సాక్షి, హైదరాబాద్: బోధన ఒక ప్రత్యేక నైపుణ్యంతో కూడిన విధానం.. బోధించే తీరుపైనే విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందడం, మానసిక వికాసం ఆధారపడి ఉంటాయి.. అలాంటి అత్యుత్తమ బోధన కోసం ప్రత్యేక శిక్షణ అవసరం. కానీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు చేయకుండానే పాఠశాలల్లో బోధిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ 17,813 మందికిపైగా శిక్షణ పొందనివారు టీచర్లుగా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని 11,500 వరకు ఉన్న ప్రైవేటు స్కూళ్లలో 3,905 మంది మాత్రమే శిక్షణ పొందని టీచర్లు ఉన్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ వాటిలో పనిచేస్తున్న 17,813 మంది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐవోఎస్) దూర విద్య విధానంలో ‘డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్)’చదివేందుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అంటే వారంతా ఉపాధ్యాయ శిక్షణ పొందకుండానే బోధిస్తున్నట్లు తేలింది.
విస్మయంలో కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో లక్షల మంది ఉపాధ్యాయ శిక్షణ పొందకుండానే బోధిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. శిక్షణ పొందనివారు పాఠశాలల్లో బోధించడానికి వీలు లేదని, ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్రాల వారీగా లెక్కలను సేకరించింది. అయితే వారంతా ఎప్పుడో స్కూళ్లలో చేరి బోధిస్తున్నందున.. బయటకు వెళ్లి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను పూర్తి చేయాలనడం సరికాదన్న ఆలోచనతో కేంద్రమే వారి దూర విద్యలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసే అవకాశం కల్పించింది. అన్‌ట్రైన్డ్ టీచర్లంతా నిర్ణీత ఫీజు చెల్లించి ఎన్‌ఐవోఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని.. వారికి ప్రత్యేక టీవీ చానళ్ల ద్వారా పాఠాలు బోధించడంతో పాటు స్టడీ మెటీరియల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
అయితే వారంతా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంది. లేకపోతే ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ చదివి నిర్ణీత శాతం మార్కులు సాధించాలని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా దూరవిద్యలో డీఎడ్ చేసేందుకు 14,97,859 మంది దరఖాస్తు చేసుకున్నారు.. అందులో తెలంగాణ నుంచి 17,813 మంది, ఏపీ నుంచి 6,338 మంది ఉన్నారు. ఇక ఇంటర్ 50 శాతం మార్కు లు లేని వారు రాష్ట్రంలో మరో 10 వేల వరకు ఉంటారని అంచనా. వారంతా దూర విద్యలో ఇంటర్ చదివేందుకు సిద్ధమవుతున్నారు.
ఐదు రాష్ట్రాల్లో లక్షకు పైనే..
శిక్షణ పొందని టీచర్లు అత్యధికంగా బిహార్ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రాష్ట్రం నుంచి దూరవిద్య విధానంలో డీఎడ్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారు ఏకంగా 2,85,234 మంది ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి 1,95,353 మంది ఉండగా, మధ్యప్రదేశ్ నుంచి 1,91,510 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 1,69,008 మంది, అసోం నుంచి 1,51,950 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment