మళ్లీ ద్రవిడియన్ వర్సిటీలో పీహెచ్‌డీల అవినీతి బాగోతం
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా డిస్టెన్స్ పీహెచ్‌డీల పేరుతో మోసం
అమాయక విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు ?
100 రోజుల్లో 100 పీహెచ్‌డీలు ఇచ్చేసినట్లు సమాచారం
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలోనే!
‘స్వామి భక్తి’పరుడిని అందలం ఎక్కించడంతోనే మొదలైన కథ
తాత్కాలిక ఉద్యోగిగా చేరి.. అడ్డదారుల్లో వర్సిటీ పీఠం ఎక్కిన వైనం
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. ఇన్నాళ్లూ ఉన్నతంగా వెలుగొందిన వర్సిటీలకు కళంకం ఏర్పడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిరాగానే రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తూ 17 వర్సిటీల వైస్ చాన్సలర్ల మెడపై కత్తిపెట్టి రాజీనామాలు చేయించడంతో తిరోగమనం మొదలైంది. అది కాస్తా.. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ అడ్డగోలుగా పీహెచ్‌డీలు మంజూరు చేసే స్థాయికి చేరుకుంది.
ప్రభుత్వ పెద్దలు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమ అనుయాయులు కొందరికి ఇన్‌చార్జి వీసీ పోస్టులు కట్టబెట్టారు. ఇందులో భాగంగానే ద్రవిడియన్ వర్సిటీలో తమకు ‘స్వామి భక్తి’ ప్రదర్శించే వ్యక్తికి వర్సిటీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సదరు వ్యక్తి కనుసన్నల్లో ‘పీహెచ్‌డీలో పైసా వసూల్’ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే ఏకంగా 100కిపైగా ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీలకు ప్రొసీడింగ్ (అవార్డు) చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
వాస్తవానికి యూజీసీ 2009లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం డిస్టెన్స్ పీహెచ్‌డీలను నిలిపివేసింది. కానీ, కాసులే పరమావధిగా ద్రవిడియన్ వర్సిటీ ఇన్‌చార్జి బాస్ అమాయక విద్యార్థుల ఆశలను అడ్డుపెట్టుకుని పనికిరాని పీహెచ్‌డీలు ఇస్తూ రూ.కోట్లలో అవినీతి దందాకు తెరతీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, అమరావతి
ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటే రూ.లక్ష
పీహెచ్‌డీ అవార్డు కంటే ముందు వర్సిటీ విద్యార్థికి ప్రొసీడింగ్స్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ద్రవిడియన్ వర్సిటీలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థికి గైడ్ ఎవరనేది చూడకుండా.. థీసిస్‌ను పరిశీలించకుండా.. జాతీయస్థాయి వర్సిటీలకు కూడా సాధ్యపడని విధంగా ప్రతిరోజూ రెండు/మూడు పీహెచ్‌డీలను ద్రవిడియన్ వర్సిటీ ఇచ్చేస్తోంది.
అది కూడా యూజీసీ గుర్తించని డిస్టెన్స్ విధానంలో ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో వర్సిటీలో అక్రమ సరి్టఫికెట్లతో లైబ్రరీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి
ద్రవిడియన్ వర్సిటీలో పీహెచ్‌డీ మంజూరులో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల బహిరంగ లేఖను విడుదల చేసింది. గత ప్రభుత్వంలో పీహెచ్‌డీ అక్రమాలపై జస్టిస్ బి.శేషశయనరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది.
ఆఫ్ క్యాంపస్‌లో పీహెచ్‌డీలు ఇస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009 ముందు రిజి్రస్టేషన్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీ ఇవ్వాలన్న యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ద్రవిడియన్ వర్సిటీ పీహెచ్‌డీ ప్రదానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాత్కాలిక ఉద్యోగి.. ఇన్‌చార్జి వీసీ
ద్రవిడియన్ వర్సిటీలో 2010లో తాత్కాలిక ప్రాతిపదికన డెప్యూటీ లైబ్రేరియన్‌గా అడుగు పెట్టిన సదరు స్వామిభక్తి పరుడు ఎక్కడిక్కడ నిబంధనలకు విరుద్ధంగానే ప్రమోషన్లు పొందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టు లేకుండానే నేరుగా డెప్యూటీ లైబ్రేరియన్ పోస్టులోకి రావడానికి అప్పట్లోనే తెరవెనుక చక్రం తిప్పారు. ఆ తరువాత తాత్కాలిక ప్రాతిపదికపై వచ్చిన వారిని రెగ్యులర్ చేస్తున్నట్లు వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు కోర్టుకు వెళ్లారు.
వర్సిటీ తీరును తప్పుపట్టిన కోర్టు.. త్వరలోనే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే.. తాత్కాలిక పద్ధతిపై వచ్చిన వారిని తొలగించకుండా వర్సిటీ అధికారులు కొందరు కోర్టును తప్పుదోవ పట్టిస్తూ రెగ్యులర్ నోటిఫికేషన్‌ను తాత్సారం చేశారు. ఇదే అదనుగా స్వామిభక్తి పరుడు వర్సిటీ పెద్దలను ప్రసన్నం చేసుకుని రెగ్యులర్ ఉద్యోగిగా మారిపోయారు. అంతటితో ఆగలేదు.. నాన్‌టీచింగ్ డెప్యూటీ లైబ్రేరియన్ పోస్టు (అసోసియేట్ ప్రొఫెసర్) నుంచి ఏకంగా టీచింగ్ విభాగంలోని ప్రొఫెసర్ పోస్టులోకి వచ్చేశారు.
సుమారు ఆరేళ్లు అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తేనే ప్రొఫెసర్ హోదాకు అర్హత లభిస్తుంది. కానీ.. అప్పుడెప్పుడో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని లెక్కగట్టి కేవలం వర్సిటీలోకి నాన్–టీచింగ్ ఉద్యోగిగా వచ్చిన మూడేళ్లలోనే ప్రొఫెసర్‌గా మారిపోయారు. సదరు స్వామిభక్తి పరుడిపై 2014లో హైకోర్టులో మరో కేసు నమోదైంది.
అది ఇప్పటికీ విచారణలో ఉండడం గమనార్హం. వీటన్నింటినీ పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు ద్రవిడియన్ వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్లను పక్కనపెట్టి సొంత సామాజిక వర్గానికి చెందిన, అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కించడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. పైగా సదరు వ్యక్తి తనపై కేసులేమీ లేవని వర్సిటీ విజిలెన్స్ రిపోర్టు తీసుకుని వైస్ చాన్సలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ భోగట్టా.
రాజకీయాలకు వేదికగా.. ద్రవిడియన్ వర్సిటీ
ఏర్పడినప్పటి నుంచి క్యాంపస్‌లో ఎటువంటి రాజకీయ సమావేశాలు జరగలేదు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్సిటీ క్యాంపస్ రాజకీయాలకు అడ్డగా మారిపోయింది. స్వామి భక్తిపరుడు సీటులో కూర్చోవడంతో ఇది మరింత పెరిగింది. ఈ నెల 1వ తేదీన ఏకంగా నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించి స్వామిభక్తిని చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment