుగుడు!
కరువు కోరల నుంచి రైతులను రక్షించడానికి వ్యవసాయ భూముల్లో కందకాలు తీసుకోవడమే ఉత్తమ మార్గమనడానికి ప్రబల నిదర్శనం తన మామిడి తోటేనని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ సంగెం చంద్రమౌళి స్వానుభవంతో తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామపరిధిలో 3.5 ఎకరాల భూమిని గత ఏడాది వేసవిలో కొనుగోలు చేశారు. 500–650 అడుగుల లోతున రెండు బోర్లు వేసినా.. డస్ట్ తప్ప నీటి చుక్క కానరాలేదు. వాన నీటిని సంరక్షించుకుంటే తప్ప నీటి భద్రత సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున 2017 మేలో కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 5 వేల వరకు ఖర్చయింది. వర్షాలు కురవడంతో కందకాల ద్వారా వర్షపు నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జలమట్టం పెరిగింది. నీటి కొరత తీరడంతో గత జూలైలో మామిడి మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా పొదుపుగా నీటిని అందిస్తున్నారు. గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. అయినా, ఇంత వేసవిలోనూ నీటి కొరత లేదని చంద్రమౌళి సంతోషంగా చెప్పారు. పొలాల్లో కురిసి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమి లోపలికి ఇంకించుకుంటే ప్రతి రైతూ కరువును విజయవంతంగా అధిగమించవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిన సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి (రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) గత కొన్నేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’తో కలసి గతంలో వరుసగా రెండేళ్లు తెలుగు రాష్ట్రాల్లో ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమాన్ని నిర్వహించి వేలాది మంది రైతుల్లో చైతన్యం నింపిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో పొలాలను స్వయంగా పరిశీలించి కందకాలు తవ్వించిన చంద్రమౌళి తన పొలంలోనూ కందకాలు తవ్వించి రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఎకరానికి రూ. 5 వేలు చాలు.. సాగు యోగ్యమైన భూముల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎకరానికి రూ. 5వేల ఖర్చుతో కందకాలు తవ్వడానికి రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని, వృథాగా పోతున్న 850 టీఎంసీల నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చని ఆయన అంటున్నారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలిపి అందించే నీరు 600 టీఎంసీలేనన్నారు. ఎకరానికి పంటకు రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడిగా ఇస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడం తప్పని సరి చేస్తే ఒక్క ఏడాదిలోనే సాగునీటి భద్రత చేకూరుతుందని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని సాగు యోగ్యమైన భూములన్నిటిలో కందకాలు తవ్విస్తే రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని, 950 టీఎంసీల నీటిని భూమిలోకి ఎక్కడికక్కడ ఇంకింపజేయవచ్చని చంద్రమౌళి (98495 66009) సూచిస్తున్నారు. చంద్రమౌళి మామిడి తోటలో కందకం -
పాతాళంలో జలం!
కీసరకు చెందిన దాగిళ్లపురం రాజు తాగునీటి బోరు తవ్వించాలని నిర్ణయించుకున్నాడు. నాలుగైదు వందల అడుగులైనా సరే.. నీళ్లు వస్తే చాలనుకొని రంగంలోకి దిగాడు. గత వారం ఐదువందల అడుగుల లోతువరకు బోరు వేయించినా ప్రయోజనం లేదు. ధైర్యం చేసి మరో 500 అడుగుల లోతువరకు డ్రిల్ వేయించాడు. కానీ ఫలితం శూన్యం. ఇంట్లో నీటిసమస్యను తట్టుకోలేక మరికొంత ధైర్యం చేసిన రాజు.. మరో వంద ఫీట్లలోతు వరకు డ్రిల్ చేయించాడు. రాతి పొగ తప్ప.. చుక్కనీరు కూడా రాలేదు. ఇప్పటికే రూ.1.60లక్షలు ఒడిసిపోవడంతో చేసేదేమీ లేక బోరువేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తాగునీటికి కటకట ఉన్న మన జిల్లాలో వెయ్యి అడుగుల లోతులో కూడా చుక్క నీరు దొరకని పరిస్థితికి నిదర్శనమిది. జిల్లాలో భారీగా పతనమైన భూగర్భ నీటిమట్టం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో నీటి సమస్య ఊగ్రరూపం దాల్చింది. తాగునీటితోపాటు నిత్యవసరాలకు వాడుకునే నీటికి సైతం తీవ్ర కటకట వచ్చింది. వేసవి సీజన్ సమీపించకముందే జిల్లాలోని అన్ని మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తడం జిల్లా ప్రజానికాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సగటున ఐదు అడుగులు పతనం మండలంలో లోతట్టు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ భూగర్భ జలశాఖ వేసిన బోరులో నీటి పరిస్థితిని పరిశీలించి భూగర్భజలాల పరిస్థితిని అంచనా వేస్తోంది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పద్ధతితో స్పష్టత రానప్పటికీ.. అధికారులు మాత్రం దీన్నే కొనసాగిస్తున్నారు. ఇటీవల జిల్లా భూగర్భజల శాఖ అధికారులు మండలాల వారీగా నీటిమట్టాలను ప్రకటించారు. 2013-14 పరిస్థితిని పరిశీలిస్తూ.. తాజాగా 2014-15 సంవత్సరంలో నమోైదె న వివరాలను పోలిస్తే భారీగా తగ్గుదల కనిపిస్తోంది. జిల్లాలో సగటున ఐదు అడుగుల లోతుకు నీటిమట్టం పడిపోయినట్లు అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదీ.. * జిల్లాలో అత్యధికంగా కీసర మండలంలో భూగర్భ జలాలు పడిపోయాయి. అయితే ఇక్కడ ఎంతమేర నీటి మట్టం పడిపోయిందనేది అధికావర్గాలు సైతం చెప్పలేకపోవడం గమనార్హం. * బంట్వారం మండలంలో ఏకంగా 19 అడుగులలోతుకు నీటిమట్టం పతనమైంది. * గండేడ్, మల్కాజిగిరి మండలాల్లో 11 అడుగుల లోతుకు భూగర్భజలాలు పతనమయ్యాయి. ఇక్కడ 25అడుగుల లోతులో నీరు లభ్యమవుతున్నట్లు అధికారులు నివేదికలు చెబుతున్నాయి. * పెద్దేముల్, బాలానగర్, మర్పల్లి, మహేశ్వరం తదితర మండలాల్లోనూ నీటిమట్టాలు భారీగా పడిపోయాయి. * పలుమండలాల్లో భూగర్భ జలాల పరిస్థితి పతనమవ్వడం, వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో మరింత ఒత్తిడి పెరగడంతో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకంగా మరే అవకాశం ఉంది. దీంతో కలుషితనీటితో అనర్థాలు జరవచ్చని పర్యవరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాల వాడకాన్ని అరికట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు.