ఇటీవల ఆడిట్ అభ్యంతరం తెలిపిన ఉత్తర్వు, జీఓ 14 ప్రకారం ఫ్యాకల్టీకే సీఏఎస్ పదోన్నతి కల్పించాలని తెలిపే నిబంధన
సాక్షి, అనంతపురం(ఎస్‌కేయూ) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారులు అస్మదీయులను అందలం ఎక్కిస్తున్నారు. ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో స్టాటిస్టికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి ఇటీవల గ్రేడ్–3 పదోన్నతి కల్పించారు. గ్రేడ్ –3 పదోన్నతి సైతం సీఏఎస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు. సీఏఎస్ (కెరీర్ అడ్వాన్సెమెంట్ స్కీం) ఇంటర్వ్యూలు కేవలం బోధన సిబ్బందికి నిర్వహించాలి. కానీ దేశంలోని ఏ వర్సిటీ కూడా సీఏఎస్ ఇంటర్వ్యూల ద్వారా రీసెర్చ్‌కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ను గ్రేడ్–3 కేడర్‌కు ఎంపిక చేయలేదు. కానీ ఎస్కేయూలో మాత్రం అందుకు భిన్నంగా గ్రేడ్–3కి ఎంపిక చేశారు. త్వరలోనే ఇదే సీఏఎస్‌ల ద్వారా గ్రేడ్–4 అంటే అసోసియేట్ ప్రొఫెసర్ హోదాను కల్పించనున్నారు. గ్రేడ్–3 హోదాతో పాటు ఆర్‌పీఎస్(రివైజ్డ్ పే స్కేలు)ను అమలు చేశారు. దీంతో ఇప్పటికే రూ.16 లక్షలు లబ్ధి చేకూరింది. అర్హత లేని వ్యక్తికి అక్రమంగా పదోన్నతి కల్పించడంతో జీతంతో పాటు అదనంగా రూ.16 లక్షలు అరియర్స్ రూపంలో దండుకున్నారు.
లేని అంశాలను జోడించి ఆమోదముద్ర..
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 14 ప్రకారం రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని, సెలెక్షన్ గ్రేడ్–3 వరకు పదోన్నతి కల్పించామని ఎస్కేయూ ఉన్నతాధికారులు పాలకమండలిలో లేని అంశాలను జోడించి చెప్పి ఆమోదముద్ర వేయించుకున్నారు. జీఓలో ఉన్న అంశాలు.. పేర్కొన్న అంశాలు వాస్తవ విరుద్ధాలు. పాలకమండలిని, ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి లక్షలు కాజేశారు.
జీఓ –14 ఏం చెబుతుందంటే ....
రాష్ట్ర బ్లాక్‌గ్రాంట్ పరిధిలో ఉద్యోగం చేస్తున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో.. వారు యూజీసీ పే స్కేల్ 1996 పరిధిలో ఉంటే .. వారికి గ్రేడ్–3 పదోన్నతి కల్పించవచ్చు. ఆర్‌పీఎస్ అందించవచ్చు. సీఏఎస్‌కూ అర్హులే. ఇక ఫ్యాకల్టీలోనూ వెకేషన్, నాన్ వెకేషన్ అని రెండు రకాలున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం పనిచేస్తూ యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారు, వేసవి తదితర సెలవులు ఉన్న వారు వెకేషన్ ఫ్యాకల్టీకి కిందకు వస్తారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేస్తున్న వారు నాన్ వెకేషన్ ఫ్యాకల్టీ పరిధిలో ఉంటారు. అయితే రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జీఓ 14 ప్రకారం ఫ్యాకల్టీ ఎలా అవుతారో ఎస్కేయూ ఉన్నతాధికారులకే తెలియాలి. ఫ్యాకల్టీ అనే పదం స్పష్టంగా ఉన్నప్పటికీ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగి అయిన స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు ఎలా గ్రేడ్–3 పదోన్నతి కల్పించారని, సీఏఎస్‌ల ద్వారా ఇంటర్వ్యూలకు ఎలా అర్హత సాధించారో.. ఉన్నతాధికారులు బహిరంగంగా బదులివ్వాలని ఉద్యోగులు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఆడిట్ అక్షింతలు
సీఏఎస్ ద్వారా గ్రేడ్–3 హోదా పొందేందుకు అనర్హులని... జీఓ 14 ప్రకారం ఫ్యాకల్టీ పరిధిలోకి రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రారని .. స్టేట్ ఆడిట్ అధికారి అక్షింతలు వేశారు. ఆడిట్ అభ్యంతరం తెలపకుండా ..ఆమోదిస్తే తన ఉద్యోగం పోవడం ఖాయమని ..ఫైలును వెనక్కి పంపినట్లు తెలిసింది. జీఓ 14లో ఫ్యాకల్టీ అనే పదానికి రీసెర్చ్ కమ్ స్టాటస్టికల్ ఆఫీసర్ అనర్హుడని.. కరాఖండిగా తేల్చిచెప్పారు. అదే ఆడిట్ అధికారి గత నెలలో పదవీ విరమణ చేశాడు. దీంతో తిరిగి ఆడిట్‌కు ఫైలు పంపారు. ఆడిట్ ఆమోదం పొందితే .. సదరు ఉద్యోగి ఎస్కేయూ కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా వచ్చేందుకు అవరోధం తొలిగినట్లే. వాస్తవానికి ఫ్యాకల్టీ కింద పరిగణించబడి.. అర్హత ఉన్న వారిని జీఓ 14 ప్రకారం అనర్హులని చెప్పి ఎలాంటి పదోన్నతి కట్టబెట్టకపోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment