పక్కా చూసిరాత ! | mass copying | Sakshi
Sakshi News home page

పక్కా చూసిరాత !

Published Sun, Sep 25 2016 9:51 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

పక్కా చూసిరాత ! - Sakshi

పక్కా చూసిరాత !

 –ఎస్‌వీ యూనివర్సిటీ దూర్యవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌
– శంకరాస్‌ డిగ్రీ కళాశాల కేంద్రంలో బరితెగింపు
– పరీక్ష కేంద్రానికి తాళం వేయించి చూసిరాత 
– వర్సిటీ, పోలీసు,అధికారులను మేనేజ్‌ చేశామంటున్న వైనం
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. ఇటీవల మహానందిలోని గాజులపల్లె భారతీ డిగ్రీ కళాశాలలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ మీడియా కంట పడిన నేపథ్యంలో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఎవరు లోపలికి రాకుండా కర్నూలులోని శంకరాస్‌ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రానికి తాళం వేసి లోపల బుక్కులు పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయిస్తున్నారు. అంతేకాక మాస్‌ కాపీయింగ్‌కు వర్సిటీ, స్థానిక పోలీసులు, రెవెన్యూ, ఇతర అధికారులే అనుమతి ఇచ్చినట్లు వారు చెబుతుండడం గమనార్హం.  
 
మోహన్‌రెడ్డిదే హవా!
శంకరాస్‌ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎస్వీ దూర విద్య పరీక్షలకు ఆ కళాశాల డైరక్టర్‌ హరికిషన్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌గా  నియమితులయ్యారు. ఈయన పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, ఈ  కేంద్రం పరీక్షల కో ఆర్డినేటర్‌గా ప్రతిభ మోడల్‌ స్కూల్‌ యాజమాని బావమరిది మోహన్‌రెడ్డి  ఉన్నారు. ఈయనే విద్యార్థుల నుంచి అడ్మిషన్ల కోసం, మాస్‌ కాపీయింగ్‌ కోసం డబ్బులను వసూలు చేస్తాడు. మాస్‌ కాపీయింగ్‌ కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా పరీక్షా కేంద్రం వద్దనే ఉండి ఎవరినీ లోపలకు వెళ్లనీయకుండా చూస్తాడు. ఏకంగా గేటుకు తాళం వేశాడు. మీడియాను సైతం నిలువరించే ప్రయత్నం చేస్తాడు. మొదట నోటితో భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు.  మాట వింటే ఒకే. లేకుంటే ఏమైన ఉంటే మాట్లాడుదాం..రండి అంటూ ఆఫర్‌ ఇస్తాడు. కాగా, ప్రవేశాలు చేయించుకునే కో ఆర్డినేటర్‌ పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చా అంటే సమాధానం చెప్పేనాథుడు కరువయ్యాడు. ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే పరీక్షలను ఎక్కడైనా కింది ఫ్లోర్‌లో నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం కింది ఫ్లోర్లను వదిలి రెండో ఫ్లోర్‌లో నిర్వహిస్తున్నారంటే మాస్‌కాపీయింగ్‌ కోసమేనని తెలుస్తోంది. ఎందుకో తనిఖీ చేసే వర్సిటీ అధికారులు మామూళ్లకు తలొగ్గి ముఖం చాటేశారు. దీంతో కేంద్రంలో బుక్కులు పెట్టి పరీక్షలు రాస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. 
 
మీడియాను తికమక పెట్టిన వైనం..
శంకరాస్‌ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎస్వీ దూర విద్య పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌ జోరుగా జరుగుతుందనే సమాచారంతో ఆదివారం సాక్షి బందం అక్కడికి వెళ్లింది. అప్పటికే పరీక్ష కేంద్రానికి తాళం వేసి ఉన్నారు. ఆ పక్కనే లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా కోఆర్డినేటర్‌ మోహన్‌రెడ్డి ఉన్నారు. అయినా, సాక్షి బందం లోపలి వెళ్లేందుకు ప్రయత్నించగా మొదట గట్టి అరుపులతో భయపెట్టేందుకు కోఆర్డినేటర్‌ చూశాడు. మీడియా అని చెప్పగా మొదట చీఫ్‌ సూపరింటెండెంట్‌ అనుమతి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆయన దాదాపు 15 నిమిషాల తరువాత మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడి లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు..మాకు తెలుసు అంటూ మాట విప్పాడు. ఏమైన ఉంటే మాట్లాడుదామని పిలిచాడు. ఇలా దాదాపు మీడియా పరీక్ష కేంద్రం ఆవరణలోకి వెళ్లిన ఆరగంటకు గేటు తాళం తీశారు. అనంతరం పరీక్షలను రాస్తున్న విద్యార్థుల దగ్గరకు తీసుకెళ్లారు. ఈలోపే విద్యార్థుల దగ్గర నుంచి పుస్తకాలు తీసేసి ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరగడం లేదని కలరింగ్‌ ఇచ్చారు. అయినా, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన పుస్తకాలు ‘సాక్షి’కంట పడ్డాయి. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement