చూసెయ్..రాసెయ్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దూర విద్యా విధానంలో వివిధ యూనివర్సిటీల పోస్టు గ్రాడ్యుయేషన్ పరీక్షలు కాసులు కురిపిస్తున్నాయి. హోదా కోసమో, ప్రమోషన్ కోసమో పరీక్ష రాసే అభ్యర్థుల అవసరమే పెట్టుబడిగా యేటా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డీడీలు సృష్టించడంలో జిల్లాలో సిద్ధహస్తులుగా పేరొందిన కొందరు వ్యక్తులు ‘చూచిరాత ముఠా’గా తయారయ్యారు. స్టడీ సెంటర్ల మాటున వీరు చేస్తున్న ఆగడాలకు యూనివర్సిటీ వర్గాలు కూడా అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.శ్రీ వెంకటేశ్వర, నాగార్జున ఇలా యూనివర్సిటీ యేదైనా జిల్లాలో వాటికి అనుబంధంగా ఉండే అధ్యయన కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి.
అడ్మిషన్లు మొదలుకుని పరీక్షల నిర్వహణ వరకు వ్యవహారమంతా అక్రమ పద్ధతుల్లో సాగుతోంది. తాజాగా జిల్లాలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తున్న పీజీ పరీక్షలు అక్రమాలకు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి పరీక్ష ఫీజుతో పాటు మరో రూ.2 వేలు అక్రమంగా వసూలు చేసినట్లు సమాచారం. పరీక్ష కేంద్రంలోనే చూచిరాత సౌకర్యం కల్పిస్తే అభ్యర్థులు రెండు వేలు చెల్లించాలి. కొందరు అభ్యర్థులు ఇళ్ల వద్దకే ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు తీసుకెళ్లాలంటే ఒక్కో పేపర్‌కు రూ.2 వేల నుంచి రూ.5 వేల అధ్యయన కేంద్రం నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఎస్‌వీ యూనివర్సిటీ వెబ్‌సైట్ ప్రకారం జిల్లాలో సిద్దిపేట, తూప్రాన్, గజ్వేల్, జహీరాబాద్‌లో అధ్యయన కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో సుమారు సుమారు రెండు వేలకు పైగా అభ్యర్థులు పీజీ కోర్సుల కోసం నమోదైనట్లు అంచనా.
ఎనిమిదేళ్లుగా ఇదే రీతిలో పరీక్షల నిర్వహణ కొనసాగుతున్నా సంబంధిత యూనివర్సిటీలు తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటాయి. అధ్యయన కేంద్రాల నిర్వహకులు పరీక్షలు సరిగా నిర్వహించేలా చూడాల్సిన యూనివర్సిటీ పరిశీలకులు ‘మేనేజ్’ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. సిద్దిపేట కేంద్రంగా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు పొరుగు రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లు సరఫరా చేసినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ నిర్వాహకుడిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అదే వ్యక్తి సిద్దిపేట కేంద్రంగా ‘చూచిరాత ముఠా’ను నడుపుతున్నారు.
తూప్రాన్‌లోనూ ఇదే పరిస్థితి
తూప్రాన్ స్టడీ సెంటర్‌లో ఎస్‌వీ యూనివర్సిటీ పీజీ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించినా మాస్ కాపీయింగ్ జోరు కనిపిస్తోంది. గతంలో నకిలీ డీడీలను సృష్టించిన కేసు ఎదుర్కొన్న ఓ వ్యక్తి తూప్రాన్ కేంద్రంగా ప్రస్తుతం పీజీ పరీక్షల చూచిరాత వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ వర్గాలను మేనేజ్ చేస్తున్నందున ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభ్యర్థులకు స్వయంగా భరోసా ఇస్తున్నాడు. సిద్దిపేటలో నాగార్జున యూనివర్సిటీ అధ్యయన కేంద్రం నిర్వహిస్తున్న సంస్థపైనా గతంలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వచ్చాయి. పోలీసులు, అధికారులు దృష్టి సారిస్తే తప్ప ‘చూచిరాత ముఠా’ అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడం లేదు.