ద్రవిడియన్‌ వర్సిటీలో స్క్రాప్‌ దందా! | Scrap racket at Dravidian University | Sakshi
Sakshi News home page

ద్రవిడియన్‌ వర్సిటీలో స్క్రాప్‌ దందా!

Published Mon, Jan 6 2025 5:37 AM | Last Updated on Mon, Jan 6 2025 5:37 AM

Scrap racket at Dravidian University

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని వర్సిటీలో అధ్వాన పరిస్థితులు 

స్క్రాప్‌ పేరుతో విలువైన సామగ్రి చౌకగా విక్రయం

రూ.50లక్షల వరకు విలువైన ఏసీలు, కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు రూ.5లక్షలకే?

బినామీల పేరుతో స్వాహా చేసిన యూనివర్సిటీ పెద్దలు

ఐదు లారీల దూరవిద్య పుస్తకాలను విక్రయిస్తే.. మూడు లారీలకే లెక్కలు!

జోరుగా ‘డిస్టెన్స్‌ పీహెచ్‌డీ’ల వ్యాపారం

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. అక్షర జ్ఞానం అందించాల్సిన యూనివర్సిటీల్లో అవినీతి దందా రాజ్యమేలుతోంది. రాజ్యాంగ వ్యవస్థ నిర్ణయాన్ని తుంగలో తొక్కి వైస్‌ చాన్సలర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడం గొప్పగా భావించిన ‘కూటమి’ పెద్దలు... వర్సిటీల్లో చదువులను గాలికొది­లేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్‌ యూనివర్సిటీలో దిగజారిన పరిస్థితులే ఇందుకు నిదర్శనం. 

ప్రస్తుతం ద్రవిడియన్‌ యూనివర్సిటీ ‘పైసా వసూల్‌’కు కేంద్రంగా మారింది. పైసలు ముట్టచెబితే ఏకంగా పీహెచ్‌డీలను పప్పుబెల్లం మాదిరిగా అమ్మేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా యూనివర్సిటీ ఆస్తులను కూడా ‘స్క్రాప్‌’ పేరుతో కారుచౌకగా అమ్మేసి అందిన కాడికి దోచేస్తుంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుండటం గమనార్హం.     – సాక్షి, అమరావతి

చదువుకునే పుస్తకాలు చెత్తలో పడేసి..!
ద్రవిడియన్‌ యూనివర్సిటీలో అక్రమాల కారణంగా దాదాపు విశ్వసనీయత కోల్పోయింది. ఈ క్రమంలో దూరవిద్య విభాగం సైతం మూతపడింది. అయితే దూర విద్య కోసం ముద్రించిన స్టడీ మెటీరీయల్‌ వర్సిటీలో ఉండిపోయింది. ఆ పుస్తకాలను కూడా చెత్తలో కలిపేసిన వర్సిటీ పాలకులు... వాటిని తమిళనాడుకు తీసుకువెళ్లి కారుచౌకగా అమ్మేసి సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 

వాస్తవానికి మార్కెట్‌లో టన్ను పేపర్లు(చెత్త) ధర రూ.26వేలు పలుకుతోంది. అలాంటిది విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్‌ను టన్ను రూ.15వేల లోపే తమ అనుయాయు­లకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఐదు లారీల స్టడీ మెటీరియల్‌ స్క్రాప్‌ కింద బయటకు వెళితే... యూనివర్సిటీ లెక్కల్లో మాత్రం మూడు లారీల సరుకునే చూపించినట్టు సమాచారం.

బినామీల పేరుతో పెద్దల మాయాజాలం!
ద్రవిడియన్‌ వర్సిటీ కీర్తిప్రతిష్టలను, ఆస్తులను కాపాడాల్సిన పెద్దలే దొరికింది దొరికినట్టు దోచేస్తున్నారు. తాజాగా సుమారు పది రోజుల కిందట ఈ యూనివర్సిటీలో పెద్దలు ‘స్క్రాప్‌’ పేరుతో అవినీతి దందాకు తెరదీశారు. నిబంధనల ప్రకారం విస్తృతంగా ప్రచారం కల్పించిన తర్వాతే వర్సిటీలో పనికిరాని వస్తువులను విక్రయించేందుకు ‘స్క్రాప్‌’ టెండర్లు పిల­వాలి. 

కానీ, అధికారులు మాత్రం బయటకు తెలియకుండా నామమాత్రంగా ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్న డ్రైవర్లతో ‘స్క్రాప్‌’ కొనుగోలుకు టెండర్లు వేయించారు. వారిలో కూడా తక్కువ రేటు కోట్‌ చేసిన వ్యక్తికే టెండర్‌ కట్టబెట్టారు. వినియోగంలో ఉన్న వస్తువులను, స్వల్పంగా మరమ్మతులు చేస్తే ఉపయోగించుకునే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్‌ సామగ్రిని అప్పనంగా అమ్మేశారు. 

దాదాపు రూ.30­లక్షల నుంచి రూ.50లక్షలు విలువైన వస్తువులను కేవలం రూ.5లక్షలకు విక్రయించినట్టు సమాచారం. వీటిల్లో మూడు జనరేటర్లు, 300 కంప్యూ­టర్లు, 25 ఏసీలు, రెండు లారీల్లో డెస్క్‌లు, కుర్చీలు ఉన్నాయి. కంప్యూటర్లు, ఏసీల్లో చాలావరకు పనిచేసేవి ఉన్నట్టు యూనివర్సిటీ వర్గాలు చెబుతు­న్నాయి. అయితే, ఎక్కువ కోట్‌ చేసిన వ్యక్తికి టెండర్‌ దక్కకపోవడంతో అసలు ఈ అవినీతి దందా బయటకు పొక్కింది.  

నాలుగు బ్రాంచ్‌లు పెట్టి ‘పీహెచ్‌డీ’ వ్యాపారం!
ద్రవిడియన్‌ యూనివర్సిటీలో అక్రమ పీహెచ్‌డీల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పైసలిస్తే పీహెచ్‌డీల దందా పడగవిప్పింది. ఏడు నెలల్లో సుమారు వందకు పైగా పీహెచ్‌డీలు ప్రదానం చేశారని ఏపీ పేరెంట్స్‌ అసోసియేషన్‌ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. వాస్తవానికి యూజీసీ నిబంధనల ప్రకారం డిస్టెన్స్‌ పీహెచ్‌డీలు చెల్లవు. ఇక్కడ దూరవిద్య కేంద్రం మూతపడింది. అయినా పాత తేదీలతో రోజుకు రెండు, మూడు పీహెచ్‌డీలు అవార్డు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ఈ యూనివర్సిటీ బాస్‌... దక్షిణ భారతదేశంలో నాలుగు బ్రాంచ్‌లు పెట్టి మరీ పీహెచ్‌డీల వ్యాపారం చేస్తున్నట్టు అధ్యాపకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తిరుమల, చెన్నై, మైసూరు, కోయంబత్తూరు కేంద్రాలుగా ఈ పీహెచ్‌డీల వ్యాపారం, మార్కెటింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో పీహెచ్‌డీ ప్రొసీడింగ్స్‌పై సంతకం పెట్టాలంటే సగటున రూ.లక్ష వసూలు చేస్తున్నారని తెలిసింది. 

పైగా న్యాక్‌ బృందం పర్యటనలోనూ వీటినే రెగ్యులర్‌ పీహెచ్‌డీలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని యూనివర్సిటీ పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన వర్సిటీల పని తీరుపైన ప్రభావం పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement