
భక్తుల అగచాట్లను పట్టించుకోని టీటీడీ యంత్రాంగం
టోకెన్లను కొందరు సిబ్బంది అడ్డదారిలో అమ్మేస్తున్నారంటూ భక్తుల ఆగ్రహం
ఆదివారం తెల్లవారుజాముకే వేలాదిగా తరలివచ్చిన భక్తులు
వాహనాలను అడ్డుకున్న సెక్యూరిటీ ఆటోలకు మాత్రం అనుమతి
ఆగ్రహంతో సెక్యూరిటీని తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన భక్తులు
చంద్రగిరి: శ్రీవారిమెట్టు మార్గంలో టోకెన్ల దందా కొనసాగుతోంది. విజిలెన్స్ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఎంతో దూరం నుంచి ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వచి్చన సామాన్య భక్తులు టోకెన్లు లభించక తీవ్ర అగచాట్లు పడ్డారు. ఆటో డ్రైవర్లతో కలిసి పలువురు సిబ్బంది అడ్డదారిలో టోకెన్లు విక్రయిస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు.. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) యంత్రాంగం కొన్ని నెలలుగా రోజుకు కేవలం 3 వేల టోకెన్లే జారీ చేస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వారాంతాల్లోనూ అదే రీతిలో టోకెన్లు ఇస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 10 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిమెట్టు వద్దకు పోటెత్తారు. ఉదయం 6 గంటలకే భక్తులు భారీగా తరలిరావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
శ్రీవారిమెట్టు మార్గంలోని పంపు హౌస్ వద్ద బారికేడ్లతో భక్తుల వాహనాలను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. కానీ ఆటోలను మాత్రం ముందుకు అనుమతించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు.
తిరుపతి నుంచే వసూలు మొదలు..
తిరుపతిలో తమ వాహనాలు ఎక్కితే.. శ్రీవారి దర్శన టోకెన్లు ఇస్తామంటూ ఆటో డ్రైవర్లు జనాన్ని తీసుకువస్తున్నారని భక్తులు ఆరోపించారు. గ్రూపులుగా వచ్చే వారిని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. సుమారు ఏడుగురు ఉండే గ్రూప్ నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. బెంగళూరుకు చెందిన కృష్ణమూర్తి అనే భక్తుడు మాట్లాడుతూ.. “బెంగళూరు నుంచి కుటుంబసభ్యులతో శ్రీవారిమెట్టు సమీపానికి శనివారం అర్ధరాత్రికే వచ్చా. అప్పటి నుంచి సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని అనుమతించలేదు.
కానీ ఆటోలను మాత్రం పంపించారు. దీనిపై ప్రశ్నిస్తే జవాబు చెప్పట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఇలా ఇబ్బందులు పెట్టడం దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తగినన్ని టోకెన్లు జారీ చేయాలని టీటీడీని కోరారు. టోకెన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment