Madras IIT
-
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు..
-
మద్రాస్ ఐఐటీలో స్పోర్ట్స్ కోటా
న్యూఢిల్లీ: అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను ప్రవేశపెట్టిన ఐఐటీగా మద్రాస్ ఐఐటీ నిలిచింది. 2024–25 అకడమిక్ సెషన్ నుంచి ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అదనంగా రెండు సీట్లను ఇందుకోసం సృష్టించాలని నిర్ణయించినట్లు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్(ఎస్ఈఏ) ప్రోగ్రాం కింద సృష్టించిన ఈ రెండు సీట్లలో భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో ఒకటి విద్యార్థినులకు రిజర్వు చేస్తామన్నారు. ఐఐటీల్లో ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా లేదు. -
ఐఐటీ మద్రాస్‌లో కరోనా కలకలం
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు ఐఐటీలో కరోనా కలకలం చెలరేగింది.100 మందికిపైగా విద్యార్థులకు కోవిడ్ సోకడంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసుని తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం 104 మంది విద్యార్థులకు కోవిడ్ సోకగా, అందరి పరిస్థితీ నిలకడగానే ఉన్నట్టు తమిళనాడు హెల్త్ సెక్రటరీ జె.రాధాకృష్ణన్ చెప్పారు. మొత్తం 444 శాంపిల్స్ పరీక్షించగా అందులో 104 మందికి కోవిడ్ పాజిటివ్ నమోదయ్యింది. ముఖ్యమంత్రి పళని స్వామి ఆదేశాల మేరకు వీరందరికీ, కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్‌లో చికిత్సనందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వివిధ డిపార్ట్మెంట్లను, ప్రయోగశాలలను మూసివేసినట్లు ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం కేవలం 700 మంది విద్యార్థులు, ప్రధానంగా రీసెర్చ్ స్కాలర్స్ మాత్రమే తొమ్మిది హాస్టల్స్‌లో ఉన్నారని, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. విద్యార్థులను వారి వారి గదులకే పరిమితం కావాలని, క్వారంటైన్లో ఉండాలని సూచించారు. విద్యార్థుల గదులకే ప్యాకెట్లలో ఆహారాన్ని అందజేస్తున్నారు. తమిళనాడులోని అన్ని కాలేజీల్లో పీజీ రెండో సంవత్సరం, పీహెచ్డీ విద్యార్థులకు ఈనెల 2వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 7 నుంచి తరగతులు ఆరంభం అయ్యాయి. ఐఐటీలోని 66 మంది పీహెచ్డీ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. సోమవారం నాటికి ఈ సంఖ్య 104కి చేరింది. హాస్టల్ విద్యార్థులకు కరోనా సోకడంతో ఐఐటీ ప్రాంగణంలోని అన్ని విభాగాలు, లైబ్రరీలు, క్యాంటీన్లను మూసివేస్తున్నట్లు రిజిస్ట్రార్ సోమవారం ఒక సర్క్యులర్ జారీచేశారు. అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్టు డైరెక్టర్లు, పీహెచ్డీ విద్యార్థులు వర్క్ ఫ్రం హోం పాటించాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ సోమవారం ఐఐటీకి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. -
ఓటింగ్‌కు బ్లాక్‌చైన్ టెక్నాలజీ
బనశంకరి (బెంగళూరు): దేశంలో ఎక్కడినుంచైనా ఓటు వేయటానికి వీలు కల్పించే బ్లాక్‌చైన్ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు ఎన్నికల కమిషన్, మద్రాసు ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉందని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్దిష్ట ప్రదేశానికి రావాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక ఇంటర్నెట్ లైన్ల ద్వారా వెబ్ కెమెరా, ఓటరు వేలిముద్రలను ఉపయోగించుకొని ఓటరును నిర్ధారించుకుంటారు. అనంతరం టూ వే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ఓటును ఎన్‌క్రిప్ట్ చేస్తారు. అనంతరం తిరిగి ఎన్నికలప్పుడే డీక్రిప్ట్ చేసేలా చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు చెన్నైకి చెందిన వ్యక్తి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలోనే అధికారులు ఏర్పాటు చేసిన అధీకృత సెంటర్ ద్వారా చైన్నైలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. దీనికి ఈ–బాలెట్ పేపర్ జనరేట్ అవుతుందని చెప్పారు. -
దేశం విడిచి వెళ్లాలంటూ జర్మన్ విద్యార్థికి ఆదేశం
సాక్షి, చెన్నై : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఓ జర్మన్ విద్యార్థిని అధికారులు దేశం నుంచి పంపించేశారు. అతని చర్య వీసా నిబంధనలను ఉల్లంఘిస్తోందని, దేశ బహిష్కరణ చేయకముందే దేశాన్ని విడిచి వెళ్లాలంటూ ఆ విద్యార్థికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. మద్రాస్ ఐఐటీలో భౌతికశాస్త్రంలో పీజీ చదువుతున్న జాకబ్ లిండెంతల్ అనే జర్మన్ విద్యార్థి గత వారం సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకొని జాకబ్‌ను విచారించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను సోమవారం అర్థరాత్రి కల్లా దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో జాకబ్ చేసేది లేక సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి అమ్‌స్టర్‌డామ్ నగరానికి చేరుకున్నారు. ఈ విషయంపై జాకబ్ స్పందిస్తూ.. నేను స్నేహితులతో చెపాక్, వల్లవర్ కొట్టంకు వెళ్లాను. అప్పటికి 144 సెక్షన్ విధించలేదు. సీఏఏపై ఎలాంటి అభిప్రాయాన్ని గానీ, వ్యతిరేకతను గానీ వ్యక్తం చేయలేదు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని తెలిపాడు. అర్థాంతరంగా దేశం నుంచి వెళ్లగొట్టడంపై న్యాయ నిపుణులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటానని జాకబ్ వెల్లడించాడు. ఈ పరిణామాలపై మద్రాస్ ఐఐటీని సంప్రదించగా, వారు ఇంకా స్పందించాల్సి ఉంది. -
న్యాయ పోరాటం కన్నతండ్రి కన్నీరు
టీనేజ్ దాటాక తల్లిదండ్రులు స్నేహితులైపోవాలని నియమం. మరి అధ్యాపకులు ఎంత ఆత్మీయులైపోవాలి? పిల్లలు ఇల్లు వదిలి వచ్చేది విద్యాలయాలను ఇల్లుగా భావించడం వల్లే. అక్కడ ఎంత ఆదరణ ఉండాలి. చాలా కష్టపడితే తప్ప, ప్రతిభ చూపితే తప్ప ఐ.ఐ.టి వంటి చోటుకు విద్యార్థులు చేరలేరు. అలాంటి విద్యార్థుల కోసం ఎంత స్నేహశీలత ఉండాలి? కాని ఆశిస్తున్నది వేరు. జరుగుతున్నది వేరు. పాతిమా లతీఫ్ ఆత్మహత్య చేస్తున్న హెచ్చరిక వేరు. ‘ఓ మనిషిని మారణాయుధాలతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపితేనే హత్యకాదు. బలవన్మరణానికి పాల్పడే స్థాయిలో మానసికంగా వేధింపులకు గురిచేసినా హత్యగా పరిగణించాలి. అందుకే చెబుతున్నా... నా కుమార్తె ఫాతిమా లతీఫ్ది ఆత్మహత్య కాదు, హత్య’ అంటూ ఆవేదన చెందుతున్నారు ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్.ఆయన ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఫాతిమా ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఫాతిమా మరణానికి ముందు దిగాలు పడి ప్రాణాలు తీసుకుంది. దీనికి కారణం ఆమె మీద వత్తిడి తీసుకు వచ్చిన ఒక ప్రొఫెసర్ అని అబ్దుల్ లతీఫ్ ఆరోపిస్తున్నారు. ‘నా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. ముందు నిందితులను పట్టుకోండి’ అని అతడు తమిళనాడు ప్రభుత్వాన్ని కన్నీళ్లతో కోరుతున్నాడు.తమ పిల్లలు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో చదువుకుని ఉన్నతోద్యోగులు కావాలని చాలామంది తల్లిదండ్రులు ఆశించినట్టే అబ్దుల్ లతీఫ్, సబితా కూడా ఆశించారు. కాని ఆ కలలు చెదిరిపోయాయి. చెన్నై ఐఐటీలో పెద్ద కూతురు ఫాతిమా చేరిన ఐదు నెలల్లోనే ఫాతిమా హాస్టల్ గదిలో ఉరి వేసుకుని తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. కేరళ రాష్ట్రం కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ (19) ఈ ఏడాది మేలో చెన్నై ఐఐటీలో చేరింది. చురుకైన విద్యార్థినిగా కొద్ది రోజుల్లోనే అందరి అభిమానం పొందారు. ఐఐటీ ప్రాంగణంలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రతిరోజూ రాత్రి తల్లికి ఫోన్ చేసి నిద్రపోవడం ఫాతిమాకు అలవాటు. అయితే నవంబరు 9వ తేదీన ఎంతకూ కుమార్తె నుంచి ఫోన్ రాకపోవడంతో తల్లే చేసింది. ఎంతకూ ఫోన్ తీయకపోవడంతో స్నేహితురాళ్లకు ఫోన్ చేసింది. లోన గడియ వేసి ఉన్న స్థితిలో తలుపులు ఎంతగా బాదినా తీయక పోవడంతో హాస్టల్ సిబ్బంది వచ్చి పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఫాతిమా నిర్జీవంగా వేలాడుతూ ఉంది. అక్టోబరులో జరిగిన పరీక్షలో తక్కువ మార్కులు రావడం వల్ల ఫాతిమా ప్రాణాలు తీసుకుందని కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నై కొట్టూరుపురం పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. హడావిడిగా పోస్టుమార్టం పూరి ్తచేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే ఫాతిమా సోదరి ఆయేషా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి స్విచ్ ఆఫ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ను ఆన్ చేసి పరిశీలించగా సుదర్శన్ పద్మనాభన్ అనే ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా సౌదీలో పనిచేస్తున్న తండ్రికి పంపిన ఎస్.ఎం.ఎస్ బయటపడింది. కేరళ రాష్ట్రంలో కొల్లం మేయర్‌గా ఉన్న తన తండ్రి స్నేహితుడు రాజేంద్రబాబు సహకారంతో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆయేషా తన అనుమానాలతో వినతిపత్రం సమర్పించింది. వెంటనే కేరళ సీఎం తమిళనాడు సీఎం ఎడపాడికి ఉత్తరం రాయడంతో ఫాతిమా కేసు తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వ్యవహారంగా మారి విశ్వరూపం దాల్చింది. మాజీ సీబీఐ అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు ప్రకటించిన చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్.. ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభన్తోపాటూ ముగ్గురు ప్రొఫెసర్లకు సమన్లు పంపారు. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు, ఆందోళనలు సాగిస్తున్నాయి. పదకొండుమంది చెన్నై ఐఐటీ విద్యార్థులు ప్రాంగణం లోపల సోమవారం దీక్ష చేపట్టారు. కేంద్ర ఉన్నతవిద్యాశాఖ ప్రతినిధుల బృందం ఆదివారం విచారణ జరిపి వెళ్లింది. నెల రోజుల వేదన ‘మా అక్క ఫాతిమా దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అప్పటికే ఆమె డల్‌గా అయిపోయింది. మేమంతా హోమ్‌సిక్‌నెస్ అనుకున్నాం. చనిపోయే రెండు రోజుల ముందు సెమినార్ ఉందని చెప్పింది. అది సుదర్శన్ పద్మనాభన్ సెమినార్. అందులో ఆయన అందరు విద్యార్థుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడని నాతో చెప్పింది. మేము ఎక్కడ బాధ పడతామోనని ఆమె లోలోపల కుమిలిపోయింది. చివరకు ప్రాణాలు తీసుకుంది’ అని ఆయేషా పత్రికల వారితో చెప్పింది. ఫాతిమా తండ్రి మాత్రం కేవలం సుదర్శన్ పద్మనాభన్ వల్లే తన కుమార్తె మరణించినట్టు పత్రికల వారి వద్ద ఆరోపించాడు. ‘అతనొక్కడే కాదు.. ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు ఈ కేసులో పట్టుబడాల్సి ఉంది’ అని అతడు అన్నాడు. మరోవైపు విద్యార్థి సంఘాలు ఫాతిమా ఒక మైనారిటీ స్టూడెంట్ కాబట్టే ఈ వివక్ష చోటు చేసుకొని ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని ఆరోపిస్తున్నాయి. దేశమంతా ఫాతిమా తరఫున వారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది తొమ్మిదో ఆత్మహత్య చెన్నై ఐఐటీలో 2016 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఫాతిమా లతీఫ్ ఆగష్టులో చేరి మూడునెలల్లోనే మానసిక క్షోభకు గురై ఈనెల 9వ తేదీన ప్రాణాలు తీసుకోవడం రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసింది. చెన్నై ఐఐటీలో ఇప్పటికి 8 ఆత్మహత్య సంఘటనలు చోటుచేసుకోగా ఫాతిమా ఉదంతం తొమ్మిదవది, ఇలా వరుసగా ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నా ఐఐటీ యాజమాన్యం చేష్టలుడిగి చూస్తుండటం పట్ల తల్లిదండ్రులు ఆవేదనం చెందుతున్నారు. ఇటీవలి కాలంలో కొత్తగా రిక్రూట్ అయిన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువ అసిస్టెంట్ ప్రొఫెసర్లు దక్షిణాది విద్యార్థులపట్ల చిన్నచూపు చూస్తు న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాది విద్యార్థులను చేరదీయడం, దక్షిణాది విద్యార్థుల పట్ల పరుషంగా ప్రవర్తించడం యువ ప్రొఫెసర్లకు పరిపాటిగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. చెట్టులా నీడనివ్వాల్సిన అధ్యాపకుల మీద ఇలాంటి ఆరోపణలు రావడం కచ్చితంగా అప్రమత్తం కావాల్సిన విషయం. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
అది ఆత్మహత్యే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైన తమ కుమార్తె ఫాతిమా లతీఫ్‌కు తక్కువ మార్కులు రావడం ఏమిటి, కలత చెంది ఆత్మహత్యకు పాల్పడడం ఏమిటి...అంతా అబద్ధం. మానసికంగా వేధింపులతో తమ కుమార్తెను హత్యచేశారు...’ అంటూ ఫాతిమా లతీఫ్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమార్తె చావుకు కారణమైన ప్రొఫెసర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, కేరళ సీఎంల జోక్యంతో విషయం విశ్వరూపం దాల్చింది. ఇదిలా ఉండగా మాజీ సీబీఐ అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ గురువారం ప్రకటించారు. చెన్నై ఐఐటీలో చదువుతున్న కేరళకు చెందిన ఫాతిమా లతీఫ్ (18) ఈనెల 9న తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తొలుత ఒక సాధారణ సంఘటనగా పరిగణించారు. గతనెల జరిగిన పరీక్షలో తక్కువమార్కులు రావడంతో ప్రాణాలుతీసుకుందని కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నై కొట్టూరుపురం పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. హడావుడిగా పోస్టుమార్టం పూర్తిచేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఫాతిమా సోదరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి స్విచ్ ఆఫ్ స్థితిలో ఉన్న సెల్‌ఫోన్‌ను ఆన్ చేసి పరిశీలించగా సుదర్శన్ పద్మనాభన్ అనే ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా ఆమె నమోదు చేసిన ఎస్ఎంఎస్ బయటపడింది. దీంతో మృతురాలి తండ్రి అబ్దుల్ లతీఫ్ స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసుకుని ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం, కేరళ సీఎం తమిళనాడు సీఎంకు ఉత్తరం రాయడంతో రెండురాష్ట్రాల వ్యవహారంగా మారింది. దీంతో ఐదురోజుల తరువాత ఆత్మహత్య ఘటన విశ్వరూపం దాల్చింది. ఫాతిమా ఆత్మహత్యపై సవివరమైన నివేదికను ఇవ్వాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభన్‌కు కమిషనర్ సమన్లు పంపారు. సెలవుపై వెళ్లి ఉండిన ప్రొఫెసర్ గురువారం విధులకు హాజరుకాగా కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఉదయం 11 గంటలకు స్వయంగా ఐఐటీకి వెళ్లి ఆయనను, సహ విద్యార్థులను విచారించారు. ఫాతిమా రాసిన ఆత్మహత్య ఉత్తరాన్ని దగ్గర ఉంచుకుని కమిషన్ వేసిన ప్రశ్నలకు సుదర్శన్ ఇచ్చిన సమాధానాన్ని వాంగ్మూలంగా నమోదు చేశారు. మాజీ సీబీఐ అధికారి ఈశ్వరమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేసును విచారిస్తుందని కమిషనర్ తెలిపారు. అలాగే ఐదుగురు ప్రొఫెసర్లు బృందంగా ఏర్పడి 15 మంది స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మానసికంగా వేధించారు: తల్లిదండ్రుల ఆరోపణ తమ కుమార్తె ఎంతో ధైర్యవంతురాలు, ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది, తక్కువ మార్కుల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం సరికాదని ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్, తల్లి సుజిత అన్నారు. కాలేజీలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తమకు పదేపదే ఫోన్ చేసి చెప్పేదనితెలిపారు. మానసికంగా వేధించి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. తన చావుకు ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభనే కారణమని తన సెల్ఫోన్లో నమోదు చేసిందని తెలిపారు. ప్రొఫెసర్తోపాటూ ఫాతిమా బలవన్మరణానికి కారణమైన వారందరినీ విచారించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన ఫాతిమా ఆత్మహత్య ఉదంతంతో విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోతున్నందున ఐఐటీ మెయిన్ గేటు ముందు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా లెక్కచేయకుండా గురువారం ఉదయం పెద్ద ఎత్తున కదలి వచ్చిన విద్యార్థి సంఘాలు ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఐఐటీలో తరచూ విద్యార్థుల ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నందున ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో గిండి పరిసరాల్లో ట్రాఫిక్ స్తాంభించిపోయింది. ఐఐటీ విద్యార్థిని ఫాతిమా మరణంపై హేతుబద్ధమైన విచారణ జరగాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. -
తొక్కిసలాటలకు చెక్
కొన్ని ఉత్సవాలకు జనం లక్షల్లో వస్తుంటారు. ముందుకు అడుగేయలేనంత దట్టంగా గుమిగూడుతుంటారు. అలాంటి సందర్భాల్లో ఏమైనా తొక్కిసలాటలు జరగవచ్చు. ఊహించని విషాదాలు చోటు చేసుకోవచ్చు. మరి వాటిని నివారించడమెలా? దీనికి సైన్స్ ఏమైనా పరిష్కారం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు. ఇందుకు సాయపడే అల్గారిథమ్‌ను వారు తయారు చేశారు. గుంపులో తలెత్తిన అల్లర్లు, తొక్కిసలాట వంటివి నివారించే దిశగా పోలీసులకు ఎక్కడ మోహరించాలనే∙విషయాన్ని ఈ పద్దతి ద్వారా గ్రహించవచ్చని, తద్వారా గందరగోళాన్ని ఆదిలోనే నివారించవచ్చని వారు చెబుతున్నారు. ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన సంబంధిత పరిశోధనాంశం ప్రకారం – కంప్యూటర్ సిమిలేషన్ను ఉపయోగించి సురక్షిత తరలింపు విధానాలు రూపకల్పన చేసుకునేందుకు సైతం ఇది దోహదపడుతుంది. కుంభమేళాకి కోట్లాది మంది జనం తరలివస్తుంటారు. ఒక్కోరోజు రెండు కోట్ల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. ఇలాంటి చోట ఏవైనా దుర్ఘటనలు సంభవిస్తే నష్టం భారీగానే వుంటుంది. ఇలాంటి దుర్ఘటనలను అడ్డుకునే లక్ష్యంతో, అతి జనసమ్మర్థాన్ని మెరుగైన పద్ధతుల్లో నియంత్రించే ఉద్దేశంతో తాము ఈ అల్గారిథమ్‌ను రూపొందించామంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. అసలు ఇలాంటి తొక్కిసలాటలు ఎలా మొదలవుతాయో గమనించగలిగితే వాటిని నివారించగల మార్గాలను కూడా మనం గుర్తించవచ్చునని చెబుతున్నారు మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ మహేశ్ పంచాగ్నుల. తొక్కిసలాటల తాలూకూ తొలి సంకేతాలను అర్థం చేసుకుని, ఎక్కడ పోలీసు బలగాలు వుంచాలనేది గ్రహించడం చాలా ముఖ్యమంటున్నారు ఈయన. జనసమూహాలను క్రమబద్ధీకరించేందుకు కొన్ని చోట్ల ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేయడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదంటున్న ఈ శాస్త్రవేత్తలు.. బయటకు వేగంగా పోవడానికి వీల్లేని ప్రదేశాల్లో జనం దట్టంగా కూడినపుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోగలవో విశ్లేషించారు. ద్రవ పదార్థాలు ప్రవహించే తీరును విశ్లేషించే ఫ్లూయిడ్ డైనమిక్స్‌ను ఆపాదిస్తూ జనసమూహం పద్ధతి ప్రకారం ముందుకు సాగేలా చూడాలని బృందంలో భాగంగా వున్న సుమేష్ పి తంపి, అజింక్యా కులకర్ణి చెబుతున్నారు. -
వెజ్జా.. నాజ్ వెజ్జా..?!
చెన్నై : కులం, మతం పేరుతో విభజించడం తెలుసు.. కానీ భోజనం పేరు చెప్పి కూడా మనషులును విభజించడం గురించి చాలా తక్కువుగా విని ఉంటాము. నార్మల్‌గా బయట ఫంక్షన్లలో వెజ్, నాన్ వెజ్ అంటూ రెండు వేర్వేరు మెనులు ఏర్పాటు చేస్తారు. కానీ హస్టల్స్లో ఇలాంటి వర్గీకరణ గురించి ఎప్పుడు వినలేదు. కానీ ఇలాంటి సంఘటన ఒకటి మద్రాస్ ఐఐటీలో చోటు చేసుకుంది. ఇక్కడ క్యాంటీన్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లకు వేర్వేరు దారులనే కాక వేర్వేరే వాష్ బేసిన్లను కూడా ఏర్పాటు చేసింది యాజమాన్యం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే విద్యార్థుల కోరిక మేరకే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. గత ఏడాది మేలో క్యాంపస్‌లో ‘బీఫ్ పెస్టివల్’ని నిర్వహించారు. ఈ సమయంలో హస్టల్లో గొడవలు కూడా జరిగాయి. బీఫ్ ఫెస్టివల్లో పాల్గొన్నందుకు ఓ రిసెర్చ్ స్కాలర్ని చితక బాదారు కూదా. ఈ సంఘటన తరువాత విద్యార్థులు.. వెజిటేరియన్లకు ప్రత్యేక మెస్ కావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇలా రెండు మెస్‌లను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం పేర్కొంది. అయితే ఇలా వేర్వేరు మెస్‌లు ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. యాజమాన్యం క్యాంపస్‌లో వర్ణ, వర్గ వివక్షలకు తెరతీస్తోందంటూ ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. అయితే విద్యార్థులను ఆహారం పేరు చెప్పి రెండు వర్గాలుగా విభజించడం పట్ల తమిళ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన తెలుపుతున్నాయి. మొత్తం ఐఐటీలో 8 వేల మంది విద్యార్థులుండగా వీరిలో 6 వేల మంది నాన్ వెజిటేరియన్లు కాగా.. మరో 2 వేల మంది వెజిటేరియన్లు. -
ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
చెన్నై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసు (ఐఐటీ– ఎం)లో ఫైనలియర్ విద్యార్థి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళలోని మళప్పురానికి చెందిన షాహుల్ కోర్నాథ్ (23) ఐఐటీ–ఎంలో నేవల్ ఆర్కిటెక్చర్ విభాగంలో బీటెక్– ఎంటెక్ (డ్యూయల్ డిగ్రీ) చదువుతున్నాడు. షాహుల్ శనివారం తన గదిలో సీలింగ్‌కు ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని వెల్లడించారు. హాజరు తక్కువగా ఉండటంతో షాహుల్ కొంత ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోందన్నారు. షాహుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. -
గేట్‌కు వచ్చే నెల 1 నుంచే దరఖాస్తులు
సాక్షి,హైదరాబాద్: ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశాల కోసం గ్రాడ్యుయేట్ అప్టిట్యూట్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్) నిర్వహణకు ఐఐటీ మద్రాసు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించేలా షెడ్యూలు జారీ చేసింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను (http:// gate.iitm.ac.in) అందుబాటు లోకి తెచ్చింది. 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈసారి గేట్లో స్టాటిస్టిక్స్ పేపరును కూడా కేంద్రం ప్రవేశ పెట్టింది. మొత్తంగా 24 సబ్జెక్టుల్లో ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి విద్యార్థి ఒకే పేపరులో పరీక్ష రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును రూ. 1,500గా నిర్ణయించింది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నల్లగొండ, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, కర్నూల్, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మద్రాసు ఐఐటీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈసారి గేట్ రాసేందుకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ గేట్ షెడ్యూలు.. సెప్టెంబరు 1 నుంచి 21వ తేదీ వరకు: ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అక్టోబరు 1వరకు: రూ. 500 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ నవంబరు 16 వరకు: పరీక్షల కేంద్రాల మార్పునకు అవకాశం (ప్రత్యేక ఫీజు చెల్లింపుతో) 2019 జనవరి 4: వెబ్సైట్లో అందుబాటులోకి హాల్‌టికెట్లు 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో: గేట్ ఆన్లైన్ పరీక్షలు, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. మార్చి 16: ఫలితాలు వెల్లడి. -
ఘీంకరించిన చీమ
ఘీంకరించేది ఏనుగు... నలిగిపోయేది చీమ! అలాంటప్పుడు ఈ ప్రయోగం ఏంటి? అసలు చీమ ఘీంకరించడం ఏంటి? చీమ శబ్దమంటూ ఏదైనా వినపడితే పుటుక్కున కాలికింద నలిగిపోవడమే! అసలు వాయిస్ ఉండదు కదా! కష్టపడే చీమ.. పెత్తనం చలాయించే ఏనుగు మధ్య ఉన్న ఘర్షణే ఈ ఘీంకారం! సుజాతా గిడ్ల ఘీంకారం!! ‘‘మా అమ్మ (మేరీ మంజుల) వాళ్లది కృష్ణాజిల్లా, మా నాన్న (లూథర్ ప్రభాకర్‌రావు) వాళ్లది తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరూ లెక్చరర్లే. నేను పుట్టింది మాత్రం ఖాజీపేటలోని మేనమామ వాళ్లింట్లో. నాకు ఒక తమ్ముడు, చెల్లి. మా కుటుంబం కాకినాడలో స్థిరపడ్డది. కెనడియన్ బాప్టిస్ట్ మెషినరీ స్కూల్లో చదివాను. ఇంటర్, డిగ్రీ.. పీఆర్ గవర్నమెంట్ కాలేజ్‌లో చేశాను. డిగ్రీ తర్వాత వరంగల్ ఆర్ఈసీలో ఎమ్మెస్సీ– టెక్నాలజీలో సీట్ రావడంతో అక్కడ చేరాను. సోమర్సెట్ మామ్.. రావిశాస్త్రి, బీనాదేవి నాన్న ఇంగ్లిష్ లెక్చరర్. దాంతో ఇంట్లో తెలుగు పుస్తకాలతోపాటు ఇంగ్లిష్ పుస్తకాలూ ఉండేవి. రెండిటినీ బాగా చదివేవాళ్లం. అప్పట్లో మొబైల్ లైబ్రరీస్ ఉండేవి. సైకిల్‌మీద వచ్చి అద్దెకు పుస్తకాలు ఇచ్చి వెళ్తుండేవారు. వాటినీ వదిలిపెట్టేవాళ్లం కాదు. నాక్కాస్త ఊహ తెలిశాక.. రావిశాస్త్రి, బీనాదేవీ రచనలు చదవడం మొదలుపెట్టా. సోమర్సెట్ మామ్, రావిశాస్త్రి రచనలంటే భలే ఇష్టం. ఆర్ఎస్యూ పరిచయం.. లెఫ్ట్ ఉద్యమం నేను టెన్త్‌లో ఉన్నప్పుడు.. కొంతమంది స్టూడెంట్స్ మా వీథిలో డ్రమ్స్ కొడుతూ పాటలు పాడుతుంటే అక్కడికి వెళ్లాను. ‘‘మీరు ఎవరు?’’ అని అడిగితే ‘‘ఆర్ఎస్యూ’’ అని చెప్పారు. ఆ పాటలు నచ్చి నేనూ జాయిన్ అయ్యా. ఆ తర్వాత తెలిసింది దాని వ్యవస్థాపకుల్లో మా మామయ్యా (కేజీ సత్యమూర్తి) ఒకరని. అప్పటి నుంచి పీజీ వరకు ఆర్ఎస్యూలో కొనసాగాను. ఒకరకంగా సాహిత్యం వల్లే లెఫ్ట్‌కి మొగ్గు చూపాను. ఎన్కౌంటర్స్ అయినప్పుడు.. ‘సమాజం కోసం వాళ్లెంత త్యాగం చేస్తున్నారు!’ అనిపించేది. ఉద్వేగంగా, పాషనేటింగ్గా ఉండేది. నేను, చెల్లి పాటలు పాడేవాళ్లం. డాన్స్ చేసేవాళ్లం. ఆ పాటలు పాడుతున్నప్పుడు నాకైతే కళ్లల్లో నీళ్లొచ్చేవి. ఏమీ తెలియని వయసు కదా.. నా చుట్టుపక్కల ఉన్నవాళ్లను లిబరేట్ చేస్తున్నానే ఫీలింగ్ ఉండేది. నేరమేమీ చేయకుండానే అరెస్ట్ 1985, పీజీ ఫైనలియర్లో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ తన క్యాస్ట్ వాళ్లకు ఎక్కువ మార్క్స్ వేస్తూ మిగిలిన వాళ్లకు తక్కువ మార్కులు వేస్తూ పక్షపాతం చూపిస్తుంటే అతనిమీద ప్రిన్సిపల్‌కి కంప్లయింట్ చేశాం. ఆయనేమీ యాక్షన్ తీసుకోలేదు. దాంతో స్ట్రైక్ మొదలుపెట్టాం. తర్వాత నేను కాకినాడ వచ్చేశాను. ఈ లోపు వరంగల్ నుంచి పోలీసులు వచ్చి ఆర్ఈసీలో మేం చేస్తున్న స్ట్రయిక్ గురించి జస్ట్ క్వశ్చన్స్ అడుగుతామని చెప్పి నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఏ చార్జెస్ పెట్టకుండానే వరంగల్‌లో రోజుకొక స్టేషన్ తిప్పడం మొదలుపెట్టారు. దాంతో మా అమ్మ.. కన్నాభిరాన్గారిని కలిసి జరిగిన విషయం చెప్పారు. ఆయన హెబియస్‌కార్పస్ వేశారు. అప్పుడు నన్ను వరంగల్ జైల్‌కి మార్చారు. టూ మంత్స్ జైల్లోనే ఉన్నాను. బయటకు వచ్చాక ఆర్ఈసీలో నేను చదవడానికి వీల్లేదు, అసలక్కడ ఉండకూడదు అన్నారు. అప్పుడు వరంగల్‌లో అరవిందరావు ఏఎస్పీ అనుకుంటా. మా పేరెంట్స్ ఆయనను కలిసి ‘మా అమ్మాయి ఆర్ఎస్యూ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయదు.. ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి’ అని రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకున్నారు. అలా ఎమ్మెస్సీ పూర్తి చేశాను. మద్రాస్ ఐఐటి... కామెంట్స్ పీజీ అయిపోగానే మద్రాస్ ఐఐటీలో రీసెర్చ్ అసోసియేట్‌గా జాబ్ వచ్చింది. వెళ్లాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. నేను ఆర్ఈసీలో చేరేకంటే ముందు హెచ్సీయు (యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్) ఎంట్రెన్స్ కూడా రాశాను. సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాతోపాటే హెచ్‌సీయూ ఎంట్రెన్స్ రాసిన క్లాస్మేట్ ఒకామె మద్రాస్ ఐఐటీలో కనిపించింది. ఆ అప్పర్ క్యాస్ట్ అమ్మాయి నన్ను చూసి గుర్తుపట్టి.. ‘హెచ్‌సీయూ ఎంట్రెన్స్‌లో నీకు సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా.. గ్రేట్’ అంటూ ఒకపక్క కాంప్లిమెంట్స్ ఇస్తూనే, వెనకాల నా కట్టూ బొట్టూ తీరు గురించి మాత్రం రకరకాల కామెంట్స్ చేసేది. నిజానికి అప్పటిదాకా కులవివక్షని పెద్దగా ఎదుర్కోలేదు నేను. మద్రాస్ ఐఐటీలోనే ఎదురైంది. అసలక్కడ జాబ్ దొరకగానే.. పరిచయస్తులెవరైనా ఉన్నారేమో అని వాకబు చేస్తే.. ఆర్ఈసీలో నా సీనియరే అక్కడ ఉంటోందని తెలిసింది. ఆ టైమ్‌లో ఆమె ఆంధ్రలోనే ఉంది. సరే.. మద్రాస్ వెళ్లేముందు ఆమెను ఒకసారి కలిసి కొత్తప్రాంతం బెరుకు పోగొట్టుకుందామని మా తమ్ముడిని తీసుకొని వాళ్లింటికి వెళ్లా. మా క్యాస్ట్ తెలిసి, మమ్మల్ని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. తర్వాత మద్రాస్ క్యాంపస్‌లో ఆమె నన్ను ద్వేషించడమే పనిగా పెట్టుకుంది. నా బాయ్ ఫ్రెండ్ జైనమతస్థుడు. ఆయనకు ఒక పంజాబీ ఫ్రెండ్ ఉండేవాడు. అతను నా బాయ్‌ఫ్రెండ్‌తో ఊరికే అనేవాడుట.. ‘ఆ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావ్? ఆమెతో స్నేహమేంటి?’ అని. కాని నా ఫ్రెండ్ మాత్రం ఏ రోజూ నా క్యాస్ట్ గురించి అడగలేదు. బహుశా నన్ను కేరళైట్ అనుకుని ఉండొచ్చు.. లేదా.. నేను ఫలానా అని గుర్తించలేక పోయుండొచ్చు! అమెరికా.. క్యాస్ట్ ప్రయాణం 1991లో అమెరికా వచ్చాను. న్యూయార్క్ లోని ఒక బ్యాంక్‌లో చేరాను.. ఐటీగా. ఇండియాలో ఎదుర్కోలేనంత కులవివక్షను ఇక్కడ ఎదుర్కొన్నాను. ఎందుకనో మరి లంచ్టైమ్లోనే కులం గురించి అడిగేవారు ఎక్కువగా. ‘ఈ దళిత్స్కు ఈ మధ్య పొగరెక్కువైంది’ అంటూ కామెంట్స్ చేసేవారు. రంగు, రూపు, ఆహారపు అలవాట్లను బట్టి క్యాస్ట్‌ను ట్రేస్ చేయడానికి ట్రై చేసేవారు. నా కన్నా కూడా మా చెల్లి కులవివక్షను ఎక్కువగా ఎదుర్కొంది. తను ఇక్కడ (అమెరికా) రెసిడెంట్ డాక్టర్‌గా చేస్తున్నప్పుడు చాలా వేధింపులనెదు ర్కొంది. ఒకసారి తను ఒక కాన్ఫరెన్స్‌కి వెళ్లింది. దానికి కొంతమంది ఇండియన్స్ కూడా వచ్చారట. లంచ్ అవర్లోనో ఎప్పుడో.. ఒక అగ్రకులం అమ్మాయి ‘‘నేను ఫలానా... ఇప్పుడు మీరు మీ కులాలు చెప్తారా?’ అని అడిగిందట. అందరూ చెప్పారట. మా చెల్లి వంతు వచ్చినప్పుడు.. తను చెప్పలేను అందిట. అప్పుడు ఆ అమ్మాయి ‘‘నాకు అర్థమైందిలే’’ అని హేళన చేసినట్టు మాట్లాడిందిట. దాంతో దానికి తన క్యాస్ట్ చెప్పక తప్పలేదు. మా చెల్లి దళిత్ అని తెలియగానే ‘ఇకనేం.. బోర్డ్ ఎగ్జామ్ (రెసిడెన్సీకి సంబంధించి)లో ఈజీగా క్లియర్ అయిపోతావ్’ అని తేలిక చేస్తూ మాట్లాడిందట. అమెరికాలో రిజర్వేషన్ ఏముంటుంది క్యాస్ట్ పరంగా? అసలు ఆ అమ్మాయికేమన్నా ఇంగితముందా? కేవలం ఇన్సల్ట్ చేయడమొక్కటే గోల్ కాకపోతే? ఇలా ఉంటాయి అమెరికాలో మన వాళ్ల వేధింపులు. పాపం.. చెల్లి చాలా సెన్సిటివ్. తట్టుకోలేక వెళ్లిపోయింది. ఇలాంటివి నాకు మొదట్లోనే అర్థమై త్వరగా ఇండియన్స్‌ను వదిలి ఫారినర్స్‌తో స్నేహం చేయడం మొదలు పెట్టాను. ఇక్కడ రేసిజం మాత్రమే ఉంటుంది. క్యాస్ట్ అంటే వాళ్లకు తెలియదు. అంటరాని తనం అంటే ఏంటో అర్థంకాదు. వాళ్ల రేసిజం మన కులమంత క్రూరంగా ఉండదు. కులం పేరుతో మనిషి అత్మాభిమానాన్ని చంపడం, ఆత్మవిశ్వాసాన్ని కుంగదీయడాలు ఉండవు. ఏ మార్పూరాదు.. నా పుస్తకం రిసెప్షన్ అమెరికాలో చాలా బాగుంది. ముఖ్యంగా అమెరికన్స్‌కు బాగా నచ్చుతోంది. వీళ్ల విలువలు వేరు. ప్రివిలేజెస్ వల్ల పైకి రావడం నచ్చదు వాళ్లకు. కష్టపడి రావడం నచ్చుతుంది. సెల్ఫ్‌మేడ్ పీపుల్ని బాగా ఇష్టపడతారు. గౌరవిస్తారు. అందువల్ల కూడా నా పుస్తకానికి చాలా పాపులారిటీ దొరుకుతుందేమో. ఇక్కడున్న మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు అనుకున్నా కాని వాళ్ల నుంచి కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. తెలుగు సంఘాల వాళ్లు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి, నన్ను మాట్లాడమంటున్నారు. అయితే ఇలాంటి పాపులారిటీకి నేనేం రియాక్ట్ అవట్లేదు. ఇంటలెక్చువల్‌గా ఇదొక టర్న్. కాని ఇమోషనల్‌గా నాకేం అనిపించడంలేదు. దీన్ని మామూలు విషయంగానే తీసుకుంటున్నా. ఎందుకంటే ఈ పుస్తకం వల్ల ఏం మార్పురాదు. వస్తుందనీ నేను అనుకోవడం లేదు. ఇంతకుముందు కన్నా భారతదేశంలో పరిస్థి తులు ఇంకా దారుణంగా తయారవుతున్నాయి. దళితులే ఎక్కువ దౌర్జన్యానికి గురవుతున్నారు. సమాజంలో అప్రెస్ అవుతున్న వాళ్లంతా కలిసి పోరాడితేనే మార్పు వస్తుంది. ప్రతి దేశానికీ సెంట్రల్ క్వశ్చన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు స్త్రీ సెంట్రల్ క్వశ్చన్. మనకు క్యాస్ట్. అయితే మన దగ్గర స్త్రీలూ అప్రెస్ అవుతున్నారు. అందుకే మన దేశంలో విమెన్ లిబరేషన్, క్యాస్ట్ ఇమాన్సిపేషన్..రెండూ ఒకదానితో ఒకటి ముడిపడిన్నాయి. మొదటి వాల్యూమ్‌ను కుదించాను దాన్ని మళ్లీ వివరంగా ఒక పుస్తకంగా తేవాలనుకుంటున్నా. రైతులు అన్నీ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది కన్స్ట్రక్షన్ కూలీలుగా మారుతున్నారు. అలా మారిన వాళ్లలో నాకు తెలిసిన రైతు కుటుంబాలూ ఉన్నాయి. వాళ్లందరినీ ఇంటర్వ్యూ చేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ను రాయాలనుకుంటున్నాను.’’ మామయ్యంటే... హీరో వర్షిప్ మామయ్య (కేజీ సత్యమూర్తి) అంటే చిన్నప్పటి నుంచీ హీరో వర్షిప్పే. 1970ల్లోనే ఆయన యూజీలోకి వెళ్లాడు కాబట్టి ఆయన గురించి వినడమే. అప్పుడప్పుడు ఆయన రాసిన ఉత్తరాల్లో ఆయనను చూసుకునేవాళ్లం. ఆ మాటల్లోని జ్ఞానం నాకెప్పుడు బోధపడుతుందా అనుకునేదాన్ని. మామయ్యంటే మా అందరికీ భయంతో కూడిన గౌరవం, ఆరాధన. ఉద్యమాన్ని, బంధుత్వాన్ని ఆయనెప్పుడూ ముడిపెట్టలేదు. అందుకే నన్ను ఆయన ఎక్నాలెడ్జ్ చేసుంటాడేమో కాని స్పెషల్‌గా అయితే ట్రీట్ చేయలేదెప్పుడూ. మామయ్య గురించి అమ్మ చాలా చెప్పేది. అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చినప్పుడు .. ‘‘మీ మామయ్య కూడా ఇలాంటివాడే’’ అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆ సినిమాకు తీసుకెళ్లింది. అప్పటి నుంచి మామ్మయ్యంటే మరింత గౌరవం పెరిగింది. నేనూ ఆయనలాగే ఉండాలని.. కిందపడుకోవడం లాంటి కఠినమైన లైఫ్‌స్టయిల్‌ను ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఆయన కవిత్వాన్ని పాటలు కట్టి పాడుతుంటే ‘మామయ్య ఇంత గొప్పవాడా!’ అనుకునేవాళ్లం. అయితే నేను అమెరికా వచ్చేవరకు ఆయన కవిత్వాన్ని చదవలేదు. శ్రీశ్రీ, మామయ్యల కవిత్వమంటేనే ఇష్టం. యాంట్స్ ఎమాంగ్ ది ఎలిఫెంట్స్ చిన్నప్పటి నుంచీ నన్ను ఒకటే ప్రశ్న వేధించేది.. ‘‘మా కులం తక్కువ’’, ‘‘వాళ్ల కులం ఎక్కువ’’.. ఎందుకు? అని. ఎవరూ సమాధానం చెప్పలేదు. ‘‘మౌనగీతం’’ సినిమా చూశాను. అందులో హీరోయిన్ క్రిస్టియన్. చాలా సంపన్నమైన అమ్మాయి, సోషల్‌గా కూడా మంచి స్టేటస్‌లో ఉంటుంది. మరి మేం కూడా క్రిస్టియన్సే కదా.. మాకెందుకు ఆ సోషల్ స్టేటస్ లేదు? అనుకున్నాను. జవాబు దొరకలేదు. మద్రాస్‌లో ఉన్నప్పుడు క్రిస్టియన్ కేరళైట్స్ని అడిగాను ఇదే ప్రశ్న. ‘మేం బ్రాహ్మిన్స్మి. సెయింట్ థామస్ వచ్చినప్పుడు మేమంతా క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయ్యాం’ అని చెప్పారు వాళ్లు. ఆ కథాకమామీషు ఏంటీ అని మా అమ్మను అడిగా. అప్పుడు మా అమ్మ ఆ హిస్టరీ అంతా చెప్పింది. స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం.. ఎన్నో కథలు.. నన్ను కదిలించాయి.. ఆలోచింపచేశాయి.. పుస్తకం రాయాలి అని అనుకుంది అప్పుడే. రీసెర్చ్ మొదలుపెట్టాను. 2006 నుంచి 2012 వరకు కొనసాగింది. పుస్తకంగా రాశాను. ముందు స్వాతంత్య్రం వచ్చేవరకు సంఘటనలనే రాసి ఆపేశాను. ఇంకా యాడ్ చేయమన్నారు పబ్లిషర్స్. ఎక్స్టెండ్ చేసేసరికి రెండు వాల్యూమ్స్‌గా వచ్చింది. చాలా ఎక్కువైపోయింది తగ్గించమన్నారు. మొదటి వాల్యూమ్ అంతటినీ ఒక చాప్టర్‌గా కుదించాను. ఈలోపు ఎడిటర్స్ కూడా మారిపోయారు. అందుకే ‘యాంట్స్ ఎమాంగ్ ది ఎలిఫెంట్స్’ రావడం లైట్ అయింది. ప్రస్తుతం : 2009లో వచ్చిన రెసిషన్ వల్ల బ్యాంక్‌లో ఉద్యోగం పోయింది. అంతకుముందే న్యూయార్క్‌లో మెట్రోట్రైన్ను ఆడవాళ్లు నడుపుతుంటే చూసి ఇన్స్పైర్ అయి నేనూ నడపాలని ఎమ్‌టీఏ (మెట్రో ట్రాన్సిట్ ఆథారిటీ) టెస్ట్‌కు వెళ్లాను. అయితే కండక్టర్‌గా టెస్ట్ క్లియర్ అయింది. డ్రైవర్ టెస్ట్‌కి మళ్లీ చాలా సార్లు ప్రయత్నించాను కాని ఏవో అవాంతరాల వల్ల రాయలేకపోయా. 2009లో ఉద్యోగం పోయాక అప్పుడు రాసిన కండక్టర్ టెస్ట్‌తో ఎమ్టీఏలో కండక్టర్‌గా చేరాను. కంటిన్యూ అవుతున్నాను. – సుజాతా గిడ్ల (ఫోన్ ఇంటర్వ్యూ: సరస్వతి రమ) -
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు
మే 21న పరీక్ష.. టాప్ 2.2 లక్షల మందికి అనుమతి - జూన్ 11న ఫలితాలు.. 19 నుంచి ప్రవేశాలు - షెడ్యూల్ విడుదల చేసిన మద్రాస్ ఐఐటీ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గురువారం జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలైన నేప థ్యంలో అడ్వాన్స్డ్ పరీక్ష ప్రక్రియను మద్రాస్ ఐఐటీ చేపట్టింది. మే 21న ఈ పరీక్ష జరు గనుంది. జేఈఈ మెయిన్‌కు 11 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. అందులో అర్హత సాధించిన వారిలో టాప్ 2.2లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమ తిస్తారు. మే 2 వరకు దరఖాస్తులు.. 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 2వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మద్రాస్ ఐఐటీ వెల్లడించింది. రిజిస్ట్రేషన్, సీట్లు, ఫీజు తదితర వివరాలను సంబంధిత ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో పొందవచ్చని పేర్కొంది. 2015 జేఈఈ మెయిన్‌లో టాప్ 1.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతించగా.. 2016లో టాప్ 2 లక్షల మందికి అవకాశమిచ్చామని తెలిపింది. సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు ఈసారి టాప్ 2.2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తామని వివరించింది. రిజర్వేషన్ కేటగిరీల వారీగా చూస్తే... అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్ కేటగిరీలో 1,11,100 మంది (50.5 శాతం), ఓబీసీలో 59,400 మంది (27 శాతం), ఎస్సీల్లో 33 వేల మంది (15 శాతం), ఎస్టీల్లో 16,500 మందిని (7.5 శాతం) అనుమతిస్తామని వివరించింది. మరిన్ని అర్హత వివరాలు ► 1992 అక్టోబర్ 1న, ఆ తర్వాత జన్మించిన వారు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది. ► జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఒక అభ్యర్థి మొత్తంగా మూడుసార్లు, వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరుకావచ్చు. ► ఇంటర్ వార్షిక పరీక్షలు 2016 రాసిన వారు, 2017లో రాయబోయే వారు కూడా హాజరుకావచ్చు. 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2015 జూన్ తరువాత ఫలితాలు వచ్చిన విద్యార్థులు అడ్వాన్స్డ్ రాయవచ్చు. ► ఇప్పటికే ఐఐటీల్లో చేరిన వారు, గతంలో ఐఐటీల్లో సీట్లు పొంది కాలేజీల్లో రిపోర్టింగ్ చేశాక సీటును రద్దు చేసుకున్న వారు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనర్హులు. ► అయితే 2016 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సీటు లభించాక సీటు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి, సీటును యాక్సెప్ట్ చేయని వారు (జాయింట్ సీట్ అలొకేషన్‌లో భాగంగా రిపోర్టింగ్ కేంద్రాల్లో ఎక్కడా రిపోర్టు చేయనివారు) మాత్రం పరీక్ష రాసేందుకు అర్హులే. ► ఏదైనా ఐఐటీలో 2016లో మొదటిసారిగా ప్రిపరేటరీ కోర్సులో చేరినవారు 2017 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ ఇదీ.. ఏప్రిల్ 28 నుంచి మే 2: అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ (ప్రారంభ తేదీన ఉదయం 10 నుంచి, చివరి తేదీన సాయంత్రం 5 వరకు) మే 2 నుంచి 4: ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ మే10 నుంచి 21: హాల్‌టికెట్ల డౌన్లోడ్ మే 21న: అడ్వాన్స్డ్ పరీక్ష (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–2) మే 31 నుంచి జూన్ 3: ఆన్లైన్లో ఓఎంఆర్ జవాబు పత్రాల ప్రదర్శన.. విజ్ఞప్తుల స్వీకరణ జూన్ 4న: ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో జవాబుల కీలు జూన్ 4 నుంచి 6: ‘కీ’లపై అభ్యంతరాల స్వీకరణ జూన్ 11: అడ్వాన్స్డ్ ఫలితాల వెల్లడి జూన్ 11, 12 తేదీల్లో: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 14: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష జూన్ 18న: ఏఏటీ ఫలితాల విడుదల జూన్ 19 నుంచి జూలై 18 వరకు: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలు. నాలుగేళ్లుగా తగ్గుతున్న కటాఫ్! జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే కటాఫ్ మార్కులు ఏటా తగ్గిపోతున్నాయి. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రంలో ఒక్కోసారి ఒక్కో సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కఠినంగా వస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌డ్‌కు 2014–15లో జనరల్ కేటగిరీలో 115 మార్కులుగా కటాఫ్ ఈసారి 81కి తగ్గింది. గతేడాది ఫిజిక్స్‌లో ప్రశ్నలు కఠినంగారాగా.. ఈసారి గణితంలో కఠినంగా వచ్చాయి. -
నిషేధం వేటు... సమానతకు చేటు
ఐఐటీలతోపాటు, కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ వ్యతిరేక విద్వేషం పెల్లుబుకుతోంది. అవమాన భారానికి పలువురు దళిత, ఆదివాసీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మగౌరవం కోసం నిలిస్తే చాలు... ఇంటర్నల్స్‌లో కోత, ఫెయిల్ చేయడం, బహిష్కరణలు పరిపాటిగా మారాయి. మద్రాసు ఐఐటీ వేధింపు మరో రకం. ఆలోచనలకు నిషేధపు సంకెళ్లు తొడగడం. చెన్నై ఐఐటీలో వ్యక్తమైనది కంటికి కనిపించే పొగ మాత్రమే. రాజుకుంటున్న కుల వివక్షత, విద్వేషం అనే నిప్పు చాలా విద్యాసంస్థలను దహించేస్తోంది. ‘‘భారతీయులు రెండు భిన్నమైన అభిప్రాయాలతో సహజీవనం చేస్తు న్నారు. రాజ్యాంగం పీఠికలో పేర్కొన్నట్టు రాజకీయంగా స్వేచ్ఛ, సమాన త్వం, సోదర భావాలను గౌరవిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ వారి మతం బోధించే సామాజిక అసమానతల సిద్ధాంతం స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం భావాలను దరిదాపుల్లోకి రానివ్వదు’’ అని డాక్టర్ బి.ఆర్. అంబే డ్కర్ అన్నమాటలు నేటి భారత సామాజిక గమనానికి అద్దం పడుతున్నాయి. మేధో సామ్రాజ్య మణిమకుటంగా కీర్తిగాంచిన ఐఐటీల్లో కుల వివక్షతో కూడిన కుటిల రాజకీయాలు ఎన్నడో పాతుకుపోయి, నేడు ఊడలు చాచి అంతటికీ విస్తరిస్తున్నాయి. విజ్ఞానంతో, వివేచనతో ప్రగతిశీలమైన, చైతన్య వంతమైన భవిష్యత్ తరాన్ని అందించాల్సిన ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు కులం జబ్బుతో కునారిల్లుతున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇటీవల చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎస్సీ, ఎస్టీ తదితర అణగారిన వర్గాల విద్యార్థులు నిర్వహిస్తున్న ‘‘అంబేడ్కర్- పెరి యార్ స్టడీ సర్కిల్’’పై విధించిన నిషేధమే. స్టడీ సర్కిల్ విద్వేషాలను రెచ్చ గొడుతోందని, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ సంస్థ యాజమాన్యం ఈ నిరంకుశ చర్యకు పాల్పడింది. ఇది మచ్చుకి ఒకటే. నిజానికి దేశంలోని ఐఐటీలతో పాటు, పలు కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీ వ్యతిరేక విద్వేషం కట్టలు తెంచుకుంటోంది. అవమాన భారాన్ని భరించలేక పలువురు దళిత, ఆదివాసీ విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తలెత్తి నిలిస్తే చాలు... ఇంటర్నల్ మార్కుల కోతలు, ఫెయిల్ చేయడం, క్రమశిక్షణ సాకుతో బహి ష్కరణ పరిపాటిగా మారాయి. మద్రాసు ఐఐటీ వేధింపు మరో రకం. ఆలోచ నలకు నిషేధపు సంకెళ్లు తొడగడం. ప్రశ్నల కొడవళ్లను మొగ్గలోనే తుంచేయ డం. హక్కుల కోసం సంఘటిత మయ్యే విద్యార్థులను బెదిరించి లొంగదీసు కునే కుటిలయత్నం. చెన్నై ఐఐటీలో వ్యక్తమైనది కంటికి కనిపించే పొగే. రాజుకుంటున్న కుల వివక్షత, విద్వేషం అనే నిప్పు చాలా విద్యాసంస్థలను దహించేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులం భారతీయులంతా ఒక్కటే ననే భావన మెదళ్లలోకి ఎక్కకుండా అడ్డగిస్తోంది. సాటి మనిషిని ప్రేమించి, ఆదరించడమనే మానవ స్వభావాన్నే ధ్వంసిస్తున్నది. పర్యవసానంగానే ఐఐటీ, ఐఐఎమ్, ఏఐఐఎమ్మెస్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కుల విద్వేషం కట్టలు తెంచుకుంటోంది. మన మేడిపండు ‘ప్రతిభ’ ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదనే వాదనతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రవేశాల నాటి నుండే వెలివేసి, అవమానాలకు గురి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రవేశం వల్లనే ఈ సంస్థల ప్రతిష్ట దిగజారుతోందని ప్రచారం సాగుతోంది. మన ఐఐటీల చరిత్ర తెలిస్తేనైనా ఇలా ప్రతిభ గురించి విర్రవీగేవారికి కనువిప్పు కావొచ్చు. అవన్నీ ఇతర దేశాల దయాదాక్షిణ్యాలతో ఉనికిలోకి వచ్చినవే. యునెస్కో సహకారంతో సోవియెట్ యూనియన్ మొట్ట మొదట బొంబాయి ఐఐటీని స్థాపించింది. చర్చనీయాంశంగా మారిన మద్రాసు ఐఐటీ నాటి పశ్చిమ జర్మనీ సహకారంతోనూ, కాన్పూర్ ఐఐటీ అమెరికా సహాయంతోనూ 1959లో ఏర్పడ్డాయి. ఢిల్లీ ఐఐటీ 1961లో బ్రిటన్ సహాయంతో ఏర్పాటైంది. నేటికీ ఇవన్నీ కేంద్రం సహా ఇతర దేశాల సహాయ సహకారాలతోనే నడుస్తున్నాయి. పోనీ పరిశోధనలోనో, నూతన ఆవిష్కర ణలలోనో గొప్ప ప్రావీణ్యాన్ని చూపుతున్నాయా? అంటే అదీ లేదు. ‘‘అమె రికా లాంటి దేశాల్లో లాగా మన దేశంలో శాస్త్ర, సాంకేతిక సంస్థలు కొత్త ఆవిష్కరణలకు పూనుకోవడం లేదు. ఇది మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన లోపం’’ అని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పల్లె రామారావు ఇటీవలే నిర్మొహమాటంగా అన్నారు. ఏ రంగంలో ఎవరు మంచి ఫలితాలను, ప్రగ తిని సాధించినా వాటిని ఇతరులకు అందించడం ద్వారానే సమాజం సమ గ్రాభివృద్ధిని సాధిస్తుంది. అయితే కుల సమాజాన్ని పెంచిపోషిస్తున్న హిందూ సమాజం తమకు అందివచ్చిన ఫలాలను ఇతరులకు పంచడానికి ముందుకు రావడం లేదు. అందుకే ఈ దుస్థితి. అసమాన పోటీలో... ఇక ఎక్కువ మార్కులు సంపాదించిన వారే ప్రతిభావంతులనే వాదననూ ముందుకు తెస్తున్నారు. ఎంట్రన్స్ టెస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ మార్కులు వచ్చినా అడ్మిషన్ వచ్చేస్తోందని, రిజర్వేషన్ల వల్లే తమతో ‘సరితూగనివాళ్లు’ తమ పక్కన కూర్చుంటున్నారనే వ్యతిరేకత ఇతర కులాల విద్యార్థుల మన స్సుల్లో బలంగా ఉన్నది. ఇలాంటి దురభిప్రాయాలను కొందరు మేధావులు పనిగట్టుకొని పెంచిపోషిస్తున్నారు. ఈ ఏడాది ఐఐటీ ఎంట్రన్స్‌కు హాజరైన 13 లక్షల మందిలో కనీసం 10 లక్షల మంది కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది ఉంటారు. ఒక్కొక్కరు సగటున లక్ష రూపాయలైనా ఖర్చు పెట్టి ఉంటారు. ఇంత తాహతు ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడెది? లక్షలు ఖర్చు పెట్టి సీటు సంపాదిం చిన వారితో, సర్కారు బళ్లలో చదివిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పోటీపడాల్సి వస్తోంది. ఈ అసమాన పోటీని అర్థం చేసుకుని, సరిదిద్దాల్సిన బాధ్యత సమా జంపైనే ఉంది. కానీ హిందూ సమాజ కులవ్యవస్థ అందుకు అనుమతించదు. వీటన్నిటితోపాటూ నిత్యం ఎదుర్కోక తప్పని కుల వివక్ష ఎస్సీ, ఎస్టీ విద్యార్థులలో ఆత్మన్యూనతను పెంపొందింపజేస్తోంది. ఏ విద్యాసంస్థలోనైనా మొదట ప్రవేశించినప్పుడు ఏ విద్యార్థికైనా బెరుకు తప్పదు. కానీ, గ్రామీణ ప్రాంతాల, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు మరింత భయంగా సంస్థలోకి అడుగుపెడతారు. ఆ భయానికి ప్రొఫెసర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడలేక విద్యార్థులు నోరు తెరవడానికే భయపడతారు. ప్రొఫెసర్ల. విద్యార్థుల చిన్న చూపునకు గురవుతారు. పైగా వారికి సరైన గెడైన్స్ కూడా దొరకదు. అధ్యాపకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు తగినప్రాతి నిధ్యం ఉండకపోవడం మరో కీలకాంశం. ఒకవేళ ఎవరో ఒకరిద్దరున్నా దళిత విద్యార్థులకు మద్దతుగా నిలిచే సాహసం చేయలేరు. ఈ పరిస్థితి ఐఐటీలకే పరిమితమైనది కాదు. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా దళితులు, ఆదివాసుల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతున్నది. గత పదేళ్లలో కొన్ని పదుల మంది విద్యార్థులు బహిష్కృతులయ్యారు. ఎందరో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వివక్ష బలిపీఠాలపై... అలాంటి వారిలో ఐఐటీ విద్యార్థులే అత్యధికం! ఒక్క కాన్పూర్ ఐఐటీలోనే గత ఐదేళ్ళలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన సుమన్. ఎంటెక్ చేసిన ఆ విద్యార్థి 2010 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు హైదరాబాద్‌కు చెందిన మాధురి. శ్రీకాంత్ అనే మరో తెలుగు విద్యార్థి ముంబై ఐఐటీలో చదువుతూ 2007లో అలాగే బలైపోయాడు. వెలుగులోకిరాని వేన వేల వేధింపులు ఎన్నో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూల్లోని వేధింపులను గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అక్కడా ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మ హత్యల ఘటనలు చాలానే ఉన్నాయి. దేశంలోనే పేరుమోసిన హెచ్‌సీ యూలో వెంకటేష్ అనే పీహెచ్డీ విద్యార్థికి ఏళ్లు గడచినా గైడ్‌ను కేటాయిం చలేదు. చదువులో ఎంతో మంచి రికార్డు ఉన్న వెంకటేష్‌కు ఆర్థికంగా ఇబ్బం దులూ లేవు. యాజమాన్యం చూపిన వివక్షకే వెంకటేష్ నిండు ప్రాణాలు బలైపోయాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, లింగంపల్లి గ్రామా నికి చెందిన వెంకటేష్ తండ్రి పోలీసు కానిస్టేబుల్. 2013 నవంబర్‌లో హాస్టల్ గదిలోనే జరిగిన ఈ ఆత్మహత్యపై సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నిజని ర్ధారణ కమిటీని వేసి, నివేదికను జాతీయ మానవహక్కుల సంఘానికి అందించింది. ఇటీవల విచారణ జరిపిన ఎన్హెచ్ఆర్సీ వెంకటేష్ కుటుం బానికి యూనివర్సిటీ చేత ఏడు లక్షల నష్టపరిహారం ఇప్పించింది. ఇది కంటితుడుపు చర్య మాత్రమే. అదేవిధంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర విద్యాలయాల్లో ‘సెం టర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ పేరిట విడిగా ప్రత్యేక స్వయంప్రతిపత్తి సంస్థలను నెల కొల్పుతున్నారు. క్రమశిక్షణ ముసుగులో వాటిలో విద్యార్థులను, ముఖ్యంగా దళిత, ఆదివాసీ విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని వెంటనే రద్దుచేసి ఒక ప్రజాస్వామిక వాతావర ణాన్ని ఈ విశ్వవిద్యాలయాల్లో కల్పించాల్సి ఉంది. మద్రాసు ఐఐటీ వివాదం తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నిపుణుల కమిటీని వేసి విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 9705566213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
రణరంగమైన మద్రాస్ ఐఐటీ
మద్రాస్ ఐఐటీ ప్రాంగణం రణరంగంగా మారింది. విద్యార్ధి సంఘం గుర్తింపు రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును గర్హిస్తూ గత మూడు రోజులుగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి ఉద్రింక్తంగా మారింది. ఒక దశలో విద్యార్థులను పోలీసులు చితకబాదినట్లు సమాచారం. మీడియా ప్రతినిధులు క్యాపస్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటుండంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారన్న ఫిర్యాదు ఆధారంగా అంబేడ్కర్-పెరియార్ స్టడీ సర్కిల్(ఏపీఎస్సీ) విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. -
మద్రాస్ ఐఐటీలో ‘గుర్తింపు’ రగడ!
మోదీని విమర్శించారన్న ఫిర్యాదుతో విద్యార్థి సంఘం గుర్తింపు రద్దు చెన్నై/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారన్న ఫిర్యాదు ఆధారంగా మద్రాస్ ఐఐటీ ఓ దళిత విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. వాక్‌స్వేచ్ఛ అణచివేతను ప్రతిఘటిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఐఐటీ నిర్ణయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ సమర్థించడంతో శుక్రవారం ఢిల్లీలో ఆమె ఇంటి ముందు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఆందోళన. చేశారు. ఐఐటీకి చెందిన అంబేడ్కర్-పెరియార్ స్టడీ సర్కిల్(ఏపీఎస్సీ) విద్యార్థి సంఘం ఇటీవల ఓ సమావేశం నిర్వహించింది. అందులో ప్రధానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టారని, కేంద్ర విధానాలను తప్పుపట్టారంటూ మానవ వనరుల శాఖకు కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఆ శాఖ ఐఐటీకి పంపింది. తర్వాత ఐఐటీ ఆ విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. ‘విద్యార్థి సంఘాలు ఏవైనా తమ కార్యక్రమాలకు ఐఐటీ మద్రాస్ పేరునుగానీ, ఆ విద్యాసంస్థ అధికార విభాగాల పేర్లనుగానీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. దీన్ని ఏపీఎస్సీ ఉల్లంఘించింది. దీంతో ఆ సంఘం గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది’ అని ఐఐటీ తాత్కాలిక డెరైక్టర్ ప్రొఫెసర్ రామమూర్తి తెలిపారు. రాహుల్, స్మృతి మాటల యుద్ధం ఐఐటీ గొడవపై రాహుల్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ‘వాక్‌స్వేచ్ఛ ప్రజల హక్కు. మోదీ విమర్శించినందుకు ఇప్పుడు విద్యార్థి సంఘంపై నిషేధం విధించారు. రేపు దేనిపై నిషేధం విధిస్తారు?’ అని రాహుల్ ట్విటర్లో ప్రశ్నించారు. స్మృతి బదులిస్తూ.. ‘తదుపరి పోరుపై మీతోనే. ఎన్ఎస్యూఐ మాటున దాక్కోకు. త్వరలో మళ్లీ అమేథీకి వస్తున్నా. అక్కడ కలుద్దాం. కేంద్ర ప్రభుత్వ పాలన చర్చకు సిద్ధం. సమయం, వేదిక ఎక్కడో మీరే చెప్పండి. గొడవ చేయాలని మీరు నిన్న ఎన్ఎస్యూఐకి చెప్పారు. ఈరోజు గూండాలు నేను లేనప్పుడు వచ్చి ఇంటి ముందు గొడవ చేశారు’ అని అన్నారు.