పాతాళంలో జలం!
కీసరకు చెందిన దాగిళ్లపురం రాజు తాగునీటి బోరు తవ్వించాలని నిర్ణయించుకున్నాడు. నాలుగైదు వందల అడుగులైనా సరే.. నీళ్లు వస్తే చాలనుకొని రంగంలోకి దిగాడు. గత వారం ఐదువందల అడుగుల లోతువరకు బోరు వేయించినా ప్రయోజనం లేదు. ధైర్యం చేసి మరో 500 అడుగుల లోతువరకు డ్రిల్ వేయించాడు. కానీ ఫలితం శూన్యం. ఇంట్లో నీటిసమస్యను తట్టుకోలేక మరికొంత ధైర్యం చేసిన రాజు.. మరో వంద ఫీట్లలోతు వరకు డ్రిల్ చేయించాడు.
రాతి పొగ తప్ప.. చుక్కనీరు కూడా రాలేదు. ఇప్పటికే రూ.1.60లక్షలు ఒడిసిపోవడంతో చేసేదేమీ లేక బోరువేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
తాగునీటికి కటకట ఉన్న మన జిల్లాలో వెయ్యి అడుగుల లోతులో కూడా చుక్క నీరు దొరకని పరిస్థితికి నిదర్శనమిది.
జిల్లాలో భారీగా పతనమైన భూగర్భ నీటిమట్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో నీటి సమస్య ఊగ్రరూపం దాల్చింది. తాగునీటితోపాటు నిత్యవసరాలకు వాడుకునే నీటికి సైతం తీవ్ర కటకట వచ్చింది. వేసవి సీజన్ సమీపించకముందే జిల్లాలోని అన్ని మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తడం జిల్లా ప్రజానికాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సగటున ఐదు అడుగులు పతనం
మండలంలో లోతట్టు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ భూగర్భ జలశాఖ వేసిన బోరులో నీటి పరిస్థితిని పరిశీలించి భూగర్భజలాల పరిస్థితిని అంచనా వేస్తోంది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పద్ధతితో స్పష్టత రానప్పటికీ.. అధికారులు మాత్రం దీన్నే కొనసాగిస్తున్నారు. ఇటీవల జిల్లా భూగర్భజల శాఖ అధికారులు మండలాల వారీగా నీటిమట్టాలను ప్రకటించారు. 2013-14 పరిస్థితిని పరిశీలిస్తూ.. తాజాగా 2014-15 సంవత్సరంలో నమోైదె న వివరాలను పోలిస్తే భారీగా తగ్గుదల కనిపిస్తోంది. జిల్లాలో సగటున ఐదు అడుగుల లోతుకు నీటిమట్టం పడిపోయినట్లు అధికారులు గణాంకాలు చెబుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదీ..
* జిల్లాలో అత్యధికంగా కీసర మండలంలో భూగర్భ జలాలు పడిపోయాయి. అయితే ఇక్కడ ఎంతమేర నీటి మట్టం పడిపోయిందనేది అధికావర్గాలు సైతం చెప్పలేకపోవడం గమనార్హం.
* బంట్వారం మండలంలో ఏకంగా 19 అడుగులలోతుకు నీటిమట్టం పతనమైంది.
* గండేడ్, మల్కాజిగిరి మండలాల్లో 11 అడుగుల లోతుకు భూగర్భజలాలు పతనమయ్యాయి. ఇక్కడ 25అడుగుల లోతులో నీరు లభ్యమవుతున్నట్లు అధికారులు నివేదికలు చెబుతున్నాయి.
* పెద్దేముల్, బాలానగర్, మర్పల్లి, మహేశ్వరం తదితర మండలాల్లోనూ నీటిమట్టాలు భారీగా పడిపోయాయి.
* పలుమండలాల్లో భూగర్భ జలాల పరిస్థితి పతనమవ్వడం, వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో మరింత ఒత్తిడి పెరగడంతో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకంగా మరే అవకాశం ఉంది. దీంతో కలుషితనీటితో అనర్థాలు జరవచ్చని పర్యవరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాల వాడకాన్ని అరికట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు.