![Fathima Lathif Parents Fire on madras IIT Professor - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/15/fathima.jpg.webp?itok=WvemLvW9)
తల్లిదండ్రులతో ఫాతిమా
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైన తమ కుమార్తె ఫాతిమా లతీఫ్‌కు తక్కువ మార్కులు రావడం ఏమిటి, కలత చెంది ఆత్మహత్యకు పాల్పడడం ఏమిటి...అంతా అబద్ధం. మానసికంగా వేధింపులతో తమ కుమార్తెను హత్యచేశారు...’ అంటూ ఫాతిమా లతీఫ్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమార్తె చావుకు కారణమైన ప్రొఫెసర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, కేరళ సీఎంల జోక్యంతో విషయం విశ్వరూపం దాల్చింది. ఇదిలా ఉండగా మాజీ సీబీఐ అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ గురువారం ప్రకటించారు.
చెన్నై ఐఐటీలో చదువుతున్న కేరళకు చెందిన ఫాతిమా లతీఫ్ (18) ఈనెల 9న తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తొలుత ఒక సాధారణ సంఘటనగా పరిగణించారు. గతనెల జరిగిన పరీక్షలో తక్కువమార్కులు రావడంతో ప్రాణాలుతీసుకుందని కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నై కొట్టూరుపురం పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. హడావుడిగా పోస్టుమార్టం పూర్తిచేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఫాతిమా సోదరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి స్విచ్ ఆఫ్ స్థితిలో ఉన్న సెల్‌ఫోన్‌ను ఆన్ చేసి పరిశీలించగా సుదర్శన్ పద్మనాభన్ అనే ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా ఆమె నమోదు చేసిన ఎస్‌ఎంఎస్ బయటపడింది. దీంతో మృతురాలి తండ్రి అబ్దుల్ లతీఫ్ స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసుకుని ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం, కేరళ సీఎం తమిళనాడు సీఎంకు ఉత్తరం రాయడంతో రెండురాష్ట్రాల వ్యవహారంగా మారింది. దీంతో ఐదురోజుల తరువాత ఆత్మహత్య ఘటన విశ్వరూపం దాల్చింది. ఫాతిమా ఆత్మహత్యపై సవివరమైన నివేదికను ఇవ్వాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభన్‌కు కమిషనర్ సమన్లు పంపారు. సెలవుపై వెళ్లి ఉండిన ప్రొఫెసర్ గురువారం విధులకు హాజరుకాగా కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఉదయం 11 గంటలకు స్వయంగా ఐఐటీకి వెళ్లి ఆయనను, సహ విద్యార్థులను విచారించారు. ఫాతిమా రాసిన ఆత్మహత్య ఉత్తరాన్ని దగ్గర ఉంచుకుని కమిషన్ వేసిన ప్రశ్నలకు సుదర్శన్ ఇచ్చిన సమాధానాన్ని వాంగ్మూలంగా నమోదు చేశారు. మాజీ సీబీఐ అధికారి ఈశ్వరమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేసును విచారిస్తుందని కమిషనర్ తెలిపారు. అలాగే ఐదుగురు ప్రొఫెసర్లు బృందంగా ఏర్పడి 15 మంది స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
మానసికంగా వేధించారు: తల్లిదండ్రుల ఆరోపణ
తమ కుమార్తె ఎంతో ధైర్యవంతురాలు, ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది, తక్కువ మార్కుల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం సరికాదని ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్, తల్లి సుజిత అన్నారు. కాలేజీలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తమకు పదేపదే ఫోన్ చేసి చెప్పేదనితెలిపారు. మానసికంగా వేధించి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. తన చావుకు ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభనే కారణమని తన సెల్‌ఫోన్‌లో నమోదు చేసిందని తెలిపారు. ప్రొఫెసర్‌తోపాటూ ఫాతిమా బలవన్మరణానికి కారణమైన వారందరినీ విచారించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆందోళన
ఫాతిమా ఆత్మహత్య ఉదంతంతో విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోతున్నందున ఐఐటీ మెయిన్ గేటు ముందు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా లెక్కచేయకుండా గురువారం ఉదయం పెద్ద ఎత్తున కదలి వచ్చిన విద్యార్థి సంఘాలు ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఐఐటీలో తరచూ విద్యార్థుల ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నందున ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో గిండి పరిసరాల్లో ట్రాఫిక్ స్తాంభించిపోయింది. ఐఐటీ విద్యార్థిని ఫాతిమా మరణంపై హేతుబద్ధమైన విచారణ జరగాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment