కాకినాడ జిల్లా తూరంగి జెడ్పీ హైస్కూల్‌లోని మ్యాథ్స్ ల్యాబ్‌లో చదువుకుంటున్న విద్యార్థులు
తూరంగి, తుని నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. దశాబ్దాల తరబడి తగినంత మంది ఉపాధ్యాయలు లేక ఇబ్బందులు పడ్డ విద్యార్థులకు ఇప్పుడు సుశిక్షితులైన టీచర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విద్యా సామర్థ్యాలు, పరీక్షల్లో మార్కులు పెరిగాయి. పేద పిల్లల చదువులు, ఆరోగ్య స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. వసతుల కల్పనతో డ్రాపౌట్లు నిలిచిపోయాయి. ప్రతి నెలా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తహీనత ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రతి గురువారం స్కూళ్లలోనే ఐరన్ మాత్రలు పంపిణీ చేస్తూ భావి పౌరుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
యోగా, డ్రిల్ తప్పనిసరి చేయడంతో విద్యార్థుల ఫిట్‌నెస్‌లో మార్పు వచ్చింది. నిరంతర నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్లు, ఆర్వో తాగు నీటితోపాటు మధ్యాహ్నం జగనన్న గోరుముద్దతో పోషకాహారం, రాగిజావ, చిక్కీ, వారానికి ఐదురోజులు కోడిగుడ్డు ఇవ్వడంతో విద్యార్థులు ఉత్సాహంగా చదువులపై దృష్టి సారిస్తున్నారు. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో పాటు రుతుక్రమ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో మానసికంగా వారిలో మార్పు వచ్చింది. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో ఐదారేళ్ల క్రితం వరకు 40 నుంచి 60 శాతం దాటని హాజరు ఇప్పుడు సగటున 98 శాతానికి పైగా పెరిగింది. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు ఫీజులు రూపంలో చెల్లించే మొత్తం మిగలడం, మెరుగైన బోధన అందడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తగినంత మంది టీచర్లు.. పీఈటీలు
కాకినాడ జిల్లా తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 720 మంది విద్యార్థులుండగా వీరిలో 80 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వారిలో గత నాలుగేళ్లలో 15 మంది విద్యార్థులు ఐఐఐటీల్లో సీట్లు సాధించడం, ఆరుగురు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందుకోవడం గమనార్హం. ఆరు నుంచి 10వ తరగతి వరకు బోధనకు గతంలో 12 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉండగా ఇప్పుడు 29కి పెరిగింది. తునిలోని శ్రీరాజా ఉన్నత పాఠశాలలో 540 మంది విద్యార్థులు ఉండగా ఎన్నో ఏళ్ల పాటు ఉపాధ్యాయుల సంఖ్య 10 మందికి మించలేదు.
ఈ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 17కి పెరిగింది. చాలా ఏళ్ల తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుడి రాకతో విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు ఇంగ్లిష్ బోధనను సునాయాసంగా అర్థం చేసుకోవడం, పరీక్షలు రాయడంతో పాటు సగటు మార్కుల శాతాన్ని కూడా పెంచుకోవడం గమనార్హం. వ్యాయామ ఉపాధ్యాయులను అందించడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన, టోఫెల్ శిక్షణతో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్నారు.
ప్రతినెలా తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించడం, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిని విశ్లేషించడం, అవసరానికి తగట్టు బోధనతో పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాలు, నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. నాలుగేళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుని, తూరంగిలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ‘సాక్షి’ ప్రతినిధి వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
మారిన తలరాతలు.. వెలుగు నిండిన స్కూళ్లు
తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారిన పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాల నుంచి యూనిఫారం దాకా సర్వం సమకూరుస్తోంది. పిల్లలకు స్కూళ్లలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్చినా గతంలో ఒక్కో కుటుంబం పుస్తకాలు, యూనిఫారం కోసం ఏటా రూ.రెండు మూడు వేలు వెచ్చించాల్సి వచ్చేది. బెల్టు, బూట్లు, పుస్తకాల బ్యాగు ఖర్చు దీనికి అదనం.
ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలోని దాదాపు 45 వేల పాఠశాలల్లో 42 లక్షల మంది పిల్లల తల్లిండ్రులకు చదువుల బెంగ తీరిపోయింది. బడికి పంపించినందుకు ఏటా రూ.15 వేలను జగనన్న అమ్మ ఒడి కింద ప్రభుత్వమే జమ చేస్తోంది. నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మారిపోయాయి. ల్యాబ్స్, డిజిటల్ విద్య, ట్యాబ్స్, కొత్త తరగతి గదులు, ఆర్వో తాగునీరు, మరుగుదొడ్లు, బాలికలకు శానిటరీ ప్యాడ్స్ అన్నీ అందుబాటులో ఉండడంతో బాలికల చేరికలు పెరిగాయి.
టెక్నాలజీ బోధన.. టోఫెల్ శిక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను కలలో కూడా ఊహించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసమే గతంలో అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్చామని గుర్తు చేసుకుంటున్నారు. ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్లలో చదివించేందుకు ఏటా సగటున రూ.లక్ష వరకు ఖర్చయ్యేదని పేర్కొంటున్నారు. తెలుగు మీడియం నుంచి వచ్చిన వారికి అర్థమయ్యేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను ఇవ్వడం పిల్లలకు ఎంతో మేలు చేస్తోందని చెబుతున్నారు. ఇక మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 1,000 పాఠశాలల్లో పూర్తిగా సీబీఎస్‌ఈ బోధనను అందిస్తోంది.
అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లను ఉచితంగా ఇవ్వడంతో చదువుల్లో రాణిస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 6 నుంచి 10 వరకు తరగతి గదుల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), ఎలిమెంటరీ పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధనను అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లను మించిపోయాయి. సైన్స్ ల్యాబ్‌లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరిగినట్లు విద్యార్థులు వెల్లడిస్తున్నారు. ఇక టోఫెల్ శిక్షణ పిల్లల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని, ఇవన్నీ ఎవరూ ఊహించని అద్భుతమైన సంస్కరణలని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.
ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు కూడా..
ప్రతినెలా పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, ప్రతి గురువారం రక్తహీనత గల పిల్లలకు ఫోలిక్ ఐరన్ మాత్రలు అందజేయడంతో గతంలో 30 శాతంగా ఉన్న రక్తహీనత బాధితులు ఇప్పుడు 10 శాతానికి తగ్గిపోయారు. కేవలం పిల్లల చదువులనే కాకుండా వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం గొప్ప విషయమని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా రంగ సంస్కరణల కోసం నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.66,722.36 కోట్లు వ్యయం చేసింది.
జగనన్న అమ్మ ఒడి, మనబడి: నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, విదేశీ విద్యాకానుక లాంటి పలు విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసింది. పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు తెచ్చింది. ప్రతి బడిలోనూ డబుల్ డెస్కు బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు లాంటి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం లాంటి వసతులు కల్పించింది.
ఎంతో బాగుంది
చాలామందికి ప్రభుత్వ స్కూళ్లంటే చిన్నచూపు. ఇన్నాళ్లూ మేమూ అలాగే అనుకున్నాం. మాది సొంతూరు విజయనగరం జిల్లా చీపురుపల్లి. గతంలో హైదరాబాద్‌లో మా బాబు నాగసాయి వంశీని ప్రైవేట్ స్కూల్లో చదివించాం. ఫీజుల మోతతోపాటు ఆటపాటలు ఉండేవి కాదు. రెండేళ్ల క్రితం ఉద్యోగ రీత్యా తుని వచ్చాం. కొద్దిగా సంకోచిస్తూనే మా బాబును శ్రీరాజా హైస్కూల్లో 9వ తరగతిలో చేర్చాం.
ఏడాదిలోనే ఎంతో మార్పు కనిపించింది. గతేడాది టెన్త్‌లో 555 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. క్రీడల్లోను రాణించాడు. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లల్లో ఉన్న సదుపాయాలు కార్పొరేట్ స్కూళ్లల్లో కూడా లేవు. పుస్తకాలతో పాటు బ్యాగు, యూనిఫారం, బూట్లూ సమస్తం ఉచితంగా ఇచ్చారు. మధ్యాహ్నం చక్కటి భోజనం పెడుతున్నారు. ఇంట్లో కంటే బడిలోనే పిల్లలను బాగా చూసుకుంటున్నారు.
– బసవరసు సంతోషి, తుని
ఇంతకంటే ఏం కావాలి?
నా భర్త వడ్రంగి పని చేస్తాడు. ప్రస్తుతం మా పాప తొమ్మిదో తరగతి, బాబు ఏడో తరగతి చదువుతున్నారు. ఖర్చులు తడిసి మోపెడైనా ఇంగ్లీష్ మీడియం ఉందనే ఆశతో ఇద్దరినీ ఐదో తరగతి దాకా ప్రైవేట్ స్కూళ్లలోనే చదివించాం. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక సర్కారు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని తెచ్చింది. దీంతో పిల్లలను రా>జా హైస్కూల్లో చేర్చాం.
తల్లిదండ్రులతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రతి నెలా పిల్లల పురోగతిని ఉపాధ్యాయులు తెలియచేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ఇక పుస్తకాల నుంచి యూనిఫారం వరకు అన్నీ ఉచితమే. సైన్స్ ప్రయోగాలు నేర్పిస్తున్నారు. రోజు ఇంగ్లిష్ పదాలను నేర్పిస్తున్నారు. ఆటలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. తల్లిదండ్రులకు ఇంతకంటే ఇంకేం కావాలి?
– వేమవరపు హేమనాగలక్ష్మి. తుని
ఏం జరుగుతోందో అంతా తెలుసు..
మా చిన్నమ్మాయి తేజస్విని తూరంగి జెడ్పీ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న మా పెద్దమ్మాయి కూడా ఇదే స్కూల్లో చదువుకుంది. గతంలో ఇలాంటి పథకాలే లేవు. అచ్చు పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు బడి తెరిచిన రోజే అన్ని పుస్తకాలు, యూనిఫారం, బ్యాగుతో సహా ఇస్తున్నారు.
అమ్మ ఒడి, విద్యా దీవెన అందుతోంది. మా ఇల్లు బడి పక్కనే ఉంది. అక్కడేం జరుగుతోందో నాకు బాగా తెలుసు. గత నాలుగేళ్లుగా చూస్తున్నా. ప్రభుత్వ బడి ఇంత చక్కగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నా.
– జక్కా యోగీశ్వరి, తూరంగి
ఇక్కడే చదువుకున్నా..
2007లో ఇదే జెడ్పీ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నా. మా అబ్బాయి కూడా ఇక్కడే టెన్త్ పూర్తి చేశాడు. మా అమ్మాయిలు రామతులసి, లక్ష్మి తులసి 9వ తరగతి చదువుతున్నారు. మా కాలానికి ఇప్పటికి బడి పూర్తిగా మారిపోయింది. అప్పట్లో కనీసం బాత్‌రూమ్ కూడా ఉండేది కాదు. పుస్తకాలకు ఇబ్బంది పడేవాళ్లం. ల్యాబ్ అంటే ఏమిటో తెలియదు. బెంచీలు కూడా పూర్తిగా ఉండేవి కావు. మధ్యాహ్నం భోజనం బదులు బియ్యం ఇచ్చేవారు.
ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ స్కూళ్లు పూర్తిగా మారిపోయాయి. ఐదు రోజులు పిల్లలకు గుడ్లు ఇస్తున్నారు. రోజుకో మెనూ చొప్పున పోషకాలు ఉన్న అన్నం వడ్డిస్తున్నారు. పుస్తకాలకు, యూనిఫారం కోసం ఇబ్బంది లేదు. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. మా ఇద్దరు పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చారు. అమ్మ ఒడి వస్తోంది. నేను చదువుకున్నప్పుడు కూడా ఇన్ని సదుపాయాలు ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. నిజంగా జగన్ సర్ గ్రేట్.
– తంగిళ్ల నాలక్ష్మి, తూరంగి
మరో ఐదేళ్లల్లో అద్భుతాలు
దాదాపు 25 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత అద్భుతమైన మార్పులను చూస్తానని అనుకోలేదు. చదువులు పూర్తి స్నేహపూర్వక వాతావరణంలోకి మారిపోయాయి. నీటి సౌకర్యం ఉన్న బాత్‌రూమ్‌లు, శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో ఆడపిల్లల డ్రాపౌట్లు ఆగిపోయాయి. మా స్కూల్లో 720 మంది పిల్లలు చదువుతున్నారు.
29 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివే 80 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ చేరారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు మరో ఐదేళ్లల్లో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. కార్పొరేట్ స్కూళ్లల్లో లేనన్ని సదుపాయాలు, బోధన ఇక్కడ అందుతున్నాయి.
– కడలి లక్ష్మీదుర్గ, తూరంగి జెడ్పీ స్కూల్ హెచ్‌ఎం
పూర్వ వైభవం
తుని సమీపంలోని 40 గ్రామాల కోసం 1904లో ఈ హైస్కూల్ ఏర్పాటైంది. దాదాపు 50 ఏళ్ల పాటు ఎంతో ఉన్నతంగా నడిచింది. ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఆ ప్రాభవం తగ్గిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు పూర్వ వైభవం వచ్చింది. ఇదే స్కూల్లో గతంలో టీచర్‌గా పనిచేశా. ఇప్పుడు హెచ్‌ఎంగా సేవలందిస్తున్నా. నాడు–నేడు కింద అదనపు గదులు నిర్మించారు.
డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం సామాన్యులకు చేరువ కావాలని ఎన్నోసార్లు కోరుకున్నా. వాటితో పాటు టోఫెల్ శిక్షణను కూడా ప్రభుత్వం పేద పిల్లలకు చేరువ చేసింది. పూర్తిస్థాయిలో టీచర్లను ఇచ్చింది. విద్యార్థులు సైతం ఇంగ్లిష్ చదువుల్లో బాగా రాణిస్తున్నారు. ఇంత అద్భుతమైన మార్పులను చూస్తాననుకోలేదు.
– టి.శేషగిరి శ్రీరాజా హైస్కూల్ హెచ్‌ఎం, తుని.
► ఎలక్ట్రికల్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కాకినాడ జిల్లా తూరంగి వాసి పరమట శ్రీనుకు ముగ్గురు పిల్లలు. ఇంగ్లిష్ మీడియం కోసం వారిని ప్రైవేట్ స్కూళ్లలో చేర్చడంతో ఏటా రూ.90 వేలు ఖర్చయ్యేవి. ఇతర ఫీజులు పేరుతో మరో రూ.15 వేలు చెల్లించాల్సి వచ్చేది. రోజంతా కష్టపడితే రూ.500 సంపాదించే శ్రీను ఫీజులు కట్టడం ఆలస్యం కావడంతో ఆయన పిల్లలను బడి బయట నిలబెట్టిన సందర్భాలు ఎన్నో! ఇంటికొచ్చి పిల్లలు ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి.
ఇంత ఖర్చు చేసినా ప్రైవేట్ చదువులేమీ గొప్పగా లేవని శ్రీను గతాన్ని గుర్తు చేసుకున్నాడు. 2019 నుంచి ఆయన పిల్లల చదువుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ముగ్గురు పిల్లలను తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్చాడు. ఆయన పెద్ద కుమార్తెకు రెండేళ్లు జగనన్న అమ్మ ఒడి వచ్చింది. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతూ జగనన్న విద్యా దీవెన కింద ఉచిత విద్యను పొందడంతో పాటు వసతి దీవెన కింద రూ.20 వేలు అందుకుంటోంది. టెన్త్ చదివే రెండో పాపకు అమ్మ ఒడి అందుతోంది. ఉచితంగా, పుస్తకాలు, యూనిఫారంతో పాటు బూట్లు కూడా ఇచ్చారు.
ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడికి కూడా అన్ని సదుపాయాలు అందాయి. ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం తపన పడ్డ ఈ తండ్రి ఆశలను ప్రభుత్వం నెరవేర్చింది. ట్యాబ్‌లు, డిజిటల్ బోధన లాంటి చక్కటి సదుపాయాలను కల్పించింది. ప్రైవేటు చదువులతో ఆర్థికంగా చితికిపోయిన శ్రీను గతంలో పిల్లల ప్రైవేటు చదువుల కారణంగా కొత్త దుస్తులు కూడా కొనుక్కోలేకపోయానని, నాలుగేళ్లుగా చదువుల ఖర్చు లేకపోవడంతో ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణం చేపట్టినట్టు ఆనందంగా చెప్పాడు.
► కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచిలో ఇటుకల బట్టీని నిర్వహించే మొల్లేటి బేబి కుటుంబం గతంలో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లింది. కుమారుడు ఆదిత్యవర్థన్‌ను రెండో తరగతి వరకు అక్కడే చదివించారు. ఫీజుల భారాన్ని తట్టుకోలేక తునిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదివించారు. ఇక్కడా అదే పరిస్థితి తలెత్తడంతో తునిలోనే శ్రీరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్చారు. ‘రెండేళ్ల నుంచి బాబులో మంచి మార్పు గమనిస్తున్నా. ప్రైవేట్ స్కూళ్లలో లేని ఎన్నో మంచి వసతులు ఇక్కడున్నాయి. ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేయిస్తున్నారు.
చదువుల్లో, ఆటల్లో బాగా రాణిస్తున్నాడు. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. ప్రతి నెలా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి పిల్లల ప్రగతిని వివరిస్తున్నారు. మాలాంటి కుటుంబాలకు భారంగా మారిన పిల్లల చదువులను ప్రభుత్వమే తన బాధ్యతగా తీసుకోవడం ఎంతో గొప్ప విషయం. ప్రభుత్వ బడికి మారడంతో ఏటా ఫీజులు రూపంలో చెల్లించే రూ.50 వేల వరకు మిగులుతోంది. ఇంత గొప్ప సౌకర్యాలు, సదుపాయాలు, బోధన హైదరాబాద్‌లోని ప్రైవేట్ స్కూల్లో కూడా చూడలేదు’ అంటూ ఆమె సంతోషంగా చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment