సాక్షి, హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తరువాత తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులే కాదు ప్రైవేటు కాలేజీలు కూడా తెలుగు రాష్ట్రాల్లో అధికంగానే ఉన్నట్లు ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్‌హెచ్‌ఈ) తేల్చింది. 2018–19 సంవత్సరానికి సంబంధించిన సర్వే వివరాలను ఇటీవల ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను 2,64,65,449 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో ఉత్తరప్రదేశ్‌లోనే 47,91,749 మంది (18.10 శాతం) చదువుతున్నారు. అలాగే మహారాష్ట్రలో 29,57,491 మంది (11.17 శాతం) చదువుతుండగా తెలంగాణ, ఆం«ధ్రప్రదేశ్‌ల నుంచి 24,17,378 మంది (9.13 శాతం) ఉన్నట్లు సర్వే వివరించింది. ఇందులో డిగ్రీ నుంచి మొదలుకొని పీహెచ్‌డీ వరకు విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించింది.
కాలేజీల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ టాప్..
దేశవ్యాప్తంగా ఉన్నతవిద్యను అందించే కాలేజీల్లో ఉత్తరప్రదేశ్ టాప్‌లో నిలిచింది. అక్కడ అత్యధికంగా 6,447 కాలేజీలు ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఆ తరువాత స్థానంలో తెలుగు రాష్ట్రాలే నిలిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4,497 కాలేజీలు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో 2,521 కాలేజీలు, తెలంగాణలో 1,976 కాలేజీలు ఉన్నాయి. మూడో స్థానంలో మహారాష్ట్ర (4,340 కాలేజీలు) నిలిచింది.
ప్రైవేటు కాలేజీల్లో ద్వితీయ స్థానం..
దేశవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల సంఖ్యలోనూ మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. అక్కడ 5,659 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,497 కాలేజీలు ఉండగా అందులో 3,923 ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి. తెలంగాణలో 1,700 ప్రైవేటు కాలేజీలు ఉండగా (80 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 2,223 (82 శాతం) ప్రైవేటు కాలేజీలు ఉన్నట్లు సర్వే వివరించింది. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర (3,589 ప్రైవేటు కాలేజీలు) ఉన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment