కుంటుబడిన గిరిజన విద్య
మంజూరు కాని ఉపాధ్యాయ పోస్టులు
సీఆర్టీల భర్తీలో తాత్సారం
ఆదివాసీ బాలలకు అంటని విద్యాగంథం
పాడేరు: ప్రభుత్వ విధానాలతో గిరిజన విద్య కుంటుపడుతోంది. తరగతుల్లో విద్యాబోధనకు ఉపాధ్యాయులు కొరత... వసతిగృహాల్లో వార్డెన్లు, వర్కర్ల లేమితో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సీలేరు, లంబసింగి తదితర కొన్ని పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు కూడా లేని వైనం పరిస్థితికి అద్దం పడుతోంది. విద్యా ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఏజెన్సీలో 103 గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 93 ఉపాధ్యాయ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. 83 వార్డెన్ పోస్టులకు ప్రస్తుతం రెగ్యులర్ వార్డెన్లు 52 మందే ఉన్నారు. ఏటా డిప్యుటేషన్‌పై పాఠశాలలోని ఉపాధ్యాయులే వార్డెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2012-13 లో 33 యూపీ స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. మూడేళ్లయినా వీటిలో ఉపాధ్యాయులను నియమించలేదు. ఈ పాఠశాలలకు పీజీహెచ్‌ఎంలతోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సుమారు 300 ప్రభుత్వం మంజూరు చేయవలసి ఉంది. మూడేళ్లుగా సీఆర్టీలతోనే ఈ పాఠశాలల్లో విద్యాబోధన సాగిస్తున్నారు. గతేడాది ఏజెన్సీ ఆశ్రమోన్నత పాఠశాలల్లో 420 మంది సీఆర్టీలు బోధించారు. ఈ ఏడాది పాఠశాలలు తెరిచి నెల రోజులయినా వీరి భర్తీలో తాత్సారం సాగుతోంది. ప్రస్తుతం 93 మంది సీఆర్టీల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నట్లు గిరిజన సంక్షేమ అధికారులు చెబుతున్నారు.
ఉపాధ్యాయ పోస్టులే లేని 33 ఆశ్రమ పాఠశాలల్లో విద్యాబోధన ప్రశ్నార్థకంగా మారింది. వీటికి ఒకరిద్దరు స్కూల్ అసిస్టెంట్లను ప్రస్తుతం సర్దుబాటు చేశారు. 2013-14 లో 7 గిరిజన సంక్షేమ వసతి గృహాలను ఉన్నత పాఠశాలలుగా మార్చారు. వీటిలో ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడు లేని దుస్థితి. విద్యార్థులే ఉపాధ్యాయుల అవతారం ఎత్తుతున్నారు. మరోవైపు వసతిగృహాల్లో వర్కర్ల కొరత వల్ల మౌలిక సదుపాయాలు అందడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో పారిశుధ్య పనులకు వర్కర్లు అందుబాటులో లేరు. విద్యార్థులే ఈ పనులు చేసుకుంటున్నారు. ఏటా ఆశ్రమాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాది 32 వేల మంది విద్యార్థులు ఉంటే ఈ ఏడాది సంఖ్య 35 వేలకు పెరిగింది. పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కావడం లేదు. ఏటా టెన్త్ ఫలితాలపై తీసుకుంటున్న శ్రద్ధ ఆశ్రమాల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంపై చూపడం లేదు. ఏజెన్సీలోని మొత్తం ఆశ్రమ పాఠశాలలకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి, కనీసం సీఆర్టీలనైనా నియమిస్తే విద్యాబోధన కొంతవరకు మెరగుపడుతుంది.