26 మంది డిశ్చార్జి
61మందికి అరకులోయ ఆస్పత్రిలో వైద్యసేవలు
భయంతో ఇళ్లకు వెళ్లిపోతున్న మిగతా విద్యార్థినులు
సాక్షి,పాడేరు: కలుషిత ఆహారం తిని ఆస్వస్థతకు గురైన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు ప్రాణాపాయం తప్పింది. అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రితో పాటు కిల్లోగుడ పీహెచ్‌సీ వైద్యబృందం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం 61మంది విద్యార్థినులు అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. 26మంది విద్యార్థినులు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు.
గుడ్డుకూర, రసంతో కూడిన అన్నం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు 79మంది తీవ్ర అçస్వస్థతకు గురైన ఘటనపై శనివారం ఉదయం కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్ విచారించారు. ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణ సక్రమంగా లేదంటూ గిరిజన సంక్షేమ డీడీ కొండలరావు పనితీరుపై కలెక్టర్ మండిపడ్డారు. జామగుడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు ఆస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడంతో మిగిలిన విద్యార్థినులను వారి తల్లిదండ్రులు శనివారం ఇళ్లకు తీసుకెళుతున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: అరకు ఎంపీ
అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం జాముగుడ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమపాఠశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్‌పాయిజన్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి డిమాండ్ చేశారు.
స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ఆమె శనివారం పరామర్శించారు. ఆమె డాక్టర్ కావడంతో స్టెతస్కోప్‌తో విద్యార్థినులను పరీక్షించారు. ఆస్పత్రిలో అన్ని వార్డులను సందర్శించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment