గురుపూజోత్సాహం...
- తరలివచ్చిన ఉపాధ్యాయులు
- ఆదరాబాదరగా అవార్డుల ప్రదానం
సాక్షి, విశాఖపట్నం: తొలిసారిగా రాష్ట్రస్థాయి గురుపూజోత్సవానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తరలి వచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించడంతో పది రోజుల నుంచి అధికారులంతా ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. విజయవంతం అయిందనిపించుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. నగరంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో విశాలంలో షామియానాలు ఏర్పాటు చేశారు. సభా వేదికను సుందరంగా అలంకరించారు. వేదిక బయట ఎల్‌ఈడీ స్క్రీన్లను అమర్చారు. రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులతో పాటు వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలకు చెందిన దాదాపు 15 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను సమకూర్చింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు కుటుంబ సభ్యులతో ఒకరోజు ముందుగానే విశాఖ చేరుకున్నారు. మధ్యాహ్నానికే సభా ప్రాంగణానికి వచ్చారు. సాయంత్రం మూడు గంటలకు సభ ప్రారంభమవుతుందని ఎదురు చూశారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాక రెండు గంటలు ఆలస్యం కావడంతో ఒకింత ఇబ్బంది పడ్డారు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అవార్డుల ప్రదానం సమయాభావంతో ఆదరాబాదరాగా నిర్వహించారు. దీంతో గందరగోళ పరి స్థితులేర్పడ్డాయి. అవార్డుల ప్రదానం తీరు పట్ల పలువురు ఉపాధ్యాయులు అసంతృప్తి, ఆవేదనను వెళ్లగక్కారు. మ రోవైపు సభ ఆరంభంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అందరిలోనూ భయాందోళనలు రేకెత్తించింది. సకాలంలో సరఫరా నిలిపివేయడంతో అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని ఘటనను కళ్లారా చూసిన వారు వ్యాఖ్యానించారు.
జిల్లాలో అవార్డు గ్రహీతలు వీరే..
1. జె.జాని హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, వేచలం, దేవరాపల్లి మండలం
2. కె.వి.వి.గణపతిరావు, ఎస్జీటీ, ఎయిడెడ్ పాఠశాల, చమ్మచింత, నాతవరం మండలం
3. బి.వి.కె.గోవిందరావు, స్కూల్‌అసిస్టెంట్, బయాలజికల్ సైన్స్, ఎంపీయూపీఎస్, కొండుపాలెం,అనకాపల్లి మండలం
4. కె.మేరీకుమారి, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్‌ఎస్, అగనంపూడి,
గాజువాక మండలం జాతీయ అవార్డులుకు ఎంపికైనవారు..
1. ఎం.వీరభద్రస్వామి, ఎస్జీటీ, ఎంపీపీఎస్ స్కూల్, చోడవరం
2. డి.రామేశ్వర్రావు, స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్, జెడ్పీహెచ్‌ఎస్, వొమ్మవరం, ఎస్.రాయవరం మండలం
3. కరుణమ్మ, విశ్రాంత ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, జీవీఎంసీ ప్రైమరీ స్కూల్, నక్కవానిపాలెం
ఆంధ్ర యూనివర్శిటీ :-
1. ప్రొఫెసర్ పి.ఎస్.అవధాని, కంప్యూటర్ సెన్సైస్ అండ్ ఇంజనీరింగ్ సిస్టమ్
2 ప్రొఫెసర్ కె.వి.ఎస్.ఆర్.ప్రసాద్, వాతావరణ విభాగం.
3. ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్
4. డి.పుల్లారావు, ప్రొఫెసర్, ఎకనామిక్స్.