Telangana Education Department
-
తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్: మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంటోంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేసింది. సాంకేతిక విద్య సహా అన్ని ఉన్నత విద్య కోర్సులకు స్థానిక భాషల్లో పుస్తకాలు అందించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పరిస్థితిపై రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో తెలుగు మీడియం పరిస్థితి అంతంత మాత్రంగానే తేలింది. తెలుగు మీడియంలో బోధించడం ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందిగానే ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిష్ వాడుక భాషగా మారడం, కొత్తతరం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంతో తెలుగు బోధనలోనూ ఇంగ్లిష్ పదాలు దొర్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యను తెలుగులో బోధించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై నిపుణులతో కమిటీ వేసే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చూపంతా ఆంగ్ల మాధ్యమం వైపే.. రాష్ట్రంలో తెలుగు మీడియం కన్నా ఇంగ్లిష్ మీడియం వైపే ప్రజలు మొగ్గుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కేవలం 0.6 శాతం మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది 6.7 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో 41,628 ప్రభుత్వ, ప్రైవేటు బడులు ఉండగా.. వాటిలో 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.ప్రభుత్వ బడుల్లో ఒకటి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 22,63,491 మందికాగా.. ఇందులో 4,08,662 మంది (18 శాతం) మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో 34,92,886 మంది చదువుతుంటే... అందులో 20,057 మంది (0.57 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 62,738 మందిలో 8,960 మంది మాత్రమే తెలుగు మీడియం వారు. ఇంగ్లిష్ ముక్కలొస్తే చాలంటూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదివించాలనే భావిస్తున్నారని విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో 2023 నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా... ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇంగ్లిష్ నేర్చుకుని, మాట్లాడటం వస్తే చాలన్న భావన కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. మరోవైపు టెన్త్, ఇంటర్ తర్వాత దొరికే చిన్నా చితక ఉద్యోగాలకూ ఆంగ్ల భాష ప్రామాణికంగా మారిందని.. దీనితో ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమం కోసం పంపుతున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లోనూ తెలుగు మీడియం కంటే ఆంగ్ల మాధ్యమంలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్న కేంద్ర సూచనలపై పీటముడి పడుతోంది. తెలుగు మీడియంలో చేరేవారెవరు, బోధించేవారెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
తెలంగాణ వర్సిటీలకు వీసీల నియామకం.. నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు వచ్చే నెల 12 వరకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్‌నగర్), జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్)లకు వైస్ ఛాన్స్లర్ల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించింది. -
TS: ‘చంద్రయాన్’పై విద్యాశాఖ ఆదేశాలు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో బుధవారం పాఠశాలల టైమింగ్ విషయంలో జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. రేపు చంద్రయాన్ టెలికాస్ట్ కోసమని పాఠశాల ని 6.30 గం. ల వరకు నడపవలసిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. అయితే.. రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులకు ప్రొజెక్టర్/కె యాన్/టీవీ ల ద్వారా చూపెట్టాలని.. మిగతా పాఠశాలల విద్యార్థులు ఇంటి వద్ద టీవీ లో గాని మొబైల్ లో గాని చూడమని అవగాహన కల్పించాలని తెలిపింది. ఒకవేళ రేపు సాయంత్రం చూడని పక్షంలో తర్వాతి రోజు పాఠశాల సమయంలో విద్యార్థుల కు పాఠశాల లో చూపించాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం కోసమని విద్యార్థులను బడి బయటకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేసిన విద్యాశాఖ.. చంద్రయాన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చంద్రయాన్ 3 లాండింగ్ నేపథ్యంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు టీ సాట్, టీ సాట్ నిపుణ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించేందుకు ఏర్పాటు చేయాలని అంతకు ముందు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. -
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. బడి వేళలు మార్చుతూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల వేళ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాలను మార్చుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (రేపటి) నుండి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.15 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్ర 4.45 వరకు పని చేస్తాయి. అయితే, విద్యాశాఖ తాజా నిర్ణయానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. మరోవైపు తెలంగాణలో వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి రెడ్ అలెర్ట్, హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సోమవారం కూడా భారీగా వర్షాపాతం నమోదైంది. (ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన సర్కార్) సమస్యల బడి భవనాలు.. భారీవర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గత గురు, శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం వెలువడిన వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్ర స్థాయిలో తాజా పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. అయితే, చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయి. తరగతి పైకప్పులు కురుస్తున్నాయి. వర్షపునీరుతో గదుల్లో బోధన జరిపే అవకాశం తక్కువ. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈక్రమంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు కొందరు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు. (హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆరెంజ్ అలెర్ట్ జారీ) -
తెలంగాణ విద్యాశాఖ తీరు వివాదాస్పదం.. ఓటు హక్కు లేదని వివక్ష.. !
సాక్షి, హైదరాబాద్: స్పౌజ్‌లుగా ఉన్న ఎస్జీటీల విషయంలో విద్యాశాఖ అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్ అసిస్టెంట్లకు ఓటు హక్కు ఉండబట్టే వారికి అవకాశం ఇచ్చారని, తమకు లేదంటూ వివక్ష చూపుతున్నారని ఎస్జీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారు. దీనిపై ఏడాదిగా పోరాటాలు నడుస్తున్నాయి. తాజాగా జరుగుతున్న బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్స్ 615 మందికి సొంత జిల్లాలకు వెళ్ళేందుకు అనుమతించారు. కానీ 1,585 మంది ఎస్జీటీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారిలో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినాలని వారు కోరుతున్నారు. మా ఇద్దరి మధ్య 250 కి.మీ. దూరం నేను మహబూబాబాద్‌లో, నా భర్త సిద్దిపేటలో పనిచేస్తున్నాం. ఇద్దరు పనిచేసే ప్రాంతాల మధ్య దూరం 250 కిలోమీటర్లు. దీంతో ఇద్దరు పిల్లలను చెరొకరం పంచుకున్నాం. తీవ్రమైన మానసిక వ్యథతో 13 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నాం. తల్లిగా ఓడిపోతున్నాను. భర్తకు దూరమవుతున్నాను. ఈ బదిలీల్లోనైనా న్యాయం జరుగుతుందనే ఆశ కన్పించడం లేదు. – ఎస్.మమత (ఎస్జీటీ, మహబూబాబాద్) -
ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యానికి ముకుతాడు వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డొనేషన్లు, ఫీజులు కనీస వసతులతో పాటు నిర్వహణ తీరుతెన్నులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమైంది. సీసీ కెమెరాల నిఘా నడుమ పాఠశాల నిర్వహణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మండలం యూనిట్‌గా ఆయా పాఠశాల వ్యవహారంపై సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాల అనుమతి పునరుద్ధరించే సమయంలో చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. పాఠశాలకు అనుమతి రెన్యువల్ చేయడమో.. లేక తిరస్కరించడమో చేయనుంది. నిబంధనలు తూచ తప్పకుండా పాటించే విధంగా షరతులను అనుమతికి కొర్రీగా పెట్టనుంది. నిబంధనలు అమలు చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర స్కూళ్లపై కూడా.. ►స్టేట్ సిలబస్‌తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్‌పై కూడా పర్యవేక్షణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. స్టేట్ సిలబస్ పాఠశాలపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులది ఉండగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపునకు మాత్రం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) మాత్రమే జారీ చేస్తోంది. ►ఈ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్ఓసీ సైతం ఉపసంహరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఫీజులపై దృష్టి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు దండుకునే విషయంలో చూపే శ్రద్ధ.. మౌలిక వసతులను కల్పించడంలో లేకపోవడం సర్వసాధారణంగా తయారైంది. ►ప్రైవేటు యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలా ఉంచుతున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి.. ►ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. ►కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఒత్తిళ్లు, పలుకుబడితో అనుమతులు లభించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతుల జారీ అనుమానాలకు తావిస్తోది. -
చదువు వెనుక‘బడి’!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్య నాణ్యత సూచీలో తెలంగాణ వెనుకబడింది. రాష్ట్రంలోని బడుల్లో మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరతతో విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయని కేంద్రం వెలువరించిన ‘పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గ్రేడ్ (పీఐజీ)’ నివేదిక తేల్చింది. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి చూస్తే.. పాఠశాల విద్య నాణ్యతలో తెలంగాణ 31వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. గత ఏడాదికన్నా ఐదు పాయింట్లు తగ్గిపోయి దిగువ నుంచి ఏడో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. వేలకొద్దీ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, బోధనతోపాటు పర్యవేక్షణ కూడా సరిగా లేదని పేర్కొంది. మనకన్నా వెనుక ఈశాన్య రాష్ట్రాలే.. పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పాలన (గవర్నెన్స్), విద్యార్థుల నమోదు వంటి అంశాల ఆధారంగా ఏటా ‘పీఐజీ’ సూచీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆయా అంశాల ఆధారంగా 2020–21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు 754 పాయింట్లు వచ్చాయి. అంతకుముందు 2019–20 పీజీఐలో రాష్ట్రం 759 పాయింట్లు పొందడం గమనార్హం. ఈసారి తెలంగాణకన్నా దిగువన సిక్కిం (751 పాయింట్లు), మణిపూర్ (741), నాగాలాండ్ (728), ఉత్తరాఖండ్ (719), మేఘాలయ (716), అరుణాచల్‌ప్రదేశ్ (669) మాత్రమే నిలిచాయి. కేరళ, మహారాష్ట్రలు 928 పాయింట్లతో అన్నింటికన్నా ముందంజలో ఉన్నాయి. బోధన, పర్యవేక్షణ రెండూ కొరతే! రాష్ట్రంలో పీఐజీ తగ్గడానికి మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో (గురుకుల, రెసిడెన్షియల్ కాలేజీలు కలిపి) 69,15,241 మంది చదువుతున్నారు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో 33,03,699, ఎయిడెడ్ 90,601, ప్రైవేటు సంస్థల్లో 35,14,380 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 22గా ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత, ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లతోనే నడిపించే పరిస్థితి ఉంది. 8,630 మంది భాషా పండితులు, పీఈటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్‌గ్రేడ్ కాలేదు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4,207 పీఎస్ హెచ్ఎం పోస్టులుండగా.. 2,386 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతావి 1,821 ఖాళీలున్నాయి. కొత్తగా 5,793 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఇక పాఠశాల విద్యను పర్యవేక్షించాల్సిన డీఈవోలు, ఎంఈవోలు పూర్తిస్థాయిలో లేరు. ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలు ఉన్నారు. 21 జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాకులుగా చేశారు. అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. దీంతో హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. అంతేకాదు ఒక్కో హెచ్ఎంకు ఆరేడు మండలాలు అప్పగించారు. దీనివల్ల పాఠశాలల్లో విద్యా బోధన, పర్యవేక్షణకు ఇబ్బంది కలుగుతోంది. మౌలిక వసతుల కరువుతో.. పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఇంకా వేగం పుంజుకోలేదని.. రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో సమస్యలు కనిపిస్తున్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 38వేల బడుల్లో శౌచాలయాలు ఉన్నా, వాటిలో 10వేల వరకు పనికిరాని స్థితిలో ఉన్నాయి. బాలికలు ఎక్కువగా ఉండే 5,700 స్కూళ్లలోనూ శౌచాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇది బాలికల గైర్హాజరు పెరగడానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో దాదాపు 20వేల స్కూళ్లలో విద్యార్థులకు లైబ్రరీ అనేదే తెలియదు. లైబ్రరీ ఉన్నా అందులో పుస్తకాలు శూన్యం. 15వేల బడుల్లో ఆటస్థలాలు లేవు. దీనివల్ల విద్యార్థుల్లో మానసికోల్లాసం నష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40,437 స్కూళ్లకు విద్యుత్ సౌకర్యమున్నా.. 38,920 స్కూల్స్‌లోనే సరిగా సరఫరా జరుగుతోంది. డిజిటల్ విద్య వైపు దేశం అడుగులేస్తున్నా.. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని స్కూళ్లు 20వేలకుపైగా ఉన్నాయి. ఇవన్నీ విద్య ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయని పీఐజీ నివేదిక పేర్కొంది. కేంద్రం తీసుకున్న డేటా పాతది పీజీఐ నివేదికను పరిశీలించాం. వాళ్లు తీసుకున్న డేటా పాతది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. మౌలిక వసతుల మెరుగుకు మన ఊరు–మన బడి ప్రారంభించాం. ఇప్పటికే చాలా స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యలో అనేక మార్పులు చేస్తున్నాం. బోధనా ప్రమాణాలు మెరుగు పరుస్తున్నాం. వచ్చే ఏడాది మనం మంచి ర్యాంకు సాధిస్తాం. – వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి వచ్చే ఏడాది గ్రేడ్–1లో ఉంటాం ఈ నివేదిక మొత్తం కోవిడ్ కాలంలో జరిగిన పరిశీలనే. పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో పాయింట్స్ తగ్గినా మనం గ్రేడ్–2లోనే ఉన్నాం. కోవిడ్ సమయంలో స్కూల్స్ తెరవలేదు. అందుకే బయోమెట్రిక్ హాజరు వాడలేదు. దాన్ని కొలమానంగా తీసుకోలేం. అదీగాక కోవిడ్ వల్ల రాష్ట్రంలో విద్యా వలంటీర్లను కూడా నియమించలేదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది పీఐజీలో మనం గ్రేడ్–1లో ఉండటం ఖాయం. – దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ టీచర్ల కొరత తీర్చితే నాణ్యత పెరుగుతుంది రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించకపోతే ఉపాధ్యాయ కొరత ఎలా తీరుస్తారు? ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ముందు దీన్ని పరిష్కరించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తే పాఠశాల విద్యలో నాణ్యత మెరుగుపడుతుంది. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పారదర్శకత పెంచాలి ప్రైవేటు స్కూళ్లకు అనుమతి ఇచ్చే క్రమంలో ఆన్లైన్ విధానం ఉండాలి. ఈ తరహా పారదర్శకత అవసరం. డిజిటలైజేషన్ చేపట్టాలి. సకాలంలో నిధులు ఇవ్వాలి. అప్పుడే విద్యాశాఖలో నాణ్యత పెరుగుతుంది. – పి.రాజాభానుచంద్ర ప్రకాశ్, హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
టార్గెట్ రిజల్ట్స్.. 100 శాతం ఫలితాలు సాధించే బడులకు ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ రూట్‌మ్యాప్ సిద్ధం చేసింది. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే బడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని.. ఫలితాల సాధన దిశగా జిల్లా అధికారులకు టార్గెట్లు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే వార్షిక పరీక్షల తేదీలను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ.. ఫలితాలు తక్కువగా ఉండే బడుల వివరాలను సేకరిస్తోంది. ఆయా స్కూళ్లలో ఫలితాలు తక్కువగా ఉండటానికి కారణాలను విశ్లేషిస్తూ నివేదికలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు సరిగా జరగలేదు. 2021లో పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేశారు. 2020లోనూ పరీక్షలు రాసినవారి వరకు ఉత్తీర్ణులుగా ప్రకటించారు. కరోనా కాలంలో బోధన జరిగా జరగకపోవడమే దీనికి కారణం. అయితే ఈ ఏడాది సకాలంలో బడులు తెరిచారు. సిలబస్ కూడా సకాలంలో పూర్తవుతుందని భావిస్తున్నారు. అంతర్గత పరీక్షలన్నీ నిర్వహించడం వల్ల వార్షిక ఫలితాలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారనే అభిప్రాయంతో విద్యాశాఖ ఉంది. సన్నద్ధతకు ప్రత్యేక చర్యలు ఈసారి పదో తరగతిలో ఉన్న విద్యార్థులంతా కరోనా కాలంలో 8, 9 తరగతులు చదివినవారే. ఆ రెండేళ్లు విద్యా సంస్థలు సరిగా తెరవక, బోధన జరగక అభ్యసన నష్టాలు ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. దానిని సరిచేయడానికే బ్రిడ్జి కోర్సులు నిర్వహించింది. అంతకు ముందు విద్యార్థులు చదివిన తరగతుల్లో వెనుకబడిన పాఠాలను మళ్లీ బోధించారు. కానీ దీని నుంచి ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. విద్యాశాఖ అంతర్గత సర్వేలోనూ ఇది వెల్లడైంది. ఈ క్రమంలోనే క్లాసులో కనీసం 80 శాతం విద్యార్థులకు పాఠం అర్థమైతేనే సిలబస్‌లో ముందుకెళ్లాలని విద్యాశాఖ ఆదేశించింది. సరిగా అర్థంకాని విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఒక గంట ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు పుస్తకాలు సరిగా అందకపోవడం, ఇతర కారణాలతో బోధన సరిగా సాగలేదని భావిస్తున్నారు. కాబట్టి వచ్చే ఐదు నెలల పాటు ప్రత్యేక బోధనపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ పేర్కొంది. అంతర్గత పరిశీలనలో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక బోధన చేపట్టాలని.. ప్రతి వారం వారి పురోగతి అంచనా వేయాలని సూచించింది. నెల రోజుల్లో వారి సామ ర్థ్యాన్ని గుర్తించి, అప్పటికీ పురోగతి లేకపోతే మరో సారి ప్రత్యేక బోధన చేపట్టాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకుపైగా బడుల్లో టెన్త్ ఫలితాలు గతం కన్నా తగ్గే అవకాశం ఉందని.. జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించింది. సబ్జెక్టు టీచర్లు లేకుండా ఎలా? టెన్త్ ఫలితాల సాధనకు టార్గెట్లు పెడుతున్న అధికారులు.. క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికీ 10వేల బడుల్లో ఏదో ఒక సబ్జెక్టు టీచర్ కొరత ఉందని, హైస్కూల్ టీచర్లను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. అభ్యసన నష్టాలను ఈ ఐదు నెలల్లో ఎలా భర్తీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖలో దాదాపు 18 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని.. ఈ ఏడాది విద్యా వలంటీర్లను కూడా నియమించలేదని గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఎంఈవోలు, డీఈవోల పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పరిశీలన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. హైస్కూల్ హెచ్ఎంలకు ఎంఈవోగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, బోధనపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా చేస్తున్నారని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయి టీచర్ల కొరత పరిష్కరించకుండా, ఫలితాల కోసం టార్గెట్లు పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. -
బంజారాహిల్స్ డీఏవీ పాఠాశాల గుర్తింపు రద్దు
-
పర్యవేక్షణ అధికారుల్లేక పరేషాన్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యశాఖలో ఏళ్ల తరబడి పర్యవేక్షక అధికారుల కొరత పీడిస్తోంది. 30 లక్షలమంది విద్యార్థులు, లక్ష మందికిపైగా సిబ్బంది ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థలో పలు మండలాలకు ఎంఈవో, కొన్ని జిల్లాలకు డీఈవోలు లేరు. ప్రధానోపాధ్యాయులకే ఎంఈ వో పోస్టులు తాత్కాలికంగా అప్పగిస్తున్నారు. పలువురు ఎంఈవోలను అదనపు మండలాలకు సర్దుబాటు చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం స్కూళ్లు మొదలైన నాటి నుంచి ప్రతీ అంశాన్ని పర్యవేక్షించడం, అవసరమైన నివేదికలు తయారు చేసి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మండల, జిల్లాస్థాయి అధికారుల పాత్ర కీలకం. ఇంగ్లిష్ మీడియం బోధన మొదలైనా పర్యవేక్షక అధికారుల కొరత వల్ల ఇప్పటివరకూ క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నతాధికారులకు అందలేదని తెలుస్తోంది. 317 జీవోకు ముందు జిల్లా, జోన్లుగా రెండంచెల వ్యవస్థ ఉండేది. జీవో అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా, జోన్, మల్టీజోన్లుగా మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు, డైట్ లెక్చరర్ల పోస్టులన్నీ మల్టీజోన్ క్యాడర్ పోస్టులుగా ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణకు మల్టీ జోన్‌స్థాయి అధికారి పోస్టులు ఉండాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఏడు జోన్లకు పాలన వ్యవహారాలు నిర్వహించడానికి ఏడుగురు జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులు అవసరం కాగా, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అత్యంత కీలకమైన పరీక్షల విభాగం, ఎస్సీఈఆర్టీ, ఓపెన్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, సైట్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గ్రంథాలయాలు, పాఠ్యపుస్తకాలు, పబ్లిక్ స్కూల్స్, జవహర్ బాలభవన్ వంటి విభాగాల నిర్వహణకు అధికారులుంటేనే వ్యవస్థలో లోపాలను సరిచేయవచ్చని సూచిస్తున్నారు. కేజీబీవీల్లో ఇద్దరు, మోడల్ స్కూల్స్ విభాగం, ఓపెన్ స్కూల్స్‌లో ఒకరు చొప్పున జాయింట్ డైరెక్టర్లున్నారు. మిగిలిన విభాగాల్లో ఏడీ పోస్టు కానీ, పూర్తిస్థాయిలో డీడీ పోస్టులు లేవు. ఎంఈవోలు... డీఈవోలు ఎక్కడ? ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలున్నారు. 21 జిల్లాల్లో డీఈవో పోస్టులు మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాకులుగా చేశారు. ప్రతీ బ్లాక్‌కు ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఇప్పుడున్న టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే భర్తీ అవుతాయి. స్థానిక సంస్థల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఎక్కువ వున్నారని, కాబట్టి తమకే ఎంఈవోలు కావాలని పంచాయతీరాజ్ విభాగం టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో నేరుగా నియమించిన ఉపాధ్యాయులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులు దక్కించుకునే అర్హత తమకే ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే హెచ్ఎంల పదోన్నతి ప్రతి ఏటా వాయిదా పడుతూ వస్తోంది. పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో కొంతమంది ఎంఈవోలకు 6 నుంచి 8 మండలాలు ఎంఈవో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో తమ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు దెబ్బతినే వీలుందని ఉపాధ్యాయులు అంటున్నారు. -
విద్యార్థుల మెరుగైన కెరీర్ కోసం ‘ఇంటర్సెల్’తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదారాబాద్: విద్యార్థులకు మెరుగైన కేరీర్ ఎదుగుదల అవకాశాలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఆ దిశగా గణనీయమైన పురోగతి సాధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే.. ఆన్లైన్ మెంటారింగ్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ప్లాట్ ఫామ్ అయిన ‘ఇంటర్సెల్’తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషనరేట్ ఆఫ్ కాలేజియెట్ ఎడ్యుకేషన్(సీసీఈటీఎస్)తో ఇంటర్సెల్ ఎంవోయూ కుదుర్చుకుంది. ► విద్యార్థులు ఇంటర్సెల్ ప్లాట్‌ఫామ్‌పై తమ సంబంధిత రంగాల్లోని నిపుణుల నుంచి గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ పొందుతారు. ► రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో మెంటారింగ్ సిస్టమ్ అమలుకు అవసరమైన సహాయాన్ని, మద్దతును సీసీఈటీఎస్ అందిస్తుంది. ► ఇంటర్సెల్ వర్చువల్ మెంటార్ నెట్వర్క్ విద్యార్థులు, యువ వృత్తినిపుణులు ప్రపంచవ్యాప్తంగా మెంటార్లతో కనెక్ట్ కావడానికి ఒక నిర్మాణాత్మక వేదికను అందిస్తుంది. ► ఈ ఎంవోయూ మూడు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య కమిషనర్, ఐఏఎస్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కెరీర్ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది. ఇంటర్సెల్తో ఈ భాగస్వామ్యం మన రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును నిర్మించాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఇంటర్సెల్ వ్యవస్థాపకుడు, సీఈవో అరుణభ్ వర్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ కెరీర్ పురోభివృద్ధికి తోడ్పడటానికి మేం ఎదురు చూస్తున్నాం. మా ప్లాట్‌ఫామ్‌తో, విద్యార్థులు విభిన్న రంగాల్లోని అత్యుత్తమ కెరీర్ మెంటార్లను యూక్సెస్ చేసుకుంటారు. వారు కెరీర్ విజయానికి మార్గనిర్దేశం చేయడానికి అందుబాటులో ఉంటారు.’ అని చెప్పారు. ఇంటర్ సెల్ అంటే ఏమిటి? ఇంటర్సెల్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ఆన్లైన్ మెంటారింగ్ ప్లాట్‌ఫామ్. 30కిపైగా దేశాలకు చెందిన మెంటార్లు, 250కిపైగా కెరీర్ స్పైషలైజేషన్లతో ఇంటర్సెల్ విద్యార్థులు, యువ వృత్తి నిపుణులకు లైవ్ వన్ టూ వన్ మెంటారింగ్ సెషన్లను అందిస్తుంది. ఇంటర్సెల్ వద్ద మెంటార్లు అత్యంత గౌరవనీయమైన పరిశ్రమ నిపుణులు. వీరు విభిన్న రంగాలు, పరిశ్రమల్లో 5వేలకు పైగా బ్రాండ్లలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇదీ చదవండి: Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు! -
విద్యా వలంటీర్లతో నెట్టుకొద్దాం! 12 వేల మందిని తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరంలో మళ్లీ విద్యా వలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి విద్యా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే విద్యా వలంటీర్ల నియామక ప్రక్రియ చేపట్టే వీలుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టెట్ ఉత్తీర్ణులైన వారిని సబ్జెక్టుల అవసరాన్ని బట్టి నియమించే అవకాశముందని తెలుస్తోంది. రెండేళ్లుగా కరోనా వెంటాడటంతో స్కూళ్లు సరిగా నడవలేదు. దీంతో విద్యా వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేదు. గత సంవత్సరం పాఠశాలలు తెరిచినా, వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. జీపీఏ తగ్గడం వల్లే.. ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల జీపీఏ తగ్గింది. దీనిపై ఇటీవల అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల వరకూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల కొరత విపరీతంగా ఉంది. కొన్ని స్కూళ్లలో ఉన్న వాళ్లే మిగతా సబ్జెక్టులు బోధించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలు విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపాయి. దీనికి తోడు కరోనా కారణంగా అభ్యసన నష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపడుతున్నారు. ఈ దృష్ట్యా ఉపాధ్యాయుల కొరత ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే వీలుంది. ఈ ఏడాది ప్రభుత్వం టీచర్ల నియామకం చేపడుతుందని భావించారు. కానీ పదోన్నతుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో తాత్కాలికంగా విద్యా వలంటీర్లలతో ఈ ఏడాది నెట్టుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 2019లో 16 వేల మంది వలంటీర్లను తీసుకున్నా, ఆ తర్వాత ఈ సంఖ్య 12 వేలకు తగ్గింది. ఇప్పుడు కూడా ఇంతే మొత్తంలో వలంటీర్లను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
సర్కారీ స్కూళ్లలో ఇక ప్రతి బుధవారం బోధన ‘మామూలు’గా ఉండదు!
సాక్షి, భువనగిరి : సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ప్రతి బుధవారం పాఠశాలల్లో ‘బోధన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ మండలం జమీలాపేట ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 22న బోధన కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించడంతో పాటు పఠనంలో దోషాలు నివారించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. బుధవారం బోధనలో ఇలా.. బుధవారం బోధనలో భాగంగా ఆ రోజు పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులను తరగతి గదిలో బిగ్గరగా చదివించడం, అక్షర దోషాలు లేకుండా రాయించడం, భాష దోషాలు లేకుండా, గణితంలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. కిచెన్‌గార్డెన్‌లో భాగంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో కూరగాయ మొక్కలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తారు. చదవండి👉🏻Telangana: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం పర్యవేక్షణ అధికారులు వీరే.. బోధన కార్యక్రమాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈఓ, ఎంఈఓలు, ఎంపీడీఓలు, సెక్టోరియల్ అధికారులు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, జిల్లా, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారు. విద్యార్థులు బిగ్గరగా చదివే అభ్యాసాన్ని ప్రోత్సహిస్తారు. పఠనం మరియు సంఖ్యా గణనలో పురోగతి వయస్సుకు తగిన గణిత శాస్త్ర కార్యకలాపాలను చేయడంతో విద్యార్థుల పురోగతిని పరిశీలిస్తారు. దోషాలు తెలుస్తాయి బోధన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెరుగుతుంది. బిగ్గరగా చదవడం వల్ల దోషాలు తెలుస్తాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి బుధవారం ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చదువులో విద్యార్థులు పురోగతి సాధిస్తారు. –కానుగుల నర్సింహ, డీఈఓ చదవండి👉🏻స్కూల్‌కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి.. టీచర్ బ్రెయిన్ డెడ్.. జీవన్ దాన్ సంస్థ ద్వారా -
టీచర్ల పరస్పర బదిలీలకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కోర్టు తీర్పునకు లోబడి ఉంటామని ఒప్పంద పత్రం సమర్పించిన 1,260 మంది టీచర్ల పరస్పర బదిలీలపై ఈ నెల 20వ తేదీ.. సోమవారం నాటికి ఉత్తర్వులిచ్చే వీలుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను శుక్రవారం క్లియర్ చేసి, విద్యాశాఖకు పంపుతామని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి తెలిపారని యూటీఎఫ్ నేతలు చావా రవి, లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ, జీఏడీ నుంచి ఫైల్ అందిన తర్వాత విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని, సోమవారం బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని శేషాద్రి స్పష్టం చేశారని వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ, కొంతమందిని కొత్త జిల్లాలకు పంపింది. అయితే, పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గ దర్శకాలు వెలువరించింది. దీంతో పరస్పర బదిలీ లపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని అంగీ కార పత్రం ఇచ్చిన వారిని బదిలీ చేసేందుకు విద్యాశాఖ సమ్మతించింది. దీంతో 1,260 మంది ఒప్పంద పత్రాలు సమర్పించారు. వీరిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదోన్నతుల మాటేంటి? బదిలీలు, పదోన్నతులను ఏక కాలంలో పూర్తి చేస్తామని గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చెబుతోంది. కానీ పదోన్నతుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువరించలేదు. కాగా, ఈ నెలాఖరుకు పదోన్నతుల ప్రక్రియ చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇటీవల తెలిపారు. ఉపాధ్యాయులకు 2015లో ప్రమోషన్లు ఇచ్చారు. అప్పటినుంచి తదుపరి పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. త్వరలో వివాదం పరిష్కరించి, ప్రమోషన్లు ఇస్తామని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పడే ఖాళీలను కొత్తవారితో భర్తీ చేసే వీలుందని చెబుతున్నారు. -
నెలాఖరుకల్లా గురుకుల సెట్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు నిర్వహించిన గురుకుల సొసైటీలు ఇప్పుడు ఫలితాల ప్రకటన, అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఐదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఒకట్రెండు సొసైటీల్లో బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి నాలుగైదు రోజుల్లో పరీక్ష పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా అన్నిరకాల ప్రవేశపరీక్షల ఫలితాలు ప్రకటించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫలితాల ప్రకటన తర్వాత వెంటనే అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి. జూలై నెలాఖరుకు ప్రవేశాల ప్రక్రియను కొలిక్కి తెచ్చి, అవసరమున్న కేటగిరీల్లో రెండు, మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించి పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. -
ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సర్కారు కొలువుల జాబితాలో అత్యధిక ఖాళీలు విద్యాశాఖలో ఉండటంతో నిరుద్యోగుల దృష్టి అంతా టీచరు పోస్టులపై కేంద్రీకృతమైంది. కొత్త జోన్లు, జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానుంది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ఫైనలియర్లో ఉన్న అభ్యర్థులకు కూడా కలిసి వచ్చే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం సుమారు 842కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినట్లు తెలుస్తోంది. ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయిదేళ్లుగా నో నోటిఫికేషన్.. గ్రేటర్ పరిధిలో సుమారు 25 వేలమందికిపైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా టీఆర్టీ నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీని నిర్వహించగా ఇప్పటివరకు ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఈసారి ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ అవుతాయనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 4,700 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే.. సర్కారు బడుల్లో భారీగా చేరిక.. గ్రేటర్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల జాతర కొనసాగుతోంది. పదవీ విరమణ, పదోన్నతులు, బదిలీలతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి చతికిలపడి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భరించలేక సర్కారు బడుల్లో తమ పిల్లలను పెద్ద ఎత్తున చేర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతోపాటు విద్యా వలంటీర్లకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం పడుతోంది. రెండు మాధ్యమాల్లో.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించవచ్చని అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేసే అవకాశం ఉండడంతో నియామక పరీక్ష రెండు మాధ్యమాల్లో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బీఎడ్ పూర్తి చేసినవారి సంఖ్యే అధికంగా ఉంది. ఆంగ్ల బోధనపై ప్రస్తుతం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మున్ముందు ఆంగ్లంలో బోధనను దృష్టిలో ఉంచుకుని.. కొత్తగా నియమించే ఉపాధ్యాయులను కూడా ఆ మాధ్యమం వారిని తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. మొత్తం పోస్టుల్లో ఆంగ్ల మాధ్యమం వారినే తీసుకుంటే తెలుగు మాధ్యమం అభ్యర్థులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో రెండు మాధ్యమాల్లో డీఎస్సీకి నిర్వహించే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. టెట్ కోసం.. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తే టీఆర్టీ రాయవచ్చని నిరీక్షిస్తున్నారు. డీఎస్సీకి ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా అయిదేళ్ల నుంచి టెట్ నిర్వహించలేదు. టెట్ పేపర్– 1, పేపర్– 2లో అర్హత సాధించినవారి కంటే టెట్ క్వాలిఫై కాని, 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసినవారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ నిర్వహించాలంటే కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇవ్వాల్సి ఉంటుంది. గత పద్ధతి ప్రకారం డీఈడీ చేసినవారు పేపర్– 1, బీఈడీ చదివినవారు పేపర్– 2 రాయడానికి అర్హులు. ఎన్సీఈఆర్టీ కొత్త మార్గదర్శకాల ప్రకారం బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్– 1, పేపర్– 2 రాయడానికి అర్హులు. ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉత్తర్వులివ్వాల్సి ఉంది. -
క్యాలెండర్ విడుదల: తెలంగాణలో బడులు ఎన్ని రోజులంటే..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యా క్యాలెండర్ విడుదలైంది. విద్యా శాఖ అధికారులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ ఈయర్ విడుదల చేశారు. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వివరాలు తెలిపారు. ఏప్రిల్ 23 పాఠశాలల చివరి పని దినమని చెప్పారు. ఈ ఏడాది పాఠశాల పని దినాలు 213, 47 రోజులు ఆన్లైన్ తరగతులు జరుగుతాయని వివరించారు. చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ క్యాలెండర్ ఇలా.. FA1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి SA1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి 8 డిసెంబర్ వరకు FA2 పరీక్షలు పదో తరగతి జనవరి 31 నుంచి FA2 పరీక్షలు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నుంచి SA2 పరీక్షలు 1 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి18 వరకు పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ ఫిబ్రవరి 25 లోపు మార్చి లేదా ఏప్రిల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు దసరా సెలవులు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు సంక్రాంతి సెలవులు: జనవరి 11 నుంచి జనవరి 16 వరకు -
టీఎస్ ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9వరకు ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ విభాగం మంగళవారం వెల్లడించింది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 13 వరకు వెబ్ఆప్షన్స్ నమోదు.. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుపుతామని చెప్పింది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు కాలేజీల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని ఓ ప్రకటనలో పేర్కొంది. (చదవండి: రేవంత్‌ను నమ్మడం కరెక్టేనా?: మంత్రి ప్రశాంత్ రెడ్డి) -
పుస్తకాల్లేని చదువులు.. విద్యార్థుల చింత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసలే టీవీ పాఠాలు. వాటిని వింటున్న విద్యార్థులు చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు చదువు లకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ పిల్లలకు విద్యా బోధన ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. టీవీ పాఠాలు పెద్దగా అర్థంకావడం లేదని, కనీసం పుస్తకాలున్నా కొంతవరకు వాటిని చదువుకొని ఉపాధ్యాయులను ఫోన్లలో అడిగి సందేహాలను నివృత్తి చేసుకునే వారమని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా.. అవి అత్యధిక మంది విద్యార్థులకు చేరడం లేదు. 8 జిల్లాల్లో అందని పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాల పంపిణీనే ప్రారంభించలేదు. ఆదిలాబాద్, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరినా వాటిని మండల స్థాయికి, పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 12 జిల్లాల్లో 20 శాతంలోపే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వగా, ఆరు జిల్లాల్లో 20-50 శాతంలోపు పంపిణీ చేశారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందినట్లు అధికారులు తేల్చారు. విందామన్నా.. నెట్‌వర్క్‌తో ఇబ్బంది చాలా జిల్లాల్లో విద్యార్థులు టీవీ పాఠాలను వినేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీల్లో ఏయే సమయాల్లో ఆ పాఠాలను బోధిస్తారనే విషయంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు కొంత చొరవ తీసుకొని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠాలు ప్రసారమయ్యే సమయం తెలియజేస్తున్నారు. దీంతో కొద్దిమంది వాటిని వింటున్నారు. మిగతా విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లు కలిగిన కొందరు విద్యార్థులు టీశాట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని పాఠాలను విందామనుకుంటే నెట్వర్క్ సమస్యలతో వీడియో పాఠాలను వినలేకపోతున్నారు. పుస్తకాలు ఇవ్వలేదు మా పాప పదో తరగతి రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా సందేహాలు చూసుకునేందుకు పుస్తకాలు లేవు. దీంతో ఇబ్బంది పడుతోంది. - సుభద్ర, విద్యార్థిని తల్లి, రామన్నపేట ఏమి అర్థం కావడం లేదు ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నా పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆన్లైన్లో పాఠాలు చూడటం తప్పæ పుస్తకంలో చదువుకునే వీలులేకుండా పోతోంది. సందేహం వస్తే పుస్తకాలు లేకపోవటంతో ఏమీ అర్థంకావడం లేదు. - రాకేశ్, 10వ తరగతి ,బాలుర ఉన్నత పాఠశాల, మంచిర్యాల పుస్తకాలు లేకుండా విద్య ఎలా? ఆన్లైన్లో బోధించేటప్పుడు విద్యార్థులకు పుస్తకాలు ముందు ఉండాలి. అర్థంకాని అంశాలను అందులో చూసి చదువుకుంటారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు విద్యనందించడం సాధ్యం కాదు. పుస్తకాలు లేకుండా క్లాస్‌లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. అందరికీ పుస్తకాలు అందేలా చూడాలి. - తుకారం, టీచర్, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా -
సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా!
మంత్రివర్గ ఉప సంఘం సూచనలివీ.. స్కూళ్లకు పక్కా భవనాలు, అవసరమైన చోట అదనపు తరగతి గదులను నిర్మించాలి. వివిధ పద్ధతుల ద్వారా నిధులను సమీకరించాలి. సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద కేంద్రం నుంచి కొంత మేరకు నిధులు వస్తాయి. సర్కారీ స్కూళ్లను అభివృద్ధి చేస్తే ప్రైవేటు పాఠశాలలకు కొంతైనా పోటీ ఇవ్వొచ్చు. రానున్న రోజుల్లో అదనంగా 10 లక్షల మంది విద్యార్థులు చేరొచ్చని అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను విడతల వారీగా అభివృద్ధి చేయాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసింది. మూడేళ్లలో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేయాలని పేర్కొంది. మొత్తం 27 వేల స్కూళ్లలో, తొలుత ఈ ఏడాది 9 వేల స్కూళ్లను అభివృద్ధి చేయాలని, అందులో కొన్నింటికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించింది. అందుకోసం ఈ ఏడాది రూ.2వేల కోట్ల మేరకు ఖర్చు చేయా లని సిఫార్సు చేసింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సర్కారుకు నివేదిక సమర్పించింది. మొత్తం అన్ని స్కూళ్ల అభివృ ద్ధికి రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు అవస రమవుతాయని అంచనా వేసింది. మూడేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణులు, విద్యాశాఖ అధికారులతో పలుమార్లు చర్చించిన అనంతరం ఈ నివేదికను తయారు చేసింది. అలాగే అధికారుల బృందం ఏపీలోని నాడు నేడు పథకం స్కూళ్లతో పాటు ఢిల్లీలోని స్కూళ్లనూ పరిశీలించింది. రాష్ట్రంలో అనేక స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేవని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారణకు వచ్చింది. గదులు లేకపోవడం, పాత భవనాలు కావడంతో పెచ్చులూడి పోవడం, ప్రహారీ గోడలు లేకపోవ డంతో పశువులు, ఇతర జంతువులు సంచరించడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం, కొన్నిచోట్ల ఫ్యాన్లు లేక విద్యార్థులు యాతనలు పడుతున్నారు. గోడలకు పెయింటింగ్ వేయకపోవడంతో అనేక స్కూళ్లు బూజు పట్టి దర్శనమిస్తున్నాయి. బల్లలు, కుర్చీలు లేక విద్యా ర్థులు, టీచర్లు కూర్చోవడానికి వీలు లేకుండా పోతుంది. మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు లేక పోవడాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాఠశాలల అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘం పలు సూచనలు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు నిధులు సమకూర్చి ఈ ఏడాది నుంచే పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. నివేదిక అనంతరం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యాశాఖ వర్గాలు వేచి చూస్తున్నాయి. తొలి ఏడాది అత్యధిక విద్యార్థు లున్న స్కూళ్లను ఎంపికచేస్తారని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఒక ఉన్నతాధి కారి తెలిపారు. రెండో ఏడాది కూడా ఇదే పద్ధతి ప్రకారం ఎంపిక చేస్తారన్నారు. -
తెలంగాణ: మొదటిసారి 100 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారందరికి ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగా ద్వితీయ సంవత్సరంలో మార్కులను ఇంటర్మీడియట్ బోర్డు కేటాయించింది. ఈ ఫలితాలను తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన వారిలో రెగ్యులర్ విద్యార్థులు 4,51,585 మంది ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల ఫలితాలను బోర్డు వెబ్సైట్ (https:// tsbie. cgg. gov. in, http:// examresults.ts nic. in, http:// results. cgg. gov. in) లో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ప్రథమ సంవత్సర హాల్ టికెట్ నంబర్‌ను పొందుపరిచి ద్వితీయ సంవత్సర ఫలితాలను పొందవచ్చని, గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు తమ పాత హాల్ టికెట్ నంబర్ ద్వారా మార్కులు పొందవచ్చని మంత్రి వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన మొత్తం రెగ్యులర్ విద్యార్థుల్లో 1,76,722 మంది ఏ గ్రేడ్ వారున్నారు. బీ గ్రేడ్‌లో 1,04,891 మంది, సీ గ్రేడ్‌లో 61,889 మంది, డి గ్రేడ్‌లో 1,08,083 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ప్రాక్టికల్స్‌లో 100 శాతం... కరోనా కారణంగా ఈసారి వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలో ఆయా సబ్జెక్టులకు కేటాయించింది. ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ఏవైనా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి ఉంటే.. వాటికి 35 శాతం పాస్ మార్కులను కేటాయించింది. ద్వితీయ సంవత్సరంలోనూ ఆ సబ్జెక్టుల్లో అవే మార్కులను కేటాయించింది. అలాంటి విద్యార్థులు 1,99,019 మంది ఉన్నారు. వారందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం చొప్పున మార్కులను కేటాయించి పాస్ చేసింది. ఈసారి ప్రాక్టికల్స్ కూడా నిర్వహించని కారణంగా విద్యార్థులందరికి అందులో 100 శాతం మార్కులను కేటాయించింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారికి 35 శాతం పాస్ మార్కులను ఇచ్చింది. ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన వొకేషనల్ బ్రిడ్జికోర్సు, అదనపు సబ్జెక్టుల్లో 35 శాతం పాస్ మార్కులు వేసింది. ప్రస్తుతం కేటాయించిన మార్కులతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక రాత పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొంది. జూలై 1 నుంచి మార్కుల మెమోలు... మార్కుల మెమోలను (కలర్ షార్ట్ మెమో) విద్యా ర్థులు బోర్డు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. జూలై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తరువాత http://tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే 040–24600110 ఫోన్ నంబర్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లోనూ (www. bigrs. telangana. gov. in), బీఐజీఆర్ఎస్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. కాలేజీల వారీగా ఫలితాలను కాలేజీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి పొందవచ్చు. కాలేజీల వారీగా మార్కుల రిజిస్టర్లను జూలై 5 నుంచి కాలేజీ లాగిన్ ద్వారా పొందవచ్చు. మొదటిసారి 100 శాతం పాస్.. కరోనా కారణంగా ఈసారి పరీక్షలు లేనందున విద్యార్థులంతా పాస్ అయ్యారు. ఈసారి 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, గతేడాది 4,85,166 మంది (62.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2018–19 విద్యా సంవత్సరంలో 4,90,308 (59.37%), 2017–18లో 5,07,906 మంది (60.97%), 2016–17లో 5,01,119 మంది (59.91%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థుల వివరాలివే.. స్ట్రీమ్ విద్యార్థులు రెగ్యులర్ జనరల్ 4,28,921 4,07,684 వొకేషనల్ 44,929 43,901 మొత్తం 4,73,850 4,51,585 పాసైన వారిలో బాలురు-2,36,409 బాలికలు-2,37,441 ప్రధాన గ్రూపుల వారీగా విద్యార్థుల వివరాలు.. గ్రూపు విద్యార్థులు ఎంపీసీ 1,74,945 ఎంఈసీ 20,716 బైపీసీ 1,00,547 సీఈసీ 1,18,750 హెచ్ఈసీ 12,954 -
తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు తాత్కాలిక బ్రేక్ పడింది. స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్లైన్లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 9, 10 తరగతులకు కూడా ఆన్లైన్లోనే బోధన నిర్వహించనుంది. 50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హజరయ్యేలా చూడనున్నారు. దీనికి సంబంధించి నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. (చదవండి: కూకట్‌పల్లిలో విషాదం: ఆట మధ్యలో ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య) -
తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టుకు వివరాలు సమర్పించారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ బోధన కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యాసంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. అయితే పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీంతో వారంలోగా పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది. చదవండి: TS: కరోనా చికిత్స, టెస్ట్ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం -
పిల్లలూ సిద్ధంకాండ్రి: 1 నుంచి 8, 9, 10 తరగతులు
విద్యాశాఖ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ.. నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయం. వారంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బోధనను కొనసాగించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనతోపాటు బడులకు హాజరుకాని విద్యార్థుల కోసం ఆన్లైన్ బోధనను కూడా చేపడతారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని టీచర్లు ఈనెల 25 నుంచి బడులకు రావాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను అమలు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 30 శాతం ఫీజులను తగ్గించాలన్న తల్లిదండ్రుల విజ్ఞప్తులపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చిస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యాబోధనను దశలవారీగా చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 1 నుంచి బడులను ప్రారంభించాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 8, 9, 10 తరగతులకు జూలై 1 నుంచి విద్యా బోధనను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలిసింది. 6, 7 తరగతు లకు జూలై 20 నుంచి బోధనను చేపట్టాలని, 3, 4, 5 తరగతులకు ఆగస్టు 16 నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేలా ప్రతిపాదించింది. ఒకటి, రెండో తరగతుల అం శాన్ని ప్రస్తావించలేదు. పాఠశాలల్లో విద్యా బోధనకు అవసరమైన మార్గదర్శకాల కోసం విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనలపై సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. దాదాపు ఆ షెడ్యూలు ప్రకారమే ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ గురుకులాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాలను కూడా ప్రారంభించాల్సి ఉన్నందున సన్నద్ధతపై ఆయా శాఖల మంత్రులతోనూ చర్చించాకే ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండు మూడు రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా, ఈనెల 25 నుంచి బడులకు హాజరయ్యే ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మోడల్‌స్కూళ్లు, కేజీబీవీలు, విద్యా శాఖ గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ లెక్చరర్లు అంతా ఆయా విద్యా సంస్థల్లో రిపోర్టు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆదేశించారు. అందుకు అనుగుణంగా డీఈవోలు, ఆర్జేడీలు చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే వారం సెకండియర్ ఫలితాలు వచ్చే వారంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు (ప్రత్యక్ష బోధన) ప్రారంభమవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన జీవో 46 ప్రకారమే యాజమాన్యాలు ఫీజులను తీసుకోవాలని స్పష్టంచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ మూలాన భయపడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరుతామన్నారు. ఈ విషయంలో మరోసారి మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
తెలంగాణ: పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితాల కోసం bsetelangana.org ను సంప్రదించండి. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి సబిత తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు వెల్లడించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారు బాలురు 2,62,917 బాలికలు 2,53,661 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 2,10,647 10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు 535 పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఆయా సబ్జెక్టులకు ఎఫ్ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చింది. ఎఫ్ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ప్రకటించింది. 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. -
1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ప్రమోట్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. 1 తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులుగా మంత్రి సబితా రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఆ తెల్లారే సోమవారం విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేసవి సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేయగా తాజాగా ప్రాథమిక నుంచి ఉన్నత విద్య (1నుంచి 9వ తరగతి) విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే విద్యాలయాలన్నీ మూసివేయగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని కరోనా కట్టడి చర్యలు తీసుకునే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ -
విద్యార్థుల వెన్నంటే కరోనా భయం!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్ సదుపాయం కలిగిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీ బీవీ), గురుకుల పాఠశాలలకు పంపేందుకు ససే మిరా అంటున్నారు. స్కూళ్లు, హాస్టళ్లలో కరోనా వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధనకు మాత్రం గత్యం తరం లేని పరిస్థితుల్లో విద్యార్థులను (75–80%) స్కూళ్లకు పంపిస్తున్నారు. గత నెల 24 నుంచి ప్రారంభమైన 6, 7, 8 తరగతుల ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు 50 శాతం కూడా ఉండట్లేదు. ఇక హాస్టల్ వసతి ఉన్న గురుకులాలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య 20 శాతానికి మించట్లేదు. భయపెడుతున్న కేసులు.. ఇటీవల సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేజీబీవీలో 19 కేసులు నమోదు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు, టీచర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా బోథ్ గిరిజన ఆశ్రమ (బాలికల) పాఠశాలలో ఏడుగురికి కరోనా సోకింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థినికి కరోనా సోకింది. వికారాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇద్దరు టీచర్లకు పాజిటివ్ వచ్చింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఇద్దరు టీచర్లకు కరోనా సోకింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలపూర్ జెడ్పీహెచ్ఎస్లో ఇద్దరు టీచర్లు, ఒక విద్యార్థికి కరోనా వచ్చింది. ధర్మపురి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉపాధ్యాయుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. భద్రాద్రి కొత్తగూడెం మేదరబస్తిలో ఒక టీచర్‌కు, కరకగూడెం కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థినికి పాజిటివ్ వచ్చింది. ఇలా టీచర్లకు, విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ఇదీ విద్యార్థుల హాజరు పరిస్థితి.. రాష్ట్రంలోని కేజీబీవీల్లో 6, 7, 8 తరగతులకు చెందిన బాలికలు 50,727 మంది ఉండగా, 13,065 మంది (25.75 శాతం) తల్లిదండ్రులను తమ పిల్లలను హాస్టళ్లకు పంపేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. అంగీకార పత్రాలు అందజేసిన వారంతా కూడా తమ పిల్లలను కేజీబీవీ హాస్టళ్లకు పంపట్లేదు. మొత్తం విద్యార్థుల్లో 9,695 మంది (19.11 శాతం) పిల్లలను మాత్రమే పంపిస్తున్నారు. 9, 10 తరగతుల బాలికలు కేజీబీవీల్లో 36,148 మంది ఉండగా, 30,231 మంది విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. వారిలో 28,524 మంది (78.91 శాతం) మాత్రమే స్కూళ్లకు వస్తున్నారు. 11, 12 తరగతుల (ఇంటర్మీడియట్) విద్యార్థులు కేజీబీవీల్లో 18,986 మంది ఉండగా, అందులో 14,667 మంది బాలికలను హాస్టళ్లకు పంపించేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. వారిలో 12,954 మందిని (66.05 శాతం) కేజీబీవీలకు పంపించారు. రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో 37 గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. అందులో 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులు 8,216 మంది ఉండగా, 746 మంది (9.07 శాతం మంది) విద్యార్థులే గురుకులాలకు వచ్చారు. 9, 10, 11, 12వ తరగతి విద్యార్థులు మాత్రం 81 శాతం మంది హాస్టళ్లకు వచ్చినట్లు విద్యా శాఖ చెబుతోంది. 7,986 ప్రభుత్వ పాఠశాలల్లో 5,52,654 మంది 6, 7, 8 తరగతుల విద్యార్థులుంటే, 2,52,834 మంది (46 శాతం) విద్యార్థులు మాత్రమే ప్రత్యక్ష బోధనకు హాజరవుతున్నారు. 194 మోడల్ స్కూళ్లలో ఆయా తరగతుల విద్యార్థులు 49,035 మంది ఉండగా, అందులో 19,883 మంది (41 శాతం) మాత్రమే ప్రత్యక్ష బోధనకు హాజరవుతున్నారు. కేజీబీవీల్లో హాజరు పరిస్థితిదీ.. తరగతి మొత్తం విద్యార్థులు అంగీకారపత్రం ఇచ్చింది స్కూల్‌కు వస్తున్నది హాజరుశాతం 6 13,417 3,606 2,749 20.71 7 18,350 4,560 3,241 17.66 8 18,960 4,899 3,675 19.38 9 18,784 14,552 13,515 71.95 10 17,364 5,679 15,009 86.44 11 10,337 8,178 7,241 70.05 12 8,649 6,489 5,713 66.05 ఇవీ జిల్లాల వారీగా స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల్లో నమోదైన పాజిటివ్ కేసులు.. జిల్లా మొత్తం కేసులు ప్రాంతం ఆదిలాబాద్ 7 బోథ్-6, ఆదిలాబాద్ -1 వరంగల్ అర్బన్ 2 కరీమాబాద్ జగిత్యాల 4 కోరుట్ల-3, ధర్మపురి- 1 సిరిసిల్ల 1 శివనగర్ భద్రాద్రి 2 మేదరబస్తీ-1, కరకగూడెం-1 సంగారెడ్డి 19 ఝరాసంఘం మంచిర్యాల 3 ములకల-1, గర్మిల్ల-2 నిర్మల్ 2 లక్ష్మణచాంద వికారాబాద్ 2 వికారాబాద్ -
నో ఆన్లైన్.. ఓన్లీ ఆఫ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తున్నాం. స్కూళ్లకు వచ్చే వారికి ప్రత్యక్ష బోధన ఉంటుంది. బడికి రాని విద్యార్థులకు ఆన్లైన్/ డిజిటల్ పాఠాలు కొనసాగించాల్సిందే. హాజరు నిబంధన లేదు.. పిల్లలను స్కూళ్లకు పంపించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దు...’’అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన తెల్లవారే కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు ఆ నిబంధనలను తుంగలో తొక్కాయి. గురువారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నామని, పిల్లలను స్కూళ్లకు పంపించాలని స్పష్టం చేశాయి. ఇక ఆన్లైన్ బోధన ఉండబోదని, పిల్లలను స్కూళ్లకు పంపించాల్సిందేనని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. కరోనా కేసులు పెరుగతున్నాయనే వార్తల నేపథ్యంలో విద్యార్థులంతా ప్రత్యక్ష బోధనకు హాజరు కావాల్సిందేనని కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు సమాచారం ఇవ్వడం పట్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లకు వచ్చే వారిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భౌతికదూరమే అసలు సమస్యైతే... ప్రస్తుతం రాష్ట్రంలో 10,500కు పైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల వరకున్న స్కూళ్లలోనే భౌతికదూరం పాటించడం సాధ్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లోని మిగతా స్కూళ్లలో ఆరడుగుల భౌతికదూరం పాటించడంలో సమస్యలు తప్పవని అధికారులే పేర్కొంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లలో అయితే మరీ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 9, 10 తరగతులను ప్రారంభించినప్పుడే కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కాయి. బెంచీకి ముగ్గురు, నలుగురు విద్యార్థులను కూర్చోబెట్టి మరీ ప్రత్యక్ష బోధనను చేపట్టాయి. ఆన్లైన్ బోధనను పూర్తిగా తొలగించాయి. ప్రభుత్వం మాత్రం ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్ బోధనను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. స్కూళ్లకు పంపించకపోతే నష్టం మీ పిల్లలకేనంటూ తల్లిదండ్రులను భయపెట్టాయి. దీంతో తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధనకు పంపించక తప్పలేదు. దీంతో దాదాపు 6 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు వచ్చారు. ఇపుడు 6, 7, 8 తరగతులకు చెందిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు వస్తారు. అంటే ప్రైవేటు స్కూళ్లలోనే బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య 16 లక్షలకు చేరనుంది. 9, 10 తరగతులకే భౌతికదూరం పాటించని ప్రైవేటు స్కూళ్లలో ఇప్పుడు వాటితోపాటు 6, 7, 8 తరగతుల పిల్లలు వస్తే భౌతికదూరం పాటించడం సాధ్యం కాదని అధికారులే ఒప్పుకొంటున్నారు. గదుల్లేక కాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు, ఫీజుల వసూళ్లకు.. ప్రైవేటు పాఠశాలల్లో గదుల కొరత సమస్య కానేకాదని అధికారులే చెబుతున్నారు. మెజారిటీ స్కూళ్లలో ఎల్కేజీ మొదలుకొని పదో తరగతి వరకు బోధనను కొనసాగిస్తున్నారు. ఇపుడు స్కూళ్లకు వచ్చే 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులను గదికి 20 మంది చొప్పున విభజించి బోధించడం సమస్య కాదు. అలా విభజిస్తే పాఠాలు బోధించాల్సిన టీచర్లు మూడు రెట్లు అవసరం అవుతారు. ఇపుడు సబ్జెక్టుకు ఒకరు చొప్పున 6–7 మందితో బోధన కొనసాగిస్తున్న ప్రైవేటు యాజమన్యాలు కోవిడ్ నిబంధనల ప్రకారం బోధన చేపట్టాలంటే 21 మంది వరకు టీచర్లతో బోధన చేపట్టాల్సి వస్తుంది. షిఫ్ట్ పద్దతి అమలు చేసినా అదనపు టీచర్లను నియమించాల్సిందే. పైగా ఆన్లైన్ బోధనను కొనసాగిస్తే అదనంగా మరో ఆరేడు మంది టీచర్లను నియమించాల్సి వస్తుంది. అదే బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున విద్యార్థులను గతంలో మాదిరిగానే కూర్చోబెట్టి బోధన కొనసాగిస్తే ఖర్చు తక్కువ అవుతుందని నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. విద్యార్థులు స్కూళ్లకు వస్తే సంవత్సరం ఫీజులు మొత్తం వసూలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో యాజమాన్యాలు ఆన్లైన్ బోధనను కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు. నిబంధనల అమలుపై ధ్యాసేదీ? ప్రైవేటు పాఠశాలల్లో భౌతికదూరం పాటించే విషయంలో విద్యాశాఖ ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఏమీ లేవు. కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించినపుడే స్కూళ్లలో గదికి 20 మంది విద్యార్థులకు మించకూడదని, ఒక్కో విద్యార్థి మధ్య కనీసం 6 అడుగుల భౌతికదూరం ఉండేలా చూడాలని, బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలని విద్యాశాఖ తమ మార్గదర్శకాల్లో పేర్కొంది. పరీక్షలకు హాజరు కూడా విద్యార్థుల ఇష్టమేనని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయడానికి వీల్లేదని, నో డిటెన్షన్ పాలసీ అమల్లో ఉందని స్పష్టం చేసింది. అయినా నిబంధనల అమలును మాత్రం పట్టించుకోవడం లేదు. -
1 నుంచి 8 తరగతులకు ఆన్లైన్ పాఠాలే..
సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ఉంటుందా? ఉండదా? అంటే ఉండకపోవచ్చుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు.. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే ఎదురయ్యే సవాళ్లు, సమస్యల నేపథ్యంలో వారికి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు వెనుకంజ వేస్తోంది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రారంభించిన ప్రత్యక్ష బోధనను మాత్రమే కొనసాగించే యోచనలో ఉంది. ఇటు మిగతా తరగతుల విద్యార్థులను ప్రస్తుతమున్న ఆన్లైన్/డిజిటల్ (టీవీ పాఠాలు) పాఠాలకే పరిమితం చేసే ఆలోచనల్లోనే విద్యాశాఖ ఉంది. అంతేకాదు వారికి బోర్డు ఎగ్జామ్స్ కాదు కాబట్టి ఎలాంటి పరీక్షల నిర్వహణ లేకుండానే పైతరగతులకు పంపించే దిశగానే అడుగులు వేస్తోంది. ‘భౌతిక దూరం’కష్టమనే.. కరోనా కారణంగా పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారైంది. కార్పొరేట్, బడా ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు తీసుకున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని, చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలు అటు ఆన్లైన్ తరగతులు నిర్వహించలేకపోవడంతో అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. కొన్ని యాజమాన్యాలైతే స్కూళ్లను పూర్తిగా మూసేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు త్వం గత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్/డిజిటల్ (టీవీ పాఠాలను) ప్రారంభించింది. టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా వీడియో పాఠాలను ప్రభుత్వ విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆన్లైన్ బోధన చేపట్టలేని మరికొన్ని సాధారణ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం అందిస్తున్న వీడియో పాఠాలనే చూడా లని తల్లిదండ్రులకు సూచించాయి. మొన్నటివరకు అ లాంటి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వీడియో పాఠాలనే విన్నారు. చివరకు ఈనెల 1వ తేదీ నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. పాఠశాలల్లో భౌతిక దూరం పాటిస్తూ, బెంచీకి ఒకరు చొప్పున, తరగతి గదిలో 20 మంది మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. గతంలో ఒక్కో తరగతికి చెందిన వారు ఒకే గదిలో 70–80 మంది కూర్చునే విద్యార్థులను మూడు నాలుగు తరగతి గదుల్లో కూర్చోబెట్టారు. వారికి బోధించేందుకు ఉన్నత పాఠశాలల్లోని టీచర్లతో పాటు 5 వేల మంది వరకు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై ఉన్నత పాఠశాలలకు పంపించారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం బెంచీకి ముగ్గురు నలుగురు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. భౌతిక దూరం పాటించడం అనేది లేకుండా పోయింది. 6, 7, 8 తరగతులు ప్రారంభించాలనుకున్నా.. పాఠశాలల్లో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించిన సమయంలోనే 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే ఆలోచన చేశారు. అయితే 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన సమయంలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూసి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే పాఠశాలల్లో కరోనా వ్యాప్తి లేకపోయినా, ప్రైవేటు పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 18 రోజులు దాటింది. అయితే కోవిడ్ నిబంధనల అమలు ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగా సాధ్యం కావడం లేదనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, ఏదైనా అనుకోని సమస్య వస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఒక్క విద్యార్థికి కరోనా ఉన్నా అది ఇతరులకు సులభంగా సోకే ప్రమాదముంది. పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతులను ప్రారంభిస్తే ఇంకా అదనపు టీచర్లు కావాలి.. గత విద్యా సంవత్సరంలో తీసుకున్న 12 వేల మంది విద్యా వలంటీర్లకు మించి ఇంకా అదనంగా తీసుకోవాలి. ఇటు అదనపు తరగతి గదులు అవసరముంటుంది. ఈ నేపథ్యంలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయడమే మంచిదన్న అభిప్రాయంలోనే అధికారులున్నారు. మరోవైపు మార్చి నెలలో 6, 7, 8 తరగతులను ప్రారంభించినా ఈ సమస్యలు వస్తాయని, పైగా మార్చిలో వేసవి ఎండలు ఎలా ఉంటా యో తెలియదు.. ఒంటిపూట బడులనే కొనసాగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధన అవసరమా? తల్లిదండ్రులు పంపిస్తారా? అన్న సందిగ్ధం ఉన్నతాధికారుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఓసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చూద్దామనే ఆలోచన చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రాథమిక పాఠశాలలు) మాత్రం ప్రత్యక్ష బోధన అవసరమే లేదనే అభిప్రాయంలో అధికారులున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న హాజరు శాతం: మంత్రి సబిత రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తుండటంతో 9,10 తరగతుల విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో తరగతుల నిర్వహణపై గురువారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నందున విద్యార్థులు ప్రత్యక్ష తరగతుల హాజరుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 1న విద్యార్థుల హాజరును పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 48%, మోడల్ స్కూళ్లలో 37%, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6%, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 19%, ప్రైవేట్ పాఠశాలల్లో 46% ఉందన్నారు. ఇక ఈ నెల 17న చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 72%, మోడల్ స్కూళ్లలో 69%, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో 71%, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 85%, ప్రైవేట్ పాఠశాలల్లో 69 శాతానికి హాజరు పెరిగిందన్నారు. -
టెన్త్ విద్యార్థులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతిలో 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విద్యా బోధన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఏప్రిల్/మేలో నిర్వహించే టెన్త్ పరీక్షల్లో ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో రెండు పేపర్ల చొప్పున ఉండగా హిందీ మాత్రం ఒకే పేపర్ ఉంది. ఇకపై సబ్జెక్టుకు ఒక పేపరే ప్రశ్నపత్రం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇక ఇంటర్ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించాలని యోచిస్తోంది. ముందుగా 9, 10 తరగతులకు... పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించాలని భావించినా ప్రస్తుత చలికాలంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై నిర్ణయం తీసుకోలేదన్నారు. జనవరి మొదటి వారంలో లేదా సంక్రాంతి తర్వాత 9వ తరగతి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. 9, 10 తరగతుల వారికి కనీసం మూడు నెలలపాటు ప్రత్యక్ష బోధన ఉండేలా చూస్తామన్నారు. వాటితోపాటు జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి చర్యలు చేపడతామన్నారు. ఆ తరువాత దశలవారీగా కింది తరగతుల వారికి ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకోనున్నారు. యూనివర్సిటీల వీసీల నియామకాలకు సంబం ధించిన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో∙నియామకాలు చేపడతామన్నారు. (చదవండి: 33 సార్లు ఫెయిల్.. కరోనాతో పాస్) ఆన్లైన్లో టెట్? టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అంతకంటే ముందుగానే టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ఈసారి టెట్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా సీఎం ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపామన్నారు. -
‘బడి’కి రూ.19.11 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ గ్రాంట్‌ను 2020–21 విద్యా సంవత్సరానికి విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 28,645 పాఠశాలలకు రూ. 19,11,50,000 విడుదల చేశారు. ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. కాగా, 15మందిలోపు విద్యార్థులున్న స్కూళ్ల సంఖ్య ఈసారి(2019–20) పెరిగింది. గతం (2018–19)లో 3,500 వరకు ఉండగా.. ఈసారి ప్రాథమిక, ప్రాథమికోన్నత కేటగిరీలో 4,178, ఉన్నత పాఠశాలల కేటగిరీలో 23 స్కూళ్లు ఉన్నాయి. ఇక 1,000 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ స్కూళ్లు రాష్ట్రంలో 38 ఉన్నట్లు విద్యా శాఖ లెక్కలు వేసింది. స్కూల్ గ్రాంట్ విడుదల కోసం విద్యాశాఖ ఈ లెక్కలను ప్రాజెక్టు అప్రూవల్ బోర్డుకు పంపించింది. -
ఫీ‘జులుం’పై కొరడా
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల పేరుతో నిబంధనలకు విరు ద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝళిపి స్తోంది. జీవో నంబర్ 46కు విరుద్ధంగా హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యా ర్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విద్యాశాఖకు ఇటీవల భారీ సంఖ్యలో ఫిర్యా దులు అందాయి. దీంతో అధికారు లు గురువారం రంగంలోకి దిగారు. గత ఏడాది నిర్దేశించిన ట్యూషన్ ఫీజుకు మించి వసూలు చేస్తున్న పాఠశాలల్లో ఆకస్మిక తని ఖీలు చేశారు. హైదరాబాద్‌లో 11, రంగా రెడ్డిలో 13, మేడ్చల్ జిల్లాలో 6 కార్పొరేట్ పాఠ శాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫీజు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విద్యా సంవత్సరం మొదలు కాకున్నా.. గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు ఏడు వేల ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 15 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. 60% మంది విద్యార్థులు కేవలం ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లలోనే చదువుతు న్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఇంకా కొన సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందో లేదోకూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ నగరంలోని పలు ఇంట ర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తు న్నాయి. విద్యార్థుల సామర్థ్యా లను పరిగణనలోని తీసుకోకుండా ఎల్కేజీ విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు చేపడుతున్నాయి. ఆన్లైన్లో క్లాసు వినాలంటే స్కూల్ యూనిఫారం ధరించాలనే నిబంధన కూడా విధించాయి. ఆన్లైన్ పాఠాల పేరుతో తమ వద్దే పుస్తకాలు సహా ల్యాప్ టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయాలని నిబంధన విధిస్తున్నాయి. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాల్సిందిగా తల్లిదం డ్రులపై పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఏకంగా స్నాక్స్, ట్రావెలింగ్, లైబ్రరీ, స్పోర్ట్స్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ట్యూషన్ ఫీజు మినహా మరే ఇతర ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇందుకు నిరాకరించిన తల్లిదండ్రులను అడ్మిషన్ క్యాన్సల్ చేస్తామని బెదిరిస్తున్నాయి. దీంతో కొంత మంది తల్లిదండ్రులు ఆయా యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి వారు అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. మరికొంత మంది విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తుండటంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆన్లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదు ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లాలో ఏ ఒక్క స్కూల్‌కూ అనుమతి ఇవ్వలేదు. అధికారికంగా ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఆన్లైన్ తరగతుల పేరుతో ఎవరైనా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమించిన స్కూళ్లను సీజ్ చేయడానికి కూడా వెనుకాడం. – వెంకటనర్సమ్మ, డీఈఓ, హైదరాబాద్ -
ప్రైవేటు స్కూళ్లపై విద్యాశాఖ కొరడా
-
సిలబస్ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలోనూ జాతీయ స్థాయిలో 30 శాతం సిలబస్ తగ్గింపునకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ యోచిస్తోంది. జూన్ 12 నుంచి ప్రారంభమై కొనసాగాల్సిన పాఠశాలలు కరోనా కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో వచ్చే నెలలోనూ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ పాఠశాల విద్యలో సిలబస్‌ను 30 శాతం వరకు తగ్గించే విషయమై విద్యాశాఖ ఆలోచిస్తోంది. దీనిపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించింది. అయితే జాతీయ స్థాయిలో స్పష్టత వచ్చాక ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనా, సిలబస్ కుదింపు అమలు చేయాల్సి వస్తే ఏయే పాఠ్యాంశాలను తొలగించాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలనే భావనకు వచ్చారు. ప్రతి సబ్జెక్టులో 30 శాతం కరోనా కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తమ పరిధిలోని స్కూళ్లలో 30 శాతం సిలబస్ కుదింపునకు ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ కుదింపునకు చర్యలు చేపట్టింది. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీఈఆర్టీ) కూడా పాఠశాలల్లో సిలబస్ కుదింపు, అకడమిక్ వ్యవహారాలు ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ తరగతుల వారీగా ఏయే సబ్జెక్టులో ఎంత సిలబస్‌ను తగ్గించవచ్చనే అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తోంది. తరగతుల వారీగా ప్రతి సబ్జెక్టులో 30 శాతం వరకు సిలబస్‌ను తగ్గించే ప్రణాళికలపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అనుగుణంగా సిద్ధంగా ఉండేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెలవు రోజుల్లోనూ పాఠశాలలు కరోనా అదుపులోకి వస్తే సెప్టెంబరులో పాఠశాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒకవేళ రాకుంటే అక్టోబరు కావచ్చు లేదా ఇంకా ఆలస్యం కావచ్చు. కాబట్టి సిలబస్ తగ్గించినా పని దినాలు సర్దుబాటయ్యే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. సెప్టెంబరు నాటికే దాదాపు 70 రోజులకు పైగా పనిదినాలు కోల్పోయినట్టవుతుంది. స్కూళ్ల ప్రారంభం ఇంకా ఆలస్యమైతే ఇంకా పని దినాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా సెలవు దినాల్లో బడులను కొనసాగించేలా ప్రణాళికలను సిద్ధం చేసేందుకు విద్యాశాఖ నడుంబిగించింది. రెండో శనివారాలు, వీలైతే ఆదివారాలు, ఇతర పనిదినాల్లోనూ స్కూళ్లను కొనసాగించేలా ప్రణాళికలను రూపొందించడంపై దృష్టి సారించింది. -
రోజుకు 3 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం సమా వేశమయ్యారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలన్న విషయంపై చర్చించారు. ముం దుగా ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకే పరీక్షలు నిర్వహించాలని, భౌతిక దూరం పాటిం చేలా, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రోజుకు మూడు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చింది. ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రంలోగా రెండు గంటలకో పరీక్ష నిర్వహించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాక, వెనువెంటనే ద్వితీయ, ప్రథమ సంవత్సరాలకు సెమిస్టర్, బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణ యానికి వచ్చింది. దీనిపై సమగ్ర ప్రణా ళికతో త్వరలోనే వర్సిటీలకు స్పష్టమైన ఆదే శాలు జారీ చేయాలని భావిస్తోంది. జూన్ 20 నుంచి వర్సిటీలు పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష సమయాన్ని రెండు గంటలకే తగ్గించాలని, డిటెన్షన్ రద్దు చేసి విద్యార్థులందరినీ పై సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని ఇదివరకే విద్యామండలి ఆదేశించింది. అందుకు అనుగుణంగా వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే భౌతిక దూరం పాటించడం సమస్యగా మారుతుందని గురుకుల విద్యాలయాల కార్యదర్శి లేఖ రాయగా దానిపైనా చర్చించారు. -
జూలై 6 నుంచి ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలి స్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్‌లోనూ ఎంసెట్‌ను నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్న అధికారులు.. జూలై 6 నుంచి ఎంసెట్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ దీనిపై చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు ఉన్నందున, జూలైలో వీలైనంత ముందుగా ఎంసెట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. జూలై 6 నుంచి మొదలుపెడితే 15లోగా పూర్తి చేయవచ్చని, తద్వారా విద్యార్థులు 18వ తేదీ నుంచి జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధం కావచ్చని అంటున్నారు. ఒకవేళ జూలై తొలివారంలో నిర్వహంచకపోతే ఆగస్టుకు వెళ్లే అవకాశం ఉంది. జూలై 23 వరకు జేఈఈ మెయిన్ ఉండగా, అదే నెల 27 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్, తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాస్తారు. మరోవైపు రెండు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరవుతారు. కాబట్టి ఈ మూడు సెట్స్ తేదీలు క్లాష్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఓ అధికారి చెప్పారు. అందుకే జూలై మొదటివారంలోనే ఎంసెట్‌ను నిర్వహించేలా ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఒకవేళ జూలైలోనూ కరోనా అదుపులోకి రాకుండా, పరిస్థితి ఇబ్బందికరంగా మారితే ఏపీ ఎంసెట్ తరువాత ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ ఎంసెట్ నిర్వహించాల్సి వస్తుంది. ఎంసెట్ కౌన్సెలింగ్పైనా కసరత్తు జేఈఈ మెయిన్ ఫలితాల తరువాతే అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలిపోకుండా చూడటంతో పాటు మెరిట్ విద్యార్థులకు ఆ సీట్లు లభించేలా చూడవచ్చని భావిస్తున్నారు. జేఈఈ మెయిన్ ఫలితాల కంటే ముందే ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తే జేఈఈ ద్వారా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో సీట్లు లభించనున్న విద్యార్థులు కూడా ఎక్కువ మంది ముందుగా రాష్ట్ర కాలేజీల్లోనే చేరిపోతారు. ఆ మేరకు కన్వీనర్ కోటాలో సీట్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆ తరువాత మెరిట్లో ఉండే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. వారు కోరుకున్న కాలేజీలో, బ్రాంచీలో సీట్లు లభించవు. అదే జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్ర కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఈ పరిస్థితిని నివారించవచ్చు. జేఈఈ విద్యార్థులు కూడా తమకు వచ్చిన ర్యాంకులను బట్టి తమకు ఎక్కడ (ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలలో) సీటు లభిస్తుందనే అంశంపై ఓ అంచనాకు వస్తారు. అపుడు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో చేరే జేఈఈ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. తద్వారా తక్కువ సంఖ్యలో బ్లాక్ అయ్యే ఆ సీట్లను తదుపరి కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచి, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరక్కుండా చూడవచ్చని భావిస్తున్నారు. అందుకే జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలు జూలై 31 నాటికి వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించకుండా ఆగాలని భావిస్తున్నారు. మొత్తానికి ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ చేపడితే ఇబ్బంది ఉండదన్న భావనతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీచేసిన అకడమిక్ కేలండర్ ప్రకారం కొత్త విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులను ప్రారంభించవచ్చని చెబుతున్నారు. -
విద్యాశాఖకు 12,127.55 కోట్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖకు 12,127.55 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం అసెం బ్లీలో ప్రకటించిన బడ్జెట్లో విద్యాశాఖకు రూ.12,144 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, విభాగాల వారీగా చూస్తే రూ. 12,127.55 కోట్లుగా ఉంది. గతేడాది విద్యా శాఖకు రూ.9,899.12 కోట్లు మాత్రమే కేటా యించగా ఈసారి దానికి అదనంగా 2,238.43 కోట్లు ఇచ్చింది. విద్యాశాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.10,405.29 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,452.03 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.270.23 కోట్లను కేటాయించింది. ఇక ఈసారి అదనంగా ఇచ్చిన రూ.2,238.43 కోట్లలో పాఠశాల విద్యలోనే నిర్వహణ పద్దు కింద రూ.1,642.32 కోట్లను కేటాయించగా, ప్రగతి పద్దులో 598.82 కోట్లను కేటాయిం చింది. ప్రగతిపద్దులో ఈ మొత్తాన్ని సమగ్ర శిక్షా అభియాన్ కోసం కేటాయింపులు జరి పింది. వాస్తవానికి పాఠశాల విద్యకే రూ.14 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరమని ప్రతిపాదనలను పంపించినా రూ.10,405.29 కోట్లకు ప్రభుత్వం కేటాయింపులు పరిమితం చేసింది. మరోవైపు ఈచ్ వన్ టీచ్ వన్‌కు రూ.100 కోట్లు కేటాయించింది. విభాగాల వారీగా కేటాయింపులివీ.. నిర్వహణ పద్దులో పాఠశాల విద్యకు కేటా యించిన రూ.9,113.10 కోట్లలో సాధారణ విద్యకు రూ.8,864.25 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.9.59 కోట్లు, వయోజన విద్యకు రూ.7.40 కోట్లు, ప్రభుత్వ గ్రంథాల యాలకు రూ.54.11 కోట్లు, జవహర్ బాలభ వన్‌కు రూ.2.99 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.34.49 కోట్లు, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.135.99 కోట్లు కేటాయించిం ది. సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ.135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటా యించింది. అయితే ఈ నిధులన్నీ నిర్వహణ కు, వేతనాలకే సరిపోనున్నాయి. ఇక ప్రగతి పద్దులో రూ.1,292.19 కోట్లు ప్రభుత్వం కేటా యించింది. అయితే అవి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏమాత్రం సరిపోవని విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘా లు అభిప్రాయపడుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు ఈ నిధులతో సాధ్యం కావని అంటున్నాయి. రెండేళ్ల కిందటితో పోల్చితే తక్కువే.. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రెండేళ్ల కిందటి తో పోల్చితే ఈసారి చేసిన కేటాయింపులు తక్కువే. ఈ పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లిం చాల్సిన మొత్తం కింద గతేడాది రూ.491.56 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.1,239.46 కోట్లను కేటాయించింది. గతే డాదితో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు పెరి గింది. అయితే అంతకుముందు సంవత్స రాల్లో చేసిన కేటాయింపుల కంటే ఈసారి తగ్గిపోయింది. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సివిల్ వర్క్స్ వంటి పథకాలకు 40 శాతం రాష్ట్ర వాటా తప్పనిసరి. వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 1,876.42 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,546.39 కోట్లకు సవరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం లో ఈ పథకాల కోసం రూ. 491.56 కోట్లు మాత్రమే కేటాయించగా, 2020–21 కోసం రూ.1,239.46 కోట్లను కేటాయించింది. ఇక ఉన్నత విద్యలో కేంద్ర పథకాల కోసం రూ. 15.04 కోట్లను మాత్రమే కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్లో 6.62 శాతమే.. రాష్ట్రంలో విద్యారంగానికి ప్రాధాన్యం తగ్గు తోంది. గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను పెం చినా మొత్తం బడ్జెట్లో విద్యాశాఖ కేటాయిం పుల వాటా తక్కువే. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.28 శాతం తగ్గిపోయాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇప్పుడు అది 6.62 శాతానికి పడిపోయింది. ఫీజులకు ఫుల్ బడ్జెట్ పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర బడ్జెట్ ఫుల్ జోష్ ఇచ్చింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయిస్తూ.. ఇకపై పాత బకాయిల ప్రస్తావన లేకుండా చేసింది. 2020–21 వార్షిక సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద రూ.2,650 కోట్లు కేటాయించింది. వాస్తవానికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ప్రతి సంవత్సరం సగటున రూ.2 వేల కోట్ల డిమాండ్ ఉంటుంది. పాత బకాయిలు, కొత్త వాటి చెల్లింపులకు సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో గత కొన్నేళ్లుగా బకాయిలు పెండిం గ్లో ఉండేవి. ఈ క్రమంలో పాత బకాయిలు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో అన్ని సంక్షేమ శాఖలు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టాయి. 2019–20 వార్షిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా రూ.3 వేల కోట్ల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిని పూర్తి స్థాయిలో చెల్లిస్తే 2019–20 వార్షిక సంవత్సరానికి సంబంధించి 75 శాతం చెల్లింపులు చేయవచ్చు. ఫీజులకు మిగులు నిధులు.. 2020–21 వార్షిక సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద మిగులు నిధులు ఉంటాయని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.2,650 కోట్లు కేటాయింపులు జరపడంతో.. అప్పటి డిమాండ్ రూ.2,050 కోట్లు ఉంటుందని, 2019–20 లో రూ.450 కోట్ల మేర ఉండే బకాయిలన్నీ చెల్లించినప్పటికీ కొంత మేర నిధులు సంక్షేమ శాఖల వద్ద ఉండే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
వయసు ఒకటే..తరగతులే వేరు!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లు నిండిన వారినే ఒకటో తరగతిలో చేర్పించాలి.. ఇదీ విద్యా హక్కు చట్టం చెబుతున్న నిబంధన. అందుకు భిన్నంగా ఉంది రాష్ట్రంలో పిల్లల పరిస్థితి. ఐదేళ్లు నిండని పిల్లలు కొందరు ప్రీప్రైమరీలో ఉంటే, మరి కొందరు ఒకటో తరగతి చదువుతు న్నారు. ఇక ఆరేళ్లు వచ్చినా కొందరు ఇంకా ప్రీప్రైమరీ స్కూళ్లోనే/అంగన్ వాడీ కేంద్రాల్లోనే ఉండగా, కొందరు ఒకటో తరగతిలో ఉన్నారు. ఆయా విద్యార్థుల వయసు ఒక్కటే ఐనా, చదివే తరగతులు వేర్వేరు. తల్లిదం డ్రుల ఆకాంక్షలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ అంతరాలకు కారణం. పిల్లలను త్వరగా చదివించాలన్న తప నతో కొందరు తల్లిదండ్రులు రెండేళ్లకే పిల్లలను ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపి స్తుంటే.. ఐదేళ్లు నిండకుండానే ఒకటో తరగతికి వచ్చేస్తున్నారు. పల్లెల్లో ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు తమ పిల్ల లను ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపించకుండా ఆరేళ్లు వచ్చినా అంగన్వాడీ కేంద్రాలకే పంపుతుం డగా, మరికొంత మంది తల్లిదండ్రులు మాత్రం ఐదేళ్లు నిండాకే తమ పిల్లలను ఒకటో తరగతిలో చేర్చుతున్నారు. రాష్ట్రంలో ప్రీప్రైమరీ, ప్రైమరీస్కూళ్లలో ప్రవేశాల తీరుపై ‘ప్రథమ్’ సంస్థ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) పేరుతో సర్వే చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వే.. దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన 26 జిల్లాల్లోని 1,514 గ్రామాల్లో అసర్ ప్రతినిధులు ఈ సర్వేను నిర్వహించారు.ఆయా గ్రామాల్లోని 30,425 ఇళ్లు తిరిగి 4 నుంచి 8 ఏళ్ల వయసున్న 36,930మంది పిల్లలతో మాట్లాడి వివరాలను సేకరించారు. అందులో రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని 60గ్రామాలకు చెందిన 1,201 ఇళ్లను తిరిగి 1,426 మంది విద్యార్థులను కలిసి, 4 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల స్థితిగతులపై నివేదికను రూపొందించారు. తాజాగా ఢిల్లీలో విడుదల చేసిన నివేదికలోని ప్రధానాంశాలు ►రాష్ట్రంలో ఐదేళ్ల వయసున్న విద్యార్థుల్లో 21.6 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, మిగతా వారు అంగన్వాడీ/ప్రీప్రైమరీ తరగతులు చదువుతున్నారు. ►ఇక ఆరేళ్ల వయసు వారిలో 32.8 శాతం మంది అంగన్వాడీ కేంద్రాలు/ప్రీప్రైమరీ స్కూళ్లలో ఉన్నారు. ఇక 46.4 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, 18.7 శాతం మంది రెండో తరగతి, మిగతా వారు ఆపై తరగతుల్లో ఉన్నారు. ►4 నుంచి 8 ఏళ్ల వయసు వారిలో బాలికలు ఎక్కువ మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరగా, బాలురు ఎక్కువ మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నారు. ►నాలుగైదేళ్ల వయసు పిల్లల్లో 56.8% మంది బాలికలు ప్రభుత్వ ప్రీప్రైమరీ స్కూల్స్/అంగన్వాడీ కేంద్రాల్లో ఉండగా, బాలురు మాత్రం 50.4% మందే ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు. ►అదే వయసు పిల్లలు ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లలో 43.2% బాలికలుండగా, బాలురు 49.6% ఉన్నారు. ►6 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల్లో 61.1% బాలికలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తుండగా, బాలురు 52.1% మందే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నట్లు తేలింది. 10 మందిలో ప్రతి నలుగురు తక్కువ వయసు వారే.. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో చేరాలంటే ఐదేళ్లు నిండి ఉండాలి. కానీ రాష్ట్రంలో ఒకటో తరగతిలో చేరిన ప్రతి 10 మందిలో సగటున నలుగురు ఐదేళ్లు నిండని వారే ఉన్నట్లు సర్వేల్లో వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఆరేళ్లకు వచ్చి ఒకటో తరగతిలో చేరిన వారు 41.7 శాతమే ఉన్నట్లుగా తేలింది. అలాగే ఒకటో తరగతిలో చేరిన వారిలో ఏడెనిమిదేళ్ల వయసు వారు 36.4 శాతం ఉండగా, నాలుగైదేళ్ల వయసు వారు 21.9 శాతం ఉన్నట్లుగా వెల్లడైంది. -
ఇంగ్లిష్ నైపుణ్యాలకు ప్రాధాన్య పాయింట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కావాలంటున్నారు. తమ పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని కోరుతున్నారు. దీనికి అనుగుణంగా విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఇంగ్లిష్ మీడియం బోధించే నైపుణ్యాలు ఎంతమందిలో ఉన్నాయి.. నైపుణ్యాలు గలవారిని ఎలా గుర్తించాలి? వారు ఇంగ్లిష్ స్కూళ్లలో బోధించేందుకు ఏ చర్యలు చేపట్టాలని తర్జనభర్జన పడుతోన్న విద్యా శాఖకు ఓ ఆలోచన తట్టింది. టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించే నైపుణ్యాలపై పరీక్ష నిర్వహించి, ఆ నైపుణ్యాలు కలిగిన వారిని గుర్తించి ముందుకుసాగితే ఉపయోగంగా ఉంటుందన్న ఆలోచనకు వచ్చింది. అంతేకాదు వారిని ప్రోత్సహించి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో బోధించేలా చేసేం దుకు వారికి ప్రా«ధాన్య పాయింట్లు ఇస్తే బాగుంటుందని భావిస్తోంది. విద్యా శాఖ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే పాయింట్లను (రెగ్యులర్‌గా వారికి వచ్చే పాయింట్లకు అదనంగా) వారి బదిలీలు, పదోన్నతుల్లో ఉపయోగించుకునేలా చూడటం ద్వారా ఆయా టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో వారు బాగా పనిచేస్తారని, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో వారి సేవలను సద్వినియోగపరచుకోవచ్చని, మెరుగైన విద్యను అందించవచ్చని యోచి స్తోంది. త్వరలోనే దీనిపై ఉన్నతస్థాయి భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. ప్రైమరీ స్కూళ్లు ఇంగ్లిష్ వైపు.. రాష్ట్రంలో 26,754 ప్రభుత్వ పాఠశాలల్లో 1,21,657 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లు 14,170 మంది ఉండగా, సబ్జెక్టు కాకపోయినా మరో 20వేలమంది వరకు ఇంగ్లిష్‌లో బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల టీచర్లు ఇంగ్లిష్ నేర్పించాల్సిందే. దీంతో ఇంగ్లిష్ టీచర్లు కాకుండా మిగతా వారిలో ఎంతమందికి ఇంగ్లిష్‌లో బోధించే నైపుణ్యాలున్నాయో తెలుసుకునే చర్యలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 18,230 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, అందులో 2018 నుంచి 6వేల ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. 4 వేల కు పైగా ఉన్నత పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లలో 2008లోనే ప్రారంభమైంది. ఇంగ్లిష్ మీడియం కావాలన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడున్న స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం సెక్షన్ ప్రారంభించడం లేదా ఇంగ్లిష్ మీడియానికి మార్పు చేసే అధికారాన్ని డీఈవోలకు ఇచ్చేలా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఇంగ్లిష్ మీడియంలో 37 శాతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26,87,563 మంది విద్యార్థులు చదువుతుండగా, అందులో 10,16,334 మంది (37.82 శాతం) విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇక తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులు 15,44,208 మంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 31,22,927 మంది విద్యార్థులు ఉండగా, అందులో 30,27,459 మంది ఇంగ్లిష్ మీడియం వారే. -
టెన్త్ మెమోలపై క్యూఆర్ కోడ్!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి నకిలీ మెమోలను అరికట్టేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పది మెమోలపై ఇకపై క్యూఆర్ కోడ్ పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమవుతోంది. 2004 నుంచి పదో తరగతి మెమోలను ఆన్లైన్లో పొందుపరిచిన ప్రభుత్వ పరీక్షల విభాగం అంతకుముందుకు మెమోలనూ ఆన్లైన్లో పొందుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు అందజేసిన మెమోలు నకిలీవా? అసలైనవా? అని గుర్తించేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తోంది. ఇకపై విద్యార్థులకు ఇచ్చే మెమోలపై క్యూఆర్ కోడ్ ముద్రించే ఆలోచనకు వచ్చింది. తద్వారా నకిలీ మెమోలను అరికట్టవచ్చని భావిస్తోంది. అసలైన మెమోపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను రీడ్ చేస్తే సదరు అభ్యర్థి సమగ్ర వివరాలు తెలుస్తాయని, అదే నకిలీ మెమోపై క్యూఆర్ కోడ్ ఉండదని, ఒకవేళ ఏదైనా ముద్రించినా ఆ వివరాలు రావని, తద్వారా మెమోలు నకిలీవి తయారు చేయకుండా నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
ఫోన్లో పాఠాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చదువులో వెనకబడిన విద్యార్థులకు త్వరలోనే ఫోన్ ద్వారా ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో మాత్రమే ట్యూషన్లు చెప్పేవారు. కానీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా టెలీ టీచర్స్ ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. దీంతో వారు తరగతి గదుల్లో మాత్రమే విద్య నేర్చుకున్నారు. వసతి గృహాల్లో ట్యూటర్ ఉండటంతో అక్కడి విద్యార్థుల సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోగలుగుతారు. కానీ అనేక మంది విద్యార్థులు బిడియం, మొహమాటం కారణంగా తరగతి గదుల్లో తమ సందేహాలను ఉపాధ్యాయులు, ట్యూటర్లను అడగలేకపోతున్నారు. సందేహాలు అడిగితే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఏమనుకుంటారోనన్న ఆలోచనతో అనేకమంది విద్యార్థులు తమ సందేహాలను అడగకుండా చదువులో వెనుకబడి పోతున్నారు. అయితే టెలీ టీచర్స్ ద్వారా తమకు వచ్చిన సందేహాలను ఫోన్ ద్వారా అడగొచ్చు కాబట్టి విద్యార్థులకు భయం ఉండదనే ఆలోచనతో రాష్ట్ర విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. రిటైర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఖాళీ సమయాల్లో బోధించే ఆసక్తి ఉన్నవారి ద్వారా ఈ టెలీ ట్యూషన్లు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. టెలీ టీచర్స్ పద్ధతి ప్రస్తుతం మహరాçష్ట్రలో అమల్లో ఉంది. ప్రత్యేక సమయం.. ఈ టెలీ ట్యూషన్‌కు సాయంత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించడం ద్వారా అటు ట్యూటర్ (టెలీటీచర్స్)కు, ఇటు విద్యార్థులకు లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించిన టెలీ ట్యూటర్ ఫోన్ నంబర్‌ను ఇవ్వడం ద్వారా విద్యార్థులు వారికి కేటాయించిన సమయంలో ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. టెలీటీచర్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు అధికంగా లబ్ధి చేకూరుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు త్వరలోనే టెలీ ట్యూషన్ అందుబాటులోకి తెస్తాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. భయపడే, మొహమాటపడే విద్యార్థులు పరోక్షంగా తమ పాఠ్యాంశంలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. – విద్యా శాఖ పిన్సిపల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి -
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఊరట..
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఊరట లభించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. నూతన జిల్లాల ఆవిర్భావం తర్వాత పాత జిల్లా ప్రాతిపదికనా.. లేక కొత్త జిల్లా ప్రకారం పదోన్నతులు ఇవ్వాలా అనే సందిగ్ధంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఫలితంగా పైస్థాయి పోస్టులు ఖాళీ అవుతున్నప్పటికీ కిందిస్థాయి టీచర్లకు పదోన్నతులు రావ డం లేదు. ఈ అంశంపై ఉపాధ్యాయ సం ఘాలు ప్రభుత్వానికి పలుమార్లు వినతులు సమర్పించాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రి సబితా రెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పదోన్నతుల అంశాన్ని సులభంగా పరిష్కరించేలా చూడాలని సూచనలు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పాత పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని విద్యా శాఖాధికారులు స్పష్టం చేయడంతో ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టు అనుమతికి చర్యలు... నూతన జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని కోర్టు గతంలో స్పష్టం చేసింది. గత విద్యా సంవత్సరం ఉపాధ్యాయ బదిలీల సమయంలో పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. నూతన జిల్లా ప్రాతిపదికన బది లీలు చేపట్టాలని పలు పిటిషన్లు దాఖలు కాగా... వాటిని విచారించిన కోర్టు పాత జిల్లా ప్రాతిపదికన బదిలీలు, కొత్త జిల్లా ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టవచ్చని సూచించింది. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిని పరిగణిస్తూ బదిలీల ప్రక్రియ పూర్తి చేయగా, పదోన్నతుల అంశం మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ క్రమంలో టీచర్ల బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పరిష్కార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లా ప్రకారం పదోన్నతులు ఇవ్వాలంటే ఉద్యోగుల విభజన జరగలేదనే అంశం ఇబ్బందికరంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ప్రమోషన్లు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశిస్తూనే... కోర్టు అనుమతి కోసం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అధికారులకు సూచించింది. స్కూల్ అసిస్టెంట్ వరకే... తాజాగా బదిలీల ప్రక్రియ చేపట్టాల్సివస్తే కేవలం ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు మాత్రమే పదోన్నతులు ఇచ్చే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎం (గెజిటెడ్ హెడ్మాస్టర్) పదోన్నతుల్లో జోనల్ సమస్య ఉంది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టు జోనల్ పరిధిలో ఉండడం, తాజాగా నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఏ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఎంఈఓ, డిప్యూటీ ఈవో పదోన్నతులపైనా జోనల్ అంశంతో పాటు సర్వీసు రూల్స్‌తో ముడిపడి ఉంది. దీంతో ఈ పోస్టులకు పదోన్నతులు ఇవ్వడం ప్రస్తుతానికి కష్టమనే చెప్పొచ్చు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులతో రాష్ట్రవ్యాప్తంగా 6,500 పోస్టులు భర్తీ చేసే వీలున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. -
బడి దూరం పెరగనుందా?
సాక్షి, హైదరాబాద్ : విద్యా హక్కు చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి (నైబర్‌హుడ్) కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరంలోపు ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్లలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధన ఇకపై మారబోతోందా అంటే, విద్యాశాఖ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నైబర్‌హుడ్ పరిధి పెంపునకు కసరత్తు మొదలైందని విద్యాశాఖ వర్గాలు నిర్ధారించాయి. పాఠశాల కేటగిరీని బట్టి ఒక కిలోమీటర్, 3 కి.మీ., 5 కి.మీ. ఉండగా, ఇకపై అన్నింటికి 5 కి.మీ. దూరాన్నే వర్తింపజేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే అది సాధ్య మవుతుందా? లేదా? విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది. అది సాధ్యం కాకపోతే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చునన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈనెల 15వ తేదీన విద్యాశాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ కమిటీ ఈ నెల 22వ తేదీలోగా నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. అందులో మరోవైపు మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ వంటి సంస్థల పరిధిలో ఉండే పట్టణ ప్రాంతాల్లో నైబర్‌హుడ్ పరిధిని ఒక వార్డుగా చేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో చట్టం అమలుకు ఇచ్చిన రూల్స్‌కు సవరణ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. హేతుబద్ధీకరణ కోసమేనా? రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,754 పాఠశాలలుంటే.. ఒక్క విద్యార్థీ లేని స్కూళ్లు 916 ఉన్నాయి. ఈస్కూళ్లలో 748 మంది టీచర్లున్నారు. వారిని విద్యాశాఖ ఇతర స్కూళ్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. అయితే 1–10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 1,752 ఉండగా, వాటిల్లో 2,022 మంది టీచర్లు ఉన్నారు. 11 నుంచి 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 3,441 ఉండగా, వాటిల్లో 5,275 మంది టీచర్లను కొనసాగించాల్సి వస్తోంది. మొత్తంగా 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లలోనే 5 మందికి పైగా టీచర్లను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హేతుబద్ధీకరణకు ఆలోచనలు చేసింది. అయితే ఉపాధ్యాయ సంఘాలు స్కూళ్లు మూసేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వాస్తవానికి ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న టీచర్లను సర్దుబాటు చేయకుండా, పాఠశాలల హేతుబద్ధీకరణ చేయకుండా అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నా 5 వేల మందికి పైగా టీచర్లను వాటికి కేటాయించడం ద్వారా మానవ వనరులు వృథా అవుతున్నాయి. వారిని ఆయా స్కూళ్లలోనే కొనసాగించాల్సి రావడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు వారిని పంపించలేని పరిస్థితి నెలకొంది. విద్యా హక్కు చట్టంలో ఆవాస ప్రాంతానికి నిర్ధేశిత దూరంలో పాఠశాల లేకపోతే ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించాలని చట్టం చెబుతోంది. దానిని కొన్ని చోట్ల అమలు చేస్తున్నా.. తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లను ఇతర స్కూళ్లలో విలీనం చేసేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. అందుకే విద్యాహక్కు చట్టం నిబంధనలకే మార్పులు చేయడం సాధ్యమా? అది సాధ్యమైతే తమ ఆలోచనలను సులభంగా ఆచరణలో పెట్టవచ్చన్న భావనతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెబుతున్నదీ అదే.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన నూతన విద్యా విధానంలో కూడా స్కూల్ కాంప్లెక్స్ పేరుతో ఉన్నత పాఠశాలలను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ కాంప్లెక్స్‌కు 5 నుంచి 10 మైళ్ల పరిధిలో కింది తరగతులతో కూడిన పాఠశాలలను కొనసాగించాలని గతంలోనే ఎడ్యుకేషన్ కమిషన్ సిఫారసు చేసిందని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అభిప్రాయపడింది. ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని పాలసీని రూపొందించిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అది అమల్లోకి రావాలంటే విద్యాహక్కు చట్టంలోని నివాస ప్రాంతంలో స్కూల్ ఉండాల్సిన నిర్ధేశిత పరిధిని పెంచేలా మార్పులు చేయాల్సి వస్తుంది. కేంద్రం ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం సిఫారసు చేస్తుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు.. హైదరాబాద్ ఆర్జేడీ హైదరాబాద్ డీఈవో రంగారెడ్డి డీఈవో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఒక డిప్యూటీ ఈవో. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఎంఈవో సమగ్ర శిక్షా అభియాన్ నుంచి ఏఎస్పీడీ తరపున ఒక ప్రతినిధి -
106 మంది టీచర్లకు తొలగింపు నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరు అవుతున్న 106 మంది టీచర్లను తొలగించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ముందు వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాకు ఒక విచారణ అధికారిని నియమించనుంది. ఆ అధికారి నేతృత్వంలో ఆయా జిల్లాల్లో విధులకు గైర్హాజరైన టీచర్లకు నోటీసులు జారీ చేయనుంది. ఇలా అన్ని జిల్లాల్లో విధులకు గైర్హాజరు అవుతున్న టీచర్లకు విధుల నుంచి తొలగింపు నోటీసులను త్వరలో ఇవ్వనుంది. వారి నుంచి సమాధానం తీసుకొని సదరు అధికారి విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిక పంపిస్తారని, ఆ నివేదికపై తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారి చెప్పారు. 30 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు.. అక్టోబర్ 30 నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షలు నవంబర్ 11 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రతి రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. -
మనోళ్లు అదుర్స్
సాక్షి, హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తరువాత తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులే కాదు ప్రైవేటు కాలేజీలు కూడా తెలుగు రాష్ట్రాల్లో అధికంగానే ఉన్నట్లు ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్హెచ్ఈ) తేల్చింది. 2018–19 సంవత్సరానికి సంబంధించిన సర్వే వివరాలను ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను 2,64,65,449 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో ఉత్తరప్రదేశ్‌లోనే 47,91,749 మంది (18.10 శాతం) చదువుతున్నారు. అలాగే మహారాష్ట్రలో 29,57,491 మంది (11.17 శాతం) చదువుతుండగా తెలంగాణ, ఆం«ధ్రప్రదేశ్‌ల నుంచి 24,17,378 మంది (9.13 శాతం) ఉన్నట్లు సర్వే వివరించింది. ఇందులో డిగ్రీ నుంచి మొదలుకొని పీహెచ్డీ వరకు విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించింది. కాలేజీల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ టాప్.. దేశవ్యాప్తంగా ఉన్నతవిద్యను అందించే కాలేజీల్లో ఉత్తరప్రదేశ్ టాప్‌లో నిలిచింది. అక్కడ అత్యధికంగా 6,447 కాలేజీలు ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఆ తరువాత స్థానంలో తెలుగు రాష్ట్రాలే నిలిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4,497 కాలేజీలు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో 2,521 కాలేజీలు, తెలంగాణలో 1,976 కాలేజీలు ఉన్నాయి. మూడో స్థానంలో మహారాష్ట్ర (4,340 కాలేజీలు) నిలిచింది. ప్రైవేటు కాలేజీల్లో ద్వితీయ స్థానం.. దేశవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల సంఖ్యలోనూ మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. అక్కడ 5,659 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,497 కాలేజీలు ఉండగా అందులో 3,923 ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి. తెలంగాణలో 1,700 ప్రైవేటు కాలేజీలు ఉండగా (80 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 2,223 (82 శాతం) ప్రైవేటు కాలేజీలు ఉన్నట్లు సర్వే వివరించింది. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర (3,589 ప్రైవేటు కాలేజీలు) ఉన్నట్లు పేర్కొంది. -
పాఠశాలలకో రేటింగ్
సాక్షి, హైదరాబాద్ : మార్కులను బట్టి విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తుంటారు కదా.. మరి స్కూళ్లకు? స్కూళ్లకేమో రేటింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. తద్వారా స్టార్ స్కూల్స్– 5 స్టార్ నుంచి 1 స్టార్ వరకు నిర్ణయించా లని చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతోపాటు ఇతర అంశాల్లో మెరుగుదల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పరిశుభ్రతకు పట్టం.. క్రమశిక్షణకు పెద్దపీట.. స్వచ్ఛతకు చేయూత.. ఇదీ సర్కార్ బడుల ఇతర ప్రాధాన్యతాంశాలు. ప్రతి అంశానికి మార్కులు.. ఆ మార్కుల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రోగ్రెస్ తీసుకురావాలని నిర్ణయించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి సూచన మేరకు ఆరు అంశాల్లో మార్కులు కేటా యించేందుకు విద్యాశాఖ పలు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాకమిషనర్ విజయ్‌కుమార్ డీఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. మార్కులు ఇలా.. వ్యక్తిగత పరిశుభ్రత పిల్లలు ప్రతిరోజు స్నానం చేయడం, మరుగుదొడ్డి వినియోగించాక, భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వంట సిబ్బంది.. వంట సిబ్బంది గోర్లు కత్తిరించుకోవడం, వారు జుట్టు ముడి వేసుకొని క్యాప్ ధరిం చడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రక్షిత నీరు.. రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచ డం, నీటి ట్యాంకును ప్రతినెలా శుభ్రం చేయ డం, తాగునీటి పాత్రలపై మూతలు పెట్టడం వంటి అంశాల్లో మార్కులు ఇస్తారు. మరుగుదొడ్లు.. మరుగుదొడ్లలో నీటిని అందుబాటులో ఉంచడం, శుభ్రమయ్యే వర కు నీరు పోయడం, బాలికల టాయిలెట్లో మూత కలిగిన చెత్తబుట్ట ఉంచటం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. పరిసరాల పరిశుభ్రత.. వ్యర్థ జలాన్ని మొక్కలకు మళ్లించడం, దాతల సహకారంతో పాఠశాల గదులకు సున్నం వేయించడం, తరగతి గదుల్లో చెత్త బుట్టలను అందుబాటులో ఉంచడం వంటి అంశాల ఆధారంగా మార్కులను ఇస్తారు. ఆ మార్కులను బట్టి రేటింగ్ ఇస్తారు. అడ్వొకసీకి అత్యధిక మార్కులు.. స్వచ్ఛ పాఠశాలలో భాగంగా అడ్వొకసీ విభాగానికి అత్యధిక మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. స్వచ్ఛతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి, వారు ఇతరులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టడం, స్వచ్ఛత క్లబ్‌ల ఏర్పాటు, అమలు, స్వచ్ఛ నమస్కారం, 90 శాతానికి మించి నెలవారీ హాజరు అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, పీఈటీ/టీచర్ మెంబర్ కన్వీనర్‌గా, విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛత క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. వీటన్నింటినీ స్వీయ మూల్యాంకనం చేసుకొని ప్రతి పాఠశాలకు రేటింగ్ ఇచ్చుకోవాలి. ఆ వివరాలను పై అధికారులకు తెలియజేయాలి. -
బడి బలోపేతం
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. రోజుకో కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడం, హాజరు , ఉత్తీర్ణత పరిశీలించడం, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, బాలకార్మికుల నమోదు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రత్యేక కేంద్రాల్లో చేరికకు విద్యార్థుల ఎంపిక, తదితర వాటిపై దృష్టిపెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు. ఆరు రోజులపాటు సాగనున్న బడిబాటకు కరపత్రాలు, బ్యానర్లతో విసృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని అవాస ప్రాంతాల్లోని బడిఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచి నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో సమాన భాగస్వామ్యంతో బలోపేతం చేయడం, అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన బాలబాలికలను సమీపంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, గ్రామ విద్య రిజిస్టర్ అప్లోడ్ చేయడం, ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకున్న వారిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించి నూరుశాతం ఎన్రోల్మెంట్ పూర్తి చేయడం, తక్కువ ఎన్రోల్ ఉన్న పాఠశాలలను గుర్తించి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. బాలిక విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించి బాలికలను పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనుంది. నిధులు మంజూరు... బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రచార సామగ్రి, ప్రగతి నివేదికలు, బ్యానర్లు వంటి వాటికి ఒక్కో పాఠశాలకు రూ.1000 చొప్పున డీఈవోల నుంచి ఎంఈవోలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 620 పాఠశాలలకు రూ.6,20,000 మంజూరు చేసింది. ఆంగ్ల మాధ్యమంపై విస్తృత ప్రచారం... ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నట్లు విసృతంగా ప్రచారం చేయాలని విద్యా కమిటీలకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు విసృతంగా ప్రచారం చేపట్టడంతోపాటు కొత్తగా ఆంగ్ల మాధ్యమ తరగతులను ప్రారంభించే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో బడిబయట ఉన్న పిల్లల నమోదును పెద్ద ఎత్తున పెంచేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతుంది. రోజువారీ బడిబాట కార్యక్రమాలు... 14వ తేదీన బడిబాట ప్రాధాన్యతను గుర్తించేలా అవాస పాఠశాలలను అందంగా అలంకరించాలి. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంచాలి. విద్యార్థులతో ‘మన పాఠశాల మన గ్రామం’ నినాదంతో ప్రచారం. పాఠశాల పనితీరుపట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. 15వ తేదీన పాఠశాలల్లో బాలికలకు బాలిక విద్యపట్ల ప్రత్యేక అవగాహన కల్పించడం. బాలికల జీవనైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమాలు. 16న సామూహిక అక్షరాభ్యాసం, పిల్లల తల్లిదండ్రులతో సమావేశం, ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం. 17న స్వచ్చ పాఠశాలలో భాగంగా తరగతి గదులను, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రం చేసుకోవడం, చెట్ల సంరక్షణ, చెట్లకు నీరుపోయడం, చెట్ల బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం. 18న బాలకార్మికులకు గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే బాల కార్మిక నిర్మూలనాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికా«ధికారులను భాగస్వామ్యులు చేయడం. పాఠశాల యాజమాన్య కమిటితో సమావేశం నిర్వహించాలి. 19న ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై ప్రచారం... మాతృభాష, ఆంగ్ల భాషలో విద్యాబోధన, డిజిటల్ తరగతి గదులు, నాణ్యమైన విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పాఠశాల యాజమాన్య కమిటి ఏర్పాటు. రవాణా భత్యం, స్కాలర్షిప్లు, ఎస్కార్ట్ అలవెన్స్‌లపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 14 నుంచి 19 వరకు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యాకమిటీల భాగస్వామ్యంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులను, స్వచ్ఛంద సంస్థలను, మహిళ సంఘాలను, యువతను సమావేశాలకు ఆహ్వానించి విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలి. ఈమేరకు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. – వెంకటేశ్వర్లు, డీఈవో, కరీంనగర్ -
ఆర్జిత సెలవుల పేరిట టీచర్ల అక్రమార్జన..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆర్జిత సెలవు(ఈఎల్స్)ల ప్రక్రియ గాడితప్పుతోంది. వేసవి సెలవుల్లో విధులు నిర్వహించకున్నా అక్రమంగా పొందుతున్నట్లు విద్యా శాఖ గుర్తించింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా వేలాది మంది బోధన, బోధనేతర సిబ్బంది ఇదే తరహాలో పొందుతున్న వైనంపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఏడాది ఆర్జిత సెలవులకు ఎవరె వరు దరఖాస్తు చేసుకుంటున్నారనే దానిపై ఆ శాఖ ఆరా తీస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జూనియర్ అసి స్టెంట్ లేదా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వహించాలి. సెలవులు పూర్తయ్యే వరకు వారిద్దరు పాఠశాలలో అందుబాటులో ఉండి ఫెయిలైన విద్యార్థుల నామినల్ రోల్స్(ఎన్ఆర్) రూపకల్పన, ఫెయిల్ విద్యార్థుల మెమోల జారీ, వారి నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజుల స్వీకరణ తదితర పనులు చేయాల్సి ఉంటుంది. వీరితోపాటు పాఠశాల స్వీపర్ కూడా విధులకు హాజరుకావాలి. ఉద్యోగి పనిచేసిన రోజుల ఆధారంగా ఆర్జిత సెలవులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ విధులు నిర్వహించిన ఉద్యోగికి సగటున 10 నుంచి 24 రోజుల వరకు ఈఎల్స్ వస్తాయి. సగటున ఒక్కో ఉద్యోగి సగం నెల వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఈ కేటగిరీలో ఏటా రూ.45 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నూరు శాతం ఫలితాలొచ్చినా.. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విధులను సాధారణంగా నూరు శాతం కంటే తక్కువ ఫలితాలొచ్చిన పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. వంద శాతం ఫలితాలొస్తే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారుండరు. కనుక అక్కడ ప్రత్యేకించి విధులు నిర్వహించాల్సిన పనిలేదు. కానీ నూరుశాతం ఫలితాలు సాధించిన స్కూళ్లలోనూ విధులు నిర్వహించినట్లు రికార్డులు రూపొందించి ఆర్జిత సెలవులు పొందుతున్నారు. గతేడాది పలు స్కూళ్లలో ఇదే తంతు జరిగినట్లు విద్యాశాఖ అధికారులు గుర్తిం చారు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది ఈఎల్స్ దరఖాస్తులను సీరియస్‌గా పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,026 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఈ ఏడాది ఏకంగా 4,374 పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 2,279 కాగా, 1,580 జిల్లా పరిషత్ పాఠశాలలు, 59 ప్రభుత్వ పాఠశాలలు, 33 ఎయిడెడ్ పాఠశాలలు, 97 ఆదర్శ పాఠశాలలు, మిగతా కేటగిరీలో కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలల నుంచి టెన్త్ సప్లిమెంటరీ విధులు నిర్వహించిన కేటగిరీలో ఎందరు ఈఎల్స్ పొందుతున్నారనే వివరాలను రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. -
టెన్షన్ వద్దు
తూప్రాన్: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఇంటర్ ఫలి తాల సమయంలో నెలకొన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫలితాలకు ముందే విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, వారికి అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈ ఓలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పరీక్షలు.. మార్కులే జీవితం కావన్నారు. విద్యార్థులు సాధించిన మార్కుల విషయంలో తల్లిదండ్రులు నిరుత్సాహపర్చేవిధంగా వ్యవహరించకూడదన్నారు. భవిష్యత్తుపై వారిలో నమ్మకం కలిగించే విధంగా ధైర్యం చెప్పాలన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించాల్సి ఉండాల్సింది అని వారిపై ఒత్తిడి తేవద్దన్నారు. దురుసుగా వ్యవహరిస్తే క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని, విద్యార్థుల అభీష్టానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వారిపై రుద్దవద్దని సూచించారు. -
ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల కారణంగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. త్వరలో విడుదల కానున్న పదోతరగతి పరీక్షల ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పక్కా చర్యలు చేపడుతోంది. తొందరపడి ఫలితాలు ప్రకటించి 5.5 లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టకుండా.. ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన జరిపాకే ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల ప్రాసెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి.. శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్, ఇతర అధికారులు, సాంకేతిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పదోతరగతి పరీక్షల ఫలితాల విషయంలో ఒక్క పొరపాటు కూడా జరక్కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. స్కానింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఫలితాల ప్రాసెస్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో తప్పులు దొర్లకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తప్పులు దొర్లకుండా పక్కాగా పరిశీలన జరపడంతోపాటు ఒకవేళ విద్యార్థులకు అనుమానాలున్నా, ఫిర్యాదు చేయాలన్నా ఆన్లైన్లోనే చేసేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా, తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగిన్ నుంచి, లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫిర్యాదు చేసేలా, దానికి మెసేజ్ రూపంలో రెస్పాన్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా రీ–వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. శనివారం నుంచి వచ్చే నాలుగైదు రోజులు పునఃపరిశీలన జరుపనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక వీలైతే వచ్చే 10వ తేదీన ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. పరిశీలన ప్రక్రియ కనుక సవ్యంగా పూర్తికాకపోతే 15వ తేదీలోగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తానికి 10–15 తేదీల మధ్య ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పరీక్షల విషయంలో తీసుకోనున్న జాగ్రత్తలివే! ఒక సబ్జెక్టు మినహా మిగతా సబ్జెక్టుల్లో పాస్ అయిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా, ఆబ్సెంట్ పడినా ఆ జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్ చేస్తారు. సున్నా మార్కులు వచ్చినా వారి జవాబు పత్రాలను పునఃపరిశీలిస్తారు. సబ్జెక్టుల వారీగా మార్కుల వ్యత్యాసాన్ని సరిపోల్చి చూస్తారు. సైన్స్‌లో అత్యధిక మార్కులు వచ్చి, మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వస్తే మళ్లీ పరిశీలన జరుపుతారు. అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని రీ–చెక్ చేస్తారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు పాఠశాలలకు ప్రత్యేక లింకు ఇస్తారు. పాఠశాలల వారీగా విద్యార్థుల మార్కులను కూడా ఆయా పాఠశాలలకు పంపిస్తారు. అందులో ఏమైనా అనుమానాలు ఉన్నా, తక్కువ మార్కులు వచ్చినట్లు గుర్తించినా విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాల్ దగ్గర్నుంచే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేసేందుకు, ఫిర్యాదులను స్వీకరించేందుకు ఆన్లైన్ విధానం ప్రవేశ పెడతారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ లింక్ ఇస్తారు. అవసరమైతే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సర్వర్‌ను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులెవరూ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరమే లేకుండా ఆన్లైన్ ద్వారానే వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఈ క్రమంలో విద్యార్థి ఫిర్యాదు చేసిన వెంటనే అతని మొబైల్ నంబరుకు మెసేజ్ పంపిస్తారు. అది పరిష్కారం అయ్యాక కూడా మెసేజ్ పంపిస్తారు. ఈ–మెయిల్ ఐడీకి కూడా ఆ వివరాలను పంపిస్తారు. వీటికి సంబంధించిన వెబ్సైట్/వెబ్‌లింక్/మొబైల్ యాప్‌ను నాలుగైదు రోజుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
‘ఏకీకృత’ ఫైలును రాష్ట్రపతికి పంపండి
కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించిన రాజ్‌నాథ్ సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు సంబంధించిన ఫైలును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపా లని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని.. హోంమం త్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశించారు. గతంలో ఇదే విషయమై ఏపీ, తెలంగాణ విద్యా శాఖ మంత్రులు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. బుధవారం తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపకుడు బి.మోహన్‌రెడ్డి, అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు కాటే పల్లి జనార్దన్‌రెడ్డి. పూల రవీందర్, ప్రధాన కార్యదర్శి చెన్న కేశవరెడ్డి తదితరులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలసి సర్వీస్ రూల్స్‌పై చర్చించారు. దీంతో వెంకయ్యనాయుడు రాజ్‌నాథ్‌తో సమావే శమై సర్వీస్ రూల్స్ ఫైలును రాష్ట్రపతి ఆమోదా నికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. దీంతో రాజ్‌నాథ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని పిలిపించి ఫైలును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఎస్టీయూ నేతలు సోమవారం హోంశాఖ కార్యదర్శి దిలీప్‌కుమార్‌తో సమావేశమై సర్వీసు రూల్స్ అమలుపై చర్చించారు. ఏకీకృత సర్వీసు నిబంధనల ఫైలును త్వరలోనే రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారు. -
స్కూళ్లలో నిపుణులతో బోధన!
- 6 నుంచి 10 తరగతులకు చేపట్టేందుకు చర్యలు - వివిధ రంగాల్లో నిపుణులతో విద్యా బోధన - ఇంటర్మీడియెట్‌లోనూ ఐఐటీ పాఠాలు - ఇంజనీరింగ్‌లో పారిశ్రామికవేత్తలతో పాఠాలు - వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో నిపుణులతో ఇక ప్రత్యక్ష విద్యా బోధన చేపట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాస్‌రూంలో వివిధ అంశాలకు సంబంధించిన ఆయా రంగాల్లోని నిపుణులను పిలిపించి విద్యార్థులకు బోధన చేపట్టనుంది. 2017–18 విద్యా సంవత్సరంలో దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒక తరగతిలో రాకెట్, అంతరిక్ష ప్రయోగం వంటి పాఠాలు ఉంటే ఆ పాఠాన్ని టీచర్‌తో చెప్పించడమే కాకుండా ఆయా రంగాలకు చెందిన నిపుణులను పిలిపించి బోధన నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కసరత్తు ప్రారంభించింది. 6 నుంచి 10వ తరగతి వరకు తరగతి వారీగా ఉన్న పాఠ్యాంశాలు, వివిధ రంగాలకు చెందిన పాఠాలను గుర్తించి ఆయా రంగాలకు సంబంధించి ఎవరెవరిని పిలిపించాలన్న అంశంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో కసరత్తు చేస్తోంది. ఆరోగ్యం వంటి పాఠాలు ఉన్న తరగతులకు ఓ డాక్టర్‌ను, భౌతిక శాస్త్రానికి సంబంధించి ఒక సైంటిస్ట్‌ను పిలిపించి పాఠాలు చెప్పించడం ద్వారా విద్యార్థుల్లో ఆయా అంశాలకు సంబంధించి అవగాహన ఏర్పడుతుందని భావిస్తోంది. ఇంటర్మీడియెట్‌లోనూ ఐఐటీ నిపుణులతో పాఠాలు చెప్పించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఐఐటీల కౌన్సిల్ కూడా ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటీ నిపుణులతో ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇంజనీరింగ్‌లోనూ పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రముఖులతో పాఠాలు బోధించడం ద్వారా ఆయా రంగాలపై విద్యార్థులకు అవగాహన కలుగ డంతోపాటు పారిశ్రామిక రంగాలకు ఏ విధమైన అవసరాలు ఉంటాయో తెలుసుకునేందుకు వీలు ఏర్పడనుంది. బీటెక్ కోర్సులోనూ ఇండస్ట్రీ శిక్షణ కాలాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది. -
‘డౌట్’సెట్!
* తెలంగాణ, ఏపీల మధ్య మరో వివాదం * కళాశాలలకు ‘ఫైర్ సేఫ్టీ’ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన హైకోర్టు * ఆ సర్టిఫికెట్లు లేకుండానే గుర్తింపు పొడిగించిన తెలంగాణ విద్యాశాఖ.. * ప్రవేశాల సమయంలో ధ్రువపత్రాలు తీసుకోవాలని డైట్ కన్వీనర్‌కు సూచన * దానితో తమకు సంబంధం లేదంటున్న ‘డైట్’ కన్వీనర్ * ఇలాగైతే కౌన్సెలింగ్ నిర్వహించలేమని స్పష్టీకరణ * తెలంగాణ, ఏపీ అధికారుల భిన్నవాదనలు.. ఆందోళనలో 2.19 లక్షల విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఎంసెట్, ఇంటర్ పరీక్షల వ్యవహారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా... తాజాగా డైట్‌సెట్ కౌన్సెలింగ్ అంశంతో మరో వివాదం మొదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు డైట్ కళాశాలలకు ‘ఫైర్‌సేఫ్టీ’ సర్టిఫికెట్ లేకుంటే కౌన్సెలింగ్ నిర్వహించలేమంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న డైట్‌సెట్ కన్వీనర్ చేతులెత్తేశారు. అసలు తెలంగాణలోని 253 డైట్కళాశాలల్లో ఏ ఒక్క కళాశాలకు కూడా ‘ఫైర్‌సేఫ్టీ’ సర్టిఫికెట్ లేకపోవడంతో ఈ వివాదం రేకెత్తింది. డైట్‌సెట్ రాతపరీక్ష జరిగి ఆరు నెలలు గడిచినా ఇంకా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఇరు రాష్ట్రాల పాఠశాల విద్యాశాఖల నుంచి కళాశాలల జాబితాలు డైట్‌సెట్ కన్వీనర్‌కు అందించడంలో జరుగుతున్న జాప్యమే దీనికి కారణమని బయటకు పేర్కొంటున్నా... కళాశాలలకు అనుమతుల జారీలో లోగుట్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత డైట్‌సెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న సురేందర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు కేటాయించారు. ఏపీలో 476, తెలంగాణలో 257 కళాశాలలు కలిపి ఇరు రాష్ట్రాల్లో 733 డైట్ కళాశాలలు ఉండగా.. వాటిల్లో మొత్తం 38,850 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే ఇరు రాష్ట్రాల్లోని సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఈ కాలేజీల్లో సౌకర్యాలపై ఏటా కౌన్సెలింగ్‌కు ముందు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) నేతృత్వంలోని అఫిలియేషన్ కమిటీ తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆయా కాలేజీల గుర్తింపును పొడిగిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం తాజాగా ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 413 కళాశాలల గుర్తింపును పునరుద్ధరిస్తూ కొద్దిరోజుల కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కళాశాలల జాబితా ఇంకా డైట్ కన్వీనర్‌కు అందకపోయినా... వీటిలో దాదాపు అన్ని కాలేజీలకూ ‘ఫైర్ సేఫ్టీ’ సర్టిఫికెట్ ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... తెలంగాణలోని 253 కళాశాలల గుర్తింపును పునరుద్ధరించిన ఇక్కడి పాఠశాల విద్యాశాఖ... ఆ కళాశాలల జాబితాను శని వారం సాయంత్రం డైట్ కన్వీనర్‌కు పంపించింది. అయితే అందులో ఏ ఒక్క కళాశాలకు ‘ఫైర్ సేఫ్టీ’ సర్టిఫికెట్ లేదు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉంటేనే కళాశాలలకు అనుమతులు జారీ చేయాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో కౌన్సెలింగ్ సమయంలోనే ఆయా కళాశాలల యాజమాన్యాల నుంచి ‘ఫైర్ సేఫ్టీ’ సర్టిఫికెట్ తీసుకుని ప్రవేశాలు జరపాలని తెలంగాణ విద్యా శాఖ డైట్‌సెట్ కన్వీనర్‌కు సూచించింది. కానీ దీనిపై డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగైతే కౌన్సెలింగ్ నిర్వహించలేమని స్పష్టం చేశారు. ఎవరి వాదన వారిదే! ‘ఫైర్ సేఫ్టీ’ వివాదంపై తెలంగాణ ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ జగన్నాథరెడ్డి, డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి భిన్న వాదనలు వినిపిస్తున్నారు. అగ్నిమాపకశాఖ ఎన్వోసీ లేకపోయినా కళాశాలలకు గుర్తింపు పొడిగింపుతో తమకు సంబంధం లేదని, బెంగళూరులోని జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (ఎన్సీటీఈ) ఈ అఫిలియేషన్లు జారీ చేసిందని జగన్నాథరెడ్డి చెబుతున్నారు. కానీ ఈ వాదనను డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తోసిపుచ్చారు. కొత్త డైట్ కళాశాలలు ప్రారంభించడానికే ఎన్సీటీఈ అనుమతులు జారీ చేస్తుందని.. మరుసటి ఏడాది నుంచి గుర్తింపు పునరుద్ధరణను ఆయా రాష్ట్రాల విద్యాశాఖల నేతృత్వంలోని అఫిలియేషన్ కమిటీలే చూడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్ జరపడం వరకే తమ బాధ్యత అని... కళాశాలల అనుమతులకు సంబంధించిన అంశాలతో తమకు సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుని తెలంగాణ విద్యాశాఖకు తెలియజేస్తామని సురేందర్‌రెడ్డి చెప్పారు. విద్యార్థుల ఎదురుచూపులు.. డైట్‌సెట్‌కు ఏప్రిల్ 29న ప్రకటన జారీకాగా జూన్ 29న పరీక్ష నిర్వహించారు. దాదాపు 3.47 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయగా.. జూలై 1న ప్రకటించిన ఫలితాల్లో 2.19 లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరి ర్యాంకులను సైతం జూలై 31వ తేదీనే ప్రకటించారు. అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో కళాశాలల గుర్తింపు పునరుద్ధరణ విషయంలో ఉన్నతస్థాయి వర్గాలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో బేరసారాలు నడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అందువల్లే గుర్తింపు పునరుద్ధరణ ప్రక్రియను సాగదీస్తున్నారనే విమర్శలూ వచ్చాయి. కానీ, రాష్ట్ర విభజన జరిగి ఇరు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడినా కళాశాలలకు గుర్తింపు జారీ ప్రక్రియలో మాత్రం మార్పు రాలేదు. ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు తమ రాష్ట్రాల్లోని కళాశాలల గుర్తింపు పొడిగింపు ప్రక్రియను సాగదీయడంతో ఇప్పటి వరకు కౌన్సెలింగ్ జరగలేదు. దీంతో రెండు లక్షల మందికిపైగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరకుండా డైట్ ప్రవేశాల కోసమే ఎదురుచూస్తున్నారు. -
స్థానికతపై స్పష్టత వచ్చాకే.. ఎంసెట్ కౌన్సెలింగ్
నాలుగు రోజుల్లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించిన స్థానికత అంశంపై స్పష్టత వచ్చాకే ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఆలోచన చేసే అవకాశం ఉందని తెలం గాణ విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్ విషయంలో అంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే పరి స్థితి లేదని పేర్కొన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అం శం తేలాకే దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుం టామని వెల్లడించాయి. మరోవైపు ఎంసెట్ ప్రవేశాలు పూర్తి చేయడం, తరగతులను ప్రారంభించే అంశంపై గడువు కోరుతూ నాలుగు రోజుల్లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చే యనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ పిటిషన్‌పై న్యాయశాఖ పరిశీలన జరుపుతోందన్నారు. అది పూర్తి కాగానే కోర్టులో దాఖలు చేస్తామన్నారు. వీలైతే శుక్రవారం, లేదంటే సోమ, మంగళవారాల్లో ఈ పిటిషన్‌ను వేయనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కౌన్సెలింగ్, ప్రవేశాల ప్రక్రియ అంతా ఈనెల 29వ తేదీలోగా పూర్తి చేయాలి. ఆగస్టు 1వ తేదీనుంచి తరగతులను ప్రారంభించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. పైగా ఇతర అనేక సమస్యలున్నందున ప్రవేశాల పూర్తికి గడువును కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు తెలిపారు. -
వేర్వేరుగానే ప్రవేశ పరీక్షలు!
ఒకటిగా సాంకేతిక, కళాశాల విద్య సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగానే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షల నిర్వహణ, ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే ఏడాది మాత్రం ఎక్కడి ప్రవేశ పరీక్షలు అక్కడే నిర్వహించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న విద్యా, ప్రవేశాల విధానామే ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఎలాగన్న అంశాలపైనా కసరత్తు చేస్తున్నారు. పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న విధానమే అమలు చేయాల్సి ఉన్నందున.. తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సీట్లు కావాలనుకుంటే తెలంగాణ విద్యాశాఖ నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రవేశాలు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే దీనిపై రెండు ప్రభుత్వాలు చర్చించాల్సి ఉంద ని తెలిపారు. ఉన్నత విద్యామండలి సహా రాష్ట్ర స్థాయి వర్సిటీల విభజన రాష్ట్ర విభజనలో భాగంగా ఉన్నత విద్యామండలిని కూడా విభజించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదో షెడ్యూల్లో ఉన్నప్పటికీ మండలి, అందులో పని చేస్తున్న వారి విభజనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అధికారులు మండలి విభజనకు సంబంధించిన చర్యలు చేపట్టారు. రాష్ట్రస్థాయి యూనివర్సిటీలను కూడా విభజించే ఏర్పాట్లు చేయాలని పేర్కొనడంతో అధికారులు వాటిపైనా దృష్టి సారించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, ద్రవిడ విశ్వవిద్యాలయాలను విభజించే ందుకు కసరత్తు చేస్తున్నారు. ఏఎఫ్ఆర్సీ మాత్రం ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు సాంకేతిక విద్యా శాఖ, కళాశాల విద్యా శాఖలను విలీనం చేయాలని నిర్ణయించారు.