
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ఈ సైబర్ మోసగాళ్ల వలలో పడిపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రతో రోజూ ఏదో ఓ మూల.. ఇలాంటి ఒక కేసు నమోదవుతూనే ఉంది. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 20 కోట్లు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ముంబైకి చెందిన 86 ఏళ్ల మహిళకు, కొందరు మోసగాళ్లు ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతున్నట్లు కాల్ చేసి చెప్పారు. స్కామర్లు.. పోలీస్ అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు.. అక్కడ నుంచి స్కామ్ ప్రారంభమైంది. ఆధార్ కార్డును చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశారు. కేసును పరిష్కరించడానికి అనేక బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని బలవంతం చేశారు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను హెచ్చరించారు. అయితే జరుగుతున్న మోసాన్ని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే రూ. 20.25 కోట్లు కోల్పోయింది. ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. ఏ ఖాతాలకు డబ్బు బదిలీ అయిందనే విషయాలను పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేసి, మోసగాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

డిజిటల్ అరెస్ట్
మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.
ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.
ఆధార్ స్కామ్ నుంచి సురక్షితంగా ఉండటం ఎలా?
పోలీసులు లేదా యూఐడీఏఐ అధికారులు.. ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలను, ఓటీపీ వంటి వివరాల కోసం ఫోన్ చేయరు. కాబట్టి ఎవరైనా కాల్ చేసి ఇలాంటి వివరాలను అడిగారంటే.. తప్పకుండా వాళ్ళు మోసగాళ్లు అని తెలుసుకోవాలి. మీకు అలాంటి కాల్స్ వస్తే.. వెంటనే డిస్‌కనెక్ట్ చేసి, 1947కు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి.
Comments
Please login to add a commentAdd a comment