సుజాతా గిడ్ల
ఘీంకరించేది ఏనుగు... నలిగిపోయేది చీమ!
అలాంటప్పుడు ఈ ప్రయోగం ఏంటి?
అసలు చీమ ఘీంకరించడం ఏంటి?
చీమ శబ్దమంటూ ఏదైనా వినపడితే
పుటుక్కున కాలికింద నలిగిపోవడమే!
అసలు వాయిస్ ఉండదు కదా!
కష్టపడే చీమ.. పెత్తనం చలాయించే
ఏనుగు మధ్య ఉన్న ఘర్షణే ఈ ఘీంకారం!
సుజాతా గిడ్ల ఘీంకారం!!
‘‘మా అమ్మ (మేరీ మంజుల) వాళ్లది కృష్ణాజిల్లా, మా నాన్న (లూథర్ ప్రభాకర్‌రావు) వాళ్లది తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరూ లెక్చరర్లే. నేను పుట్టింది మాత్రం ఖాజీపేటలోని మేనమామ వాళ్లింట్లో. నాకు ఒక తమ్ముడు, చెల్లి. మా కుటుంబం కాకినాడలో స్థిరపడ్డది. కెనడియన్ బాప్టిస్ట్ మెషినరీ స్కూల్లో చదివాను. ఇంటర్, డిగ్రీ.. పీఆర్ గవర్నమెంట్ కాలేజ్‌లో చేశాను. డిగ్రీ తర్వాత వరంగల్ ఆర్‌ఈసీలో ఎమ్మెస్సీ– టెక్నాలజీలో సీట్ రావడంతో అక్కడ చేరాను.
సోమర్‌సెట్ మామ్.. రావిశాస్త్రి, బీనాదేవి
నాన్న ఇంగ్లిష్ లెక్చరర్. దాంతో ఇంట్లో తెలుగు పుస్తకాలతోపాటు ఇంగ్లిష్ పుస్తకాలూ ఉండేవి. రెండిటినీ బాగా చదివేవాళ్లం. అప్పట్లో మొబైల్ లైబ్రరీస్ ఉండేవి. సైకిల్‌మీద వచ్చి అద్దెకు పుస్తకాలు ఇచ్చి వెళ్తుండేవారు. వాటినీ వదిలిపెట్టేవాళ్లం కాదు. నాక్కాస్త ఊహ తెలిశాక.. రావిశాస్త్రి, బీనాదేవీ రచనలు చదవడం మొదలుపెట్టా. సోమర్‌సెట్ మామ్, రావిశాస్త్రి రచనలంటే భలే ఇష్టం.
ఆర్‌ఎస్‌యూ పరిచయం.. లెఫ్ట్ ఉద్యమం
నేను టెన్త్‌లో ఉన్నప్పుడు.. కొంతమంది స్టూడెంట్స్ మా వీథిలో డ్రమ్స్ కొడుతూ పాటలు పాడుతుంటే అక్కడికి వెళ్లాను. ‘‘మీరు ఎవరు?’’ అని అడిగితే ‘‘ఆర్‌ఎస్‌యూ’’ అని చెప్పారు. ఆ పాటలు నచ్చి నేనూ జాయిన్ అయ్యా. ఆ తర్వాత తెలిసింది దాని వ్యవస్థాపకుల్లో మా మామయ్యా (కేజీ సత్యమూర్తి) ఒకరని. అప్పటి నుంచి పీజీ వరకు ఆర్‌ఎస్‌యూలో కొనసాగాను. ఒకరకంగా సాహిత్యం వల్లే లెఫ్ట్‌కి మొగ్గు చూపాను. ఎన్‌కౌంటర్స్ అయినప్పుడు.. ‘సమాజం కోసం వాళ్లెంత త్యాగం చేస్తున్నారు!’ అనిపించేది. ఉద్వేగంగా, పాషనేటింగ్‌గా ఉండేది. నేను, చెల్లి పాటలు పాడేవాళ్లం. డాన్స్ చేసేవాళ్లం. ఆ పాటలు పాడుతున్నప్పుడు నాకైతే కళ్లల్లో నీళ్లొచ్చేవి. ఏమీ తెలియని వయసు కదా.. నా చుట్టుపక్కల ఉన్నవాళ్లను లిబరేట్ చేస్తున్నానే ఫీలింగ్ ఉండేది.
నేరమేమీ చేయకుండానే అరెస్ట్
1985, పీజీ ఫైనలియర్‌లో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ తన క్యాస్ట్ వాళ్లకు ఎక్కువ మార్క్స్ వేస్తూ మిగిలిన వాళ్లకు తక్కువ మార్కులు వేస్తూ పక్షపాతం చూపిస్తుంటే అతనిమీద ప్రిన్సిపల్‌కి కంప్లయింట్ చేశాం. ఆయనేమీ యాక్షన్ తీసుకోలేదు. దాంతో స్ట్రైక్ మొదలుపెట్టాం. తర్వాత నేను కాకినాడ వచ్చేశాను. ఈ లోపు వరంగల్ నుంచి పోలీసులు వచ్చి ఆర్‌ఈసీలో మేం చేస్తున్న స్ట్రయిక్ గురించి జస్ట్ క్వశ్చన్స్ అడుగుతామని చెప్పి నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఏ చార్జెస్ పెట్టకుండానే వరంగల్‌లో రోజుకొక స్టేషన్ తిప్పడం మొదలుపెట్టారు. దాంతో మా అమ్మ.. కన్నాభిరాన్‌గారిని కలిసి జరిగిన విషయం చెప్పారు. ఆయన హెబియస్‌కార్పస్ వేశారు. అప్పుడు నన్ను వరంగల్ జైల్‌కి మార్చారు. టూ మంత్స్ జైల్లోనే ఉన్నాను.
బయటకు వచ్చాక ఆర్‌ఈసీలో నేను చదవడానికి వీల్లేదు, అసలక్కడ ఉండకూడదు అన్నారు. అప్పుడు వరంగల్‌లో అరవిందరావు ఏఎస్‌పీ అనుకుంటా. మా పేరెంట్స్ ఆయనను కలిసి ‘మా అమ్మాయి ఆర్‌ఎస్‌యూ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయదు.. ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి’ అని రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకున్నారు. అలా ఎమ్మెస్సీ పూర్తి చేశాను.
మద్రాస్ ఐఐటి... కామెంట్స్
పీజీ అయిపోగానే మద్రాస్ ఐఐటీలో రీసెర్చ్ అసోసియేట్‌గా జాబ్ వచ్చింది. వెళ్లాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. నేను ఆర్‌ఈసీలో చేరేకంటే ముందు హెచ్‌సీయు (యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్) ఎంట్రెన్స్ కూడా రాశాను. సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాతోపాటే హెచ్‌సీయూ ఎంట్రెన్స్ రాసిన క్లాస్‌మేట్ ఒకామె మద్రాస్ ఐఐటీలో కనిపించింది. ఆ అప్పర్ క్యాస్ట్ అమ్మాయి నన్ను చూసి గుర్తుపట్టి.. ‘హెచ్‌సీయూ ఎంట్రెన్స్‌లో నీకు సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా.. గ్రేట్’ అంటూ ఒకపక్క కాంప్లిమెంట్స్ ఇస్తూనే, వెనకాల నా కట్టూ బొట్టూ తీరు గురించి మాత్రం రకరకాల కామెంట్స్ చేసేది.
నిజానికి అప్పటిదాకా కులవివక్షని పెద్దగా ఎదుర్కోలేదు నేను. మద్రాస్ ఐఐటీలోనే ఎదురైంది. అసలక్కడ జాబ్ దొరకగానే.. పరిచయస్తులెవరైనా ఉన్నారేమో అని వాకబు చేస్తే.. ఆర్‌ఈసీలో నా సీనియరే అక్కడ ఉంటోందని తెలిసింది. ఆ టైమ్‌లో ఆమె ఆంధ్రలోనే ఉంది. సరే.. మద్రాస్ వెళ్లేముందు ఆమెను ఒకసారి కలిసి కొత్తప్రాంతం బెరుకు పోగొట్టుకుందామని మా తమ్ముడిని తీసుకొని వాళ్లింటికి వెళ్లా. మా క్యాస్ట్ తెలిసి, మమ్మల్ని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. తర్వాత మద్రాస్ క్యాంపస్‌లో ఆమె నన్ను ద్వేషించడమే పనిగా పెట్టుకుంది.
నా బాయ్ ఫ్రెండ్ జైనమతస్థుడు. ఆయనకు ఒక పంజాబీ ఫ్రెండ్ ఉండేవాడు. అతను నా బాయ్‌ఫ్రెండ్‌తో ఊరికే అనేవాడుట.. ‘ఆ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావ్? ఆమెతో స్నేహమేంటి?’ అని. కాని నా ఫ్రెండ్ మాత్రం ఏ రోజూ నా క్యాస్ట్ గురించి అడగలేదు. బహుశా నన్ను కేరళైట్ అనుకుని ఉండొచ్చు.. లేదా.. నేను ఫలానా అని గుర్తించలేక పోయుండొచ్చు!
అమెరికా.. క్యాస్ట్ ప్రయాణం
1991లో అమెరికా వచ్చాను. న్యూయార్క్ లోని ఒక బ్యాంక్‌లో చేరాను.. ఐటీగా. ఇండియాలో ఎదుర్కోలేనంత కులవివక్షను ఇక్కడ ఎదుర్కొన్నాను. ఎందుకనో మరి లంచ్‌టైమ్‌లోనే కులం గురించి అడిగేవారు ఎక్కువగా. ‘ఈ దళిత్స్‌కు ఈ మధ్య పొగరెక్కువైంది’ అంటూ కామెంట్స్ చేసేవారు. రంగు, రూపు, ఆహారపు అలవాట్లను బట్టి క్యాస్ట్‌ను ట్రేస్ చేయడానికి ట్రై చేసేవారు.
నా కన్నా కూడా మా చెల్లి కులవివక్షను ఎక్కువగా ఎదుర్కొంది. తను ఇక్కడ (అమెరికా) రెసిడెంట్ డాక్టర్‌గా చేస్తున్నప్పుడు చాలా వేధింపులనెదు ర్కొంది. ఒకసారి తను ఒక కాన్ఫరెన్స్‌కి వెళ్లింది. దానికి కొంతమంది ఇండియన్స్ కూడా వచ్చారట. లంచ్ అవర్‌లోనో ఎప్పుడో.. ఒక అగ్రకులం అమ్మాయి ‘‘నేను ఫలానా... ఇప్పుడు మీరు మీ కులాలు చెప్తారా?’ అని అడిగిందట. అందరూ చెప్పారట. మా చెల్లి వంతు వచ్చినప్పుడు.. తను చెప్పలేను అందిట. అప్పుడు ఆ అమ్మాయి ‘‘నాకు అర్థమైందిలే’’ అని హేళన చేసినట్టు మాట్లాడిందిట. దాంతో దానికి తన క్యాస్ట్ చెప్పక తప్పలేదు.
మా చెల్లి దళిత్ అని తెలియగానే ‘ఇకనేం.. బోర్డ్ ఎగ్జామ్ (రెసిడెన్సీకి సంబంధించి)లో ఈజీగా క్లియర్ అయిపోతావ్’ అని తేలిక చేస్తూ మాట్లాడిందట. అమెరికాలో రిజర్వేషన్ ఏముంటుంది క్యాస్ట్ పరంగా? అసలు ఆ అమ్మాయికేమన్నా ఇంగితముందా? కేవలం ఇన్‌సల్ట్ చేయడమొక్కటే గోల్ కాకపోతే? ఇలా ఉంటాయి అమెరికాలో మన వాళ్ల వేధింపులు. పాపం.. చెల్లి చాలా సెన్సిటివ్. తట్టుకోలేక వెళ్లిపోయింది. ఇలాంటివి నాకు మొదట్లోనే అర్థమై త్వరగా ఇండియన్స్‌ను వదిలి ఫారినర్స్‌తో స్నేహం చేయడం మొదలు పెట్టాను. ఇక్కడ రేసిజం మాత్రమే ఉంటుంది. క్యాస్ట్ అంటే వాళ్లకు తెలియదు. అంటరాని తనం అంటే ఏంటో అర్థంకాదు. వాళ్ల రేసిజం మన కులమంత క్రూరంగా ఉండదు. కులం పేరుతో మనిషి అత్మాభిమానాన్ని చంపడం, ఆత్మవిశ్వాసాన్ని కుంగదీయడాలు ఉండవు.
ఏ మార్పూరాదు..
నా పుస్తకం రిసెప్షన్ అమెరికాలో చాలా బాగుంది. ముఖ్యంగా అమెరికన్స్‌కు బాగా నచ్చుతోంది. వీళ్ల విలువలు వేరు. ప్రివిలేజెస్ వల్ల పైకి రావడం నచ్చదు వాళ్లకు. కష్టపడి రావడం నచ్చుతుంది. సెల్ఫ్‌మేడ్ పీపుల్‌ని బాగా ఇష్టపడతారు. గౌరవిస్తారు. అందువల్ల కూడా నా పుస్తకానికి చాలా పాపులారిటీ దొరుకుతుందేమో. ఇక్కడున్న మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు అనుకున్నా కాని వాళ్ల నుంచి కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. తెలుగు సంఘాల వాళ్లు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి, నన్ను మాట్లాడమంటున్నారు. అయితే ఇలాంటి పాపులారిటీకి నేనేం రియాక్ట్ అవట్లేదు. ఇంటలెక్చువల్‌గా ఇదొక టర్న్. కాని ఇమోషనల్‌గా నాకేం అనిపించడంలేదు. దీన్ని మామూలు విషయంగానే తీసుకుంటున్నా. ఎందుకంటే ఈ పుస్తకం వల్ల ఏం మార్పురాదు. వస్తుందనీ నేను అనుకోవడం లేదు. ఇంతకుముందు కన్నా భారతదేశంలో పరిస్థి తులు ఇంకా దారుణంగా తయారవుతున్నాయి.
దళితులే ఎక్కువ దౌర్జన్యానికి గురవుతున్నారు. సమాజంలో అప్రెస్ అవుతున్న వాళ్లంతా కలిసి పోరాడితేనే మార్పు వస్తుంది. ప్రతి దేశానికీ సెంట్రల్ క్వశ్చన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు స్త్రీ సెంట్రల్ క్వశ్చన్. మనకు క్యాస్ట్. అయితే మన దగ్గర స్త్రీలూ అప్రెస్ అవుతున్నారు. అందుకే మన దేశంలో విమెన్ లిబరేషన్, క్యాస్ట్ ఇమాన్సిపేషన్..రెండూ ఒకదానితో ఒకటి ముడిపడిన్నాయి. మొదటి వాల్యూమ్‌ను కుదించాను దాన్ని మళ్లీ వివరంగా ఒక పుస్తకంగా తేవాలనుకుంటున్నా. రైతులు అన్నీ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది కన్‌స్ట్రక్షన్ కూలీలుగా మారుతున్నారు. అలా మారిన వాళ్లలో నాకు తెలిసిన రైతు కుటుంబాలూ ఉన్నాయి. వాళ్లందరినీ ఇంటర్వ్యూ చేసి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను రాయాలనుకుంటున్నాను.’’
మామయ్యంటే... హీరో వర్షిప్
మామయ్య (కేజీ సత్యమూర్తి) అంటే చిన్నప్పటి నుంచీ హీరో వర్షిప్పే. 1970ల్లోనే ఆయన యూజీలోకి వెళ్లాడు కాబట్టి ఆయన గురించి వినడమే. అప్పుడప్పుడు ఆయన రాసిన ఉత్తరాల్లో ఆయనను చూసుకునేవాళ్లం. ఆ మాటల్లోని జ్ఞానం నాకెప్పుడు బోధపడుతుందా అనుకునేదాన్ని. మామయ్యంటే మా అందరికీ భయంతో కూడిన గౌరవం, ఆరాధన. ఉద్యమాన్ని, బంధుత్వాన్ని ఆయనెప్పుడూ ముడిపెట్టలేదు. అందుకే నన్ను ఆయన ఎక్‌నాలెడ్జ్ చేసుంటాడేమో కాని స్పెషల్‌గా అయితే ట్రీట్ చేయలేదెప్పుడూ. మామయ్య గురించి అమ్మ చాలా చెప్పేది. అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చినప్పుడు .. ‘‘మీ మామయ్య కూడా ఇలాంటివాడే’’ అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆ సినిమాకు తీసుకెళ్లింది. అప్పటి నుంచి మామ్మయ్యంటే మరింత గౌరవం పెరిగింది. నేనూ ఆయనలాగే ఉండాలని.. కిందపడుకోవడం లాంటి కఠినమైన లైఫ్‌స్టయిల్‌ను ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఆయన కవిత్వాన్ని పాటలు కట్టి పాడుతుంటే ‘మామయ్య ఇంత గొప్పవాడా!’ అనుకునేవాళ్లం. అయితే నేను అమెరికా వచ్చేవరకు ఆయన కవిత్వాన్ని చదవలేదు. శ్రీశ్రీ, మామయ్యల కవిత్వమంటేనే ఇష్టం.
యాంట్స్ ఎమాంగ్ ది ఎలిఫెంట్స్
చిన్నప్పటి నుంచీ నన్ను ఒకటే ప్రశ్న వేధించేది.. ‘‘మా కులం తక్కువ’’, ‘‘వాళ్ల కులం ఎక్కువ’’.. ఎందుకు? అని. ఎవరూ సమాధానం చెప్పలేదు. ‘‘మౌనగీతం’’ సినిమా చూశాను. అందులో హీరోయిన్ క్రిస్టియన్. చాలా సంపన్నమైన అమ్మాయి, సోషల్‌గా కూడా మంచి స్టేటస్‌లో ఉంటుంది. మరి మేం కూడా క్రిస్టియన్సే కదా.. మాకెందుకు ఆ సోషల్ స్టేటస్ లేదు? అనుకున్నాను. జవాబు దొరకలేదు. మద్రాస్‌లో ఉన్నప్పుడు క్రిస్టియన్ కేరళైట్స్‌ని అడిగాను ఇదే ప్రశ్న. ‘మేం బ్రాహ్మిన్స్‌మి. సెయింట్ థామస్ వచ్చినప్పుడు మేమంతా క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయ్యాం’ అని చెప్పారు వాళ్లు. ఆ కథాకమామీషు ఏంటీ అని మా అమ్మను అడిగా. అప్పుడు మా అమ్మ ఆ హిస్టరీ అంతా చెప్పింది. స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం.. ఎన్నో కథలు.. నన్ను కదిలించాయి.. ఆలోచింపచేశాయి.. పుస్తకం రాయాలి అని అనుకుంది అప్పుడే. రీసెర్చ్ మొదలుపెట్టాను.
2006 నుంచి 2012 వరకు కొనసాగింది. పుస్తకంగా రాశాను. ముందు స్వాతంత్య్రం వచ్చేవరకు సంఘటనలనే రాసి ఆపేశాను. ఇంకా యాడ్ చేయమన్నారు పబ్లిషర్స్. ఎక్స్‌టెండ్ చేసేసరికి రెండు వాల్యూమ్స్‌గా వచ్చింది. చాలా ఎక్కువైపోయింది తగ్గించమన్నారు. మొదటి వాల్యూమ్ అంతటినీ ఒక చాప్టర్‌గా కుదించాను. ఈలోపు ఎడిటర్స్ కూడా మారిపోయారు. అందుకే ‘యాంట్స్ ఎమాంగ్ ది ఎలిఫెంట్స్’ రావడం లైట్ అయింది.
ప్రస్తుతం : 2009లో వచ్చిన రెసిషన్ వల్ల బ్యాంక్‌లో ఉద్యోగం పోయింది. అంతకుముందే న్యూయార్క్‌లో మెట్రోట్రైన్‌ను ఆడవాళ్లు నడుపుతుంటే చూసి ఇన్‌స్పైర్ అయి నేనూ నడపాలని ఎమ్‌టీఏ (మెట్రో ట్రాన్సిట్ ఆథారిటీ) టెస్ట్‌కు వెళ్లాను. అయితే కండక్టర్‌గా టెస్ట్ క్లియర్ అయింది. డ్రైవర్ టెస్ట్‌కి మళ్లీ చాలా సార్లు ప్రయత్నించాను కాని ఏవో అవాంతరాల వల్ల రాయలేకపోయా. 2009లో ఉద్యోగం పోయాక అప్పుడు రాసిన కండక్టర్ టెస్ట్‌తో ఎమ్‌టీఏలో కండక్టర్‌గా చేరాను. కంటిన్యూ అవుతున్నాను.
– సుజాతా గిడ్ల (ఫోన్ ఇంటర్వ్యూ: సరస్వతి రమ)