ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు దిగింది. వర్సిటీలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం, పాలనాపరమైన రహస్యాల్లో గోప్యత పాటించకపోవడం, ఉద్యోగ నియామకాల్లో ఏకపక్ష నిర్ణయాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాల రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో వర్సిటీలో అక్రమాలపై విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించడం... ఒకే సామాజిక వర్గం వారికి, అస్మదీయులకు లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించిన ఎస్కేయూ ఉన్నతాధికారుల వైఖరిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపైనా అసంతృప్తి చెలరేగుతోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రెటరీ సైతం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఉన్నతాధికారి వ్యవహార శైలిపై ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలకమండలి సభ్యులు సైతం ఉన్నతాధికారుల వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. వీరు ఇచ్చిన నివేదిక సైతం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిఘా వర్గాల నుంచి సమాచారం
‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో వర్సిటీ జరిగిన అవినీతి, అక్రమాలపై నిఘా వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని కోరినట్లు తెలిసింది. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అదనపు చెల్లింపులు, అక్రమ నియామకాలు, రాష్ట్ర ప్రభుత్వం ముసుగులో చేసిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఇప్పటికే గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ‘సాక్షి’ వరుస కథనాల కటింగ్‌లను పంపుతున్నారు. దీంతో గవర్నర్ కార్యాలయ వర్గాలుసైతం ప్రత్యేక దృష్టి సారించాయి. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని త్వరలో దాఖలు చేయనున్నట్లు విద్యార్థి నాయకులు పేర్కొన్నారు.
మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి అన్యాయంపై నిరసన
ఎస్కేయూలో పాతికేళ్లు ఉద్యోగం చేసి మరణించిన టైం స్కేలు ఉద్యోగి రామచంద్ర కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. దీంతో వర్సిటీలోని ఉద్యోగులు, విద్యార్థులు వైఎస్సార్‌సీసీకి దగ్గరయ్యారు. దీనిపై నిఘా వర్గాల ద్వారా సమాచారం పొందిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని అక్షింతలు వేయడంతో.. ఉద్యోగుల దీక్షను బలవంతంగా అణచివేశారు.
ఛాన్స్‌లర్ దృష్టికి తీసుకెళతాం
ఎస్కేయూలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని ఛాన్సలర్ దృష్టికి తీసుకెళతాం. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ వ్యవహారంలో అక్రమాలు, పరీక్షల విభాగంలో అవకతవకలు, దూరవిద్యలో డీడీల గోల్‌మాల్, ఇండస్ట్రీ కోటాలో అడ్డుగోలుగా పీహెచ్‌డీ అడ్మిషన్ల వ్యవహారంపై గవర్నర్‌కు విన్నవిస్తాం. ‘సాక్షి’లో వచ్చిన కథనాల ఆధారంగా.. దర్యాప్తు చేయించి చర్యలు తీసుకోవాలని కోరతాం.
– జీవీ లింగారెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment