గిరిజన విద్యార్థులపై నిర్లక్ష్యమా..?
ఆగ్రహించిన కలెక్టర్ కృష్ణభాస్కర్
మరిమడ్ల(కోనరావుపేట) : ‘గిరిజన విద్యార్థులకు సరైన వసతులు లేవు. భోజనం సక్రమంగా పెట్టడంలేదు.. కనీసం విద్యాబుద్ధులు కూడా నేర్పించడంలేదు.. ఒక్క గణిత సమస్యకూ విద్యార్థులకు సమాధానం చెప్పడం లేదు. రోజూ ఏం చదు వు చెబుతున్నారు..? మీరేం చేస్తున్నారు.. గిరి జన విద్యార్థులంటే ఇంత నిర్లక్ష్యమా..?’ అని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పదో తరగతి విద్యార్థులను గణితశాస్త్రంపై ప్రశ్నలు అడిగారు. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం వంటశాలలో భోజనం తయారీని పరిశీలించారు. ఎంతమంది విద్యార్థుల కోసం భోజనం తయారు చేస్తున్నారని ప్రశ్నించగా సిబ్బంది, ప్రిన్సిపాల్ సరైన సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాల పైనే దృష్టి పెట్టారని, సిబ్బంది, నిర్వాహకులు ఇలా నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డీఈవో రాధాకిషన్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రాయ్ ఉన్నారు.