ఏఎన్‌యూ ‘దూరవిద్య’లో కుంభకోణం
Published Sat, Sep 17 2016 9:24 PM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
* రూ.5 లక్షల మేర టోపీ పెట్టిన వ్యక్తి
* నకిలీ చలనాలతో జగన్మాయ
* అనధికారికంగా అడ్మిషన్ ఫీజు వసూలు చేసిన వైనం
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రంలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దూరవిద్యాకేంద్రంలో అడ్మిషన్ పొందేందుకు విద్యార్థులు చెల్లించే ఫీజును వసూలు చేసి చలానాల రూపంలో దూరవిద్యాకేంద్రంలో జమచేసే ఓ వ్యక్తి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని ఓ డిగ్రీ కాలేజీలో గతంలో పనిచేసిన ఓ వ్యక్తి విద్యార్థుల వద్ద నుంచి అడ్మిషన్, పరీక్ష ఫీజులు తీసుకుని ఏఎన్‌యూలో చెల్లిస్తూ ఉండేవాడు. ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రానికి ఏ విధమైన అధ్యయన కేంద్రం (స్టడీ సెంటర్) లేకపోయినప్పటికీ తనకున్న పరిచయాలతో విద్యార్థుల అడ్మిషన్లు సేకరించి అనధికారికంగా ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రంలో ఫీజులు చెల్లించటం వంటి వ్యవహారాలు కొనసాగించే వాడు. ఈ క్రమంలో ఇటీవల అతను బ్యాంక్‌లో ఒక ఆన్‌లైన్ చలానా చెల్లించి తరువాత యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ఫీజుల నమోదు కేంద్రంలో సమర్పించే సమయానికి అందులో ఉన్న చెల్లింపులకు సంబంధించిన అంకెలు ఎక్కువగా మార్పు చేసినట్లు తెలిసింది.
ఈ చలానాలను దూరవిద్యాకేంద్ర సిబ్బంది కంప్యూటర్‌లో నమోదు చేసిన తరువాత అకౌంట్ల పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతను అంకెలు మార్పు చేసిన చలానాల్లో సుమారు 5 లక్షల రూపాయలు వరకు యూనివర్సిటికి నష్ట వాటిల్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న దూరవిద్యాకేంద్రం అధికారులు కుంభకోణం అంశాన్ని నిగ్గుతేల్చి అతనిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కుంభకోణానికి అతనే పాల్పడ్డాడా? లేక దూరవిద్యాకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వారెవరైనా అతనికి పరోక్షంగా సహకారం అందించారా? అనే అంశాలపై కూడా దూరవిద్యాకేంద్రం అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. దీనిపై వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా నకిలీ చలానాల కుంభకోణం తన దృష్టికి రాలేదన్నారు.
Advertisement