సాక్షి, హైదరాబాద్: ‘‘ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తున్నాం. స్కూళ్లకు వచ్చే వారికి ప్రత్యక్ష బోధన ఉంటుంది. బడికి రాని విద్యార్థులకు ఆన్‌లైన్/ డిజిటల్ పాఠాలు కొనసాగించాల్సిందే. హాజరు నిబంధన లేదు.. పిల్లలను స్కూళ్లకు పంపించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దు...’’అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన తెల్లవారే కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు ఆ నిబంధనలను తుంగలో తొక్కాయి. గురువారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నామని, పిల్లలను స్కూళ్లకు పంపించాలని స్పష్టం చేశాయి.
ఇక ఆన్‌లైన్ బోధన ఉండబోదని, పిల్లలను స్కూళ్లకు పంపించాల్సిందేనని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. కరోనా కేసులు పెరుగతున్నాయనే వార్తల నేపథ్యంలో విద్యార్థులంతా ప్రత్యక్ష బోధనకు హాజరు కావాల్సిందేనని కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు సమాచారం ఇవ్వడం పట్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లకు వచ్చే వారిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
భౌతికదూరమే అసలు సమస్యైతే...
ప్రస్తుతం రాష్ట్రంలో 10,500కు పైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల వరకున్న స్కూళ్లలోనే భౌతికదూరం పాటించడం సాధ్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లోని మిగతా స్కూళ్లలో ఆరడుగుల భౌతికదూరం పాటించడంలో సమస్యలు తప్పవని అధికారులే పేర్కొంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లలో అయితే మరీ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 9, 10 తరగతులను ప్రారంభించినప్పుడే కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కాయి. బెంచీకి ముగ్గురు, నలుగురు విద్యార్థులను కూర్చోబెట్టి మరీ ప్రత్యక్ష బోధనను చేపట్టాయి. ఆన్‌లైన్ బోధనను పూర్తిగా తొలగించాయి.
ప్రభుత్వం మాత్రం ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్ బోధనను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. స్కూళ్లకు పంపించకపోతే నష్టం మీ పిల్లలకేనంటూ తల్లిదండ్రులను భయపెట్టాయి. దీంతో తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధనకు పంపించక తప్పలేదు. దీంతో దాదాపు 6 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు వచ్చారు. ఇపుడు 6, 7, 8 తరగతులకు చెందిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు వస్తారు. అంటే ప్రైవేటు స్కూళ్లలోనే బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య 16 లక్షలకు చేరనుంది. 9, 10 తరగతులకే భౌతికదూరం పాటించని ప్రైవేటు స్కూళ్లలో ఇప్పుడు వాటితోపాటు 6, 7, 8 తరగతుల పిల్లలు వస్తే భౌతికదూరం పాటించడం సాధ్యం కాదని అధికారులే ఒప్పుకొంటున్నారు.
గదుల్లేక కాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు, ఫీజుల వసూళ్లకు..
ప్రైవేటు పాఠశాలల్లో గదుల కొరత సమస్య కానేకాదని అధికారులే చెబుతున్నారు. మెజారిటీ స్కూళ్లలో ఎల్‌కేజీ మొదలుకొని పదో తరగతి వరకు బోధనను కొనసాగిస్తున్నారు. ఇపుడు స్కూళ్లకు వచ్చే 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులను గదికి 20 మంది చొప్పున విభజించి బోధించడం సమస్య కాదు. అలా విభజిస్తే పాఠాలు బోధించాల్సిన టీచర్లు మూడు రెట్లు అవసరం అవుతారు. ఇపుడు సబ్జెక్టుకు ఒకరు చొప్పున 6–7 మందితో బోధన కొనసాగిస్తున్న ప్రైవేటు యాజమన్యాలు కోవిడ్ నిబంధనల ప్రకారం బోధన చేపట్టాలంటే 21 మంది వరకు టీచర్లతో బోధన చేపట్టాల్సి వస్తుంది.
షిఫ్ట్ పద్దతి అమలు చేసినా అదనపు టీచర్లను నియమించాల్సిందే. పైగా ఆన్‌లైన్ బోధనను కొనసాగిస్తే అదనంగా మరో ఆరేడు మంది టీచర్లను నియమించాల్సి వస్తుంది. అదే బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున విద్యార్థులను గతంలో మాదిరిగానే కూర్చోబెట్టి బోధన కొనసాగిస్తే ఖర్చు తక్కువ అవుతుందని నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. విద్యార్థులు స్కూళ్లకు వస్తే సంవత్సరం ఫీజులు మొత్తం వసూలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో యాజమాన్యాలు ఆన్‌లైన్ బోధనను కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు.
నిబంధనల అమలుపై ధ్యాసేదీ?
ప్రైవేటు పాఠశాలల్లో భౌతికదూరం పాటించే విషయంలో విద్యాశాఖ ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఏమీ లేవు. కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించినపుడే స్కూళ్లలో గదికి 20 మంది విద్యార్థులకు మించకూడదని, ఒక్కో విద్యార్థి మధ్య కనీసం 6 అడుగుల భౌతికదూరం ఉండేలా చూడాలని, బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలని విద్యాశాఖ తమ మార్గదర్శకాల్లో పేర్కొంది. పరీక్షలకు హాజరు కూడా విద్యార్థుల ఇష్టమేనని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయడానికి వీల్లేదని, నో డిటెన్షన్ పాలసీ అమల్లో ఉందని స్పష్టం చేసింది. అయినా నిబంధనల అమలును మాత్రం పట్టించుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment