సాక్షి, హైదరాబాద్: ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) కోర్సులకు అనుమతులు మంజూరు చేసే విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు విధించింది. 2018–19 విద్యా సంవత్సరం, ఆపై కాలానికి విశ్వవిద్యాలయాలు, వాటికి అనుమతిచ్చిన కోర్సులతో యూజీసీ ఇటీవల ఒక జాబితా విడుదల చేసింది. అందులో ముఖ్యమైన కోర్సులకు సంబంధించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో సహా చాలా వర్సిటీల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ఆయా వర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నియంత్రణ సంస్థల అనుమతి తప్పనిసరి
ఎంబీఏ/ఎంసీఏ/బీఈడీ/ఎంఈడీ/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)/ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)/హోటల్ మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు గుర్తింపు లభించాలంటే తొలుత ఆయా కోర్సులకు సంబంధించిన నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని యూజీసీ కొత్త నిబంధనలు విధించింది. ఉదాహరణకు బీఈడీ వంటి కోర్సులను దూరవిద్యా విధానంలో ఆఫర్ చేయాలంటే యూజీసీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి కోర్సుకూ ఆయా నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు సంస్థలను నియంత్రించే విషయాన్ని సరిగా పట్టించుకోకుండా, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల విషయంలో యూజీసీ ఇలా వ్యవహరించడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త నిబంధనల వల్ల వర్సిటీ పాలనా వ్యవహారాలు గాడితప్పి, అసలు లక్ష్యాలు పక్కదారిపడతాయని వారు విమర్శిస్తున్నారు.
‘డిస్టెన్స్’పై యూజీసీ ఆంక్షలు
Published Sun, Aug 12 2018 2:34 AM | Last Updated on Sun, Aug 12 2018 2:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment