తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు? | Telangana Education Department confusion on Central Govt recommendations on Telugu Medium | Sakshi
Sakshi News home page

తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు?

Published Thu, Dec 26 2024 5:33 AM | Last Updated on Thu, Dec 26 2024 5:33 AM

Telangana Education Department confusion on Central Govt recommendations on Telugu Medium

మాతృభాషలో ఉన్నత విద్య బోధించాలన్న కేంద్రం సిఫార్సులపై రాష్ట్ర విద్యాశాఖ తర్జనభర్జన

సాక్షి, హైదరాబాద్‌: మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంటోంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేసింది. సాంకేతిక విద్య సహా అన్ని ఉన్నత విద్య కోర్సులకు స్థానిక భాషల్లో పుస్తకాలు అందించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పరిస్థితిపై రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 

ముఖ్యంగా స్కూల్‌ స్థాయిలో తెలుగు మీడియం పరిస్థితి అంతంత మాత్రంగానే తేలింది. తెలుగు మీడియంలో బోధించడం ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందిగానే ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిష్‌ వాడుక భాషగా మారడం, కొత్తతరం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంతో తెలుగు బోధనలోనూ ఇంగ్లిష్‌ పదాలు దొర్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యను తెలుగులో బోధించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై నిపుణులతో కమిటీ వేసే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

చూపంతా ఆంగ్ల మాధ్యమం వైపే.. 
రాష్ట్రంలో తెలుగు మీడియం కన్నా ఇంగ్లిష్‌ మీడియం వైపే ప్రజలు మొగ్గుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కేవలం 0.6 శాతం మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది 6.7 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో 41,628 ప్రభుత్వ, ప్రైవేటు బడులు ఉండగా.. వాటిలో 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

ప్రభుత్వ బడుల్లో ఒకటి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 22,63,491 మందికాగా.. ఇందులో 4,08,662 మంది (18 శాతం) మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో 34,92,886 మంది చదువుతుంటే... అందులో 20,057 మంది (0.57 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎయిడెడ్‌ స్కూళ్లలో చదువుతున్న 62,738 మందిలో 8,960 మంది మాత్రమే తెలుగు మీడియం వారు. 

ఇంగ్లిష్‌ ముక్కలొస్తే చాలంటూ.. 
గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం చదివించాలనే భావిస్తున్నారని విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో 2023 నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టినా... ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇంగ్లిష్‌ నేర్చుకుని, మాట్లాడటం వస్తే చాలన్న భావన కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. 

మరోవైపు టెన్త్, ఇంటర్‌ తర్వాత దొరికే చిన్నా చితక ఉద్యోగాలకూ ఆంగ్ల భాష ప్రామాణికంగా మారిందని.. దీనితో ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమం కోసం పంపుతున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లోనూ తెలుగు మీడియం కంటే ఆంగ్ల మాధ్యమంలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్న కేంద్ర సూచనలపై పీటముడి పడుతోంది. తెలుగు మీడియంలో చేరేవారెవరు, బోధించేవారెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement