అనంతపురం, ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై హైకోర్టులో కేసు దాఖలు కావడం...న్యాయమూర్తి విచారణకు స్వీకరించడంతో పాటు వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. ఎస్కేయూలో జరిగిన అధికార దుర్వినియోగం, అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పిటీషనర్ చేసిన విన్నపాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఎస్కేయూలో జరిగిన కుంభకోణాలను ఇప్పటికే ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించిన సంగతి విధితమే.
అవుట్‌సోర్సింగ్‌లో అధికార దుర్వినియోగం
ఎస్కేయూలో భర్తీ చేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో నియమ, నిబంధనలను విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 151కి విరుద్ధంగా భర్తీ చేశారని పిటీషనర్ పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదనీ, రోస్టర్ పాయింట్లు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఉద్యోగాల్లో కాకుండా ఇష్టానురీతిగా భర్తీ చేశారనీ, తొలుత పాలకమండలి అనుమతి లేకుండానే నేరుగా ఉద్యోగాలు భర్తీ చేసి, లేబర్ డిపార్ట్‌మెంట్‌లో లేని ఏజెన్సీకి కట్టబెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి చెల్లించాల్సిన జీతాలు మొత్తం కంటే అదనంగా ఏజెన్సీ నిర్వాహకుడికి అప్పటి వీసీ ప్రొఫెసర్ కే. రాజగోపాల్, రిజిస్ట్రార్ సుధాకర్ బాబు చెల్లించారనీ, వీరిద్దరిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధలకు విరుద్ధంగా వెంగమాంబ ఏజెన్సీకి, కార్తికేయ ఏజెన్సీకి లక్షలాది రూపాయలు చెల్లించారనీ, ఈ అంశాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పిటీషనర్లు «హైకోర్టు ధర్మాసనానికి గురువారం విన్నవించారు. దీంతో జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాససనం పిటీషనర్లు ఆధారాలతో సహా వివరాలు ఇస్తున్నపుడు.. ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరాలతో సహా కౌంటర్ దాఖలు చేయాలన్నారు.
పనిచేయకున్నా.. జీతాలు
ఎస్కేయూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు ఉన్న నేపథ్యంలో విధులు నిర్వహించే విషయంలోనూ విమర్శలు లేకపోలేదు. గార్డెనర్ పేర్లతో ఉద్యోగాలు కల్పించినా... వారు ఎక్కడ విధులు నిర్వహిస్తారో.. ఎంత మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో.. ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. పాలకమండలి కేవలం 69 మందికి మాత్రమే అనుమతి ఇస్తే.. 130 మంది విధులు నిర్వహిస్తున్నట్లు జీతాలు చెల్లిస్తున్నారు. ఉద్యోగులు విధులకు హాజరయినట్లు హాజరుపట్టీ సైతం లేకుండా జీతాలు చెల్లిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆరు నెలల నుంచీ విన్నపాలు
హైకోర్టు మెట్లెక్కిన పిటిషనర్లు..ఎస్కేయూలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని గవర్నర్ నుంచి ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ వరకు ఆరు నెలల నుంచి అనేక దఫాలుగా వినతి పత్రాలు అందించారు. అయితే ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఎస్కేయూలో ప్రహరీ నిర్మాణంలోనూ అవినీతి జరిగిందనీ, టెండర్లు ఒకరికి దక్కితే...పనులు మరొకరు చేస్తున్నారనీ, కిలో మీటర్ ప్రహరీ నిర్మాణానికి రూ.1.30 కోట్లు ఖర్చు పెడుతురని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దూరవిద్య విభాగంలోనూ విద్యార్థులతో కోట్లాది రూపాయలు ఫీజులు కట్టించుకుని.. పరీక్షలు పెట్టకుండా.. ఆ నిధులను ఇతర పనులకు మళ్లించారని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment