distance education
-
ద్రవిడియన్ వర్సిటీలో స్క్రాప్ దందా!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. అక్షర జ్ఞానం అందించాల్సిన యూనివర్సిటీల్లో అవినీతి దందా రాజ్యమేలుతోంది. రాజ్యాంగ వ్యవస్థ నిర్ణయాన్ని తుంగలో తొక్కి వైస్ చాన్సలర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడం గొప్పగా భావించిన ‘కూటమి’ పెద్దలు... వర్సిటీల్లో చదువులను గాలికొదిలేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ యూనివర్సిటీలో దిగజారిన పరిస్థితులే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ద్రవిడియన్ యూనివర్సిటీ ‘పైసా వసూల్’కు కేంద్రంగా మారింది. పైసలు ముట్టచెబితే ఏకంగా పీహెచ్‌డీలను పప్పుబెల్లం మాదిరిగా అమ్మేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా యూనివర్సిటీ ఆస్తులను కూడా ‘స్క్రాప్’ పేరుతో కారుచౌకగా అమ్మేసి అందిన కాడికి దోచేస్తుంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుండటం గమనార్హం. – సాక్షి, అమరావతిచదువుకునే పుస్తకాలు చెత్తలో పడేసి..!ద్రవిడియన్ యూనివర్సిటీలో అక్రమాల కారణంగా దాదాపు విశ్వసనీయత కోల్పోయింది. ఈ క్రమంలో దూరవిద్య విభాగం సైతం మూతపడింది. అయితే దూర విద్య కోసం ముద్రించిన స్టడీ మెటీరీయల్ వర్సిటీలో ఉండిపోయింది. ఆ పుస్తకాలను కూడా చెత్తలో కలిపేసిన వర్సిటీ పాలకులు... వాటిని తమిళనాడుకు తీసుకువెళ్లి కారుచౌకగా అమ్మేసి సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మార్కెట్లో టన్ను పేపర్లు(చెత్త) ధర రూ.26వేలు పలుకుతోంది. అలాంటిది విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్‌ను టన్ను రూ.15వేల లోపే తమ అనుయాయులకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఐదు లారీల స్టడీ మెటీరియల్ స్క్రాప్ కింద బయటకు వెళితే... యూనివర్సిటీ లెక్కల్లో మాత్రం మూడు లారీల సరుకునే చూపించినట్టు సమాచారం.బినామీల పేరుతో పెద్దల మాయాజాలం!ద్రవిడియన్ వర్సిటీ కీర్తిప్రతిష్టలను, ఆస్తులను కాపాడాల్సిన పెద్దలే దొరికింది దొరికినట్టు దోచేస్తున్నారు. తాజాగా సుమారు పది రోజుల కిందట ఈ యూనివర్సిటీలో పెద్దలు ‘స్క్రాప్’ పేరుతో అవినీతి దందాకు తెరదీశారు. నిబంధనల ప్రకారం విస్తృతంగా ప్రచారం కల్పించిన తర్వాతే వర్సిటీలో పనికిరాని వస్తువులను విక్రయించేందుకు ‘స్క్రాప్’ టెండర్లు పిలవాలి. కానీ, అధికారులు మాత్రం బయటకు తెలియకుండా నామమాత్రంగా ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న డ్రైవర్లతో ‘స్క్రాప్’ కొనుగోలుకు టెండర్లు వేయించారు. వారిలో కూడా తక్కువ రేటు కోట్ చేసిన వ్యక్తికే టెండర్ కట్టబెట్టారు. వినియోగంలో ఉన్న వస్తువులను, స్వల్పంగా మరమ్మతులు చేస్తే ఉపయోగించుకునే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ సామగ్రిని అప్పనంగా అమ్మేశారు. దాదాపు రూ.30లక్షల నుంచి రూ.50లక్షలు విలువైన వస్తువులను కేవలం రూ.5లక్షలకు విక్రయించినట్టు సమాచారం. వీటిల్లో మూడు జనరేటర్లు, 300 కంప్యూటర్లు, 25 ఏసీలు, రెండు లారీల్లో డెస్క్‌లు, కుర్చీలు ఉన్నాయి. కంప్యూటర్లు, ఏసీల్లో చాలావరకు పనిచేసేవి ఉన్నట్టు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎక్కువ కోట్ చేసిన వ్యక్తికి టెండర్ దక్కకపోవడంతో అసలు ఈ అవినీతి దందా బయటకు పొక్కింది. నాలుగు బ్రాంచ్‌లు పెట్టి ‘పీహెచ్డీ’ వ్యాపారం!ద్రవిడియన్ యూనివర్సిటీలో అక్రమ పీహెచ్‌డీల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పైసలిస్తే పీహెచ్‌డీల దందా పడగవిప్పింది. ఏడు నెలల్లో సుమారు వందకు పైగా పీహెచ్‌డీలు ప్రదానం చేశారని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. వాస్తవానికి యూజీసీ నిబంధనల ప్రకారం డిస్టెన్స్ పీహెచ్‌డీలు చెల్లవు. ఇక్కడ దూరవిద్య కేంద్రం మూతపడింది. అయినా పాత తేదీలతో రోజుకు రెండు, మూడు పీహెచ్‌డీలు అవార్డు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యూనివర్సిటీ బాస్... దక్షిణ భారతదేశంలో నాలుగు బ్రాంచ్‌లు పెట్టి మరీ పీహెచ్‌డీల వ్యాపారం చేస్తున్నట్టు అధ్యాపకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తిరుమల, చెన్నై, మైసూరు, కోయంబత్తూరు కేంద్రాలుగా ఈ పీహెచ్‌డీల వ్యాపారం, మార్కెటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో పీహెచ్డీ ప్రొసీడింగ్స్‌పై సంతకం పెట్టాలంటే సగటున రూ.లక్ష వసూలు చేస్తున్నారని తెలిసింది. పైగా న్యాక్ బృందం పర్యటనలోనూ వీటినే రెగ్యులర్ పీహెచ్‌డీలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని యూనివర్సిటీ పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన వర్సిటీల పని తీరుపైన ప్రభావం పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
దూర విద్య మరింత భద్రం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక, దూర విద్యల తో పాటు ఆన్లైన్ విద్య ప్రవేశాల్లో గుణాత్మక మార్పులు చేపట్టినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. యూజీసీ అనుమతి ఉన్న విద్యా సంస్థల వివరాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఆన్లైన్ ద్వారా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందాలనుకునే వారు ఈ వెబ్‌సైట్‌ను పరిశీ లించాలని కోరింది. ఎలాంటి అనుమతిలేని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు చేసిన విద్యా ర్థులు గతంలో అనేక ఇబ్బందులు పడ్డారని, ఇక మీదట ఈ పరిస్థితి తలెత్తకుండా చేయ డమే దీని ఉద్దేశమని తెలిపింది. మరింత పార దర్శకంగా ఉండేందుకు చేపట్టిన ఈ మార్పు లు 2024–25 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. వెబ్ పోర్టల్‌తో పాటు విద్యార్థులకు ఉపయుక్తంగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌ను అందు బాటులోకి తెచ్చామని తెలిపింది. విద్యార్థి చేసే కోర్సుకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఈ ఏడాది అకడమిక్ సెషన్ సెప్టెంబర్ నుంచి మొదల వుతుందని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ వెల్లడించారు. -
Andhra University: ఏయూ దూరవిద్య.. మరింత చేరువ
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): దూరవిద్య విధానం ద్వారా అందరికీ నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) పనిచేస్తోంది. విద్యార్థులు దేశంలో ఎక్కడ నుంచైనా సేవలు పొందే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఆన్లైన్లో బీకామ్, ఎంఏ సోషియాలజీ కోర్సులను అందిస్తున్న ఏయూ దూరవిద్య కేంద్రం మరిన్ని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, పరీక్షలకు దరఖాస్తు, ఫీజుల చెల్లించడం వంటి వాటిని ఆన్లైన్లోనే చేసేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే సెప్టెంబర్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా ఆన్లైన్లో 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 25 వరకు దరఖాస్తుకు అవకాశముంది. ఈ దూర విద్యా కోర్సులకు రెగ్యులర్ కోర్సుల తరహాలోనే సెమిస్టర్ విధానం ఉంటుంది. అదేవిధంగా గ్రేడింగ్ విధానం కూడా ప్రవేశపెట్టారు. విద్యార్థుల ముంగిటకే సేవలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం సులువుగా తమకు నచ్చిన కోర్సులను అభ్యసించేలా ఆన్లైన్లో ప్రవేశాలు పొందే అవకాశం ఏయూ కల్పిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు andhrauniversity.edu.inలో నిర్దేశిత లింక్‌ను క్లిక్ చేయాలి. అనంతరం లెర్నర్ ఎన్రోల్మెంట్పై క్లిక్ చేయాలి. అక్కడ విద్యార్థులు తమ వ్యక్తిగత, సామాజిక, విద్యా సంబంధ వివరాలు సమర్పించాలి. అలాగే పదో తరగతి, కులధ్రువీకరణ, విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. దీంతో దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. ఆ తర్వాత కోర్సుల వారీగా నిర్దేశిత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వర్సిటీ అధికారులు.. విద్యార్థుల దరఖాస్తు, తదితర వివరాలను పరిశీలించి.. అర్హత ఉన్నట్లయితే ప్రవేశాన్ని ధ్రువీకరిస్తారు. ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి దూరవిద్యా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. -
దూరవిద్య అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: దూరవిద్య (ఓపెన్)లో టెన్త్, ఇంటర్ చదివిన అభ్యర్థులను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీఆర్‌లో ‘ఓపెన్’కు సంబంధించిన ఆప్షన్ కనిపించకపోవడంతో ఈ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కష్టమైపోయింది. అభ్యర్థి ఆధార్ కార్డు వివరాలతో వెబ్సైట్లో ఎంట్రీ చేయగానే పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సూచిస్తోంది. కానీ దూరవిద్యలో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పాఠశాలలో, కళాశాలలో చదివిన నేపథ్యం లేకపోవడంతో నిర్దేశించిన ఆప్షన్లను పూరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఓటీఆర్ ప్రక్రియలో ముందుకు సాగలేకపోతున్నారు. నోటిఫికేషన్లు వెలువడితే ఓటీఆర్ లేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు ఓపెన్ అభ్యర్థులూ ఓటీఆర్‌కు అర్హులేనని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వివరాల నమోదు సమయంలో వచ్చే పేజీని కొనసాగిస్తే సరిపోతుందంటున్నారు. కానీ రిజిస్ట్రేషన్ సాగట్లేదని అభ్యర్థులు చెబుతున్నారు. (చదవండి: TSPSC: గ్రూప్–1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేనట్టే! నేడో, రేపో..) -
ఓయూ ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష ఉండేది కాదు. ఈనేపథ్యంలో ఓయూలో కొత్తగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: మూడు వందల కాలేజీలకు ముప్పు) 13న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఈనెల 10న శుక్రవారం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈనెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షకు 836 మంది దరఖాస్తు చేయగా 677 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐసెట్–2021 అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. (చదవండి: మద్యం తాగాడు.. విద్యార్థులను బాదాడు) పీజీ రిపోర్టింగ్ గడువు 15 వరకు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్‌లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (చదవండి: బయోపిక్‌లు ‘భయో’ పిక్‌లు, కాకూడదు) -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్‌లాగ్‌లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్‌ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
విద్యార్థులూ.. బహుపరాక్
సాక్షి, అమరావతి: దేశంలో అనుమతులు లేని యూనివర్సిటీలు ఇతర విద్యాసంస్థల (ఫేక్ వర్సిటీలు, సంస్థల) పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచిస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ దూరవిద్య, ఆన్లైన్ మోడ్ కోర్సులు అందించే సంస్థల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. సదరు సంస్థలకు, అవి అందించే కోర్సులకు తమ గుర్తింపు ఉందో లేదోననే విషయాన్ని యూజీసీ అధికారిక వెబ్సైట్లో సూచించిన పోర్టళ్ల ద్వారా పరిశీలన చేసుకోవాలని పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. నిషేధిత ప్రోగ్రామ్స్ ఇవీ.. ► ఇంజనీరింగ్, మెడిసిన్, లా, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, ఫిజియోథెరపి, అగ్రికల్చర్, హోటల్ మేనేజ్మెంట్, పాక అధ్యయనాలు(కలినరీ స్టడీస్), వేల్యూయేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ► చట్టబద్ధమైన కౌన్సిల్స్, రెగ్యులేటరీ సంస్థల ద్వారా ఓడీఎల్ మోడ్‌లో అందించడానికి అనుమతించని ఇతర కార్యక్రమాలు. ► ఎం.ఫిల్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు కూడా ఓడీఎల్, ఆన్లైన్ మోడ్లలో అందించడాన్ని నిషేధించారు. ► ఏ విద్యాసంస్థ అయినా దానికి నిర్దేశించిన ప్రాదేశిక ప్రాంతాలకు లోబడి మాత్రమే ఓడీఎల్ సెషన్స్, కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ డెలివరీ, పరీక్షల నిర్వహణ, ప్రవేశాలను చేపట్టాలి. దాని ప్రాదేశిక ప్రాంత పరిధిలో మాత్రమే పనిచేయాలి. ► కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలు తమ ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ ద్వారా ఫ్రాంచైజీల తరహాలో నిర్వహించడాన్ని నిషేధించారు. కేవలం వాటి ప్రధాన కార్యాలయాల నుంచి మాత్రమే ఓడీఎల్ ప్రోగ్రాములను అందిస్తాయి. ► ఏదైనా విద్యాసంస్థ వీటికి భిన్నంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటే తమకు ఫిర్యాదు చేయాలని యూజీసీ సూచించింది. చెక్ చేసుకోండి ► ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రామ్‌లకు అనుమతి పొందిన విద్యాసంస్థల జాబితాను ► యూజీసీ వెబ్సైట్‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీసీ.ఏసీ.ఐఎన్/డీఈబీ’, లేదా ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లలో చూడవచ్చు. ► స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ఓడీఎల్ ప్రోగ్రామ్స్ అందించేందుకు యూజీసీ అనుమతి పొందిన సంస్థల వివరాలను ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐ ఎన్/ఎన్ఓటీఐసీఈఎస్’ లేదా హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్/ఎన్ఓటీఐసీఈఎస్.హెచ్ టీఎంఎల్’ పోర్టల్‌లో పరిశీలన చేసుకోవాలి. ► ప్రవేశం పొందేముందు యూజీసీ వెబ్‌సైట్‌లోని ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లో నోటీసుల ద్వారా తెలుసుకోవాలి. ► కోవిడ్ నేపథ్యంలో ఓడీఎల్ ప్రోగ్రామ్స్ కాలవ్యవధిని 12 నెలలకు పరిమితం చేశారు. వీటిని ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి ప్రారంభించేలా అనుమతి ఇచ్చింది. ► డిగ్రీ, పీజీ కోర్సులను ఓడీఎల్ మోడ్‌లో అందించే సంస్థలు తప్పనిసరిగా నిర్దేశిత అర్హతా ప్రమాణాలను పాటించాలి. -
అమ్మకానికి సర్టిఫికెట్లు
సాక్షి, చెన్నై: పరీక్షలకు హాజరు కాకుండానే, దూరవిద్య కోర్సుల్ని అభ్యసించిన వేలాది మంది విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్లు మంజూరు చేసిన మదురై కామరాజ్ వర్సిటీ దూర విద్యా విభాగం అధికారుల గుట్టురట్టు అయింది. సర్టిఫికెట్లను ఈ అధికారులు అమ్ముకున్నట్టు నిర్ధారణ కావడంతో ముగ్గుర్ని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్నావర్సిటీలో రీవాల్యుయేషన్లో మార్కుల మాయాజాలం ఇది వరకు వెలుగులోకి వచ్చి పెద్ద కలకలాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మదురైకామరాజ్‌వర్సిటీలో సర్టిఫికెట్ల స్కాం వెలుగులోకి రావడం మరో చర్చకు దారి తీసింది. ఏసీబీకి అందిన సమాచారం మేరకు అధికార వర్గాలు కామరాజర్ వర్సిటీపై నిఘా వేశాయి. ఇందులో ఆ వర్సిటీ దూరవిద్యా విభాగంలో నోట్లు ఉంటే చాలు సర్టిఫికెట్లు చేతికి వచ్చినట్టే అన్నట్టుగా పరిస్థితి ఉండడాన్ని గుర్తించి ఉన్నారు. దూరవిద్యా విభాగం ద్వారా ఏకంగా వేలాది మంది మంది విద్యార్థులు సర్టిఫికెట్లను పొంది ఉన్నట్టుగా విచారణలో తేలింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షల మేరకు వసూళ్లు చేసి సర్టిఫికెట్లను అమ్మకానికి పెట్టి ఉండడం తేట తెల్లమైంది. ముగ్గురు సస్పెన్షన్..విద్యార్థులపై గురి తమకు అందిన సమాచారం మేరకు ఓ వైపు ఏసీబీ విచారణను ముమ్మరం చేసింది. మరో వైపు ఆ వర్సిటీ పాలక మండలి రిటైర్డ్ న్యాయమూర్తి అక్బర్ అలీ నేతృత్వంలోని బృందం ద్వారా విచారణ చేపట్టింది. 2014 నుంచి దూర విద్యా విభాగంలో సాగిన వ్యవహారాలపై అక్బర్ అలీ బృందం దృష్టి పెట్టింది. అదే సమయంలో అక్రమాలు జరిగినట్టు, సర్టిఫికెట్లను అమ్ముకున్నట్టుగా ఏసీబీ తేల్చడంతో ఆ వర్సిటీ వర్గాల్లో కలవరం బయలుదేరింది. దూర విద్యా విభాగం అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజరాజన్, పర్యవేక్షణాధికారి సత్యమూర్తి, మరో అధికారి కార్తిక్‌సెల్వన్‌లను విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఈ ముగ్గుర్ని ఏసీబీ తమ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో అక్బర్ అలీ బృందం విచారణలో ఇప్పటివరకు అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్టు పాలక మండలి దృష్టికి చేరింది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే, సర్టిఫికెట్లను పొంది ఉన్నట్టు తేల్చారు. ఐదు వేల మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అమ్మకున్నట్టు విచారణలో వెలుగు చూసింది. దీంతో ఏసీబీ విచారణకు మరింత మార్గాన్ని చూపించే రీతిలో ఆ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తమ విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా రాజరాజన్, సత్యమూర్తి, కార్తిక్ సెల్వన్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఆ ముగ్గుర్ని తమ అదుపులోకి తీసుకుని, సర్టిఫికెట్ల అమ్మకాల వ్యవహారంలో ఉన్న మరికొంత మంది అదృశ్య శక్తులు, వాటిని కొనుగోలు చేసిన విద్యార్థుల భరతం పట్టే దిశగా ఏసీబీ దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతోంది. -
‘డిస్టెన్స్’పై యూజీసీ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) కోర్సులకు అనుమతులు మంజూరు చేసే విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు విధించింది. 2018–19 విద్యా సంవత్సరం, ఆపై కాలానికి విశ్వవిద్యాలయాలు, వాటికి అనుమతిచ్చిన కోర్సులతో యూజీసీ ఇటీవల ఒక జాబితా విడుదల చేసింది. అందులో ముఖ్యమైన కోర్సులకు సంబంధించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో సహా చాలా వర్సిటీల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ఆయా వర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియంత్రణ సంస్థల అనుమతి తప్పనిసరి ఎంబీఏ/ఎంసీఏ/బీఈడీ/ఎంఈడీ/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)/ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)/హోటల్ మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు గుర్తింపు లభించాలంటే తొలుత ఆయా కోర్సులకు సంబంధించిన నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని యూజీసీ కొత్త నిబంధనలు విధించింది. ఉదాహరణకు బీఈడీ వంటి కోర్సులను దూరవిద్యా విధానంలో ఆఫర్ చేయాలంటే యూజీసీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి కోర్సుకూ ఆయా నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు సంస్థలను నియంత్రించే విషయాన్ని సరిగా పట్టించుకోకుండా, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల విషయంలో యూజీసీ ఇలా వ్యవహరించడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త నిబంధనల వల్ల వర్సిటీ పాలనా వ్యవహారాలు గాడితప్పి, అసలు లక్ష్యాలు పక్కదారిపడతాయని వారు విమర్శిస్తున్నారు. -
దూరవిద్యలో విద్యార్థి కేంద్రిత విధానం తీసుకురావాలి
కేయూ క్యాంపస్: దూరవిద్యలో విద్యార్థి కేంద్రిత విధానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు. కాకతీయ యూనివర్సిటీ దూర విద్య కేంద్రం, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు డిస్టెన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫోకస్ ఆన్ అండర్సర్వ్డ్ కమ్యూనిటీస్ అండ్ అన్ కవర్డ్ రీజియన్స్’అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం హన్మకొండలోని కేయూ క్యాంపస్‌లో శనివారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థి కేంద్రిత విధానాన్ని కొనసాగించాల్సి ఉన్నప్పటికీ..దాన్ని ఆచరణలో పెట్టడం లేదన్నారు. దూరవిద్య సంస్థలకు న్యాక్ గుర్తింపు కోసం విధివిధానాలు రూపొందించేందుకు దేశవ్యాప్తంగా 7 సార్లు కార్యశాలలు నిర్వహించినట్లు తెలిపారు. ఇగ్నో ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లో మారుమూల ప్రాంతాల వారికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోర్సును ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో అవకాశం కల్పిస్తే ఒక సంవత్సరం 9 వేలమంది అడ్మిషన్లు రాగా.. మరో ఏడాది 18 వేల మంది అడ్మిషన్లు పొంది చదువుకున్నారన్నారు. ఇలా తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అడ్మిషన్లు చేపట్టవచ్చని సూచించారు. దూరవిద్య కోర్సుల సిలబస్, స్టడీమెటీరియల్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అలా జరగట్లేదన్నారు. ఆధునిక టెక్నాలజీ తో వెబ్సైట్ల ద్వారా కూడా సిలబస్, స్టడీమెటీరియల్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్‌వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ, వర్సిటీలు చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థలే.. అయితే వివిధ కోర్సుల నిర్వహణకు మళ్లీ రెగ్యులేటరీ బాడీస్ ద్వారా అనుమతులు తీసుకోవాలనేది సరికాదన్నారు. సమావేశంలో ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీమనో హర్, కేయూ వీసీ ప్రొఫెసర్ సాయన్న, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, దూరవిద్య కేంద్రం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పద్మలత పాల్గొన్నారు. -
‘దూర విద్య’ దందా!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దూర విద్యా కేంద్రాలు విద్యార్థులతో చెలగాటమాడుతున్నాయి. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లు నిర్వహించడానికి వీల్లేదని తెలిసినా, వాటిలో చదివే విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు రాష్ట్రంలో చెల్లకున్నా.. తమ కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. రాష్ట్ర యూనివర్సిటీల గుర్తింపుతో ఇక్కడ కొనసాగుతున్న కాలేజీలు కూడా ఈజీ మనీ కోసం అక్రమాల బాట పట్టాయి. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ఇచ్చే భారీ కమీషన్ల కోసం తమ కాలేజీల్లో దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులను మోసం చేస్తున్నాయి. ఇలాంటి స్టడీ సెంటర్లు ఒకటీ రెండూ కాదు వందల్లో ఉన్నాయి. ఒక్క నాగార్జున యూనివర్సిటీకి చెందిన స్టడీ సెంటర్లే రాష్ట్రంలో 100కు పైగా ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 20కి పైగా ఉండగా, ద్రవిడ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 40 వరకు ఉన్నాయి. పాండిచ్చేరి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు, అన్నామలై యూనివర్సిటీ, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ, వినాయక విద్యా మిషన్, మధురై కామరాజ్ తదితర యూనివర్సిటీలు కుప్పలుతెప్పలుగా తెలంగాణలో తమ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇంత జరుగుతున్నా ఉన్నత విద్యా మండలి కానీ, యూనివర్సిటీలు కానీ నోరు మెదపడం లేదు. తెలంగాణలోని స్టడీ సెంటర్లలో చదివే విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి రూ.కోట్లు దండుకుంటున్నా ఉన్నత విద్యా మండలికి చలనం లేకుండా పోయింది. రెగ్యులర్‌గా చదువుకునే స్తోమత లేక.. రాష్ట్రంలో రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లి చదువుకునే స్తోమత లేనివారే దూర విద్యా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలియక దారుణంగా నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లను రాష్ట్రంలో నిర్వహించడానికి వీల్లేదన్న విషయం ఉన్నత విద్యా మండలికి తెలుసు. అయినా వాటిని నిర్వహిస్తున్న కాలేజీలకు ఎలాంటి నోటీసులు, ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. స్టడీ సెంటర్ల నుంచి యూనివర్సిటీల అధికారులు ముడుపులు పుచ్చుకొని ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ విద్యార్థి వేరే రాష్ట్ర యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రంలో (తెలంగాణలోని) చదివిన సర్టిఫికెట్‌ను పెడితే దాన్ని తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి.. సంబంధిత నిబంధనలపై కనీస ప్రచారం చేయడం లేదు. ఉద్యోగాల్లో అలాంటి సర్టిఫికెట్లను అనుమతించవద్దని చెబుతోందే తప్ప.. ఇతర రాష్ట్ర యూనివర్సిటీల స్టడీ సెంటర్లలో చదవవద్దన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదు. దీంతో లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ సర్టిఫికెట్లను తెలంగాణలో చెల్లనివిగా పరిగణిస్తారన్న విషయం తెలియక విద్యార్థులు వాటిల్లో చేరుతూనే ఉన్నారు. బయటకు వచ్చినవి కొన్నే.. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి.. గతేడాది టీఎస్ ఐసెట్ రాసి మేనేజ్మెంట్ కోటాలో ఘట్కేసర్లోని ఓ కాలేజీలో ఎంబీఏలో చేరాడు. ఆ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల ర్యాటిఫికేషన్‌కు అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యా మండలికి వెళ్లాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆ విద్యార్థి సర్టిఫికెట్ చెల్లదంటూ ప్రవేశాన్ని తిరస్కరించారు. అలాగే భువనగిరి ప్రాంతంలో ఓ కాలేజీలో గీతమ్ విద్యా సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లో మరో విద్యార్థి డిగ్రీ చదివాడు. అతను మేనేజ్మెంట్ కోటాలో ఎంబీఏలో చేరగా.. సర్టిఫికెట్లను పరిశీలించిన ఉన్నత విద్యా మండలి అతని ప్రవేశాన్ని తిరస్కరించింది. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రంలో మరో విద్యార్థి డిగ్రీ పూర్తి చేసి.. లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్ని కూడా అధికారులు తిరస్కరించారు. ఇలా వందల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉద్యోగాల్లోనూ అలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యా మండలి తిరస్కస్తోంది. అనుమతి లేకున్నా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి వీల్లేదు. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ (ఎఫ్.ఎన్ఓ.డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. దాంతోపాటు నిబంధనల కాపీని జత చేసి పంపించారు. అవే నిబంధనలను తాము అమలు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చెబుతోంది. కానీ తెలంగాణలో స్టడీ సెంటర్ల పెట్టవద్దని ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు ఓ లేఖ రాయాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. కనీసం తమ ఆధీనంలోని కాలేజీల్లోనైనా ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్లు పెట్టకుండా కట్టడీ చేయడం లేదు. ఇవేవీ చేయకున్నా అలాంటి స్టడీ సెంటర్లలో చేరవద్దని విద్యార్థుల్లో అవగాహన కూడా కల్పించడం లేదు. మా సర్టిఫికెట్లు చెల్లుతాయి: నాగార్జున యూనివర్సిటీ తెలంగాణలోని తమ స్టడీ సెంటర్లలో చదువుకొని పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని నాగార్జున యూనివర్సిటీ అధికారులు స్టడీ సెంటర్ల నిర్వాహకులకు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు ఉమ్మడి విద్యా అవకాశాల విధానం అమల్లో ఉన్నందున తమ స్టడీ సెంటర్లు కూడా చెల్లుబాటు అవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా యూనివర్సిటీల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్న ఉన్నత విద్యా మండలి కనీసం ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలితోనైనా ఈ విషయంపై చర్చించడం లేదు. -
పీఎస్‌యూల్లో ఓపెన్, దూరవిద్య డిగ్రీలకు ఓకే
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీలో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీచేసే ఓపెన్, దూరవిద్య డిగ్రీలు, డిప్లొమాలను అంగీకరించాలని కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ)ను ఆదేశించింది. ఓపెన్, దూరవిద్య విధానంలో పొందిన డిగ్రీలు, డిప్లొమాలను పీఎస్‌యూలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి సుబ్రమణ్యం ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల విభాగం కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖపై సదరు విభాగం స్పందిస్తూ... పీఎస్‌యూల్లో బోర్డు కంటే తక్కువస్థాయి ఉద్యోగాల భర్తీని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంట్రప్రైజెస్(సీపీఎస్ఈ) చేపడతాయని పేర్కొంది. -
దూరవిద్యలో మాస్ కాపీయింగ్!
సాక్షి, హైదరాబాద్: దూర విద్య (ఓపెన్ స్కూల్) ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. పరీక్ష కేంద్రాలతో స్టడీ సెంటర్లు కుమ్మక్కై దందాకు తెరతీశాయి. విద్యార్థుల నుంచి భారీ వసూళ్లు చేసి పరీక్షల్లో చూసి రాసుకునేందుకు అవకాశం కల్పించాయి. ఈ వ్యవహారంలో ఓపెన్ స్కూళ్ల కోఆర్డినేటర్లే దళారులుగా మారి వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కోఆర్డినేటర్ తమ స్కూల్ విద్యార్థులు పరీక్ష రాసే సెంటర్ కోఆర్డినేటర్‌తో ముందే మాట్లాడుకొని ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మరికొన్ని కేంద్రాలైతే మరో అడుగు ముందుకేసి ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిర్యాలగూడ కేంద్రంగా.. మిర్యాలగూడ ప్రాంతంలోని పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ పూర్తయిన విద్యార్థులతో పరీక్ష కేంద్రం యాజమాన్యాలే ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. 10 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించాలనే నిబంధన ఉంది. అయితే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని కూడా నియమించారు. మేడ్చల్, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లోని డివిజన్ కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనూ.. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో కాపీయింగ్ వ్యవహారం భారీగా సాగుతున్నట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవారికి పదోన్నతి కావాలంటే ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 35 వేల మందికిపైగా పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రధానోపాధ్యాయుడి స్థాయి వారిని కాకుండా తమకు అనుకూలంగా ఉండే స్కూల్ అసిస్టెంట్లను జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లుగా నియమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
గీతం వర్సిటీకి స్వయంప్రతిపత్తి హోదా
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): ఉన్నత విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న గీతం యూని వర్సిటీకి అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా కల్పించింది. అలాగే కేటగిరీ– 1 విద్యా సంస్థగా గుర్తింపు ఇచ్చిందని గీతం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. ప్రసాదరావు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 60 విద్యా సంస్థలకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించగా డీమ్డ్ వర్సిటీల్లో గీతం కేటగిరీ–1 కింద స్వయంప్రతిపత్తి హోదా పొందిందన్నారు. 2007లో డీమ్డ్ వర్సిటీ హోదాను పొందిన గీతం విశాఖతోపాటు హైదరాబాద్, బెంగళూరుల్లో ప్రాంగణాలను నెలకొల్పిందని, మొత్తం 190 యూజీ, పీజీ కోర్సులను నిర్వహిస్తోందని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, మెడిసిన్, నర్సింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, సైన్స్, సోషల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో 21వేల మందికిపైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారని వివరించారు. దూర విద్య విభాగం ద్వారా 80వేల మంది వివిధ కోర్సులు చదువుతున్నారని పేర్కొన్నారు. బార్క్, డీఆర్డీవో, డీబీటీ, డీఎస్టీ వంటి వాటి సహకారంతో 150కి పైగా పరిశోధన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామన్నారు. అటానమస్ హోదాతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రారంభించొచ్చని, యూజీసీ అనుమతుల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. అటానమస్ హోదాతో ఇతర రాష్ట్రాల్లో గీతం ప్రాంగణాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని, పరిశోధన కేంద్రాలు, ఇంక్యుబేషన్ సెంటర్లను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో రష్యాలోని సెయింట్బర్గ్ మెరైన్ టెక్నికల్ విశ్వవిద్యాలయంతో కలసి నౌకా నిర్మాణం, సముద్ర వాహక నౌకల తయారీపై కోర్సులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. -
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
శాతవాహనయూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్రపౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్సారార్ ఆర్ట్స్,సైన్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన దూరవిద్య పితామహుడు గడ్డం రాంరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దూరవిద్య ద్వారా లక్షలాది మంది పేదలు ఉన్నత విద్యకు చేరువయ్యారన్నారు. రాంరెడ్డి కరీంనగర్ జిల్లాలోని మైలారం గ్రామానికి చెందినవారన్నారు. దేశంలోని అత్యున్నత యూనివర్సిటీలకు వీసీగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందుబాటులో తెస్తామన్నారు. ఇప్పుడు నిధులకు కొరత లేదని, బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ విద్యకోసం పరితపించిన వ్యక్తుల్లో రాంరెడ్డి అగ్రగణ్యుడని కొనియాడారు. రాంరెడ్డికి పద్మ అవార్డు విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. సామాన్యులకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్రం లో 500 రెసిడెన్షియల్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కోర్టు నుంచి వర్క్‌షాప్ వరకు గల రోడ్ ను రాంరెడ్డిరోడ్‌గా నామకరణం చేయనున్నట్లు తెలిపా రు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ రాం రెడ్డి యూజీసీ చైర్మన్‌గా ఉన్నప్పుడే విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపునూ ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నా రు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈ ద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ దూరవిద్య ద్వారా ఎం ద రో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రె డ్డి మాట్లాడుతూ రాంరెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం విగ్రహ కమిటీ ప్రతినిధులను సన్మానించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, గ్రంథాలయసంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, గడ్డం రాంరెడ్డి కుమారుడు గడ్డం ప్రమోద్‌రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విగ్రహ కమిటీ ప్రతినిధులు ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, మెతుకు సత్యం, రఘువీర్‌సింగ్, రెడ్డి సంఘం అధ్యక్షు డు ముద్దసాని లక్ష్మారెడ్డి, ఊట్కూరి రాదాకృష్ణారెడ్డి, ఓ పెన్ యూనివర్సిటీ సహాయక కేం ద్రం సహాయసంచాలకులు ఈ.రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దూర విద్య.. అంతా మిథ్య!
సాక్షి, హైదరాబాద్: - ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రం ద్వారా శ్రీనివాస్‌రెడ్డి డిగ్రీ చేశాడు. తెలంగాణ ఐసెట్ రాసి మేనేజ్మెంట్ కోటాలో ఎంబీఏలో చేరాడు. ర్యాటిఫికేషన్ కోసం అతని సర్టిఫికెట్లు ఉన్నత విద్యామండలికి వెళ్లగా పరిశీలించిన అధికారులు అతని సర్టిఫికెట్ చెల్లదని ప్రవేశాన్ని తిరస్కరించారు. - సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్యా కేంద్రం ద్వారా వెంకటేశ్వర్లు డిగ్రీ చదివాడు. తెలంగాణ లాసెట్ రాసి న్యాయ విద్య కోర్సులో చేరాడు. అతని ప్రవేశాన్నీ ఉన్నత విద్యామండలి తిరస్కరించింది. ఇలా ఒకరు.. ఇద్దరు కాదు వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. విద్యలోనే కాదు ఉద్యోగాల్లోనూ ఇలాంటి సర్టిఫికెట్లను ఉన్నత విద్యామండలి తిరస్కరిస్తోంది. సుప్రీంకోర్టు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దూర విద్యా కేంద్రాల టెరిటోరియల్ జూరిస్డిక్షన్–2013 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలోని రాష్ట్ర యూనివర్సిటీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టడానికి.. వాటి ద్వారా కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు 2013 ఆగస్టు 23న యూజీసీ పాలన డైరెక్టర్ విక్రమ్ సాహే లేఖ(ఎఫ్ఎన్ఓ డీఈబీ/క్యూఎంసీ/2013) రాశారు. ఈ నిబంధనను తెలంగాణ ఉన్నత విద్యామండలి పక్కాగా అమలు చేస్తోంది. ఫలితంగా అనేక మంది విద్యార్థులు వివిధ కోర్సుల ప్రవేశాల్లో తిరస్కరణకు గురవుతున్నారు. దీంతో ఇతర రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రాష్ట్రంలోని స్టడీ సెంటర్ల ద్వారా 2013 తర్వాత చదివిన చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. 50 ఇతర రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన 50 వరకు రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య వంటి కోర్సులను దూర విద్య ద్వారా అందిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే వేల కాలేజీల్లో ఆయా విద్యా సంస్థలు 150 కోర్సులను నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. వాటిల్లో 2 లక్షల మంది విద్యార్థులు వేలకు వేలు ఫీజులు చెల్లించి చదువుతున్నారు. ఏపీలోని ఓ స్టడీ సెంటర్ ద్వారా అక్కడి వర్సిటీలో చదివితే ఆ సర్టిఫికెట్ చెల్లుతుంది.. అదే వర్సిటీకి చెందిన హైదరాబాద్‌లోని దూర విద్య స్టడీ సెంటర్ ద్వారా చదివితే ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు కాదు. దీనిపై ప్రచారం లేకపోవడంతో విద్యార్థులకు తెలియడం లేదు. ఇతర రాష్ట్ర వర్సిటీలు ఆదాయం కోసం ఈ విషయాన్ని దాచిపెట్టి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగాల్లోనూ తిరస్కరణ! ఇలాంటి సర్టిఫికెట్లను విద్యా ప్రవేశాల్లోనే కాకుండా ఉద్యోగాల్లోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆ సర్టిఫికెట్లను ఉద్యోగ నియామకాల విభాగాలు తిరస్కరిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించి మరీ నిర్ణయం తీసుకుంటుండటంతో పలువురు అభ్యర్థులు ఉద్యోగాల్లోనూ తిరస్కరణకు గురి కావాల్సివస్తోంది. యూజీసీ నిబంధనల ప్రకారమే యూజీసీ దూర విద్య, ఆఫ్ క్యాంపస్‌ల టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర వర్సిటీ మరో రాష్ట్రంలో దూర విద్య కేంద్రాలను ఏర్పాటు చేసి కోర్సులను నిర్వహించడానికి వీల్లేదు. అందుకే అలా వచ్చే విద్యార్థుల సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాం. ఇప్పటికైనా అలాంటి వాటిల్లో విద్యార్థులు చేరవద్దు. రెగ్యులర్‌గా చదువుకునే అవకాశం లేని వారు తెలంగాణ రాష్ట్ర వర్సిటీల దూర విద్యా కేంద్రాల ద్వారా చదువుకోవాలి. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
పబ్లిగ్గా మాస్ కాపీయింగ్!
సాక్షి, విశాఖపట్నం: శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి దూరవిద్యలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పబ్లిగ్గా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. పుస్తకాలు చూసి రాసుకునే సదుపాయాన్ని అక్కడ ఇన్విజిలేటర్లే కల్పిస్తున్నారు. ఇది బహిరంగంగానే జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఐదు రోజుల కిత్రం ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా కె.కోటపాడు టీఎస్సార్ జూనియర్ కాలేజీని సెంటరుగా కేటాయించారు. దాదాపు 400 మంది అభ్యర్థులు ఈ కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు. బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ గ్రూపులకు సంబంధించి ఫిజిక్స్, స్టాటస్టిక్స్, కామర్స్, ఎకనామిక్స్ తదితర పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్కొక్క అభ్యర్థి రూ.20 వేలు చెల్లించే ఒప్పందంతో వారికి నేరుగా పుస్తకాల్లో చూసి పరీక్షలు రాసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలి సింది. ఒప్పందంలో భాగంగా ఆయా అభ్యర్థులు నిర్భీతిగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న వైనాన్ని కొంతమంది కెమెరాల్లో బంధించారు. వాటిని శనివారం రాత్రి మీడియాకు విడుదల చేశారు. సంబంధిత యూనివర్సిటీ నుం చి పరిశీలకులుగా ఇద్దరు అధికారులు వచ్చారు. వారు విశాఖలోని ఒక స్టార్ హోటల్లో బస చేసినట్టు చెబుతున్నారు. వారి కనుసన్నల్లోనే ఈ కాపీయింగ్ వ్యవహారమంతా జరుగుతోంది. మరో మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మాస్‌కాపీయింగ్‌పై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ మాస్‌కాపీయింగ్‌పై శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజగోపాల్‌ను వివరణ కోరడానికి ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
ట్రైనింగ్ లేని టీచర్లు!
సాక్షి, హైదరాబాద్: బోధన ఒక ప్రత్యేక నైపుణ్యంతో కూడిన విధానం.. బోధించే తీరుపైనే విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందడం, మానసిక వికాసం ఆధారపడి ఉంటాయి.. అలాంటి అత్యుత్తమ బోధన కోసం ప్రత్యేక శిక్షణ అవసరం. కానీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు చేయకుండానే పాఠశాలల్లో బోధిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ 17,813 మందికిపైగా శిక్షణ పొందనివారు టీచర్లుగా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని 11,500 వరకు ఉన్న ప్రైవేటు స్కూళ్లలో 3,905 మంది మాత్రమే శిక్షణ పొందని టీచర్లు ఉన్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ వాటిలో పనిచేస్తున్న 17,813 మంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) దూర విద్య విధానంలో ‘డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్)’చదివేందుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అంటే వారంతా ఉపాధ్యాయ శిక్షణ పొందకుండానే బోధిస్తున్నట్లు తేలింది. విస్మయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో లక్షల మంది ఉపాధ్యాయ శిక్షణ పొందకుండానే బోధిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. శిక్షణ పొందనివారు పాఠశాలల్లో బోధించడానికి వీలు లేదని, ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్రాల వారీగా లెక్కలను సేకరించింది. అయితే వారంతా ఎప్పుడో స్కూళ్లలో చేరి బోధిస్తున్నందున.. బయటకు వెళ్లి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను పూర్తి చేయాలనడం సరికాదన్న ఆలోచనతో కేంద్రమే వారి దూర విద్యలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసే అవకాశం కల్పించింది. అన్ట్రైన్డ్ టీచర్లంతా నిర్ణీత ఫీజు చెల్లించి ఎన్ఐవోఎస్కు దరఖాస్తు చేసుకోవాలని.. వారికి ప్రత్యేక టీవీ చానళ్ల ద్వారా పాఠాలు బోధించడంతో పాటు స్టడీ మెటీరియల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అయితే వారంతా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది. లేకపోతే ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ చదివి నిర్ణీత శాతం మార్కులు సాధించాలని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా దూరవిద్యలో డీఎడ్ చేసేందుకు 14,97,859 మంది దరఖాస్తు చేసుకున్నారు.. అందులో తెలంగాణ నుంచి 17,813 మంది, ఏపీ నుంచి 6,338 మంది ఉన్నారు. ఇక ఇంటర్ 50 శాతం మార్కు లు లేని వారు రాష్ట్రంలో మరో 10 వేల వరకు ఉంటారని అంచనా. వారంతా దూర విద్యలో ఇంటర్ చదివేందుకు సిద్ధమవుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో లక్షకు పైనే.. శిక్షణ పొందని టీచర్లు అత్యధికంగా బిహార్ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రాష్ట్రం నుంచి దూరవిద్య విధానంలో డీఎడ్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారు ఏకంగా 2,85,234 మంది ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి 1,95,353 మంది ఉండగా, మధ్యప్రదేశ్ నుంచి 1,91,510 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 1,69,008 మంది, అసోం నుంచి 1,51,950 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
చేజారిన ‘డెబ్’ గుర్తింపు
–2016–17 విద్యాసంవత్సరం దూరవిద్యకు నోటిఫికేషన్ లేనట్లే –30 వేల మంది విద్యార్థులు పొరుగు వర్సిటీల్లో ప్రవేశం - ఎస్కేయూకు రాబడి నష్టం రూ. 25 కోట్లు – అధికారుల తీరుపై విమర్శలు ఎస్కేయూ : నిధుల సమీకరణకు అంతర్గత వనరులు పెంచుకొని తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమం. అందుకు తగ్గట్టు బోధన, బోధనేతర ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి గ్రాంట్ రూపంలో రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్కేయూకు సింహభాగం ఆదాయం దూరవిద్య విధానం ద్వారా వస్తోంది. ఈ ఆదాయం నుంచి అభివృద్ధి పనులతోపాటు, వర్సిటీ స్వయంగా చేపట్టిన నియామకాలకు సంబంధించిన జీతాలూ చెల్లిస్తున్నారు. ఇంత ప్రాముఖ్యమున్న దూరవిద్య విభాగానికి సకాలంలో డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో , న్యూఢిల్లీ ) గుర్తింపు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీనివల్ల దూరవిద్య ద్వారా అభ్యసించిన విద్యార్థులకు అందజేసే సర్టిఫికెట్లకు గుర్తింపు లభిస్తుంది. మీనమేషాలు.. గత 17 సంవత్సరాల కిందట దూరవిద్య విభాగాన్ని ఎస్కేయూలో ఏర్పాటు చేశారు. 2012, 13,14 సంవత్సరాల్లో దూరవిద్య విభాగం అడ్మిషన్లు గణనీయమైన స్థాయికి చేరాయి. అదేస్థాయిలో ఆదాయం పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 220 అధ్యయన కేంద్రాల ద్వారా ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి స్ధానంలో నిలిచిన దూరవిద్య విభాగానికి డెబ్ గుర్తింపునకు దరఖాస్తు చేయడంలో మీనమేషాలు లెక్కించారు. దీంతో 2016–17 విద్యాసంవత్సరానికి గుర్తింపురాక 30 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లకు బ్రేక్ పడింది. ఫలితంగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో అందాల్సిన రూ. 25 కోట్ల రాబడిని వర్సిటీ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బలోపేతంగా ఉన్న దూరవిద్య విభాగం క్రమంగా బలహీనమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొరుగు వర్సిటీలకు తరలిన విద్యార్థులు 2016–17 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేయడం వేల మంది విద్యార్థులు పొరుగునున్న వర్సిటీల వైపు దృష్టి సారించారు. అక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే వర్సిటీలో పీజీ అయితే రెండు సంవత్సరాలు, డిగ్రీ అయితే మూడు సంవత్సరాలు ఫీజులను ఎస్కేయూ కోల్పోయినట్టయింది. కాగా మేల్కొన్న అధికారులు 2017–18 విద్యాసంవత్సరానికి డెబ్ అనుమతి కోసం ప్రయత్నించగా వచ్చే వారం డెబ్ అధికారులు ఎస్కేయూకు రానున్నారు. అనుమతి లభిస్తే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ?
– జనవరిలో ముగిసిన దూరవిద్య పరీక్షలు – ఫలితాల విడుదలలో జాప్యం – ఐసెట్ కౌన్సెలింగ్‌కు ఎదురుకానున్న ఇబ్బందులు ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విధానం ద్వారా వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ రెండు, మూడో సంవత్సరం పరీక్షలు సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే జనవరిలో నిర్వహించారు. నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించినప్పటికీ ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. ఎదురుచూపు.. డిగ్రీ కోర్సులకు సంబంధించి రెండు, మూడు సంవత్సరాల పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 వేల మంది రాశారు. ఇప్పటికే ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు అయింది. మరో వైపు వర్సిటీలలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగుతున్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే స్కూసెట్–2017 ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముగిసిన రెండు రోజులకే ఆయా వర్సిటీలు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ ఫలితాలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అకడమిక్ క్యాలెండర్ ఇయర్ గాడిలో పడేనా? రెగ్యులర్ కోర్సులకు నిర్వహించినట్లే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన దూరవిద్య విధానలంలో కూడా అమలు చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అకడమిక్ క్యాలెండర్ ఇయర్ గాడిలో పడితేనే విద్యార్థులకు విద్యాసంవత్సరం వృథా కాదని చెబుతున్నారు. త్వరలో డిగ్రీ ఫలితాలు ప్రకటిస్తాం.. ఐసెట్ కౌన్సెలింగ్‌లోపే దూరవిద్య డిగ్రీ ఫలితాలను ప్రకటిస్తాం. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి అయింది. మార్కుల నమోదును పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాం. రెగ్యులర్ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు ఈ నెల 30 లోపు విడుదల చేయనున్నాం. విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సకాలంలోనే సర్టిఫికెట్లు జారీ చేస్తాం. – జే.శ్రీరాములు, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్, ఎస్కేయూ. -
ఉన్నత విద్య దూరం
- 2016 - 17 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదలపై మీనమేషాలు - గాడితప్పిన అకడమిక్ క్యాలెండర్ ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం యూజీ, పీజీ కోర్సుల పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయానుగుణంగా లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందతున్నారు. పీజీ కోర్సు కాలవ్యవధి రెండేళ్లయినప్పటికీ సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో కోర్సు పూర్తి కావడానికి మూడేళ్లు పడుతోంది. 34వేల మంది విద్యార్థులకు తప్పని నిరీక్షణ 2015 - 16 విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు ఇప్పటిదాకా నిర్వహించలేదు. 2016 ఆగస్టులోగా పరీక్షలు పూర్తి కావాల్సి ఉన్పప్పటికీ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల్లో 34వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారికి ఇప్పటికీ ఫస్టియర్ పరీక్షలే పెట్టలేదు. కనీసం ఎప్పుడుంటాయనే విషయంపైనా ఎస్కేయూ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకలేదు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. నూతన నోటిఫికేషన్ ఎప్పుడో..! ఎస్కేయూకు సింహభాగం ఆదాయం దూరవిద్య విభాగం ద్వారానే వస్తోంది. ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల మీద ఆధారపడకుండా స్వతహాగా ఆదాయం చేకూర్చుకునే మార్గాలలో దూరవిద్య ప్రధానమైనది. పొరుగు వర్సిటీలు దీనిని కీలకమైన విభాగంగా పరిగణించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా గణనీయమైన ఆదాయం వస్తోంది. గత నాలుగు విద్యాసంవత్సరాల్లోనూ వర్సిటీకి నిధుల పరంగా దూరవిద్య ప్రధానపాత్ర పోషించింది. కానీ అకడమిక్ క్యాలెండర్ క్రమంగా గాఢి తప్పడంతో విద్యార్థులకూ, వర్సిటీకి నష్టం వాటిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2016 - 17 విద్యాసంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంతవరకు విడుదల కాలేదు. -
గాడి తప్పిన దూరవిద్య
–పర్యవేక్షణలో అధికారులు విఫలం –పరీక్షల షెడ్యూల్ ప్రకటించని వైనం ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం గాడి తప్పింది. పరీక్షల షెడ్యూల్ ప్రకటన, నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించడంలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో పూర్తి చేసినా ఇంతవరకు ఫలితాలు ప్రకటించలేదు. పీజీ రెండో సంవత్సరం పరీక్షలు, డిగ్రీ రెండు , మూడో సంవత్సరం పరీక్షలు ఎపుడు నిర్వహిస్తారో తెలియదు. పీసీపీ తరగతులు నిర్వహించని వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో 233 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులు డిగ్రీ కోర్సును అభ్యసిస్తున్నారు. ద్వితీయ, తతీయ విద్యార్థులకు తప్పనిసరిగా పర్సనల్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్‌ను ప్రతి వారాంతంలో నిర్వహించాలి. దీనిని దూరవిద్య అధికారులు పర్యవేక్షించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తరగతుల నిర్వహణకు ఒక్కో డిగ్రీ అడ్మిషన్ మీద 20 శాతం ఖర్చును అధ్యయన కేంద్రాల వారికి దూరవిద్య అధికారులు నేరుగా చెల్లిస్తున్నారు. కానీ ఎలాంటి తరగతులు నిర్వహించలేదు. పీసీపీ తరగతులు ఉన్నాయన్న సంగతి విద్యార్థులకు కూడా తెలియకపోవడం ఇందుకు నిదర్శనం . కోర్సులు లేకున్నా ప్రాక్టికల్ పరీక్షలు .. దూరవిద్య అధ్యయన కేంద్రాల నిర్వాహకులు పీసీపీ తరగతులు, ప్రాక్టికల్ , రాత పరీక్షలు ఏ డిగ్రీ కళాశాలో నిర్వహిస్తారో ముందే వెల్లడించాల్సి ఉంది. కొన్ని డిగ్రీ కళాశాల్లో బీఎస్సీ కోర్సులు లేకపోయినప్పటికీ సైన్స్ పరీక్షలకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండడం వివాదాలకు దారితీస్తోంది. అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు వర్సిటీ దూరవిద్య అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉన్నా, పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రాక్టికల్ మార్కులు నిర్ధారించి నేరుగా దూరవిద్య విభాగానికి అధ్యయన కేంద్రాల వారు పంపుతున్నారు. ఈ పరీక్షలకు ఎంత విశ్వసనీయత ఉందనే అంశంపై అనుమానాలు లేకపోలేదు. దూరవిద్య ఆదాయంలో 20 శాతం అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు చెల్లిస్తున్నపుడు కనీస ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత దూరవిద్య అధికారులపై ఉందని పులువురు అభిప్రాయపడుతున్నారు. -
పక్కా చూసిరాత !
–ఎస్వీ యూనివర్సిటీ దూర్యవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ – శంకరాస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో బరితెగింపు – పరీక్ష కేంద్రానికి తాళం వేయించి చూసిరాత – వర్సిటీ, పోలీసు,అధికారులను మేనేజ్ చేశామంటున్న వైనం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. ఇటీవల మహానందిలోని గాజులపల్లె భారతీ డిగ్రీ కళాశాలలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ మీడియా కంట పడిన నేపథ్యంలో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఎవరు లోపలికి రాకుండా కర్నూలులోని శంకరాస్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రానికి తాళం వేసి లోపల బుక్కులు పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయిస్తున్నారు. అంతేకాక మాస్ కాపీయింగ్‌కు వర్సిటీ, స్థానిక పోలీసులు, రెవెన్యూ, ఇతర అధికారులే అనుమతి ఇచ్చినట్లు వారు చెబుతుండడం గమనార్హం. మోహన్‌రెడ్డిదే హవా! శంకరాస్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎస్వీ దూర విద్య పరీక్షలకు ఆ కళాశాల డైరక్టర్ హరికిషన్ చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. ఈయన పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, ఈ కేంద్రం పరీక్షల కో ఆర్డినేటర్‌గా ప్రతిభ మోడల్ స్కూల్ యాజమాని బావమరిది మోహన్‌రెడ్డి ఉన్నారు. ఈయనే విద్యార్థుల నుంచి అడ్మిషన్ల కోసం, మాస్ కాపీయింగ్ కోసం డబ్బులను వసూలు చేస్తాడు. మాస్ కాపీయింగ్ కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా పరీక్షా కేంద్రం వద్దనే ఉండి ఎవరినీ లోపలకు వెళ్లనీయకుండా చూస్తాడు. ఏకంగా గేటుకు తాళం వేశాడు. మీడియాను సైతం నిలువరించే ప్రయత్నం చేస్తాడు. మొదట నోటితో భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. మాట వింటే ఒకే. లేకుంటే ఏమైన ఉంటే మాట్లాడుదాం..రండి అంటూ ఆఫర్ ఇస్తాడు. కాగా, ప్రవేశాలు చేయించుకునే కో ఆర్డినేటర్ పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చా అంటే సమాధానం చెప్పేనాథుడు కరువయ్యాడు. ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే పరీక్షలను ఎక్కడైనా కింది ఫ్లోర్లో నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం కింది ఫ్లోర్లను వదిలి రెండో ఫ్లోర్లో నిర్వహిస్తున్నారంటే మాస్‌కాపీయింగ్ కోసమేనని తెలుస్తోంది. ఎందుకో తనిఖీ చేసే వర్సిటీ అధికారులు మామూళ్లకు తలొగ్గి ముఖం చాటేశారు. దీంతో కేంద్రంలో బుక్కులు పెట్టి పరీక్షలు రాస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. మీడియాను తికమక పెట్టిన వైనం.. శంకరాస్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎస్వీ దూర విద్య పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జోరుగా జరుగుతుందనే సమాచారంతో ఆదివారం సాక్షి బందం అక్కడికి వెళ్లింది. అప్పటికే పరీక్ష కేంద్రానికి తాళం వేసి ఉన్నారు. ఆ పక్కనే లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా కోఆర్డినేటర్ మోహన్‌రెడ్డి ఉన్నారు. అయినా, సాక్షి బందం లోపలి వెళ్లేందుకు ప్రయత్నించగా మొదట గట్టి అరుపులతో భయపెట్టేందుకు కోఆర్డినేటర్ చూశాడు. మీడియా అని చెప్పగా మొదట చీఫ్ సూపరింటెండెంట్ అనుమతి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆయన దాదాపు 15 నిమిషాల తరువాత మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడి లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు..మాకు తెలుసు అంటూ మాట విప్పాడు. ఏమైన ఉంటే మాట్లాడుదామని పిలిచాడు. ఇలా దాదాపు మీడియా పరీక్ష కేంద్రం ఆవరణలోకి వెళ్లిన ఆరగంటకు గేటు తాళం తీశారు. అనంతరం పరీక్షలను రాస్తున్న విద్యార్థుల దగ్గరకు తీసుకెళ్లారు. ఈలోపే విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకాలు తీసేసి ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగడం లేదని కలరింగ్ ఇచ్చారు. అయినా, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన పుస్తకాలు ‘సాక్షి’కంట పడ్డాయి. -
ఏఎన్‌యూ ‘దూరవిద్య’లో కుంభకోణం
* రూ.5 లక్షల మేర టోపీ పెట్టిన వ్యక్తి * నకిలీ చలనాలతో జగన్మాయ * అనధికారికంగా అడ్మిషన్ ఫీజు వసూలు చేసిన వైనం ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రంలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దూరవిద్యాకేంద్రంలో అడ్మిషన్ పొందేందుకు విద్యార్థులు చెల్లించే ఫీజును వసూలు చేసి చలానాల రూపంలో దూరవిద్యాకేంద్రంలో జమచేసే ఓ వ్యక్తి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని ఓ డిగ్రీ కాలేజీలో గతంలో పనిచేసిన ఓ వ్యక్తి విద్యార్థుల వద్ద నుంచి అడ్మిషన్, పరీక్ష ఫీజులు తీసుకుని ఏఎన్‌యూలో చెల్లిస్తూ ఉండేవాడు. ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రానికి ఏ విధమైన అధ్యయన కేంద్రం (స్టడీ సెంటర్) లేకపోయినప్పటికీ తనకున్న పరిచయాలతో విద్యార్థుల అడ్మిషన్లు సేకరించి అనధికారికంగా ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రంలో ఫీజులు చెల్లించటం వంటి వ్యవహారాలు కొనసాగించే వాడు. ఈ క్రమంలో ఇటీవల అతను బ్యాంక్‌లో ఒక ఆన్లైన్ చలానా చెల్లించి తరువాత యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ఫీజుల నమోదు కేంద్రంలో సమర్పించే సమయానికి అందులో ఉన్న చెల్లింపులకు సంబంధించిన అంకెలు ఎక్కువగా మార్పు చేసినట్లు తెలిసింది. ఈ చలానాలను దూరవిద్యాకేంద్ర సిబ్బంది కంప్యూటర్లో నమోదు చేసిన తరువాత అకౌంట్ల పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతను అంకెలు మార్పు చేసిన చలానాల్లో సుమారు 5 లక్షల రూపాయలు వరకు యూనివర్సిటికి నష్ట వాటిల్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న దూరవిద్యాకేంద్రం అధికారులు కుంభకోణం అంశాన్ని నిగ్గుతేల్చి అతనిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కుంభకోణానికి అతనే పాల్పడ్డాడా? లేక దూరవిద్యాకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వారెవరైనా అతనికి పరోక్షంగా సహకారం అందించారా? అనే అంశాలపై కూడా దూరవిద్యాకేంద్రం అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. దీనిపై వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా నకిలీ చలానాల కుంభకోణం తన దృష్టికి రాలేదన్నారు. -
ఎస్వీయూ దూరవిద్యా పరీక్ష వాయిదా
తిరుపతి, యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలోని 59 కేంద్రాల్లో జరుగుతున్న పీజీ, యూజీ పరీక్షల్లో భాగంగా శనివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు దూరవిద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంపీ.నరసింహరాజు తెలిపారు. శనివారం ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేశామన్నారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. వాయిదా పడిన పరీక్షను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు. -
ఎడ్యు న్యూస్
దూరవిద్యలో బీఈడీ కోర్సు 2016 విద్యా సంవత్సరం నుంచి అన్ని వర్సిటీల్లో దూరవిద్య ద్వారా బీఈడీ, ఎంఈడీలను కొత్త సిలబస్, నిబంధనలతో పునఃప్రారంభించడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ఆమోదం తెలిపింది. గతేడాది దూరవిద్య విధానాన్ని ఎన్సీటీఈ తాత్కాలికంగా నిలిపివేసింది. 2015 ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం దూరవిద్యలో బీఈడీ చదవాలంటే రెండేళ్ల బోధన అనుభవం ఉండాలి. -
దూర విద్యకు ‘లైవ్ టెక్నాలజీ’!
సెల్ఫోన్లో ప్రొఫెసర్ల క్లాసులు... సందేహాల నివృత్తి పరీక్షలు, ఫలితాలు, ఫీజుల వంటి అడ్మినిస్ట్రేషన్ సేవలు కూడా.. రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టిన హెచ్ఎన్ఐలు ‘స్కూల్‌గురు’ వ్యవస్థాపకుడు శంతను రూజ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో; స్కూల్లో చదువులంటే టీచర్లుంటారు, తరగతులుంటాయి కాబట్టి సమస్యలేదు. మరి దూర విద్య సంగతేంటి? అడ్మిషన్ తీసుకోగానే ఆ విద్యా సంవత్సరానికి కావాల్సిన పుస్తకాలు అక్కడికక్కడే విద్యార్థుల చేతికిచ్చేస్తారు. అంతే!! విద్యార్థే సొంతగా చదువుకోవాలి. కొన్నిచోట్ల... అదీ పరీక్షలకు ముందు... వారానికోసారి సందేహాల నివృత్తి కోసం క్లాసులు నిర్వహిస్తుంటారు. అవి విద్యార్థులకు పూర్తిగా పనికొస్తాయని మాత్రం చెప్పలేం. అందుకే దూర విద్యలో విద్యార్థుల సంఖ్యే కాదు.. ఉత్తీర్ణత శాతమూ తక్కువే ఉంటుంది. ఈ టెక్నాలజీ శకంలోనూ ఇలా కొనసాగాల్సిందేనా? ఈ ప్రశ్నకు సమాధానమే స్కూల్‌గురు. పేరులోనే దూర విద్య కానీ... చదువులు, టెక్నాలజీ విషయంలో ఏమాత్రం కాదని నిరూపిస్తోంది ఈ సంస్థ. 16 ఏళ్ల పాటు టెక్నాలజీ కంపెనీలు నడిపి... ఆ తరవాత విద్య వైపు వచ్చారు దీని వ్యవస్థాపకుడు శంతను రూజ్. 2012 డిసెంబర్లో ముంబై కేంద్రంగా ఆరంభించిన ఈ సంస్థ గురించి ‘సాక్షి’ స్టార్టప్ డైరీ ప్రతినిధితో శంతను మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 1997లో పారడైన్ అనే టెక్ కంపెనీని ప్రారంభించా. తర్వాత బ్రాడ్లైన్ పేరిట ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. 16 ఏళ్ల పాటు ఈ రెండూ నడిపించా. అప్పుడు అనిపించింది.. విదేశాలతో పోలిస్తే మన విద్యా విధానంలో టెక్నాలజీ వాడకం తక్కువని. డిస్టెన్స్‌లో అయితే మరీను!! ఆ ఆలోచనతోనే స్కూల్‌గురును ఆరంభించాం. ప్రస్తుతం మా సంస్థ 8 రాష్ట్రాల్లో 12 యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తోంది. గుంటూరులోని నాగార్జున వర్సిటీ, తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ, హైదరాబాద్‌లోని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని వివిధ వర్సిటీలతో కలిసి పనిచేస్తున్నాం. పాఠ్యాంశాలను ఇంగ్లిష్తో పాటుగా 9 మాతృభాషల్లో అందిస్తున్నాం. ఎలా పనిచేస్తుందంటే.. ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్ తీసుకోగానే విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలతో పాటు స్కూల్‌గురు రూపొందించిన ఓ పెన్‌డ్రైవ్‌ను కూడా ఇస్తారు. దీన్ని సెల్ఫోన్లో గానీ, డెస్క్‌టాప్‌లో గానీ ఇన్సెర్ట్ చేయగానే యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో నుంచి సంబంధిత పాఠ్యాంశాలపై ప్రొఫెసర్ల క్లాసులను వీడియోతో సహా చూడొచ్చు. సందేహాలొస్తే నేరుగా ప్రొఫెసర్లతో లైవ్ చాట్ చేయవచ్చు. ఆయా వర్సిటీలకు సంబంధించిన ఫీజులను నేరుగా ఆన్లైన్ ద్వారా చెల్లించొచ్చు. పరీక్షల తేదీలు, ఫలితాలు, వర్సిటీ కార్యక్రమాలన్నీ నేరుగా సెల్‌ఫోన్ నుంచే తెలుసుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది. దీంతో మనం ఎక్కడికెళ్లినా యాప్ ద్వారా చదువుకునే వీలుంటుంది. ఇందుకోసం విద్యార్థులు ఎలాంటి ఛార్జీ చెల్లించనక్కర్లేదు. వర్సిటీలు తాము వసూలు చేసే ఫీజులో 25 శాతం సొమ్మును స్కూల్‌గురుకు చెల్లిస్తాయి. 10 మిలియన్ డాలర్లపై దృష్టి.. ఈ ఏడాది అక్టోబర్‌లో నిధులు సమీకరించాం. ఇండియా, అమెరికాలకు చెందిన ముగ్గురు అధిక నెట్‌వర్త్ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐలు) కలిసి రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టారు. మరో మూడు నెలల్లో 10 మిలియన్ డాలర్లను సమీకరిస్తున్నాం. వీటితో కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, హరి యాణాలతో పాటు ఆఫ్రికాలోని పలు యూనివర్సిటీలకూ విస్తరిస్తాం. ఈ మేరకు అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. దూర విద్యా కేంద్రంలో చదివే విద్యార్థికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కూడా అందించాలని నిర్ణయించాం. ప్రస్తుతం బెంగాల్‌లోని నేతాజీ సుభాష్ ఓపెన్ వర్సిటీలో 16 రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందిస్తున్నాం. ఈ విధానాన్ని మిగతా వర్సిటీలకూ విస్తరిస్తాం. రూ.15 కోట్ల టర్నోవర్ ప్రస్తుతం సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు స్కూల్‌గురు సేవల్ని వినియోగించుకుంటున్నారు. వచ్చే రెండేళ్లలో 15 లక్షల మంది విద్యార్థులకు చేరాలనేది మా లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో 150 మంది ఉద్యోగులున్నారు. రెండు నెలల్లో మరో 150 మందిని తీసుకుంటాం. గతేడాది రూ.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ఈ ఏడాది రూ.15 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. -
దూరవిద్య ఫలితాలు విడుదల
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) అక్టోబర్‌లో నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియెట్ దూరవిద్య సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఏపీఓఎస్ఎస్ డెరైక్టర్ పి.పార్వతి మంగళవారం విడుదల చేశారు. అక్టోబర్ 13 నుంచి 27వ తేదీ వరకూ జరిగిన ఎస్సెస్సీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 8,497మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 4,190 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఎస్సెస్సీలో 49.31 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వివరించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరైన 11,779 మందిలో 6,816 మంది ఉత్తీర్ణులయ్యారని, 57.87 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. మార్కుల మెమోలను సంబంధిత ఏపీఓఎస్ఎస్ స్టడీ సెంటర్లకు 10 రోజుల్లో పంపుతామని తెలిపారు. జవాబు పత్రాల రీకౌంటింగ్‌కు ఎస్సెస్సీలో ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ రూ.200, రీవెరిఫికేషన్‌తోపాటు ఫొటోస్టాట్ జవాబు పత్రాన్ని పొందేందుకు ఎస్సెస్సీలో సబ్జెక్టుకు రూ.వెయ్యి, ఇంటర్‌కు రూ. 600 వంతున ఫీజును ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీ లోపు చెల్లించి దరఖాస్తు చేయాలని సూచించారు. ఫలితాల కోసం www.apopenschool.org, www.schools-9.com, www.manabadi.com వెబ్సైట్లలో చూడొచ్చని తెలిపారు. -
ఏయూలో డిస్టన్స్ బీఈడీ సీట్లు పెంపు
విశాఖపట్నం (ఏయూ క్యాంపస్) : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్యను పెంచినట్లు వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు. సోమవారం ఉదయం అకడమిక్ సెనేట్ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సిటిఈ) దూరవిద్యలో అత్యధికంగా 500 ప్రవేశాలు జరిపే విధంగా అనుమతిని ఇచ్చిందన్నారు. దీని ద్వారా నాణ్యమైన బీఈడీ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. రెండేళ్ల అధ్యాపక వృత్తి అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. త్వరలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్నవారు దీనికి అర్హులన్నారు. రెండేళ్ల బీఈడి కోర్సుకు అవసరమైన సిలబస్ సిద్దం చేయడం జరిగిందని చెప్పారు. నిపుణులైన అధ్యాపకులతో దూరవిద్య కేంద్రం అధ్యయన కేంద్రాల ద్వారా సైతం శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు. ఏడాదికి రెండు పర్యాయాలుగా 45 రోజుల పాటు ప్రత్యేక బోధన, శిక్షణ తరగతులు చేపడతామని వెల్లడించారు. ఈ కోర్సును నిర్వహించడం ద్వారా వర్సిటీకి ఆధారం, ప్రతిభావంతులకు ఉపాధిని కల్పించడం సాధ్యపడుతుందన్నారు.పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కోర్సును నిర్వహిస్తామన్నారు. కేవలం 265 మంది విద్యార్థులతో ప్రారంభమైన దూరవిద్యా కేంద్రం నేడు 52 కోర్సులతో 80 వేల మందికి విద్యను చేరువ చేస్తోందని వీసీ తెలిపారు. -
ఇంటి నుంచే తెలుగులో పాఠాలు
గుంటూరు: ఇంటి నుంచే దృశ్య, శ్రవణ విధానంలో దూరవిద్యను అభ్యసించే సదుపాయం త్వరలోనే చేరువ కానుందని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ పార్వతి తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన వర్చువల్ ఓపెన్ స్కూలింగ్ సదస్సుకు హాజరై వచ్చిన ఆమె మంగళవారం సాక్షి ప్రతినిధితో విశేషాలు పంచుకున్నారు. వివిధ పనుల్లో ఉన్నవారు తరగతులకు హాజరుకాలేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (ఎన్ఐఓఎస్) ఆన్లైన్లో పాఠాలను ఉంచి నెట్ ద్వారా చదువుకునే వీలు కల్పించాలని నిర్ణయించినట్టు పార్వతి తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో పాఠాలు పెట్టినప్పటికీ అవి ఆంగ్లంలో ఉండడం వల్ల అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీన్ని గుర్తించిన ఎన్ఐఓఎస్ ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తెలుగులో పాఠాలు చదువుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. -
దూరవిద్య బీఈడీలో 112 సీట్లు మిగులు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య బీఈడీ కోర్సులో 112 సీట్లు మిగిలినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో 500 సీట్లకు గాను 388 సీట్లు భర్తీ అయినట్లు చెప్పారు. మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. మే 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. -
ఓయూ దూరవిద్య ఎంబీఏ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఓయూ దూరవిద్య ఎంబీఏ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షలతో పాటు ఎంబీఏ రెగ్యులర్ కోర్సు 3వ సెమిస్టర్ ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో ఉంచినట్లు అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ నవీన్ తెలిపారు. -
'బీఈడీ' దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి దూరవిద్యా కేంద్రం వారు బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ రేణుకాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న మహిళా ఉపాధ్యాయులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు 11, 12, 13వ తేదీలలో మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో బయోడేటాతో హాజరు కావాలన్నారు. వివరాల కు 98850 24269, 80194 05275 నంబర్లలో సంప్రదించవచ్చు. దరఖాస్తు పొందుటకు www.spmvv.ac.in. వెబ్సైట్లో లాగిన్ కావచ్చు. -
యువ రైతులకు దూరవిద్యలో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగంలో నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులను రైతులకు వివరించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ నడుం బిగించింది. దూర విద్య ద్వారా యువ రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ఈ కోర్సును ప్రారంభించనుంది. ‘తెలంగాణ యువ రైతు సాగుబడి’ పేరుతో ఈ దూరవిద్య సర్టిఫికేట్ కోర్సును అందిస్తారు. రైతుల్లో ఆర్థిక పరిపుష్టిని పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. యూనివర్సిటీతోపాటు ఇతర వ్యవసాయ అనుబంధ శాఖలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. -
చెరకు సీజన్లో ‘బడి’ని వదిలేస్తున్న గిరిజన విద్యార్థులు
జోగిపేట మార్కెట్ గంజ్ ఆవరణ.. సేదతీరుతున్న గిరిజన కుటుంబాలు..పుల్కల్ మండలంలో చెరకు కొట్టేందుకు వెళుతూ మార్గమధ్యలో వారు ఆగారు. అలా ఆగిన వారిని ‘సాక్షి’ పలకరించింది. ఆ వలసజీవులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పిల్లల్ని పాఠశాలకు పంపాలని ఉందని..అయినా తాము ఒక చోట పిల్లలు మరోచోట కష్టమనే ఇలా వెంట తీసుకె ళ్తున్నామన్నారు. చదువు మానేసిన బడిపిల్లల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మానేసిన బడిపిల్లల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చెరుకు సీజన్లో గిరిజన పిల్లలు వారి చదువులకు తప్పనిసరి పరిస్థితుల్లో దూరం అవుతున్నారు. వీరి భవిష్యత్తుపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావంతులు అంటున్నారు. ప్రతి సీజన్లో ఇలా విద్యకు దూరం కావడం వల్ల భవిష్యత్తులో వారు పూర్తి స్థాయిలో విద్యావంతులు కావడానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చెరకు సీజన్లో గిరిజనులు తమ కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తరలివెళుతుంటారు. అయితే ఇంట్లోని వారందరూ నెలల పాటు ఉండరు కాబట్టి పిల్లల్ని ఎక్కడ ఉంచేందుకు అవకాశం లేక వారిని వెంట తీసుకువెళుతున్నారు. దీంతో వారు రెండు నెలల పాటు పాఠశాలలకు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. రెండో తరగతి నుంచి 8,9 తరగతులకు చెందిన విద్యార్థులు కూడా వీరిలో ఉన్నారు. ఎక్కువగా ఈ వలసజీవులు ఎడ్లబళ్లపై అందోలు, పుల్కల్ మండల ప్రాంతాల్లో చెరకును కొట్టేందుకు వెళుతుంటారు. పాఠశాలలకు డుమ్మా ప్రతి చెరకు సీజన్లో గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలకు దూరం అవుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కంగ్టి, కల్హేర్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గం పరిధిలోని రేగోడ్ మండలానికి చెందిన వందల సంఖ్యలో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రుల వెంట చెరకు కొట్టే ప్రాంతాలకు తరలివెళుతున్నారు. దీంతో ఆయా విద్యార్థులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. తల్లిదండ్రులకు తోడుగా.. చెరకు కొట్టేందుకు వెళ్లి ఆ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. చెరకు కొట్టే సమయంలో తండ్రులకు, వంట పనులు చే సే సమయంలో తల్లులకు ఆ విద్యార్థులు సహకరిస్తుంటారు. తండ్రులు చెరకును కొట్టి ఎడ్లబళ్లపై ఫ్యాక్టరీకి తరలించే సమయంలో తల్లుల వద్ద వారి పిల్లలు తోడుగా ఉంటున్నారు. కొంత మేరకు తల్లిదండ్రులకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నా పాఠశాలను వదిలి చదువుకు దూరంగా వెళ్లడం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మా పిల్లలు చదువుకోవాలని ఉన్నా.. మా పిల్లలు చదువుకోవాలనే మాకుంటుంది, కానీ సీజన్లో కేవలం పిల్లలను ఇంటి వద్ద వదిలేసి రావడం కుదరదు. మా తండాల్లో హాస్టళ్లు లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకు వెళ్తున్నాం. పెద్ద తండాలో 60 మంది విద్యార్థులున్నా ఒకే టీచర్ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కూడా పిల్లలకు సరైన ఆహారాన్ని అందించడం లేదు. -
విద్యార్జనకు దగ్గర చేసే దూరవిద్య!
భారత సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 2011-12 నాటికి ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థుల స్థూల నమోదు శాతం (జీఈఆర్) 20.4 శాతంగా ఉంది. దీన్ని 2017 నాటికి 25.2 శాతానికి, 2020 నాటికి 30 శాతం మైలురాయికి చేర్చేందుకు యూజీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రెగ్యులర్, డిస్టెన్స్ విధానాల ద్వారా విద్యార్థులను యూజీ, పీజీ, రీసెర్చ్ కోర్సులకు దగ్గర చేసేందుకు 12వ పంచవర్ష ప్రణాళిక కింద వివిధ కార్యక్రమాల అమలుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో దేశంలో పారిశ్రామిక, సేవల రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ పెరగడంతో దూరవిద్యా కోర్సులు విస్తరిస్తున్నాయి. వేలకు వేలు ఫీజుల భారాన్ని మోయలేని వారికి, అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదులుకొని ఉన్నత విద్యకు సమయాన్ని వెచ్చించలేని వారికి దూరవిద్యా విధానంలో కోర్సులు అండగా నిలుస్తున్నాయి. దూరవిద్య లక్ష్యాలు: వివిధ కారణాల వల్ల సంప్రదాయ విద్యలో ప్రవేశం పొందలేని వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించడం.చదువును మధ్యలో ఆపేసిన వారికి‘లిబరల్ ఎడ్యుకేషన్’ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, వృత్తి నైపుణ్యాలను అభివృద్ధిపరిచే కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం.విద్యార్థులకు అందుబాటులో ఉండే సమయానికి అనుగుణంగా కోర్సులను, అధ్యయన పద్ధతులను అందించడం. విద్యార్థులకు, విద్యా సంస్థలకు మధ్య దూరాన్ని తగ్గించి మంచి విద్యా వాతావరణాన్ని పెంపొందించడం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే కోర్సులకు రూపకల్పన చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉంచడం. కోర్సు కోర్సుకూ ప్రత్యేకత: గతంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీ కోర్సులే అందుబాటులో ఉంటాయన్న భావన విద్యార్థుల్లో ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశ్వవిద్యాలయాలు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. సంప్రదాయ కాంబినేషన్లతో పాటు విభిన్న కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నాయి. ఉదాహరణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బీఎస్సీ(కాస్ట్యూమ్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ), బీఎస్సీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీహెచ్ఎం (బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్), ఎంఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్), ఎంఎస్సీ (బయో ఇన్ఫర్మాటిక్స్) వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్- ఉస్మానియా యూనివర్సిటీ బీఎస్సీ (ఏవియేషన్), పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వంటి వినూత్న కోర్సులను డిస్టెన్స్ విధానంలో ఆఫర్ చేస్తోంది. ఎంసీఏ, ఎంబీఏలకు డిమాండ్: డిస్టెన్స విధానంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు ఆదరణ పొందుతున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు బాగుండటంతో ఎంసీఏను పూర్తిచేసి, వివిధ అనుబంధ కోర్సులు చేసి యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటోంది. అప్పటికే ఏదో ఒక ఉద్యోగంలో చేరిన వారు కెరీర్లో ఉన్నత అవకాశాలు పొందేందుకు మేనేజ్మెంట్ కోర్సులైవైపు మొగ్గు చూపుతున్నారు. నైపుణ్యాలు పెంచుకొని పదోన్నతులు పొందడానికి ఈ కోర్సులు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా యూనివర్సిటీలు మేనేజ్మెంట్లో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నిర్ణీత సమయాల్లో కాంటాక్ట్ కోర్సులు నిర్వహిస్తారు. అవసరమైన స్టడీ మెటీరియల్ అందిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ మూడేళ్ల కాల వ్యవధితో ఎంసీఏ, రెండేళ్ల కాల వ్యవధితో ఎంబీఏ కోర్సులతో పాటు ఏడాది కాలవ్యవధితో బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంసీఏతో పాటు ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్), ఎంబీఏ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను అందిస్తోంది. వివిధ రంగాల్లోనూ అందుబాటులో: న్యాయశాస్త్రం, వైద్య విద్య వంటి ప్రాక్టికల్ ఓరియెంటెడ్ కోర్సుల్లోనూ డిస్టెన్స్ కోర్సులు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కూడా వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎల్ఎల్ఎం (లేబర్ లాస్), కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ.. డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ వంటి కోర్సులను అందుబాటులో ఉంచింది. సింబయాసిస్ సెంటర్ ఆఫ్ హెల్త్‌కేర్ వంటి సంస్థలు కూడా ఏడాది కాల వ్యవధితో పలు కోర్సులను అందిస్తున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వంటి నియంత్రణ సంస్థల నిబంధనల నేపథ్యంలో పూర్తిస్థాయి కోర్సులు కాకుండా ఆయా విభాగాలకు సంబంధించిన అనుబంధ కోర్సులను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం: ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సాంకేతికత రాజ్యమేలుతోంది. అంతా ఆన్లైన్లోనే అన్నట్లున్న ప్రస్తుత పరిస్థితుల్లో దూరవిద్యా కోర్సుల బోధన విధానంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. అధికశాతం యూనివర్సిటీలు డిస్టెన్స్ విద్యార్థులకు‘ఈ-లెర్నింగ్’సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కోర్సు రిజిస్ట్రేషన్ నంబరు, లేదా అడ్మిషన్ నంబరు ఆధారంగా సదరు యూనివర్సిటీ వెబ్సైట్లో యూజర్-ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ‘ఈ-లెర్నింగ్’ మెటీరియల్ లభిస్తుంది. దూరవిద్యకు పెద్ద దిక్కు: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దేశంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ప్రస్తుతం సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ తదితర విభాగాల్లో కోర్సులను ఆఫర్ చేస్తోంది. దేశ, విదేశాల్లోని నెట్వర్క ద్వారా దాదాపు 30 లక్షల మంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. నిరంతరం మార్కెట్ అవసరాలకు తగినట్లుగా పరిశ్రమ వర్గాలతో చర్చించి సరికొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో ఏటా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యా విధానంలో ఆడియో విజువల్ మెటీరియల్, టెలీకాన్ఫరెన్స్‌లు, ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా విభిన్న అంశాలతో విద్యార్థులకు చేరువవుతోంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ టూరిజం స్టడీస్, డిప్లొమా ఇన్ ఆక్వాకల్చర్, పీజీ సర్టిఫికెట్ ఇన్ సైబర్ లా, సర్టిఫికెట్ ఇన్ బిజినెస్ స్కిల్స్, సర్టిఫికెట్ ఇన్ డయాబెటిస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్కర్, సర్టిఫికెట్ ఇన్ ఆయుష్ నర్సింగ్, పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ నర్సింగ్ వంటి ఎన్నో కోర్సులు అందిస్తోంది. రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ: రాష్ట్రంలోని యూనివర్సిటీలు పలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్ స్థాయి మొదలు డిప్లొమా, పీజీ డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. మన రాష్ట్రంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ‘ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్’ నినాదంతో విద్యా సేవలు అందిస్తోంది. మల్టీమీడియా టీచింగ్-లెర్నింగ్ విధానంతో విద్యార్థులకు చేరువవుతోంది. బీఈడీ, ఎంఈడీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హెర్బల్ ప్రొడక్ట్స్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. మక్కువ అందుకే! విద్యార్థులను ఉన్నత విద్యకు దగ్గరచేసే ఉత్తమ మార్గం దూరవిద్య. ప్రవేశాలు, అర్హతలు, పరీక్షలు, ప్రాంతం, ఖర్చు తదితర అంశాల్లో సరళత కారణంగా విద్యార్థులు దూరవిద్య కోర్సులపై మక్కువ చూపుతున్నారు. ఉదాహరణకు ఇగ్నోకు సంబంధించి హైదరాబాద్‌లో కోర్సులో ప్రవేశించి, ముంబైలో పరీక్షలు రాయొచ్చు. అవసరమైతే ప్రవేశాన్ని ముంబైకి మార్చుకోవచ్చు. విద్యార్థి కేంద్రంగా, అవసరాలకు అనుగుణంగా దూరవిద్యా విధానంలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, ఆడియో-వీడియో ప్రోగ్రామ్స్, ఇంటరాక్టివ్ రేడియో కౌన్సెలింగ్, వెబ్ కాన్ఫెరెన్సెస్ వంటి సేవలు అందుకునేందుకు అవకాశముంది. నిపుణులు రూపొందించిన మెటీరియల్ కోర్సులకు ప్రత్యేక ఆకర్షణ. ఇగ్నో కోర్సులు 21 స్కూల్స్ ఆఫ్ స్టడీస్, 67 ప్రాంతీయ కేంద్రాలు, దాదాపు 2,667 లెర్నర్ సపోర్ట్ కేంద్రాలు, 29 విదేశీ భాగస్వామ్య కేంద్రాలతో విస్తరించిన ఇగ్నో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. 228కు పైగా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రముఖ కోర్సులు: ఎంసీఏ, ఎంఏ ఇన్ రూరల్ డెవలప్మెంట్, టూరిజం అండ్ మేనేజ్మెంట్, ఇంగ్లిష్, హిందీ, పిలాసఫీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, జెండర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, అడల్ట్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంఎస్సీ డైటీటిక్స్ అండ్ ఫుడ్ సర్వీసెస్ మేనేజ్మెంట్, ఎంఎస్సీ కౌన్సెలింగ్ అండ్ ఫ్యామలీ థెరఫీ. జాబ్ మార్కెట్‌కు తగినట్లు దేశంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ఇగ్నో ప్రవేశపెడుతోంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఉదాహరణకు అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, జియో ఇన్ఫర్మాటిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (కౌన్సెలింగ్) కోర్సులను చెప్పుకోవచ్చు. ఇప్పుడు జాబ్ మార్కెట్లో విద్యార్థి కోర్సు ఎక్కడ చేశారు? ఎన్ని మార్కులు వచ్చాయి? వంటి వాటి కంటే అసలు విద్యార్థి పరిజ్ఞానం, నైపుణ్యాల ఆధారంగానే అవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచే దిశగా ఇగ్నో కోర్సులకు రూపకల్పన చేస్తోంది. విద్యా సేవలు అందించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. దీనికి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (ైఉఖ), మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల (కైైఇట)ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. - డా. పి.వి.కె.శశిధర్, అసోసియేట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఇగ్నో, న్యూఢిల్లీ. -
అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్ ప్రత్యేకం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూర విద్య యూజీ కోర్సులు: బీఏ, బీకాం, కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, ఏవియేషన్ కాలపరిమితి: మూడేళ్లు; అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత పీజీ కోర్సులు: ఎంబీఏ: రెండేళ్లు అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఐసెట్-2014లో అర్హత సాధించాలి. ఎంసీఏ: మూడేళ్లు.; అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలి. ఎంఏ(ఇంగ్లిష్/హిందీ/తెలుగు/సంస్కృతం/ఉర్దూ) కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఎంఏ(ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్/హిస్టరీ/సైకాలజీ) కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులు. ఎంకాం; కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: బీకాం ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ(మ్యాథ్స్)/ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్); కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: అక్టోబర్ 10 వెబ్సైట్: http://www.oucde.ac.in/ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కోర్సు: ఎల్ఎల్ఎం; సీట్ల సంఖ్య: 15 కాలపరిమితి: ఏడాది; అర్హతలు: ఇంటిగ్రేటెడ్ లా లేదా బీఏ, ఎల్ఎల్బీ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.armyinstituteoflaw.org/ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పోస్టులు: క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ క్లినికల్ రీసెర్చ్ అసిస్టెంట్ ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా; దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 10 వెబ్సైట్:http://www.nims.edu.in/ నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ పోస్టులు: సిస్టమ్ ఎనలిస్ట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు, వయోపరిమితి ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి; చివరి తేది: జూలై 20 వెబ్సైట్: http://www.ncui.coop/ -
అంబేద్కర్ వర్సిటీకి సీఎస్ఆర్ అవార్డు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: దూరవిద్య లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందజేస్తున్నందుకు గుర్తింపుగా డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 2014 సంవత్సరానికి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ (సీఎస్ఆర్)మ్యాగజైన్ ఏటా కేటాయించే ‘సీఎస్ఆర్ టాప్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇనిస్టిటూట్స్ ఆఫ్ ఇండియా అవార్డు’ను మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. భారతదేశంలో దూరవిద్యను అందిస్తున్న వివిధ విశ్వవిద్యాలయాలలో అంబేద్కర్ యూనివర్సిటీ ప్రథమస్థానంలో నిలిచిందని నిర్వాహకులు వెల్లడించారు. దేశంలోనే ఈ విశ్వవిద్యాలయంలో బీయస్సీ డిగ్రీ విద్యాబోధన అత్యుత్తమ స్థాయిలో నిలిచిందని 2011లో అవుట్‌లుక్ మ్యాగజైన్ గుర్తించిందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా 2012లో దూరవిద్య కేటగిరిలో ఇండస్ ఫౌండేషన్ అవార్డు ఫర్ ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అనే అవార్డు కూడా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. -
మూక్స్.. ‘నెటి’టంట్లో యూనివర్సిటీ
డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. మొన్నటి మాట! ఆన్లైన్ లెక్చర్స్.. ఈ-లెర్నింగ్.. నిన్నటి మాట!! మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్-MOOCs) నేటి మాట!!! కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారింది. ఇదే ఒరవడితో విద్యారంగంలోనూ ఆధునికత సంతరించుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి.. దినదినప్రవర్థమానం అవుతోంది మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్-MOOCs). ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఇంటి నుంచే అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించొచ్చు. తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన కోర్సులు పూర్తిచేసుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండే సర్టిఫికెట్లు పొందేందుకు సరికొత్త మార్గంగా నిలుస్తున్న మూక్స్పై ఫోకస్.. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్.. విద్యారంగంలో సరికొత్త విప్లవం. ఒకరకంగా చెప్పాలంటే.. దూర విద్యావిధానంలో ఇదో వినూత్న విధానం. నిర్దిష్ట సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం కుదుర్చుకున్న ఇన్స్టిట్యూట్లలోకోర్సులను ఆన్లైన్లో అభ్యసించే పద్ధతి.. మూక్స్. ఫలితంగా విద్యార్థులు తమ ఇంటి నుంచే ఇంటర్నెట్ సహకారంతో కోర్సులను అభ్యసించి పేరున్న ఇన్స్టిట్యూట్ల నుంచి సర్టిఫికెట్లు పొందొచ్చు. ఒకప్పుడు ఆన్లైన్ విధానంలో కేవలం ఇన్స్టిట్యూట్ల లెక్చర్స్‌కు అనుగుణంగా ఈ-లెర్నింగ్ సదుపాయం ఉండేది. ఇప్పుడు మూక్స్ విధానంలో కోర్సు మెటీరియల్‌తోపాటు వీడియో లెక్చర్స్, విద్యార్థులు, ప్రొఫెసర్స్‌తో ఇంటరాక్టివ్ యూజర్ ఫోరమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో టాప్ యూనివర్సిటీల కోర్సులను సైతం నామమాత్రపు ఫీజులతో ఇప్పుడు నేరుగా మూక్స్ ద్వారా అభ్యసించొచ్చు. అందుకే మూక్స్ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్న విద్యార్థుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. మూక్స్ తీరుతెన్నులు మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్‌కు.. మూలం ఈ-లెర్నింగ్. ఇందులో నిర్దిష్ట సమయంలో మాత్రమే అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. అదే మూక్స్ విధానంలో.. ఆయా ఇన్స్టిట్యూట్లు అధికారికంగా సదరు సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం చేసుకుంటాయి. తద్వారా.. కోర్సు ఔత్సాహికులు ఏ సమయంలోనైనా సంబంధిత కరిక్యులంకు అనుగుణంగా లెక్చర్స్‌ను అందిపుచ్చుకునే వీలుంటుంది. సరిహద్దులతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా.. తమకు ఇష్టమైన ఇన్స్టిట్యూట్లలో అందుబాటులో ఉన్న కోర్సును అభ్యసించొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థి.. హార్వర్డ్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న మూక్స్ కోర్సులకు నమోదు చేసుకుని సర్టిఫికెట్ అందుకోవచ్చు. ఇలా విదేశీవిద్యను అభ్యసించాలనే కోరిక కూడా నెరవేరుతుంది. భారత విద్యార్థులకు ఎంతో మేలు మూక్స్ విధానం భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు చేసేదని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల నాణ్యత ప్రమాణాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. మూక్స్ విధానం ఎంతో ఉపయుక్తమైనది. సామాజిక- ఆర్థిక- భౌగోళిక పరిస్థితుల కోణంలోనూ ఎంతో మేలు చేకూర్చే విధానం.. మూక్స్ రూపంలో కోర్సుల అభ్యసనం. దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో టీచర్-స్టూడెంట్ నిష్పత్తి సగటున 1:40గా ఉంటోంది. ఈ నేపథ్యంలో క్లాస్‌రూంలో అధ్యాపకులు చెప్పే అంశాలన్నింటినీ అవగతం చేసుకోవడం కష్టమైందే. అదేవిధంగా అటు అధ్యాపకుల కోణంలోనూ అంతమంది విద్యార్థులను పర్యవేక్షించడం కష్టసాధ్యం. ఈ సమస్యలకు కూడా మూక్స్ పరిష్కారం చూపుతున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు సదరు కోర్సు కంటెంట్ ఆసాంతం స్వయంగా తెలుసుకోవడంతోపాటు.. సదరు వెబ్సైట్లో ఆన్లైన్లో నిరంతరం ప్రొఫెసర్లతో సంప్రదిస్తూ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. విస్తృతంగా ఉండే కోర్సు కంటెంట్‌ను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కుదించి లైవ్ వీడియో లెక్చర్స్‌ను అందించడం, వర్చువల్ క్లాస్ రూం సదుపాయం కల్పించడం మూక్స్ మరో ప్రత్యేకత. అమెరికాలో మొదలై.. భారత్‌లో వృద్ధి సాధిస్తున్న మూక్స్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల ఆవిష్కరణ అమెరికాలో మొదలైంది. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ రోచస్టర్ వంటి ప్రముఖ సంస్థలు ఆన్లైన్ వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ క్లాస్ రూం పేరుతో పలు కోర్సులను అందించడం ప్రారంభించాయి. ఈ విధానానికి భారత విద్యార్థులు బాగా ఆకర్షితులవుతున్నారు. మూక్స్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కోర్సులకు 20లక్షల మంది పేరు నమోదు చేసుకుంటే.. అందులో 2లక్షల 50వేల మంది మన విద్యార్థులే ఉండటం విశేషం. ప్రపంచలోనే మూక్స్ పద్ధతిలో అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దాంతో అమెరికాలోని మూక్స్ కోర్సుల ప్రొవైడర్స్ భారత్‌వైపు దృష్టి సారిస్తున్నారు. ఇక్కడి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం కుదుర్చుకుని కోర్సులందిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియన్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. కేవలం భారత విద్యార్థులు లక్ష్యంగా ఎడెక్స్ సహకారంతో ‘ఎంగేజింగ్ ఇండియా’ పేరిట ఇంగ్లిష్/హిందీ భాషల్లో 10 వారాల కోర్సుకు ఆవిష్కరణ చేసింది. ఓ మూక్స్ కోర్సును రెండు భాషల్లో ముఖ్యంగా హిందీలో అందించడం ఇదే తొలిసారి. ఐఐటీ-ముంబైతో మొదలు అంతర్జాతీయ మూక్స్ ప్రొవైడర్స్ భారత్‌లో ప్రవేశించడం ఐఐటీ-ముంబైతో మొదలైంది. మూక్స్ సర్వీస్ ప్రొవైడర్స్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎడెక్స్.. ఐఐటీ-ముంబైలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సులు అందిస్తోంది. మరో మూక్స్ ప్రొవైడర్ ‘కోర్స్ ఎరా’.. ఐఐటీ-ఢిల్లీతో ఒప్పందం ద్వారా వెబ్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా కోర్సును అందిస్తోంది. వీటితోపాటు ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-చెన్నైలు కూడా మూక్స్ కోర్సులు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదేబాటలో మరిన్ని మూక్స్ ప్రొవైడింగ్ ఆన్లైన్ సంస్థలు పయనిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, మరికొన్ని జాతీయ హోదా ఉన్న ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు కూడా మూక్స్ కోర్సులు అందించేందుకు.. తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఉపక్రమిస్తున్నాయి. అకడెమిక్స్.. ఇండస్ట్రీ మూక్స్ విధానంలో కోర్సుల ద్వారా అకడెమిక్ నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరం కూడా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. కారణం.. కొన్ని మూక్స్ ప్రొవైడింగ్ సంస్థలు ఆయా సంస్థల కరిక్యులం, పరిశ్రమ అవసరాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వాటికనుగుణంగా సిలబస్ రూపకల్పన చేసి కొన్ని ప్రత్యేక విభాగాల్లో కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులు ఇలాంటి తరహాలో మూక్స్ సర్టిఫికేట్స్ అందుకుని ఉద్యోగాలు పొందుతున్నారు. మూక్స్.. ముఖ్య విభాగాలు గత రెండు, మూడేళ్లలో ఆవిష్కృతమై ప్రాథమిక దశలో ఉన్న మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్‌లో.. ప్రస్తుతం అధిక శాతం సెన్సైస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ వంటి కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఓరియెంటేషన్ కీలకంగా ఉండే.. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో వీటి సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. కావాల్సిన మౌలిక సదుపాయాలు మూక్స్ విధానంలో కోర్సు అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంటర్నెట్, జావా స్క్రిప్ట్ సాఫ్ట్వేర్, ఏవీ సాఫ్ట్వేర్స్, హెడ్‌ఫోన్స్. ఇవి ఉంటే ఆన్లైన్ విధానంలో మూక్స్ కోర్సులను ఇంటి నుంచే అభ్యసించొచ్చు. ఈ మౌలిక సదుపాయాల విషయంలోనూ మూక్స్ ప్రొవైడర్స్ ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుని.. మరింత మంది విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ‘కోర్స్ ఎరా’ సంస్థ మూక్స్ కోర్సుల్లో నమోదు, లెక్చర్స్ వీక్షించడం వంటి సదుపాయాలను మొబైల్ ఫోన్ ద్వారా పొందే విధంగా మొబైల్ అప్లికేషన్స్‌ను రూపొందించింది. ఇలా.. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు.. మారుతున్న టెక్నాలజీతోపాటు తమ స్వరూపాన్ని, తీరుతెన్నులను కూడా మార్చుకుంటూ భవిష్యత్తులో ఉన్నత విద్య ఔత్సాహికులకు ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న మూక్స్ ప్రొవైడర్స్ ప్రొవైడర్: ఎడెక్స్ వెబ్సైట్: www.edx.org పాల్గొనే యూనివర్సిటీలు: మిట్, హార్వర్డ్ యూనివర్సిటీ, యూసీ బెర్కిలీ, క్యోటో వర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్. ప్రొవైడర్: కోర్స్ ఎరా; వెబ్సైట్: www.coursera.org పాల్గొనే యూనివర్సిటీలు: స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, యూనివ ర్సిటీ ఆఫ్ వర్జీనియా ప్రొవైడర్: ఐవర్సిటీ; వెబ్సైట్: www.iversity.org పాల్గొనే యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్, యూనివర్సిటీ ఆఫ్ హంబర్గ్. ప్రొవైడర్: ఫ్యూచర్ లెర్న్; వెబ్సైట్: www.futurelearn.com పాల్గొనే యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఓపెన్ యూనివర్సిటీ, మొనాష్, ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, వార్విక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బాత్. ప్రొవైడర్: అకడెమిక్ఎర్త్ http://academicearth.org పాల్గొనే యూనివర్సిటీలు: యూసీ బెర్కిలీ, యూసీఎల్ఏ, మిచిగాన్, ఆక్స్ఫర్డ్. ఇంకా.. ది ఓపెన్ యూనివర్సిటీ; వెబ్సైట్: www.open.ac.uk ఎలిసన్; వెబ్సైట్: www.alison.com ఓపెన్ లెర్నింగ్; వెబ్సైట్: www.openlearning.com యుడాసిటీ; వెబ్సైట్: www.udacity.com ఎడ్యుకార్ట్; వెబ్సైట్: www.edukart.com మూక్స్‌తో ప్రయోజనాలు మిట్, హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ల కోర్సులు చదువుకునే అవకాశం. గ్లోబల్ ఎడ్యుకేషన్‌కు ఆస్కారం. నిరంతర నమోదు అవకాశం నిరంతర అధ్యయనం అధ్యాపకులతో నేరుగా సంభాషించే అవకాశం నచ్చిన సమయంలో క్లాసులు వినే సౌలభ్యం తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ కెరీర్ ఉన్నతికి తోడ్పాటు నైపుణ్యాల నగిషీలకు మార్గం మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు.. నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఆయా కెరీర్స్‌లో స్థిరపడి ఉన్నత హోదాలు అందుకోవాలనుకునే వారికి కూడా సదరు రంగంలో అవసరమైన కోర్సులు తమకు నచ్చిన సమయంలో, నచ్చిన విధంగా అభ్యసించి సర్టిఫికెట్లు పొందేందుకు తోడ్పడుతున్నాయి. ఐటీ, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో మూక్స్కు ఆదరణ లభిస్తున్నప్పటికీ.. ఇతర కోర్సులు ముఖ్యంగా హ్యుమానిటీస్, ఆర్ట్స్ కోర్సుల విషయంలో విద్యార్థులు ఇంకా సంప్రదాయ తరహా బోధనకే పరిమితమవుతున్నారు. ఈ విభాగాల్లోనూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు అభ్యసించే అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ మూక్స్ విధానంలో ఒక రోజు లెక్చర్ వినకపోయినా.. మరుసటి రోజు సంబంధిత లింక్ ఓపెన్ చేయడం ద్వారా అంతకుముందు లెక్చర్స్‌ను విని, నేర్చుకునే అవకాశం లభిస్తోంది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో లెర్నింగ్ పరంగా మూక్స్ త్వరలోనే మరింత ప్రాచుర్యం పొందడం ఖాయం. - ఎన్.విశ్వనాథ్, సెంటర్ హెడ్, ఎడ్యుకార్ట్.కామ్, హైదరాబాద్ -
ముంగిట్లోకి దూరవిద్య
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: రోజూ కళాశాలకు వె ళ్లి విద్యను అభ్యసించలేని ఔత్సాహిక విద్యార్థుల కోసం దూరవిద్యను ముగింట్లోకే తీసుకువచ్చే ప్రయత్నానికి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (సీడీఈ) శ్రీకారం చుట్టింది. జిల్లాలో అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులను, గృహిణులను, ఉద్యోగులను ఉన్నత విద్యాధికులుగా తీర్చిదిద్దేందుకు వినూత్న ప్రక్రియను చేపట్టింది. హైదరాబాద్‌తో అనుసంధానాన్ని తగ్గిస్తూ స్థానికంగా అడ్మిషన్ కేంద్రాల ద్వారా విద్యను అందించి వ్యయప్రయాసలను తగ్గించడమే లక్ష్యంగా సీడీఈ ప్రణాళిక రూపొందించింది. అం దులో భాగంగానే జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి కేంద్రాల్లో అడ్మిషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే నిర్వహించేలా దూరవిద్య అధికారులు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు. అందుకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్‌ను సంస్కరిస్తూ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ విధానంతో జిల్లాలోని వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. సిద్దిపేటలోనే అడ్మిషన్ కేంద్రం డిగ్రీ, పీజీ లాంటి కోర్సులను రెగ్యులర్‌గా చదువుకోలేని ఔత్సహికుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానంగా ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లు దూరవిద్యను అందిస్తున్నాయి. అందులో భాగంగానే మెదక్ జిల్లా వాసుల కోసం సీడీఈ 2001లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకే ఒక స్టడీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు దూరవిద్యలో డిగ్రీ, పీజీతో పాటు డిప్లొమా కోర్సులను అభ్యసిస్తున్నారు. కేవలం స్టడీ కేంద్రంగానే ఉన్న సిద్దిపేట సీడీఈతో జిల్లా విద్యార్థులకు దూరవిద్య సేవలను ఆశించిన స్థాయిలో అందడం లేదన్న వాదనలున్నాయి. మరోవైపు దూరవిద్య విధానంలోని నిబంధనల మేరకు కోర్సులు పూర్తయ్యే వరకు ప్రక్రియ అంత హైదరాద్‌లోని సీడీఈ ప్రధాన కేంద్రంతోనే కొనసాగుతుంది. ఇది జిల్లా విద్యార్థులకు, గృహిణులకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో రె గ్యులర్ విద్యకు దీటుగా దూరవిద్యను క్షేత్ర స్థాయిలో విస్తృత పరిచి, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను ముఖ్యంగా బాలికలు, మహిళలు, నిరుద్యోగ యువతకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఈ ఏడు సీడీఈ అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కేవలం స్టడీ సెంటర్‌గా ఉన్న సిద్దిపేటలో తొలిసారిగా అడ్మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దూరవిద్య సేవలను విద్యార్థుల ముంగిట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. అందుకు అనుగుణంగానే సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డిలో అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తు విక్రయాలు, ఫీజుల వసూలు, స్టడీ మెటీరియల్ సరఫరా, తరగతి గదుల నిర్వహణ, హాల్ టికెట్ల జారీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను స్థానికంగానే నిర్వహించేందుకు సీడీఈ భవిష్యత్ ప్రణాళిక రూపొందించింది. ఈ విధానం అమలైతే జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు బీఏ, బీకాంతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఫ్రొఫెషనల్ కోర్సులను పీజీ డిప్లొమా కోర్సులను ఇంటి వద్ద ఉంటూ స్థానికంగా ఉన్న కేంద్రాల ద్వారా దూరవిద్యను అభ్యసించవచ్చు. ఈ విద్య సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. జిల్లా ప్రజలకు వరం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రస్తుతం సిద్దిపేటలో ఒకే ఒక స్టడీ సెంటర్ ఉంది. దూరవిద్య సంస్కరణల్లో భాగంగా జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో పూర్తి స్థాయి అడ్మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఈ విధానం ద్వారా విద్యార్థులకు, గృహిణులకు వ్యయప్రయాస తగ్గుతుంది. - వెంకటేశ్వర్లు ( డెరైక్టర్, సీడీఈ) -
చూసెయ్..రాసెయ్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దూర విద్యా విధానంలో వివిధ యూనివర్సిటీల పోస్టు గ్రాడ్యుయేషన్ పరీక్షలు కాసులు కురిపిస్తున్నాయి. హోదా కోసమో, ప్రమోషన్ కోసమో పరీక్ష రాసే అభ్యర్థుల అవసరమే పెట్టుబడిగా యేటా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డీడీలు సృష్టించడంలో జిల్లాలో సిద్ధహస్తులుగా పేరొందిన కొందరు వ్యక్తులు ‘చూచిరాత ముఠా’గా తయారయ్యారు. స్టడీ సెంటర్ల మాటున వీరు చేస్తున్న ఆగడాలకు యూనివర్సిటీ వర్గాలు కూడా అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.శ్రీ వెంకటేశ్వర, నాగార్జున ఇలా యూనివర్సిటీ యేదైనా జిల్లాలో వాటికి అనుబంధంగా ఉండే అధ్యయన కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. అడ్మిషన్లు మొదలుకుని పరీక్షల నిర్వహణ వరకు వ్యవహారమంతా అక్రమ పద్ధతుల్లో సాగుతోంది. తాజాగా జిల్లాలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తున్న పీజీ పరీక్షలు అక్రమాలకు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి పరీక్ష ఫీజుతో పాటు మరో రూ.2 వేలు అక్రమంగా వసూలు చేసినట్లు సమాచారం. పరీక్ష కేంద్రంలోనే చూచిరాత సౌకర్యం కల్పిస్తే అభ్యర్థులు రెండు వేలు చెల్లించాలి. కొందరు అభ్యర్థులు ఇళ్ల వద్దకే ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు తీసుకెళ్లాలంటే ఒక్కో పేపర్‌కు రూ.2 వేల నుంచి రూ.5 వేల అధ్యయన కేంద్రం నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీ వెబ్సైట్ ప్రకారం జిల్లాలో సిద్దిపేట, తూప్రాన్, గజ్వేల్, జహీరాబాద్‌లో అధ్యయన కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో సుమారు సుమారు రెండు వేలకు పైగా అభ్యర్థులు పీజీ కోర్సుల కోసం నమోదైనట్లు అంచనా. ఎనిమిదేళ్లుగా ఇదే రీతిలో పరీక్షల నిర్వహణ కొనసాగుతున్నా సంబంధిత యూనివర్సిటీలు తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటాయి. అధ్యయన కేంద్రాల నిర్వహకులు పరీక్షలు సరిగా నిర్వహించేలా చూడాల్సిన యూనివర్సిటీ పరిశీలకులు ‘మేనేజ్’ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. సిద్దిపేట కేంద్రంగా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పొరుగు రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లు సరఫరా చేసినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ నిర్వాహకుడిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అదే వ్యక్తి సిద్దిపేట కేంద్రంగా ‘చూచిరాత ముఠా’ను నడుపుతున్నారు. తూప్రాన్‌లోనూ ఇదే పరిస్థితి తూప్రాన్ స్టడీ సెంటర్లో ఎస్వీ యూనివర్సిటీ పీజీ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించినా మాస్ కాపీయింగ్ జోరు కనిపిస్తోంది. గతంలో నకిలీ డీడీలను సృష్టించిన కేసు ఎదుర్కొన్న ఓ వ్యక్తి తూప్రాన్ కేంద్రంగా ప్రస్తుతం పీజీ పరీక్షల చూచిరాత వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ వర్గాలను మేనేజ్ చేస్తున్నందున ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభ్యర్థులకు స్వయంగా భరోసా ఇస్తున్నాడు. సిద్దిపేటలో నాగార్జున యూనివర్సిటీ అధ్యయన కేంద్రం నిర్వహిస్తున్న సంస్థపైనా గతంలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వచ్చాయి. పోలీసులు, అధికారులు దృష్టి సారిస్తే తప్ప ‘చూచిరాత ముఠా’ అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు. -
దూరవిద్య అడ్మిషన్లకు దరఖాస్తుల విక్రయం ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీ యూనివర్సిటీలోని దూరవిద్యా విభాగం ద్వారా పీజీ, యూజీ, బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్వీయూలో దూరవిద్య కోర్సుల కోసం ఈనెల 14న వీసీ రాజేంద్ర నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి దరఖాస్తుల విక్రయం, స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. దూర విద్యా విభాగం డెరైక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి మంగళవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఎస్వీయూ దూరవిద్య విభాగం ద్వారా తెలుగు, ఇంగ్లిషు, హిందీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషియల్ వర్క్, పబ్లిక్ రిలేషన్స్, గణితం, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, సైకాలజీ, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ కోర్సులు నిర్వహిస్తున్నామని తెలి పారు. ఈ కోర్సుల్లో చేరడానికి నవంబర్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి విద్యార్హతా లేని వారికి డిగ్రీలో ప్రవేశానికి 2014 ఫిబ్రవరి 9న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్ష రాయాలనుకొనేవారు జనవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రెండేళ్ల సర్వీసు కలిగిన ఇన్ సర్వీసు టీచర్లు బీఈడీలో చేరడానికి అర్హులన్నారు. ఈ కోర్సుల్లో చేరదల చినవారు జనవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.ఉద్యమం ఆగిన వెంటనే పరీక్షలుఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగంలో పీజీ, డిగ్రీ చదువుతున్న రెండో సంవత్సర విద్యార్థులకు వార్షిక పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని దూరవిద్య విభాగం డెరైక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేకపోతున్నామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు పరీక్ష ఫీజు తక్షణమే చెల్లించాలని కోరారు. -
వర్సిటీల్లో మానవ వనరుల కొరత
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారికి దూరవిద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆన్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయని డీఆర్డీఓ ఆర్ఏసీ చైర్మన్, యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి సూచించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 31వ వ్యవస్థాపక దినోత్సవంసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ, దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సైతం మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యమైన శిక్షణ తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో పరిశోధనలకు కొదవ లేదని, ఏ దేశంతో పోల్చినా పీహెచ్డీ పూర్తి చేసినవారు ఇక్కడే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అయితే వారిలో సాంకేతిక, పారిశ్రామిక నైపుణ్యాలు చాలా తక్కువగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ వర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలనూ ఆన్లైన్లో నిర్వహించడం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమేనని అన్నారు. అంతకుముందు వర్సిటీలో నిర్మించతలపెట్టిన పరీక్షల విభాగం, సీఎస్టీడీ భవన నిర్మాణాలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా భూమిపూజ చేశారు. వైస్ చాన్సలర్ డాక్టర్ పి.ప్రకాశ్, అకాడమిక్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.వెంకటనారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎ.సుధాకర్ పాల్గొన్నారు.