నిషేధం వేటు... సమానతకు చేటు | Equality worst fire ban | Sakshi
Sakshi News home page

నిషేధం వేటు... సమానతకు చేటు

Published Thu, Jun 4 2015 1:23 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

నిషేధం వేటు... సమానతకు చేటు - Sakshi

నిషేధం వేటు... సమానతకు చేటు

ఐఐటీలతోపాటు, కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ వ్యతిరేక విద్వేషం పెల్లుబుకుతోంది. అవమాన భారానికి పలువురు దళిత, ఆదివాసీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మగౌరవం కోసం నిలిస్తే చాలు... ఇంటర్నల్స్‌లో కోత, ఫెయిల్ చేయడం, బహిష్కరణలు పరిపాటిగా మారాయి. మద్రాసు ఐఐటీ వేధింపు మరో రకం. ఆలోచనలకు నిషేధపు సంకెళ్లు తొడగడం. చెన్నై ఐఐటీలో వ్యక్తమైనది కంటికి కనిపించే పొగ మాత్రమే. రాజుకుంటున్న కుల వివక్షత, విద్వేషం అనే నిప్పు చాలా విద్యాసంస్థలను దహించేస్తోంది.
 
 ‘‘భారతీయులు రెండు భిన్నమైన అభిప్రాయాలతో సహజీవనం చేస్తు న్నారు. రాజ్యాంగం పీఠికలో పేర్కొన్నట్టు రాజకీయంగా స్వేచ్ఛ, సమాన త్వం, సోదర భావాలను గౌరవిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ వారి మతం బోధించే సామాజిక అసమానతల సిద్ధాంతం స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం భావాలను దరిదాపుల్లోకి రానివ్వదు’’ అని డాక్టర్ బి.ఆర్. అంబే డ్కర్ అన్నమాటలు నేటి భారత సామాజిక గమనానికి అద్దం పడుతున్నాయి.
 
 మేధో సామ్రాజ్య మణిమకుటంగా కీర్తిగాంచిన ఐఐటీల్లో కుల వివక్షతో కూడిన కుటిల రాజకీయాలు ఎన్నడో పాతుకుపోయి, నేడు ఊడలు చాచి అంతటికీ విస్తరిస్తున్నాయి. విజ్ఞానంతో, వివేచనతో ప్రగతిశీలమైన, చైతన్య వంతమైన భవిష్యత్ తరాన్ని అందించాల్సిన ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు కులం జబ్బుతో కునారిల్లుతున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇటీవల చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎస్సీ, ఎస్టీ తదితర అణగారిన వర్గాల విద్యార్థులు నిర్వహిస్తున్న ‘‘అంబేడ్కర్- పెరి యార్ స్టడీ సర్కిల్’’పై విధించిన నిషేధమే. స్టడీ సర్కిల్ విద్వేషాలను రెచ్చ గొడుతోందని, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ సంస్థ యాజమాన్యం ఈ నిరంకుశ చర్యకు పాల్పడింది. ఇది మచ్చుకి ఒకటే. నిజానికి దేశంలోని ఐఐటీలతో పాటు, పలు కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ వ్యతిరేక విద్వేషం కట్టలు తెంచుకుంటోంది.
 
 అవమాన భారాన్ని భరించలేక పలువురు దళిత, ఆదివాసీ విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తలెత్తి నిలిస్తే చాలు... ఇంటర్నల్ మార్కుల కోతలు, ఫెయిల్ చేయడం, క్రమశిక్షణ సాకుతో బహి ష్కరణ పరిపాటిగా మారాయి. మద్రాసు ఐఐటీ వేధింపు మరో రకం. ఆలోచ నలకు నిషేధపు సంకెళ్లు తొడగడం. ప్రశ్నల కొడవళ్లను మొగ్గలోనే తుంచేయ డం. హక్కుల కోసం సంఘటిత మయ్యే విద్యార్థులను బెదిరించి లొంగదీసు కునే కుటిలయత్నం. చెన్నై ఐఐటీలో వ్యక్తమైనది కంటికి కనిపించే పొగే. రాజుకుంటున్న కుల వివక్షత, విద్వేషం అనే నిప్పు చాలా విద్యాసంస్థలను దహించేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులం భారతీయులంతా ఒక్కటే ననే భావన మెదళ్లలోకి ఎక్కకుండా అడ్డగిస్తోంది. సాటి మనిషిని ప్రేమించి, ఆదరించడమనే మానవ స్వభావాన్నే ధ్వంసిస్తున్నది. పర్యవసానంగానే ఐఐటీ, ఐఐఎమ్, ఏఐఐఎమ్మెస్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కుల విద్వేషం కట్టలు తెంచుకుంటోంది.
 
 మన మేడిపండు ‘ప్రతిభ’
 ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదనే వాదనతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రవేశాల నాటి నుండే వెలివేసి, అవమానాలకు గురి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రవేశం వల్లనే ఈ సంస్థల ప్రతిష్ట దిగజారుతోందని ప్రచారం సాగుతోంది. మన ఐఐటీల చరిత్ర తెలిస్తేనైనా ఇలా ప్రతిభ గురించి విర్రవీగేవారికి కనువిప్పు కావొచ్చు. అవన్నీ ఇతర దేశాల దయాదాక్షిణ్యాలతో ఉనికిలోకి వచ్చినవే. యునెస్కో సహకారంతో సోవియెట్ యూనియన్ మొట్ట మొదట బొంబాయి ఐఐటీని స్థాపించింది. చర్చనీయాంశంగా మారిన మద్రాసు ఐఐటీ నాటి పశ్చిమ జర్మనీ సహకారంతోనూ, కాన్పూర్ ఐఐటీ అమెరికా సహాయంతోనూ 1959లో ఏర్పడ్డాయి. ఢిల్లీ ఐఐటీ 1961లో బ్రిటన్ సహాయంతో ఏర్పాటైంది.
 
 నేటికీ ఇవన్నీ కేంద్రం సహా ఇతర దేశాల సహాయ సహకారాలతోనే నడుస్తున్నాయి. పోనీ పరిశోధనలోనో, నూతన ఆవిష్కర ణలలోనో గొప్ప ప్రావీణ్యాన్ని చూపుతున్నాయా? అంటే అదీ లేదు. ‘‘అమె రికా లాంటి దేశాల్లో లాగా మన దేశంలో శాస్త్ర, సాంకేతిక సంస్థలు కొత్త ఆవిష్కరణలకు పూనుకోవడం లేదు. ఇది మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన లోపం’’ అని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పల్లె రామారావు ఇటీవలే నిర్మొహమాటంగా అన్నారు. ఏ రంగంలో ఎవరు మంచి ఫలితాలను, ప్రగ తిని సాధించినా వాటిని ఇతరులకు అందించడం ద్వారానే సమాజం సమ గ్రాభివృద్ధిని సాధిస్తుంది. అయితే కుల సమాజాన్ని పెంచిపోషిస్తున్న హిందూ సమాజం తమకు అందివచ్చిన ఫలాలను ఇతరులకు పంచడానికి ముందుకు రావడం లేదు. అందుకే ఈ దుస్థితి.
 
 అసమాన పోటీలో...
 ఇక ఎక్కువ మార్కులు సంపాదించిన వారే ప్రతిభావంతులనే వాదననూ ముందుకు తెస్తున్నారు. ఎంట్రన్స్ టెస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ మార్కులు వచ్చినా అడ్మిషన్ వచ్చేస్తోందని, రిజర్వేషన్ల వల్లే తమతో ‘సరితూగనివాళ్లు’ తమ పక్కన కూర్చుంటున్నారనే వ్యతిరేకత ఇతర కులాల విద్యార్థుల మన స్సుల్లో బలంగా ఉన్నది. ఇలాంటి దురభిప్రాయాలను కొందరు మేధావులు పనిగట్టుకొని పెంచిపోషిస్తున్నారు. ఈ ఏడాది ఐఐటీ ఎంట్రన్స్‌కు హాజరైన 13 లక్షల మందిలో కనీసం 10 లక్షల మంది కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది ఉంటారు. ఒక్కొక్కరు సగటున లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టి ఉంటారు. ఇంత తాహతు ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడెది? లక్షలు ఖర్చు పెట్టి సీటు సంపాదిం చిన వారితో, సర్కారు బళ్లలో చదివిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పోటీపడాల్సి వస్తోంది. ఈ అసమాన పోటీని అర్థం చేసుకుని, సరిదిద్దాల్సిన బాధ్యత సమా జంపైనే ఉంది. కానీ హిందూ సమాజ కులవ్యవస్థ అందుకు అనుమతించదు.
 
 వీటన్నిటితోపాటూ నిత్యం ఎదుర్కోక తప్పని కుల వివక్ష ఎస్సీ, ఎస్టీ విద్యార్థులలో ఆత్మన్యూనతను పెంపొందింపజేస్తోంది. ఏ విద్యాసంస్థలోనైనా మొదట ప్రవేశించినప్పుడు ఏ విద్యార్థికైనా బెరుకు తప్పదు. కానీ, గ్రామీణ ప్రాంతాల, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు మరింత భయంగా సంస్థలోకి అడుగుపెడతారు. ఆ భయానికి ప్రొఫెసర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడలేక విద్యార్థులు నోరు తెరవడానికే భయపడతారు. ప్రొఫెసర్ల. విద్యార్థుల చిన్న చూపునకు గురవుతారు. పైగా వారికి సరైన గెడైన్స్ కూడా దొరకదు. అధ్యాపకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు తగినప్రాతి నిధ్యం ఉండకపోవడం మరో కీలకాంశం. ఒకవేళ ఎవరో ఒకరిద్దరున్నా దళిత విద్యార్థులకు మద్దతుగా నిలిచే సాహసం చేయలేరు. ఈ పరిస్థితి ఐఐటీలకే పరిమితమైనది కాదు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా దళితులు, ఆదివాసుల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతున్నది. గత పదేళ్లలో కొన్ని పదుల మంది విద్యార్థులు బహిష్కృతులయ్యారు. ఎందరో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 
 వివక్ష బలిపీఠాలపై...
 అలాంటి వారిలో ఐఐటీ విద్యార్థులే అత్యధికం! ఒక్క కాన్పూర్ ఐఐటీలోనే గత ఐదేళ్ళలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన సుమన్. ఎంటెక్ చేసిన ఆ విద్యార్థి 2010 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు హైదరాబాద్‌కు చెందిన మాధురి. శ్రీకాంత్ అనే మరో తెలుగు విద్యార్థి ముంబై ఐఐటీలో చదువుతూ 2007లో అలాగే బలైపోయాడు. వెలుగులోకిరాని వేన వేల వేధింపులు ఎన్నో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూల్లోని వేధింపులను గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అక్కడా ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మ హత్యల  ఘటనలు చాలానే ఉన్నాయి.
 
 దేశంలోనే పేరుమోసిన హెచ్‌సీ యూలో వెంకటేష్ అనే  పీహెచ్‌డీ విద్యార్థికి ఏళ్లు గడచినా గైడ్‌ను కేటాయిం చలేదు. చదువులో ఎంతో మంచి రికార్డు ఉన్న వెంకటేష్‌కు ఆర్థికంగా ఇబ్బం దులూ లేవు. యాజమాన్యం చూపిన వివక్షకే వెంకటేష్ నిండు ప్రాణాలు బలైపోయాయి.  రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, లింగంపల్లి గ్రామా నికి చెందిన వెంకటేష్ తండ్రి పోలీసు కానిస్టేబుల్. 2013 నవంబర్‌లో హాస్టల్ గదిలోనే  జరిగిన ఈ ఆత్మహత్యపై సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నిజని ర్ధారణ కమిటీని వేసి, నివేదికను జాతీయ మానవహక్కుల సంఘానికి అందించింది. ఇటీవల విచారణ జరిపిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెంకటేష్ కుటుం బానికి యూనివర్సిటీ చేత ఏడు లక్షల నష్టపరిహారం ఇప్పించింది. ఇది కంటితుడుపు చర్య మాత్రమే.
 
అదేవిధంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర విద్యాలయాల్లో ‘సెం టర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ పేరిట విడిగా ప్రత్యేక స్వయంప్రతిపత్తి సంస్థలను నెల కొల్పుతున్నారు. క్రమశిక్షణ ముసుగులో వాటిలో విద్యార్థులను, ముఖ్యంగా దళిత, ఆదివాసీ విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని వెంటనే రద్దుచేసి ఒక ప్రజాస్వామిక వాతావర ణాన్ని ఈ విశ్వవిద్యాలయాల్లో కల్పించాల్సి ఉంది. మద్రాసు ఐఐటీ వివాదం తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నిపుణుల కమిటీని వేసి విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలి.
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 9705566213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement