చేజారిన ‘డెబ్‌’ గుర్తింపు | deb identity miss of distance education | Sakshi
Sakshi News home page

చేజారిన ‘డెబ్‌’ గుర్తింపు

Published Fri, Jun 2 2017 10:31 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

చేజారిన ‘డెబ్‌’ గుర్తింపు - Sakshi

చేజారిన ‘డెబ్‌’ గుర్తింపు

–2016–17 విద్యాసంవత్సరం దూరవిద్యకు  నోటిఫికేషన్‌ లేనట్లే
–30 వేల మంది విద్యార్థులు పొరుగు వర్సిటీల్లో ప్రవేశం  
- ఎస్కేయూకు రాబడి నష్టం రూ. 25 కోట్లు  
– అధికారుల తీరుపై విమర్శలు


ఎస్కేయూ : నిధుల సమీకరణకు అంతర్గత వనరులు పెంచుకొని  తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమం.  అందుకు తగ్గట్టు బోధన, బోధనేతర ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి  గ్రాంట్‌ రూపంలో రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్కేయూకు సింహభాగం ఆదాయం దూరవిద్య విధానం ద్వారా వస్తోంది. ఈ ఆదాయం నుంచి అభివృద్ధి పనులతోపాటు,  వర్సిటీ స్వయంగా చేపట్టిన నియామకాలకు సంబంధించిన జీతాలూ చెల్లిస్తున్నారు. ఇంత ప్రాముఖ్యమున్న దూరవిద్య విభాగానికి సకాలంలో డెబ్‌ (డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో , న్యూఢిల్లీ ) గుర్తింపు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీనివల్ల దూరవిద్య ద్వారా అభ్యసించిన విద్యార్థులకు అందజేసే సర్టిఫికెట్లకు గుర్తింపు లభిస్తుంది.

మీనమేషాలు..
        గత 17 సంవత్సరాల కిందట దూరవిద్య విభాగాన్ని ఎస్కేయూలో ఏర్పాటు చేశారు. 2012, 13,14 సంవత్సరాల్లో దూరవిద్య విభాగం అడ్మిషన్లు గణనీయమైన స్థాయికి చేరాయి. అదేస్థాయిలో ఆదాయం పెరిగింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో 220 అధ్యయన కేంద్రాల ద్వారా ప్రతి ఏటా  వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి స్ధానంలో నిలిచిన దూరవిద్య విభాగానికి  డెబ్‌ గుర్తింపునకు దరఖాస్తు చేయడంలో మీనమేషాలు లెక్కించారు. దీంతో  2016–17 విద్యాసంవత్సరానికి గుర్తింపురాక 30 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లకు బ్రేక్‌ పడింది. ఫలితంగా  విద్యార్థుల నుంచి   ఫీజుల రూపంలో అందాల్సిన  రూ. 25 కోట్ల రాబడిని వర్సిటీ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది.  ఇప్పటికే బలోపేతంగా ఉన్న దూరవిద్య విభాగం క్రమంగా బలహీనమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పొరుగు వర్సిటీలకు తరలిన విద్యార్థులు
         2016–17 విద్యాసంవత్సరం నోటిఫికేషన్‌ ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేయడం వేల మంది విద్యార్థులు పొరుగునున్న వర్సిటీల వైపు దృష్టి సారించారు. అక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే వర్సిటీలో పీజీ అయితే రెండు సంవత్సరాలు, డిగ్రీ అయితే మూడు సంవత్సరాలు ఫీజులను ఎస్కేయూ కోల్పోయినట్టయింది. కాగా  మేల్కొన్న అధికారులు 2017–18 విద్యాసంవత్సరానికి  డెబ్‌ అనుమతి కోసం ప్రయత్నించగా వచ్చే వారం డెబ్‌ అధికారులు ఎస్కేయూకు రానున్నారు. అనుమతి లభిస్తే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement