జోగిపేట మార్కెట్ గంజ్ ఆవరణ.. సేదతీరుతున్న గిరిజన కుటుంబాలు..పుల్కల్ మండలంలో చెరకు కొట్టేందుకు వెళుతూ మార్గమధ్యలో వారు ఆగారు. అలా ఆగిన వారిని ‘సాక్షి’ పలకరించింది. ఆ వలసజీవులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పిల్లల్ని పాఠశాలకు పంపాలని ఉందని..అయినా తాము ఒక చోట పిల్లలు మరోచోట కష్టమనే ఇలా వెంట తీసుకె ళ్తున్నామన్నారు.
చదువు మానేసిన బడిపిల్లల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మానేసిన బడిపిల్లల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చెరుకు సీజన్‌లో గిరిజన పిల్లలు వారి చదువులకు తప్పనిసరి పరిస్థితుల్లో దూరం అవుతున్నారు. వీరి భవిష్యత్తుపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావంతులు అంటున్నారు.
ప్రతి సీజన్‌లో ఇలా విద్యకు దూరం కావడం వల్ల భవిష్యత్తులో వారు పూర్తి స్థాయిలో విద్యావంతులు కావడానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చెరకు సీజన్‌లో గిరిజనులు తమ కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తరలివెళుతుంటారు. అయితే ఇంట్లోని వారందరూ నెలల పాటు ఉండరు కాబట్టి పిల్లల్ని ఎక్కడ ఉంచేందుకు అవకాశం లేక వారిని వెంట తీసుకువెళుతున్నారు. దీంతో వారు రెండు నెలల పాటు పాఠశాలలకు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. రెండో తరగతి నుంచి 8,9 తరగతులకు చెందిన విద్యార్థులు కూడా వీరిలో ఉన్నారు. ఎక్కువగా ఈ వలసజీవులు ఎడ్లబళ్లపై అందోలు, పుల్కల్ మండల ప్రాంతాల్లో చెరకును కొట్టేందుకు వెళుతుంటారు.
పాఠశాలలకు డుమ్మా
ప్రతి చెరకు సీజన్‌లో గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలకు దూరం అవుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కంగ్టి, కల్హేర్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గం పరిధిలోని రేగోడ్ మండలానికి చెందిన వందల సంఖ్యలో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రుల వెంట చెరకు కొట్టే ప్రాంతాలకు తరలివెళుతున్నారు. దీంతో ఆయా విద్యార్థులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు.
తల్లిదండ్రులకు తోడుగా..
చెరకు కొట్టేందుకు వెళ్లి ఆ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. చెరకు కొట్టే సమయంలో తండ్రులకు, వంట పనులు చే సే సమయంలో తల్లులకు ఆ విద్యార్థులు సహకరిస్తుంటారు. తండ్రులు చెరకును కొట్టి ఎడ్లబళ్లపై ఫ్యాక్టరీకి తరలించే సమయంలో తల్లుల వద్ద వారి పిల్లలు తోడుగా ఉంటున్నారు. కొంత మేరకు తల్లిదండ్రులకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నా పాఠశాలను వదిలి చదువుకు దూరంగా వెళ్లడం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మా పిల్లలు చదువుకోవాలని ఉన్నా..
మా పిల్లలు చదువుకోవాలనే మాకుంటుంది, కానీ సీజన్‌లో కేవలం పిల్లలను ఇంటి వద్ద వదిలేసి రావడం కుదరదు. మా తండాల్లో హాస్టళ్లు లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకు వెళ్తున్నాం. పెద్ద తండాలో 60 మంది విద్యార్థులున్నా ఒకే టీచర్ ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో కూడా పిల్లలకు సరైన ఆహారాన్ని అందించడం లేదు.
చెరకు సీజన్‌లో ‘బడి’ని వదిలేస్తున్న గిరిజన విద్యార్థులు
Published Tue, Nov 25 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement
Advertisement