సాక్షి, హైదరాబాద్: దూర విద్య (ఓపెన్ స్కూల్) ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. పరీక్ష కేంద్రాలతో స్టడీ సెంటర్లు కుమ్మక్కై దందాకు తెరతీశాయి. విద్యార్థుల నుంచి భారీ వసూళ్లు చేసి పరీక్షల్లో చూసి రాసుకునేందుకు అవకాశం కల్పించాయి.
ఈ వ్యవహారంలో ఓపెన్ స్కూళ్ల కోఆర్డినేటర్లే దళారులుగా మారి వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కోఆర్డినేటర్ తమ స్కూల్ విద్యార్థులు పరీక్ష రాసే సెంటర్ కోఆర్డినేటర్‌తో ముందే మాట్లాడుకొని ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మరికొన్ని కేంద్రాలైతే మరో అడుగు ముందుకేసి ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మిర్యాలగూడ కేంద్రంగా..
మిర్యాలగూడ ప్రాంతంలోని పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ పూర్తయిన విద్యార్థులతో పరీక్ష కేంద్రం యాజమాన్యాలే ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
10 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించాలనే నిబంధన ఉంది. అయితే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని కూడా నియమించారు. మేడ్చల్, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లోని డివిజన్ కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనూ..
హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో కాపీయింగ్ వ్యవహారం భారీగా సాగుతున్నట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవారికి పదోన్నతి కావాలంటే ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 35 వేల మందికిపైగా పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రధానోపాధ్యాయుడి స్థాయి వారిని కాకుండా తమకు అనుకూలంగా ఉండే స్కూల్ అసిస్టెంట్లను జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లుగా నియమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment