deb identity
-
చేజారిన ‘డెబ్’ గుర్తింపు
–2016–17 విద్యాసంవత్సరం దూరవిద్యకు నోటిఫికేషన్ లేనట్లే –30 వేల మంది విద్యార్థులు పొరుగు వర్సిటీల్లో ప్రవేశం - ఎస్కేయూకు రాబడి నష్టం రూ. 25 కోట్లు – అధికారుల తీరుపై విమర్శలు ఎస్కేయూ : నిధుల సమీకరణకు అంతర్గత వనరులు పెంచుకొని తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమం. అందుకు తగ్గట్టు బోధన, బోధనేతర ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి గ్రాంట్ రూపంలో రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్కేయూకు సింహభాగం ఆదాయం దూరవిద్య విధానం ద్వారా వస్తోంది. ఈ ఆదాయం నుంచి అభివృద్ధి పనులతోపాటు, వర్సిటీ స్వయంగా చేపట్టిన నియామకాలకు సంబంధించిన జీతాలూ చెల్లిస్తున్నారు. ఇంత ప్రాముఖ్యమున్న దూరవిద్య విభాగానికి సకాలంలో డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో , న్యూఢిల్లీ ) గుర్తింపు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీనివల్ల దూరవిద్య ద్వారా అభ్యసించిన విద్యార్థులకు అందజేసే సర్టిఫికెట్లకు గుర్తింపు లభిస్తుంది. మీనమేషాలు.. గత 17 సంవత్సరాల కిందట దూరవిద్య విభాగాన్ని ఎస్కేయూలో ఏర్పాటు చేశారు. 2012, 13,14 సంవత్సరాల్లో దూరవిద్య విభాగం అడ్మిషన్లు గణనీయమైన స్థాయికి చేరాయి. అదేస్థాయిలో ఆదాయం పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 220 అధ్యయన కేంద్రాల ద్వారా ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి స్ధానంలో నిలిచిన దూరవిద్య విభాగానికి డెబ్ గుర్తింపునకు దరఖాస్తు చేయడంలో మీనమేషాలు లెక్కించారు. దీంతో 2016–17 విద్యాసంవత్సరానికి గుర్తింపురాక 30 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లకు బ్రేక్ పడింది. ఫలితంగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో అందాల్సిన రూ. 25 కోట్ల రాబడిని వర్సిటీ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బలోపేతంగా ఉన్న దూరవిద్య విభాగం క్రమంగా బలహీనమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొరుగు వర్సిటీలకు తరలిన విద్యార్థులు 2016–17 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేయడం వేల మంది విద్యార్థులు పొరుగునున్న వర్సిటీల వైపు దృష్టి సారించారు. అక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే వర్సిటీలో పీజీ అయితే రెండు సంవత్సరాలు, డిగ్రీ అయితే మూడు సంవత్సరాలు ఫీజులను ఎస్కేయూ కోల్పోయినట్టయింది. కాగా మేల్కొన్న అధికారులు 2017–18 విద్యాసంవత్సరానికి డెబ్ అనుమతి కోసం ప్రయత్నించగా వచ్చే వారం డెబ్ అధికారులు ఎస్కేయూకు రానున్నారు. అనుమతి లభిస్తే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
లబ్‘డెబ్’
–డెబ్ గుర్తింపు వస్తేనే సర్టిఫికెట్లు చెల్లుబాటు –ఇప్పటికే కోర్సు పూర్తిచేసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం –డీఎల్, గ్రూప్–2, గ్రూప్–3 సన్నద్ధమయ్యే వారిలో ఆందోళన ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విభాగానికి డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) గుర్తింపు ఓ మిస్టరీగా మారింది. దూరవిద్య అందించే డిగ్రీ పట్టాల విశ్వసనీయతకు డెబ్ గుర్తింపు తప్పనిసరి. వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేందుకు ప్రతి ఏటా డెబ్ గుర్తింపు జారీ చేస్తుంది. రెండు విద్యా సంవత్సరాల్లో దూరవిద్య ద్వారా అందజేసిన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లకు డెబ్ అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ 72 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. దీంతో ఈ సర్టిఫికెట్లు తీసుకొన్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే డెబ్ అనుమతిస్తేనే కోర్సు పూర్తయి ఉత్తీర్ణత అయినట్లు నిర్ధారిస్తారు. పదోన్నతులు, ఉద్యోగాలు పొందిన విద్యార్థులు సర్టిఫికెట్లు చెల్లుబాటు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నద్ధమయ్యే వారికి నిద్ర కరువు : డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రూప్–2 ప్రిలిమినరీ పూర్తి అయింది. వచ్చే నెలలో మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. పీజీ పూర్తిచేసి నెట్, సెట్ అర్హతతో డిగ్రీ కళాశాల లెక్చరర్లు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొన్నారు. జూన్‌లో డీఎల్ పరీక్ష ఉంది. కాగా డెబ్ గుర్తింపు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. మేలుకొలుపు : 2015 సంవత్సరం నుంచి డెబ్ గుర్తింపు అనుమతి కోసం అధికారులు దరఖాస్తు కూడా చేయలేదు. తాజాగా నూతన నోటిఫికేషన్ జారీకి ప్రయత్నాలు చేయడం, విద్యార్థుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంది. నూతనంగా నియమించిన రెక్టార్ హెచ్.లజిపతిరాయ్ను డెబ్ గుర్తింపు కోసం ఇటీవల ఢిల్లీకి దరఖాస్తు పంపారు. మరో దఫా ఢిల్లీకి వెళ్లి డెబ్ అనుమతి కోసం ప్రయత్నం చేయాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎవరిది బాధ్యత : ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాత అరకొర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాత పరీక్షలు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు అనర్హులైతే డెబ్ గుర్తింపు తీసుకరావడంలో విఫలమైతే ఎవరు బాధ్యత వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.