–డెబ్ గుర్తింపు వస్తేనే సర్టిఫికెట్లు చెల్లుబాటు
–ఇప్పటికే కోర్సు పూర్తిచేసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
–డీఎల్, గ్రూప్–2, గ్రూప్–3 సన్నద్ధమయ్యే వారిలో ఆందోళన
ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విభాగానికి డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) గుర్తింపు ఓ మిస్టరీగా మారింది. దూరవిద్య అందించే డిగ్రీ పట్టాల విశ్వసనీయతకు డెబ్ గుర్తింపు తప్పనిసరి. వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేందుకు ప్రతి ఏటా డెబ్ గుర్తింపు జారీ చేస్తుంది. రెండు విద్యా సంవత్సరాల్లో దూరవిద్య ద్వారా అందజేసిన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లకు డెబ్ అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ 72 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. దీంతో ఈ సర్టిఫికెట్లు తీసుకొన్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే డెబ్ అనుమతిస్తేనే కోర్సు పూర్తయి ఉత్తీర్ణత అయినట్లు నిర్ధారిస్తారు. పదోన్నతులు, ఉద్యోగాలు పొందిన విద్యార్థులు సర్టిఫికెట్లు చెల్లుబాటు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సన్నద్ధమయ్యే వారికి నిద్ర కరువు :
డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రూప్–2 ప్రిలిమినరీ పూర్తి అయింది. వచ్చే నెలలో మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. పీజీ పూర్తిచేసి నెట్, సెట్ అర్హతతో డిగ్రీ కళాశాల లెక్చరర్లు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొన్నారు. జూన్‌లో డీఎల్ పరీక్ష ఉంది. కాగా డెబ్ గుర్తింపు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
మేలుకొలుపు :
2015 సంవత్సరం నుంచి డెబ్ గుర్తింపు అనుమతి కోసం అధికారులు దరఖాస్తు కూడా చేయలేదు. తాజాగా నూతన నోటిఫికేషన్ జారీకి ప్రయత్నాలు చేయడం, విద్యార్థుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంది. నూతనంగా నియమించిన రెక్టార్ హెచ్.లజిపతిరాయ్‌ను డెబ్ గుర్తింపు కోసం ఇటీవల ఢిల్లీకి దరఖాస్తు పంపారు. మరో దఫా ఢిల్లీకి వెళ్లి డెబ్ అనుమతి కోసం ప్రయత్నం చేయాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఎవరిది బాధ్యత :
ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాత అరకొర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాత పరీక్షలు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు అనర్హులైతే డెబ్ గుర్తింపు తీసుకరావడంలో విఫలమైతే ఎవరు బాధ్యత వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
లబ్‘డెబ్’
Published Sun, Apr 30 2017 12:02 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement