attendance
-
గ్రూప్–1 మెయిన్స్‌కు 72.4 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వరుసగా వారం పాటు జరిగే ఈ పరీక్షల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) పరీక్ష జరిగింది. అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని 46 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 1.30 గంటలకు కేంద్రాలను మూసివేశారు. ఆలస్యంగా వచ్చినవారిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. ఒకచోట నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థిని లోపలికి అనుమతించకపోవడంతో.. ఆ అభ్యర్థి ప్రహరీగోడ దూకివెళ్లాడు. కానీ పోలీసులు వెంబడించి పట్టుకుని.. బయటికి పంపించేశారు.22,744 మంది హాజరుమొత్తం 563 గ్రూప్–1 పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా.. సోమవారం జరిగిన జనరల్ ఇంగ్లిష్ పరీక్షకు 22,744 మంది, అంటే 72.4 శాతం మంది హాజరయ్యారు. సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతోపాటు ఇతర కారణాలతో చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం గట్టి ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రం చుట్టూరా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు.. పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితిని, నిర్వహణ తీరును పర్యవేక్షించారు.ఉత్కంఠకు తెరగ్రూప్–1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలనే డిమాండ్‌తో అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు తెలుగు అకాడమీ పుస్తకాలు అధికారికం కావని ప్రభుత్వం పేర్కొనడం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, పలు ఇతర అంశాలపైనా ఆందోళన వ్యక్తమైంది. అభ్యర్థులకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతుగా నిలవడంతోపాటు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. మరోవైపు అభ్యర్థులు న్యాయ పోరాటానికి సైతం దిగారు. వారి పిటిషన్లను హైకోర్టు తిరస్కరించగా.. సోమవారం సుప్రీంకోర్టులో జరిగే విచారణపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో.. ఉత్కంఠకు తెరపడింది.మధ్యస్తంగా జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రంమెయిన్స్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి పరీక్ష.. జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఇస్తున్నట్టు టీజీపీఎస్సీ పేర్కొన్నా.. కొన్ని ప్రశ్నలు సులభంగా అనిపించినా, అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ పరీక్ష అయిన ఈ పేపర్ చాలా మంది అభ్యర్థులు అర్హత సాధించే విధంగానే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో జనరల్ ఇంగ్లిష్ కీలకమైనది. అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే.. తదుపరి పరీక్షలకు సంబంధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు.అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలుగ్రూప్–1 మెయిన్స్‌కు హాజరవుతున్న అభ్యర్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పరీక్షలకు హాజరవుతున్న వారందరికీ శుభాకాంక్షలు అంటూ సోమవారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని.. విజయం సాధించి, తెలంగాణ పునర్ని ర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అందులో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిమెయిన్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు గ్రూప్–1 ఆఫీసర్లుగా ఎంపికై ప్రజాప్రభుత్వంలో, ప్రగతి తెలంగాణలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడల్లో నిరుద్యోగులు చిక్కకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కార్మికులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కార్మికులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్‌రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్‌తో.. ఫేషియల్ రికగ్నిషన్‌ను మొబైల్ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కార్మికుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది. -
జేఈఈ మెయిన్‌కు రికార్డు స్థాయిలో హాజరు
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్ పేపర్–1 (బీఈ/బీటెక్) పరీక్ష 95.80 శాతం, పేపర్–2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్‌కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు. 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలు.. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్–1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం. దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించారు. రెండో సెషన్ తేదీల్లో మార్పు.. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్దరాత్రి 11.50 గంటల వరకు సెషన్–2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు. -
ఉపాధి కూలీలకూ ‘ఆధార్’ ఆధారిత హాజరు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో బోగస్ కూలీల నమోదును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఉపాధి కూలీలకూ ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను ప్రవేశపెట్ట్టనుంది. ఫీల్డ్‌అసిస్టెంట్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లోని యాప్ ద్వారా కూలీల హాజరును ఈ విధానంలోనే నమోదు చేస్తారు. కేంద్రం ప్రస్తుతం ఈ విధానాన్ని తప్పనిసరి చేయకుండా.. ఇప్పుడు అమల్లో ఉన్న విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. పనులు కోరిన వారి వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ సేకరించి, వారికి పని కేటాయించే ఒక్క రోజు ముందు వారికి ఎక్కడ, ఎన్ని రోజులు పని కేటాయించారన్న వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఎన్ఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ పని జరిగినన్ని రోజులూ ముందుగా నమోదు చేసిన కూలీల్లో రోజూ ఎవరెవరు పనికి వచ్చారో పని జరిగే ప్రదేశంలోనే యాప్‌లో వారి పేర్ల వద్ద హాజరైనట్టు టిక్ చేస్తారు. అంతేకాదు, కూలీలు పనిచేస్తున్నప్పుడు ఒక ఫొటో తీసి దానిని కూడా ఆ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే, ఆ ఫొటోలో పనిచేస్తున్న కూలీలు ఎవరన్నది వారి ముఖాలు స్పష్టంగా కనిపించినా, కనిపించకపోయినా.. కూలీల సంఖ్య మాత్రం స్పష్టంగా తెలిసేలా ఫొటోను అప్లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, కొత్త విధానంలో కూలీల హాజరును ఫీల్డ్ అసిస్టెంట్ మొబైల్ యాప్‌లో టిక్ రూపంలో నమోదు చేసే బదులు.. ఆ కూలీ ముఖాన్ని ఫొటో తీస్తారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్‌లో నమోదైన ఫొటోతో ఈ ఫొటో సరిపోలాకే హాజరు పడేలా మొబైల్ యాప్‌లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరించనున్నారు. ఇకపై అలా వీలుపడదు.. జియో కోఆర్డినేట్ల(ఆ ప్రాంత వివరాలకు సంబంధిచిన శాటిలైట్ ద్వారా నిర్దేశించిన కొలతలు)ను ఆ పనికి అనుమతి తెలిపే సమయంలో పని ప్రదేశంలోనే ఇప్పటి వరకు నమోదు చేస్తున్నారు. కొత్త విధానంలో పని ప్రాంతంలోనే ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయా కూలీల ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జియో కోఆర్డినేట్లు నమోదు చేసిన ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో హాజరు నమోదుకు ప్రయత్నించినా వీలుపడదు. ప్రస్తుతానికి రెండు విధానాల్లోనూనమోదుకు అవకాశం ఆధార్ ఆధారిత కూలీల ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ కటారియా ఇటీవల అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటిదాకా కూలీల హాజరు నమోదు ప్రక్రియకు అనుసరించే విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి యాప్ ద్వారా కూలీల ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదు చేసేలా ఆధునికీకరించిన ఎన్ఎంఎంఎస్ యాప్ అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి రెండు ప్రక్రియల్లో హాజరు నమోదుకు వీలున్నా.. రానున్న రోజుల్లో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. -
మస్టర్ ఒకరిది! డ్యూటీలో మరొకరు!! అంతలోనే..
మంచిర్యాల: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా అధికారుల పర్యవేక్షణ లోపంతో.. కార్మికుడి స్థానంలో మరొకరు విధులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంస్థ వ్యాప్తంగా సంచలనమైంది. సమాచారం అందుకున్న అధికారులు గని అధికారికి చార్జి మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏరియాలోని కేకే–5 గనిలో టెక్నికల్ ఉద్యోగి విధి నిర్వహణకు 15 రోజుల క్రితం గనిపైకి వచ్చి మస్టర్ పడ్డాడు. ఆరోజు ఆదివారం కావడంతో సహోద్యోగులు దావత్ ఏర్పాటు చేశారు. ఈమేరకు విధులకు వచ్చిన కార్మికుడికి కూడా సమాచారం అందించారు. దీంతో సదరు కార్మికుడు విధులకు డుమ్మా కొట్టలేక ఆ గనిలోనే విధులు నిర్వహించే మరో టెక్నికల్ ఉద్యోగిని పిలిపించి అతడితో డ్యూటీ చేయించాడు. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. విధులు నిర్వహించిన ఉద్యోగికి గని అధికారి నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. సింగరేణి చరిత్రలో మస్టర్ ఒకరు పడి విధులు మరొకరు చేయడం ఇంత వరకు ఎరిగి ఉండమని, విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఉండేదని అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. -
మెడికల్ కాలేజీలో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ హాజరు
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మూడు బయోమెట్రిక్ మిషన్లు, ఒక్కొక్క ఫేస్ రికగ్నైజేషన్ మిషన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌తోపాటు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారానే హాజరు నమోదు చేస్తుండగా, వీటిని నేరుగా డీఎంఈకి అనుసంధానం చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇకపై వీరి పర్యవేక్షణను జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) కమాండ్ కంట్రోల్ నుంచే చేసేలా చర్యలు తీసుకుంటోంది. నేరుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ఉద్యోగుల హాజరును పరిశీలించనున్నారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు హాజరైనప్పుడు ఒకసారి, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేసి, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే. గత నెలలోనే ఇందుకు సంబంధించిన అధునాతన బయోమెట్రిక్ పరికరాలను బిగించి, సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేశారు. ఉద్యోగుల వివరాలన్నింటినీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి వినియోగిస్తున్నారు. ఏ సమయానికి హాజరు అవుతున్నారు అనే దానితోపాటు పనితీరు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరుకు చెక్ మంచిర్యాలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గత ఏడాది 100 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించారు. ఇటీవల నీట్ పరీక్ష నిర్వహించగా, ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది మరో 100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు పొంది చేరనున్నారు. ప్రతియేటా పెరుగుతున్న మెడిసిన్ విద్యార్థులకు అనుగుణంగా, అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను నియమిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల మెడికల్ కాలేజీకి అనుబంధంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం 130 పడకలతో కొనసాగుతోంది. నె లలో 400కు పైగా ప్రసవాలు జరుగుతుండగా, ప్రతీ రోజు 150 మందికి పైగా గర్భిణులు ఓపీకి వస్తున్నా రు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 280 పడకలతో వైద్య సేవలు అందిస్తుండగా, అన్ని విభాగాల్లో అ సోసియేట్ ప్రొఫెసర్లు, వైద్యులను నియమిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ప్రొఫెసర్లు 11 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆరుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 49 మంది, సీనియర్ రెసిడెంట్లు 44, ట్యూటర్లు 4, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 16 మంది ఉండగా, ఇతర వైద్య సిబ్బంది 20 మందికి పైగా ఉన్నారు. బయోమెట్రిక్ పరికరాలతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హాజరు సరిగ్గా పాటించని ఉద్యోగులపై నేరుగా చర్యలు తీసుకునేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సమయపాలన పాటిస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఎంసీహెచ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించేందుకు ఇప్పటికే మూడు చోట్ల బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నాం. డీఎంఈ నుంచి హాజరును పర్యవేక్షిస్తున్నారు. ఎన్ఎంసీకి అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం లాగిన్‌ఐడీ వస్తే, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదును డీఎంఈతోపాటు ఢిల్లీలోని ఎన్ఎంసీ పరిశీలిస్తారు. – డాక్టర్ ఎండీ సులేమాన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో ఉద్యోగులందరి హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్రం శుక్రవారం అన్ని శాఖలను కోరింది. తమ పరిధిలోని ఉద్యోగులు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేయనప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు అలసత్వంతో వ్యవహరిస్తున్నాయని తేలడంతో సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు తమ ఉద్యోగుల హాజరును తప్పనిసరిగా నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరింది. ఉద్యోగుల సమయపాలనపైనా శ్రద్ధ పెట్టాలని సూచించింది. ఉద్యోగులు తరచూ ఆలస్యంగా విధులకు హాజరు కావడం, ముందుగానే వెళ్లిపోవడం వంటి వాటిని ప్రోత్సహించరాదని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
TS: చలి తీవ్రత.. బడి ‘వణికిపోతోంది’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి విద్యార్థులు వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గత నాలుగు రోజులుగా విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. హాజరయ్యే విద్యార్థులు కూడా ఏదో ఒక సీజనల్ వ్యాధితో బాధపడుతున్నారని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. కొన్ని బడుల్లో కనీస హాజరు శాతం కూడా ఉండటం లేదని, దీంతో బోధన చేపట్టలేకపోతున్నారని చెప్పా యి. అనేకచోట్ల టీచర్లు కూడా చలి ప్రభావానికి లోనవుతున్నారు. మూడు రోజులుగా దాదాపు 3 వేల మంది టీచర్లు సీజనల్ వ్యాధితో సెలవు పెట్టినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, తరగతి గదిలో వెచ్చదనం లేకపోవడంతో విద్యార్థులు గజగజ వణికిపోతున్నట్టు విద్యాశాఖాధికారులు చెప్పారు. అంతటా అనారోగ్యం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో సోమవారం 45 శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఇది 35 శాతానికి తగ్గింది. స్కూల్‌కు రాని ప్రతీ విద్యార్థి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. విద్యార్థుల్లో జలుబు, దగ్గు, జ్వరం, నీరసం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ జిల్లా విద్యాశాఖాధికారి చెప్పారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, ములుగు, నల్లమలకు అనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎండ కూడా రావడం లేదు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి, విద్యార్థులు శ్వాస సమస్యలకు లోనవుతున్నట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లల్లోని విద్యార్థులు చాలా వరకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. హాస్టళ్లకు కిటీకీలు లేకపోవడం, పడుకునే నేల మంచును తలపించేలా ఉండటంతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో చలికి స్నానం చేసే పరిస్థితి ఉండటం లేదని, దీంతో చర్మవ్యాధులూ సోకుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇది కీలక సమయమే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. దీనికి అనుగుణంగా పిల్లల శరీరం ఇప్పటికిప్పుడు అలవాటు పడే అవకాశం ఉండదు. ఇలాంటి సీజ న్లలో వారిలో వ్యాధి నిరోధక శక్తి అంత చురుకుగా పనిచేయదు. ఫలితంగా చలి తీవ్రతకు జలుబు, జ్వరం వంటి వ్యాధులతో నీరసపడే ప్రమాదం ఉంది. చల్లదనానికి నీళ్లు ఎక్కువగా తీసుకోనందున డీ హైడ్రేషన్ సమస్యలూ ఉంటాయి. మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్న స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. దీనివల్ల ఇతర విద్యార్థులకు వైరస్ సోకకుండా నియంత్రించవచ్చు. విద్యార్థుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఆకు కూరలు, ఇంట్లో చేసిన వంటలు ఎక్కువగా ఇవ్వాలి. గోరు వెచ్చని నీరు తాగించాలి. – డాక్టర్ ఎస్.కవిత, పిల్లల వైద్య నిపుణురాలు, నిలోఫర్ ఆసుపత్రి ముందే సెలవులివ్వాలి.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గింది. చలికాలం ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సెలవులు ఇచ్చారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే పాఠశాలల్లో ఈ తర హా ఆలోచన చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. ఈ దిశగా వైద్యరంగం తోడ్పా టు తీసుకోవాలి. సంక్రాంతి సెలవుల తర్వాత కూడా సీజనల్ వ్యాధుల బారిన పడే పిల్లల వల్ల వైరస్ మరింత వ్యాప్తి జరగకుండా చూడాలి. – జి సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు -
‘ఉపాధి’లో ఆన్లైన్ హాజరు! జనవరి 1 నుంచి కేంద్రం కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి ఈ పథకం కింద చేపట్టే అన్నిరకాల పనులను నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ (ఎన్ఎంఎంఎస్) ద్వారా నమోదు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉపాధి పనుల్లో కూలీల ‘మాన్యువల్ అటెండెన్స్’కు చెల్లుచీటీ పలికింది. ఇకపై లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారానే అన్నిరకాల పనులకు సంబంధించిన పనుల వివరాలు, కూలీల హాజరును నమోదు చేయాలని స్పష్టం చేసింది. అయితే వ్యక్తిగత మరుగుదొడ్లు, సోక్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ తదితర వ్యక్తిగత ప్రయోజన పనులు, ప్రాజెక్టులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు, ఉపాధి హామీ పథకం కమిషనర్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధిహామీ పథకం అమలు డైరెక్టర్ ధర్మవీర్ ఝా ఉత్తర్వులను పంపించారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడం, పౌర సమాజం పర్యవేక్షణకు వీలుగా కొత్త నిబంధనలు తెచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే మొదలు.. ఉపాధి హామీ కూలీల హాజరును రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా లైవ్ లొకేషన్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలనే నిబంధనను కేంద్రం ఈ ఏడాది మే నెలలోనే తీసుకొచ్చింది. కూలీల అటెండెన్స్ రోజుకు రెండుసార్లు సమయంతో సహా నమోదయ్యేలా, కూలీల ఫొటోలను జియోట్యాగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఇరవై మందికిపైగా కూలీలు పనిచేసే సైట్లలో మాత్రమే వాటిని అమలు చేశారు. ఇప్పుడు ఉపాధి హామీ కింద చేపట్టే అన్ని పనుల్లో (వ్యక్తిగత ప్రయోజన పనులు మినహా) ఎన్ఎంఎంఎస్ ద్వారానే కూలీల హాజరు నమోదు చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ వి«ధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆన్లైన్ నమోదులో ఇబ్బందులెన్నో.. ఉపాధి హామీ పనులు జరిగే మారుమూల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్య ఉండటం, అందరికీ స్మార్ట్ఫోన్లు, డేటా లేకపోవడం వంటి సమస్యల వల్ల ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల అటెండెన్స్ నమోదు ఇబ్బందికరమేనని క్షేత్రస్థాయిలో ఈ పథకం పరిశీలకులు చెప్తున్నారు. కూలీలు చేసే పనుల కొలతలు, పరిమాణం ప్రకారమే కూలి డబ్బు ఇస్తున్నపుడు కొత్త నిబంధనలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సరిగా పని, కూలి సొమ్ము అందక ఉపాధి హామీ పథకానికి గ్రామీణ పేదలు దూరమవుతున్నారని అంటున్నారు. లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు వంటి చర్యలు మరింత ప్రతిబంధకంగా మారతాయని స్పష్టం చేస్తున్నారు. -
అటెండెన్స్ యాప్‌తో డుమ్మాలకు చెక్.. గంటలోనే సమాచారం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మనబడి నాడు–నేడుతో ఎన్నో బడుల రూపురేఖలు మారిపోయాయి. మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తెచ్చారు. రోజుకో మెనూతో పౌష్టికాహారం అందిస్తున్నారు. విద్యాకానుక అందజేస్తున్నారు. బోధనపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు స్కూల్ అటెండెన్స్ యాప్‌ను తెచ్చారు. దీంతో పిల్లలు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం ఉండడంతో వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(టౌన్): పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. కొంతమంది పిల్లలు బడికి వెళ్లకుండా క్లాసులకు డుమ్మా కొట్టేవారు. దీంతో వారు చదువులో వెనుకంజలో ఉండేవారు. ఈ విషయంలో విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉండేది. విద్యార్థుల హాజరు పక్కాగా ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అటెండెన్స్ యాప్‌ను కొంతకాలం క్రితం ప్రారంభించింది. సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతితోపాటు ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేస్తున్నారు. యాప్‌లో రోజూ ఉదయం 10 గంటల్లోపే వివరాలు నమోదు చేస్తున్నారు. వీరు భోజనం కూడా చేస్తారా లేదా అనే విషయాన్ని మరో విండోలో ఉంచుతారు. ఈ ప్రక్రియను ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి హెచ్ఎం లాగిన్ ద్వారా ఆన్లైన్ చేయనున్నారు. ఏమి చేస్తారంటే.. రోజూ అటెండెన్స్ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. విద్యార్థి గైర్హాజరైన సమాచారాన్ని హెచ్ఎం లాగిన్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ విషయం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వెళ్తుంది. అనంతరం హాజరు కాని విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఆ పాఠశాల ఉపాధ్యాయులతోపాటు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడతారు. అలాగే విద్యార్థి వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే సంబంధిత సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వలంటీర్‌కు సమాచారం పంపుతారు. దీంతో వారు స్వయంగా విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు ఎందుకు గైర్హాజరయ్యారన్న కారణం తెలుసుకుంటారు. రోజూ బడికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. దీంతో పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రాణించాలంటే.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించి పని ఉన్న సమయంలో తమ వెంట తీసుకెళ్తుంటారు. దీని వల్ల వాళ్లకి చాలా పాఠాలపై అవగాహన ఉండదు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అందుతుందని నిబంధన విధించింది. ఈ విధంగానైనా తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపిస్తారని భావించింది. కాగా విద్యార్థి బడికి వచ్చే బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేయకుండా ప్రభుత్వం అటెండెన్స్ యాప్‌ను తెచ్చింది. దీంతోపాటు రోజూ క్రమం తప్పకుండా స్కూల్‌కి వస్తేనే చదువు మెరుగుపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. వీరు ఉన్నత విద్యలో రాణించాలంటే బేసిక్ లెవల్ గట్టిగా ఉండాలని ప్రభుత్వం భావించింది. పిల్లలు సక్రమంగా బడికి వచ్చే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్) బడికి రావాలన్నదే లక్ష్యం ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా బడికి వచ్చి చదువులో రాణించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేశారు. పిల్లలపై పర్యవేక్షణకు కొత్తగా అటెండెన్స్ యాప్‌ను అమల్లోకి తెచ్చారు. ఆయా తరగతి టీచర్ హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు కూడా బడికి రెగ్యులర్‌గా వస్తారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – పి.రమేష్, నెల్లూరు డీఈఓ -
తొలి రోజు.. అంతంతే హాజరు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలిరోజు 32.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు చోట్ల అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకుండా ఆన్లైన్లోనే విద్యాబోధన కొనసాగించారు. మిగిలిన చోట్ల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పని సరిచేయగా.. విద్యార్థుల హాజరే స్వల్పంగా ఉండటంతో బెంచీకి ఒకరు, ఇద్దరు చొప్పునే కూర్చున్నారు. సిద్దిపేట, అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 51.17 శాతం, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 19.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన హనుమకొండ మర్కజీ పాఠశాలలో 1,108 మంది విద్యార్థులకు 212 మంది, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 440 మందికి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్లో పదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థినులు మాత్రమే హాజరయ్యారు. 8, 9, 10 తరగతుల్లో కలిపి మొత్తం 507 మంది విద్యార్థినులు ఉండగా 29 మంది వరకు హాజరయ్యారు. జనగామ రైల్వే ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు. -
జీపీఎస్ అటెండెన్స్ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికీ లేని సర్వీసు నిబంధనలు తమకెందుకని గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. మొబైల్ యాప్‌తో అటెండెన్స్ నమోదు, రోజంతా కార్యకలాపాలు, విధుల నిర్వహణపై జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ ఎందుకని వాపోతున్నారు. సోమవారం నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చిన జీపీఎస్ అటెండెన్స్‌ను పాటించలేమంటూ పర్మినెంట్ గ్రామ కార్యదర్శులతోపాటు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సైతం జిల్లా కలెక్టర్లు మొదలు పీఆర్ కమిషనర్, కార్యదర్శి, సీఎస్‌దాకా వినతిపత్రాలను ఇస్తున్నారు. ఉదయం 8:30 గంటలకే... ఉదయం 8.30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామకార్యదర్శులు సెల్ఫీ దిగి కొత్త డీఎస్ఆర్ మొబైల్ పీఎస్ యాప్ ‘క్యాప్చర్ జీపీ లొకేషన్’ఆప్షన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలి. రోజుకు 12 గంటలకు పైబడి విధులు, కింది నుంచి పైస్థాయి వరకు పదిమంది దాకా బాస్‌లు, రోజూ వారడిగే నివేదికలు ఇలా అనేక బరువు బాధ్యతలతో పనిచేస్తున్న తమపై ఇప్పుడు జీపీఎస్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడం సరికాదని అంటున్నారు. దీంతోపాటు రోజూ డీఎస్ఆర్ యాప్‌లో రోడ్లు, డ్రైన్లు తదితరాలతోపాటు పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంటింటి చెత్త సేకరణ వంటి ఐదు ఫొటోలు లైవ్‌లో అప్లోడ్ చేయాలి. జీపీఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేశాకే డీఎస్ఆర్ యాప్‌లో మిగతా ఆప్షన్లు ఎంట్రీ చేయడానికి వీలవుతుంది. మాకెందుకు నాలుగేళ్ల ప్రొబేషన్ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. దాదాపు మూడువేల మంది పర్మినెంట్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. రెండున్నరేళ్ల కింద ఏడున్నరవేల జూనియర్ పంచాయతీ సెక్రటరీలను (జేపీఎస్) నియమించారు. మరో రెండువేల మంది దాకా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ జూనియర్ సెక్రటరీలు కూడా పనిచేస్తున్నారు. తొలుత జేపీఎస్‌లకు మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచారు. మహిళా జేపీఎస్‌లకు ప్రసూతి సెలవులు సైతం ఇవ్వడం లేదు. ఇతర ప్రభుత్వోద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటే తమకు నాలుగేళ్లు ఎందుకని అంటున్నారు. నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి జీపీఎస్ ద్వారా ఫిజికల్ టచ్ లైవ్ లొకేషన్ అటెండెన్స్ నమోదు రద్దుచేయాలి. సెక్రటరీలకు నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి. ఉపాధి హామీ పనులకు ఒక క్షేత్రస్థాయి సహాయకుడిని ఇవ్వాలి. పంచాయతీల్లో సాంకేతిక పనుల నిర్వహణకు ట్యాబ్లెట్, సిమ్‌కార్డు, ఇంటర్నెట్, డేటా కార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజించాలి. ప్రస్తుత సర్వీస్ రూల్స్ ప్రకారం 4 గ్రేడ్లు కొనసాగించాలి. –పి.మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ సెక్రటరీల సంఘం పని ఒత్తిడి ఎక్కువ యాప్ ద్వారా జీపీఎస్ పద్ధతిలో అటెండెన్స్ నమోదు చేయొద్దని కలెక్టర్లను కోరాం. మేము లేవనెత్తిన అంశాలపై కలెక్టర్లు, పీఆర్ ఉన్నతాధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మా కార్యాచరణను ఖరారు చేస్తాం. సోమవారం నుంచి అటెండెన్స్ మాత్రం నమోదు చేయడం లేదు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. –నిమ్మల వెంకట్ గౌడ్, అధ్యక్షుడు, జూనియర్ సెక్రటరీల సంఘం -
ఇక ఠంచనుగా ఆస్పత్రికి..
నిర్మల్: నిర్మల్‌లోని జిల్లా ఆస్పత్రి, ప్రసూ తి ఆస్పత్రులతో పాటు భైంసాలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులు పక్కాగా సమయపాలన పాటిస్తున్నారు. కలెక్టరేట్ నుంచి ఈ మూడు ఆస్పత్రులకు రోజూ ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు కలెక్టర్ ముషరఫ్ అలీ తన సిబ్బందిని పంపించి వైద్యుల హాజరుపై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వారి రిజిస్టర్లో విధుల్లో ఉన్న వైద్యు లతో స్వయం గా సంతకాలు పెట్టిస్తున్నారు. కలెక్టర్ చర్యల తో ఆస్పత్రుల్లో సమయానికి వైద్యులు వస్తుండటం, సేవలు అందుతుండటంతో జిల్లావాసు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దవా ఖానాల్లో వైద్యుల గైర్హాజరీపై ‘సాక్షి’పలుమార్లు కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. -
నో ఆన్లైన్.. ఓన్లీ ఆఫ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తున్నాం. స్కూళ్లకు వచ్చే వారికి ప్రత్యక్ష బోధన ఉంటుంది. బడికి రాని విద్యార్థులకు ఆన్లైన్/ డిజిటల్ పాఠాలు కొనసాగించాల్సిందే. హాజరు నిబంధన లేదు.. పిల్లలను స్కూళ్లకు పంపించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దు...’’అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన తెల్లవారే కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు ఆ నిబంధనలను తుంగలో తొక్కాయి. గురువారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నామని, పిల్లలను స్కూళ్లకు పంపించాలని స్పష్టం చేశాయి. ఇక ఆన్లైన్ బోధన ఉండబోదని, పిల్లలను స్కూళ్లకు పంపించాల్సిందేనని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. కరోనా కేసులు పెరుగతున్నాయనే వార్తల నేపథ్యంలో విద్యార్థులంతా ప్రత్యక్ష బోధనకు హాజరు కావాల్సిందేనని కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు సమాచారం ఇవ్వడం పట్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లకు వచ్చే వారిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భౌతికదూరమే అసలు సమస్యైతే... ప్రస్తుతం రాష్ట్రంలో 10,500కు పైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల వరకున్న స్కూళ్లలోనే భౌతికదూరం పాటించడం సాధ్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లోని మిగతా స్కూళ్లలో ఆరడుగుల భౌతికదూరం పాటించడంలో సమస్యలు తప్పవని అధికారులే పేర్కొంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లలో అయితే మరీ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 9, 10 తరగతులను ప్రారంభించినప్పుడే కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కాయి. బెంచీకి ముగ్గురు, నలుగురు విద్యార్థులను కూర్చోబెట్టి మరీ ప్రత్యక్ష బోధనను చేపట్టాయి. ఆన్లైన్ బోధనను పూర్తిగా తొలగించాయి. ప్రభుత్వం మాత్రం ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్ బోధనను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. స్కూళ్లకు పంపించకపోతే నష్టం మీ పిల్లలకేనంటూ తల్లిదండ్రులను భయపెట్టాయి. దీంతో తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధనకు పంపించక తప్పలేదు. దీంతో దాదాపు 6 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు వచ్చారు. ఇపుడు 6, 7, 8 తరగతులకు చెందిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు వస్తారు. అంటే ప్రైవేటు స్కూళ్లలోనే బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య 16 లక్షలకు చేరనుంది. 9, 10 తరగతులకే భౌతికదూరం పాటించని ప్రైవేటు స్కూళ్లలో ఇప్పుడు వాటితోపాటు 6, 7, 8 తరగతుల పిల్లలు వస్తే భౌతికదూరం పాటించడం సాధ్యం కాదని అధికారులే ఒప్పుకొంటున్నారు. గదుల్లేక కాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు, ఫీజుల వసూళ్లకు.. ప్రైవేటు పాఠశాలల్లో గదుల కొరత సమస్య కానేకాదని అధికారులే చెబుతున్నారు. మెజారిటీ స్కూళ్లలో ఎల్కేజీ మొదలుకొని పదో తరగతి వరకు బోధనను కొనసాగిస్తున్నారు. ఇపుడు స్కూళ్లకు వచ్చే 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులను గదికి 20 మంది చొప్పున విభజించి బోధించడం సమస్య కాదు. అలా విభజిస్తే పాఠాలు బోధించాల్సిన టీచర్లు మూడు రెట్లు అవసరం అవుతారు. ఇపుడు సబ్జెక్టుకు ఒకరు చొప్పున 6–7 మందితో బోధన కొనసాగిస్తున్న ప్రైవేటు యాజమన్యాలు కోవిడ్ నిబంధనల ప్రకారం బోధన చేపట్టాలంటే 21 మంది వరకు టీచర్లతో బోధన చేపట్టాల్సి వస్తుంది. షిఫ్ట్ పద్దతి అమలు చేసినా అదనపు టీచర్లను నియమించాల్సిందే. పైగా ఆన్లైన్ బోధనను కొనసాగిస్తే అదనంగా మరో ఆరేడు మంది టీచర్లను నియమించాల్సి వస్తుంది. అదే బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున విద్యార్థులను గతంలో మాదిరిగానే కూర్చోబెట్టి బోధన కొనసాగిస్తే ఖర్చు తక్కువ అవుతుందని నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. విద్యార్థులు స్కూళ్లకు వస్తే సంవత్సరం ఫీజులు మొత్తం వసూలు చేసుకోవచ్చనే ఉద్దేశంతో యాజమాన్యాలు ఆన్లైన్ బోధనను కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు. నిబంధనల అమలుపై ధ్యాసేదీ? ప్రైవేటు పాఠశాలల్లో భౌతికదూరం పాటించే విషయంలో విద్యాశాఖ ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఏమీ లేవు. కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించినపుడే స్కూళ్లలో గదికి 20 మంది విద్యార్థులకు మించకూడదని, ఒక్కో విద్యార్థి మధ్య కనీసం 6 అడుగుల భౌతికదూరం ఉండేలా చూడాలని, బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలని విద్యాశాఖ తమ మార్గదర్శకాల్లో పేర్కొంది. పరీక్షలకు హాజరు కూడా విద్యార్థుల ఇష్టమేనని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయడానికి వీల్లేదని, నో డిటెన్షన్ పాలసీ అమల్లో ఉందని స్పష్టం చేసింది. అయినా నిబంధనల అమలును మాత్రం పట్టించుకోవడం లేదు. -
యాప్‌తో ఎంపీల అటెండెన్స్
న్యూఢిల్లీ : పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు నిలిచిపోతాయని, సాధ్యమైనంత వరకు సభల్లోని అన్ని కార్యకలాపాలను డిజిటలైజ్ చేస్తున్నామని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. ఈ దఫా తొలిసారి లోక్‌సభ ఎంపీలు తమ అటెండెన్స్‌ను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇలా డిజిటల్ అటెండెన్స్‌ను చేపట్టారు. ఎన్ఐసీ రూపొందించిన ఈ అటెండెన్స్ రిజిస్టర్ యాప్‌తో ఎంపీలు భౌతికంగా హాజరు పుస్తకాలను తాకాల్సిన పనిఉండదు. ఈ యాప్ కేవలం పార్లమెంట్ పరిధిలోనే పనిచేస్తుంది. -
మాస్టార్లూ... రోజూ రానక్కర లేదు!
విజయనగరం అర్బన్: కరోనా విస్తృతి కారణంగా ఉపాధ్యాయులు రోజూ బడులకు హాజరుకానక్కర లేదని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో విద్యాశాఖ ఈ నెలాఖరు వరకు ఉపాధ్యాయుల హాజరు షెడ్యూల్‌ను ప్రకటించింది. 10వ తేదీలోగా పాఠశాలల సమగ్ర నివేదిక యూ–డైస్లో పొందు పరిచాక 13వ తేదీ నుంచి వారంలో కొన్ని రోజులు మాత్రమే ఉపాధ్యాయులు బడులకు హాజరుకావాలని సూచించింది. మరోవైపు బ్రిడ్జికోర్సుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనకు కసరత్తు యధావిధిగా కొనసాగుతుంది. కంటైన్మెంట్ జోన్లు పెరగడం వల్లే... జిల్లాలో 2019–20 యు–డైస్ ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని 2,238 ప్రాథమిక పాఠశాలల్లో 1.2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 212 ప్రాధమికోన్న త పాఠశాలల్లో 47,764 మంది, 366 ఉన్నత పాఠశాలల్లో 1.5 లక్షల మంది చదువుతున్నారు. మొత్తం వివిధ కేడర్ ఉపాధ్యాయులు 10,650 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా కచ్చితంగా పాఠశాలలకు హాజరై యూడైస్‌నమోదు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఉపాధ్యాయులు సైతం రోజూ బడులకు వెళ్లి బయోమెట్రిక్ వేసుకుని రికార్డుల నిర్వహణ చేపడుతున్నారు. అయితే జిల్లాలో ఇటీవలి కాలంలో రోజురోజుకూ కంటైన్మెంట్జోన్లు పెరగుతున్నాయి. ఇప్పటికే అధికారుల లెక్కల్లో 92 ఉన్నట్టు తేలింది. దీనివల్ల ఉపాధ్యాయుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. కరోనా వ్యాప్తి, రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల పదిలోగా యూ–డైస్ పోర్టర్లో వివరాల నమోదు పూర్తి చేసుకోవాలి. 13వ తేదీ నుంచి రో జూ స్కూళ్లకి వెళ్లనక్కర లేకుండా కొత్త షెడ్యూల్ విడుదలైంది. 13 నుంచి పరిమిత రోజుల్లోనే డ్యూటీ... పూర్తి స్థాయిలో పాఠశాలలు పునఃప్రారంభించే వరకు వారంలో కొన్ని రోజులు మాత్రమే టీచర్లు హాజరు కావాలని ఆ మేరకు షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు వారంలో ఒక రోజు (మంగళవారం), ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వారంలో రెండు రోజులు (సోమ, గురువారం) హాజరు కావాలని పేర్కొంది. జిల్లాలో ‘మనబడి నాడు నేడు’ పనులకు ఎంపికైన 1,053 స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎప్పటిమాదిరిగానే రోజూ హాజరై నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని సూచించింది. యధావిధిగా బ్రిడ్జి కోర్సుల బోధన జిల్లాలో కరోనా కారణంగా జిల్లా కేంద్రం, ఇతర మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు తక్కువ శాతంలోనే ఉపాధ్యాయులు హాజరవుతున్నట్టు గురువారం వచ్చిన హాజరు నివేదికలు చెపుతున్నాయి. జిల్లాలో నమోదైన 1,600 మంది ఉపాధ్యాయుల అత్యవసర సెలవుల్లో దాదాపు 700 మంది కరోనా కంటైన్మెంట్ జోన్ల సెలవులే ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో పాఠశాలలను తెరిచే అవకాశం కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు బ్రిడ్జి కోర్సుల ద్వారా పాఠ్యాంశాలను బోధించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. సాధారణ పరిస్థితులు నెలకొంటే ఆగస్టు 3వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తెరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ తరువా త సవరించిన సిలబస్ ప్రకారం పండుగ సెలవులను తగ్గించి పాఠ్యాంశాలు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దూరదర్శన్, ఎఫ్ఎం రేడియో, యూట్యూబ్ ఆధారంగా పాఠాలను విద్యాశాఖ బోధిస్తోంది. విద్యాపరంగా నిమగ్నం చేసేందుకు బ్రిడ్జ్‌కోర్సులు చేపడుతోంది. నిబంధనల మేరకు హాజరవ్వాలి పాఠశాల విద్యాశాఖ అదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులందరూ నిబంధనలమేరకు విధిగా హాజరుకావాలి. ఈ నెల 13 నుంచి హాజరు షెడ్యూల్ మారింది. ఆ మేరకు పాఠశాలలకు హాజరైతే సరిపోతుంది. అలా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు పాల్గొంటున్న బ్రిడ్జి కోర్సుల్లో సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి. – జి.నాగమణి, డీఈఓ -
రేపటి నుంచి ఉద్యోగుల హాజరు తప్పనిసరి
సాక్షి, అమరావతి: సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న వారికి, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితుల ఆధారంగా ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు.... ► రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ గురువారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. నూటికి నూరు శాతం ఉద్యోగులు విధులకు హాజరు కావాలి. ► కార్యాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించే ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసి, చేతులను శానిటైజ్ చేసిన తరువాత పంపిస్తారు. ► అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్ చేయాలి. ► ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్ ధరించి విధులకు హాజరు కావాలి. ► కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. ► కార్యాలయాల్లో పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం. ఎవ్వరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ► ఫైల్స్, తపాల్స్ ఈ–ఆఫీస్ ద్వారానే ప్రాసెస్ చేయాలి. ఉత్తర ప్రత్యుత్తరాలను అధికారిక ఈ–మెయిల్స్ ద్వారానే చేయాలి. ► భౌతిక సమావేశాలు తగ్గించి టెలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి. ► ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్లో ఉండాలి. సంబంధిత అధికారులు సెలవును మంజూరు చేస్తారు. ► కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరు. స్పందన, తపాల్ సెక్షన్, రిసెప్షన్స్‌లో మాత్రమే సమస్యలపై విజ్ఞాపనలు చేయాలి. ► కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాలి. ► ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు చర్యలు తీసుకుని అమలు చేయాలి. -
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అటెండెన్స్ తప్పనిసరి
-
‘టీ’యాప్‌తో.. గైర్హాజరుకు చెక్!
సాక్షి, ఆదిలాబాద్: సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా ప్రత్యేకంగా ‘టీ’యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల హాజరు వివరాలు ప్రతిరోజు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తారు. ఏ పాఠశాలలో హాజరు తక్కువగా ఉంది. ఉపాధ్యాయుల గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలసుకునే వీలుంటుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు, సెల్ఫీ విత్ టీచర్ అనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా చాలా పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయకపోవడం, నెట్వర్క్ సమస్యలు ఉండడంతో సరిగ్గా పనిచేయడంలేదని తెలుస్తోంది. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా.. లేదా అనే విషయాన్ని కూడా ఉన్నతాధికారులు పసిగట్టలేకపోతున్నారు. తప్పించుకునేందుకు కొంతమంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్ హాజరును ఉపయోగించడం లేదనే విమర్శలు లేకపోలేదు. గతనెల నుంచి విద్యా శాఖ ‘టీ’ యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్‌తో పాటు జిల్లా విద్య శాఖాధికారులకు అనుసంధానం చేశారు. దీంతో వారు ప్రతిరోజు జిల్లాలో ఎంతమంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఎంత మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. గైర్హాజరును తగ్గించేందుకు విద్యాశాఖ ఈ విధానాన్ని అమలు చేస్తోంది. డుమ్మా గురువులపై నజర్.. పాఠశాలలకు డుమ్మా కొట్టే గురువులపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే బయోమెట్రిక్, సెల్ఫీ విత్ టీచర్ అమలు చేస్తోంది. అయితే విద్యా శాఖ కమిషనర్ ప్రత్యేక చొరవతో ఈ యాప్‌ను రూపొం దించారు. ఆన్లైన్ ద్వారా అనుసంధానం ఉండడంతో నేరుగా వివరాలు విద్యా శాఖ కమిషనర్ కార్యాలయానికి చేరుతాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఇట్టే తెలిసిపోతుంది. నేరుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఎంఈఓలతో మాట్లాడి గైర్హాజరును తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఉప విద్యాధికారి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది ఇన్చార్జి ఎంఈఓల పనితీరు సరిగా లేకపోవడం, వారు కార్యాలయానికే పరిమితం కావడంతో విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యా కలగానే మారే దుస్థితి నెలకొంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ ఈ యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో హాజరు ఇలా.. ఆదిలాబాద్ జిల్లాలో 18మండలాలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు మొత్తం 1262 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 67,455 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో బాలురు 31,437 మంది, బాలికలు 36,018 మంది ఉన్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 964, ప్రాథమికోన్నత పాఠశాలలు 191, ఉన్నత పాఠశాలలు 112 ఉన్నాయి. గత నెలలో ప్రారంభమైన ఈ ‘టీ’యాప్ ద్వారా ఇప్పటి వరకు 1220 పాఠశాలల్లో ఈ యాప్ రిజిస్టర్ చేసుకున్నారు. అయితే రోజు 750 నుంచి 800 వరకు మాత్రమే ఉపాధ్యాయులు వివరాలను పొందుపర్చుతున్నారు. 80శాతం వరకు ‘టీ’యాప్ ద్వారా హాజరు నమోదవుతోంది. మిగితా పాఠశాలల్లో ఉపాధ్యాయులు వివిధ కారణాలతో వివరాలను నమోదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మినీ గురుకులాలు, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ యాప్‌ను వినియోగించడం లేదని తెలుస్తోంది. ఆండ్రైడ్ ఫోన్లు లేకపోవడం, నెట్వర్క్ కవరేజీ లేదనే సాకు చూపిస్తూ ‘టీ’యాప్‌లో హాజరు నమోదు చేయడం లేదు. శనివారం 1267 పాఠశాలల్లో 790 పాఠశాలలు మాత్రమే వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. 36,018 మంది బాలికలకు 30,105 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదే విధంగా బాలురు 31,437 మందికి 24,601 మంది పాఠశాలలకు వచ్చారు. జిల్లాలో 81.10 శాతం విద్యార్థుల హాజరు నమోదైంది. అయితే జిల్లాలో 4,602 మంది టీచర్లకు 2,891 మంది టీచర్లు మాత్రమే పాఠశాలలకు వచ్చారు. 82.34 హాజరు శాతం నమోదైంది. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్.. ‘టీ’యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రైడ్ ఫోన్లో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. యుడైస్ ఆధారంగా పాఠశాలకు కేటాయించిన కోడ్‌ను అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాఠశాల పేరు, ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను పొందుపర్చాలి. పాఠశాల మెయిల్ ఐడీ, ప్రధానోపాధ్యాయుడి సెల్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి 10.30గంటల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలి. ఈ వివరాలు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంతో పాటు జిల్లా విద్యశాఖ అధికారి కార్యాలయానికి చేరుకుంటాయి. దీంతో పాఠశాలల వివరాలను క్షణాల్లో ఉన్నతాధికారులు తెలుసుకునే వీలుంది. ‘టీ’ హాజరులో నమోదు చేసిన వివరాలు సరైనవా.. కావా అనేది తనిఖీ చేసినప్పుడు విద్యాశాఖాధికారులకు తెలిసిపోతుంది. తప్పుడు సమాచారం పొందుపర్చితే సంబంధిత ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. పకడ్బందీగా అమలు చేస్తాం ‘టీ’యాప్‌ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తాం. 1267 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1220 పాఠశాలలు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. ప్రతిరోజు 800లకు పైగా పాఠశాలలు ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నారు. వందశాతం నమోదయ్యే విధంగా చర్యలు చేపడతాం. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను ఉన్నతాధికారులతో పాటు తాము సైతం తెలుసుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్ -
స్కూలు సేవలన్నిటికీ ‘క్రెడో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యారంగంలో టెక్నాలజీ బాగానే చొచ్చుకొచ్చేసింది. కాకపోతే అటెండెన్స్ వంటి విషయాల్లో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయి. అడ్మిషన్లు, స్టాఫ్ నిర్వహణ, స్టూడెంట్స్ అటెండెన్స్, ప్రోగ్రెస్ రిపోర్టులు, ఫీజులు.. ఇలా చాలా అంశాలను ఆన్‌లైన్‌లోకి తేవడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో స్కూల్ మేనేజ్మెంట్ సేవలందిస్తోంది క్రెడో!!. స్కూళ్లు, కాలేజీలతో పాటు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కు ఉపయోగపడే ఎన్నో సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తేవటం, సర్వర్‌ను కూడా భద్రంగా ఉంచడం ‘క్రెడో’ యాప్ ప్రత్యేకత. క్రెడో అంటే ఒక యాప్ మాత్రమే కాదు. ఇది వివిధ యాప్‌లను పర్యవేక్షిస్తుందని ‘క్రెడోయాప్.ఇన్’ను ప్రమోట్ చేస్తున్న హెచ్ఎల్ఎం సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు కె.నాగ శేషానంద రెడ్డి ‘స్టార్టప్ డైరీ’ ప్రతినిధితో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘స్టూడెంట్, టీచర్, పేరెంట్, స్కూల్ అడ్మిన్‌కు ప్రత్యేక యాప్‌లున్నాయి. వీటన్నిటినీ క్రెడో మానిటర్ చేస్తుంది. విద్యార్థి తాలూకు సమాచారం ఎప్పటికప్పుడు పేరెంట్స్ తెలుసుకునేలా వారి అసైన్మెంట్లతో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించి అన్ని విషయాలూ అప్డేట్ అవుతాయి. ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ క్లాసో... సిలబస్ ఏంటో... తెలుసుకోవచ్చు. టీచర్లు యాప్‌లోనే అటెండెన్స్ తీసుకోవచ్చు. విద్యార్థి తల్లిదండ్రులతో టీచర్లు యాప్ ద్వారా అన్ని విషయాలు పంచుకోవచ్చు కూడా. కాలేజీ స్థాయి విద్యార్థులకు క్లాస్‌తో పాటు, ల్యాబ్ స్కెడ్యూల్ లాంటి విషయాలు యాప్‌లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. ఫీజులు కూడా చెల్లించొచ్చు.. స్కూల్ టర్మ్ ఫీజులు, కాలేజీ సెమిస్టర్ ఫీజుల్లాంటివి క్రెడో ఫ్లాట్‌ఫాంపై ఆన్లైన్లో చెల్లించుకునే వీలుంది. దీంతో పాటు స్కూల్ అకౌంటింగ్ లాంటివి చేసుకోవచ్చు. స్కూల్ నుంచి పేరెంట్స్‌కు, స్టూడెంట్స్‌కు ఉచితంగా అపరిమిత ఎస్ఎంఎస్లు పంపవచ్చు. బయోమెట్రిక్ / ఆర్ఎఫ్ఐడీ అటెండెన్స్‌ను యాప్‌కు అనుసంధానించిన ఈ యాప్‌లో అడ్మిషన్ ఎంక్వైరీ సిస్టమ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లైబ్రరీ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బుక్స్ డొనేట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లూ ఉన్నాయి. స్కూల్ బస్ ట్రాకింగ్.. క్రెడో ద్వారా స్కూల్ బస్‌ను ట్రాక్ చేయొచ్చు. స్కూల్ బస్ ఎప్పుడు బయలుదేరిందనే సమాచారం పేరెంట్స్‌కి నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. దీంతో పాటు కాలేజీ బస్ రూట్ అప్డేట్స్ని విద్యార్థులకు చేరవేస్తుంది. ఈ సౌకర్యమంతా స్కూల్ మేనేజ్మెంట్ యాప్‌లోనే అందించటం క్రెడో ప్రత్యేకత. విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రెడో యాప్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోతాం. ఇప్పటి వరకు రూ.25 లక్షలు ఖర్చు చేశాం. ఇన్వెస్టర్లతో చర్చలు పురోగతిలో ఉన్నాయి. రెండు నెలల్లో రూ.10 కోట్లు సమీకరిస్తున్నాం. ప్రస్తుతం 60కి పైగా స్కూళ్లు, కాలేజీలు క్రెడో క్లయింట్లుగా ఉన్నాయి. మరో 30 సంస్థలతో ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నాయి’’ అని శేషానంద రెడ్డి వివరించారు. -
ఇదేమి ’హనుమంతా’..
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: ఇదేమి హనుమంతా.. ఇంకా ఈనెల 25వ తేదీ రాలేదుగా.. మరెలా ఉద్యోగం చేశావు. నీవు చేసే మాయాజాలంలో ఇదో కోణమంటావా.. అవన్నీ పక్కనబెట్టి అడిగేవారు లేరు కదా.. అంతా నా ఇష్టం అంటావా. ఏది ఏమైనా గడవని రోజుల్లో కూడా ఉద్యోగం చేసినట్లు అటెండెన్స్ పట్టికలో చూపడం మీకే చెల్లిందేమో.. అటెండెన్స్ మాయాజాలం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో కొంత మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించకుండానే జీతాలు అందుకుంటున్నారు. సెలవు పెట్టిన తేదీలకు సంబంధించి, అటెండెన్స్ పట్టికలోని గడుల్లో ముందు చుక్కలు పెడుతున్నారు. మళ్లీ విధులకు రాగానే ఆ చుక్కలను సంతకాలుగా మార్చేస్తున్నారు. రేపటి సంతకాలను సైతం ఈ రోజే పెట్టేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో ఇక చెప్పనక్కర్లేదు. ఇలా ఉద్యోగాలు చేయకుండానే చేసినట్లు అటెండెన్స్‌లో చూపి, పూర్తి జీతాలను అందుకుంటూ, ఆ చినవెంకన్న సొమ్ముకు శఠగోపం పెడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటి వరకు కొందరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేసేవారు. అయితే ఇప్పుడు రెగ్యులర్ సిబ్బంది సైతం ఇదే బాణీని అవలంబిస్తున్నట్లు తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటన ద్వారా తేటతెల్లమైంది. అసలు జరిగిందేమిటంటే శ్రీవారి ఆలయంలో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన అటెండెన్స్‌లో సిబ్బంది చేస్తున్న మాయాజాలాన్ని బట్టబయలు చేసింది. ఆధ్యాత్మిక గ్రంథాలయ పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న ఆర్.హనుమంతాచార్యులు ఈనెల 11 నుంచి 16 వరకు తనకు సంబంధించిన అటెండెన్స్ పట్టికలోని గడుల్లో సంతకాలు పెట్టలేదు. అయితే శుక్రవారం ఖాళీ గడుల్లో సంతకాలు పెట్టిన ఆయన, అంతటితో ఆగకుండా ఈనెల 25 వరకు విధులు నిర్వర్తించినట్లు సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు బహిర్గతం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశమైంది. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. పర్యవేక్షణాలోపమే కారణం విధులకు హాజరైన ఆలయ సిబ్బంది నిత్యం అటెండెన్స్ పట్టికలో, తేదీకి సంబంధించిన గడిలో సంతకం చేయాలి. ఒక వేళ విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా క్యాంపునకు వెళితే ‘ఓ.డి’ అని చూపాలి. అదే సెలవు గనుక పెడితే ’ఎల్’ అని రాయాలి. ఒక వేళ ఉద్యోగి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైతే ఆబ్సెంట్ చూపి, అతనిపై చర్యలు తీసుకోవాలి. ఏ విభాగానికి సంబంధించిన అధికారి, ఆ విభాగ అటెండెన్స్ పట్టికను ప్రతి రోజు క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఇక్కడ అవేమీ జరగడం లేదు. ఉద్యోగి సెలవులు పెట్టిన రోజుల్లో సైతం, విధులు నిర్వర్తించినట్లుగా అటెండెన్స్ పట్టికలో చూపుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
హాజరు పడాలంటే చెట్టెక్కాల్సిందే!
రాంచీ: క్లాస్‌లో కూర్చొని.. రోల్ నంబర్ వన్.. రోల్ నంబర్ టూ.. అంటూ విద్యార్థుల అటెండెన్స్ తీసుకునే టీచర్లు తమ హాజరు నమోదు కోసం మాత్రం చెట్లెక్కుతున్నారు. హాజరు కోసం చెట్లెక్కడమేంటి.. అనే కదా? టీచర్లు సరిగ్గా పాఠశాలకు వస్తున్నారో? లేక రిజిస్టర్లో దొంగ సంతకాలు పెట్టి సొంతపనులు చక్కబెట్టుకుంటున్నారో? గుర్తించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవలే కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ప్రతి స్కూల్లో ఓ ట్యాబ్లెట్ ఫోన్ ఉంటుంది. స్కూల్‌కు రాగానే దానిలో ఫేస్ రికగ్నేషన్ ఫీచర్‌తో హాజరును నమోదు చేయాలి. ఆ వెంటనే సదరు టీచర్ ఆ రోజు స్కూల్‌కు వచ్చినట్లు అది విద్యాశాఖ కార్యాలయానికి హాజరు నమోదును పంపుతుంది. టెక్నాలజీ బాగానే ఉన్నా.. అసలు సమస్య సిగ్నల్స్‌తో వచ్చింది. ఆ రాష్ట్రంలోని పాలము జిల్లా, సోహ్రీఖాస్ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ అందాలంటే చెట్లెక్కాల్సిందే. దీంతో తమ హాజరు నమోదు చేయడానికి టీచర్లకు చెట్లెక్కక తప్పడంలేదు. టీచర్లు యువకులైతే సరే.. మరి వయసు పైబడినవారి సంగతేంటి? స్కూల్‌కు వచ్చినా.. గైర్హాజరైనట్లేనా? ఈ ప్రశ్నకు విద్యాశాఖ అధికారుల నుంచి మాత్రం సమాధానం రావడంలేదట. -
అద్దం లాంటి నవ్వు
ఆమె పేరు మృదుల. ఆమె మనసూ మాటా, అన్నీ మృదులమే. విశాఖపట్నంలోని ఒక ప్రయివేట్ స్కూల్లో సైన్స్ పాఠాలు చెబుతుందామె. ఆమె బాహ్య రూపాన్ని గురించి చెప్పుకోవాలంటే, అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆమె నవ్వు గురించీ, తలకట్టు గురించీనూ. ఆమె చిరునవ్వు, అప్పుడే వెలిగించిన దీపంలా ఉంటుంది. ఇంకొంచెం గట్టిగా నవ్విందంటే ఓ వేసవి సాయంకాలం సన్నగా మొదలైన వాన గుర్తొస్తుంది. మరి ఆపుకోలేనంతగా నవ్వితేనో? ఒక పున్నమి వెన్నెల రాత్రివేళ, సముద్రపు ఇసుకలో నిలబడినప్పుడు, కాళ్ళ కిందకి వచ్చిన అల ఒకటి అలాగే ఆగిపోయినట్టనిపిస్తుందిఇక ఆమె పొడవాటి జడ గురించి చెప్పాలంటే, ప్రకృతి కూడా తనను తానోసారి తడుముకోవాల్సిందే. ఆమె రోడ్డు మీద నడుస్తుంటే ఆ పొడవాటి జడ చిక్కుల్లో పడకుండా, ఏ చూపూ తప్పించుకోలేదు. ఇక స్కూల్లో అయితే, స్టాఫ్ రూమ్‌లోంచి బయటకు వచ్చి, క్లాస్ వైపునకు బయలుదేరితే చాలు, మిగతా క్లాసుల్లోని ఆడపిల్లలంతా తలలు తిప్పి కిటికీల్లోంచి బయటకి చూడాల్సిందే. పదో తరగతిలో ప్రణీత ఉందే... టీచరంత పొడవైన, ఒత్తయిన జుట్టు కోసమని, అమ్మానాన్నల్ని పీడించి పీడించి, కొనుక్కోని నూనె లేదు. వాడని షాంపూ లేదు. ఏడో తరగతి ఎర్ర జుట్టు రాగిణయితే, తెల్లారేసరికల్లా తన జుట్టు కూడా మృదులా టీచర్ జుట్టంత నల్లగా, పొడవుగా మారిపోవాలని, రోజూ నిద్రపోయేటప్పుడు దేవుడ్ని ప్రార్థిస్తుంది. ఇక అప్పుడప్పుడే ఆరో తరగతిలోకొచ్చిన ఉత్తేజ్ ఉరఫ్ నాని గాడు, అంత పొడవు జుట్టున్న అమ్మాయి దొరికితే గానీ ప్రేమల్లో, దోమల్లో పడకూడదని రోజుకోసారైనా గుర్తు చేసుకుంటాడు. ఇప్పటికి మృదుల రూపం మీ మనసుల్లోకి చేరే ఉంటుంది కదూ? సరే, ఇక ఆమె మనసు దాకా వెళ్ళొద్దాం రండి. మృదుల, అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్నోసారి పరికించి చూసుకుంది. వెంటనే రాఘవ అన్న మాట గుర్తొచ్చింది. పెళ్లిచూపుల్లో అతను తన ముఖం వైపు ఒక్కసారే చూశాడట. మిగిలిన సమయమంతా తన జడనే చూస్తూ కూర్చున్నాడట. ‘‘ఇంప్రెస్ చెయ్యడం కోసమేగా జడనలా ముందుకు వేసుకున్నావు!’ అని ఏడిపిస్తుంటాడు. నెల్రోజుల్లో పెళ్లంటే ఏదో తెలియని భయంగా ఉంది. అమ్మమ్మ ఉంటే ఎంత బావుండేది. తనకి చిన్నప్పటినించీ అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే చనువు ఎక్కువ. ఇంత ఒత్తయిన, పొడవైన జడకట్టు కూడా అమ్మమ్మ దగ్గరనించే కదా, తనకు వారసత్వంగా వచ్చింది!ఎంత జాగ్రత్తగా నూనె రాసి, చిక్కు తీసి, జడ వేసేదో తనకి ప్రతిరోజూ. ఆఖరి రోజుల్లో, ఓపిక లేకపోయినా కూడా, మంచం మీంచే అనేది, ‘‘ఏమిటే ఆ పిచ్చవతారం, దువ్వెన్న తెచ్చుకో, జడేస్తాను’’ అని. ఇంకా ఇంకా చివరి రోజుల్లో అయితే, తను కనిపిస్తే చాలు, ముఖం వంకా, జుట్టు వంకా అదే పనిగా చూస్తూ ఉండేది, కళ్లనిండా ఏదో తీరని కోరికను నింపుకుని. ఆ మాయదారి క్యాన్సర్ మహమ్మారి ఆవిడని పీల్చి పిప్పి చేసిన దానికంటే, వయసుతోపాటైనా రాలిపోని జుట్టంతా, ఆ రోగానికి రాలిపోతుంటేనే అమ్మమ్మ ఎక్కువగా బాధపడిందనిపిస్తుంది. ఎప్పుడైనా కళ్ల నీళ్లు పెట్టుకునేది, ‘‘అంత చిన్నవయసులోనే ఆయన వదిలెళ్ళిపోయారే నన్ను. ఆసరాగా నిలబడేందుకు కొడుకులా లేరు. అప్పటినించీ మీ అమ్మే నాలోకమే తల్లీ. మీ నాన్న కూడా నన్ను సొంత తల్లిలా చూసుకుంటున్నాడమ్మా’’ అంటూనే మళ్ళీ పరధ్యానంలో పడేది, ‘‘ఈ పాడు జుట్టేమిటో ఇలా రాలిపోతోంది’’. అమ్మమ్మ పడిన నరకం పగవాళ్ళకి కూడా వద్దు. నిట్టూరుస్తూ అక్కడనించి లేచి బయటపడి, స్కూల్‌కి బయలుదేరింది మృదుల. సాధారణంగా మొదటి క్లాస్ ఏడో తరగతిలోనే ఉంటుంది. వెళ్లి కూర్చుని, అటెండెన్స్ రిజిస్టర్ తెరవబోతూ, ఓసారి క్లాసంతా కలియజూసింది. వాళ్ళు పలికేముందే తెలిసిపోతుంది తనకు, ఎవరెవరు క్లాస్‌కి వచ్చారో, ఎవరు ఎగ్గొట్టారో! వసంత, వేణులతో పాటుగా భార్గవి కూడా కనిపించలేదు. ఆ అమ్మాయిని తలుచుకోగానే గుండె బరువెక్కింది మృదులకు. ఇంచుమించుగా ఏడాది నించేమో, ఆ అమ్మాయి సరిగా స్కూల్‌కి రావడం లేదు. పాపకి బోన్‌కి సంబంధించిన క్యాన్సర్ అని ప్రిన్సిపాల్ మేడంతో చెప్పి వెళ్లారట పాప తండ్రి.అప్పటినించీ అప్పుడప్పుడూ స్కూల్‌కి వస్తున్నా, రెండు నెలల నుంచీ పూర్తిగా రావడం మానేసిందాపిల్ల. ఎలా ఉందో ఏమిటో అనిపించింది. ఉదయం నించీ అమ్మమ్మ బాగా గుర్తొస్తున్నందుకేమో, మృదులమనసు మరింత భారంగా ఉంది. సాయంత్రం ప్రిన్సిపాల్ మేడమ్‌తో చెప్పి, భార్గవినోసారి చూసి రావాలని నిర్ణయించుకుంది. ఫోన్ చేసి రావడం వల్లనేమో, బెల్ కొట్టగానే తలుపు తెరుచుకుంది. పాప తండ్రిలా ఉన్నాడు, ‘‘లోపలికి రండి మేడమ్’’ అన్నాడు. మొహమాటంగా నవ్వి లోపలికి అడుగుపెట్టింది. అయన తిన్నగా బెడ్ రూమ్‌లోకి దారి తీశాడు. వెనకాలే వెళ్ళింది. ఆ చిన్న రూమ్‌లో, పరుపు మీద పడుకుని నిద్రపోతోంది భార్గవి. ఆ పిల్లనలా చూడగానే విపరీతమైన ఆందోళన కలిగింది మృదులకి. ఆ కంగారుకి కడుపులో తిప్పడం మొదలైంది. ఊపిరి అందనట్టుగా అనిపిస్తుంటే తమాయించుకుని, గుండెల నిండా గాలి పీల్చుకుంది. మెల్లగా మంచం దగ్గరికి వెళ్లి, భార్గవి చెంపల్ని తాకింది. ఎంత చలాకీ అయిన పిల్ల! క్లాస్‌లో కూడా ఒక్క నిమిషమైనా నిశ్శబ్దంగా ఉండేది కాదు. ‘‘ఎలాగమ్మా ఇలా అయితే? చెప్పేది వినవు, చదవవు’’ అంటే, ‘‘ఏంటో మేడం, నాకు కదలకుండా కూర్చోవాలంటే చాలా కష్టం’’ అనేది. ఇప్పుడిలా ఇంత నిశ్శబ్దంగా ఉండటానికి, ఆ పిచ్చి పిల్ల ఎంత కష్టపడుతోందో పాపం. ‘‘రండి మేడమ్, హాల్లో కూర్చుందాం’’ అన్నాడు భార్గవి తండ్రి. వచ్చి కూర్చుందన్న మాటే గానీ గొంతు పెగలడం లేదు. మాట్లాడటమంత కష్టమైన పని ఇంకేదీ లేదనిపిస్తోంది. మనసంతా ఏదో తెలియని స్తబ్దత.ఎవరో ఒకామె టీ తీసుకొచ్చి ఇచ్చి, మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోవడాన్ని అలా పరధ్యానంగా చూస్తూ ఉండిపోయింది, ‘‘ఇప్పుడెలా ఉందంటారు?’’ అంది ఎలాగోలా చివరికి అయన వైపు తిరిగి. ‘‘ఇప్పుడు నయమే మేడమ్, కీమోథెరపీ పూర్తయ్యాక కంప్లీట్ రెమిషన్‌లో ఉంది. గండం గడిచినట్టే అని చెప్పారు డాక్టర్లు’’ అన్నాడాయన. ముడతలు పడిన ముఖంతో ముసలివాడిలా కనిపిస్తున్నాడు, ఆ మధ్య వయస్కుడు.పిల్లల్ని అలా చూడాల్సిన ఖర్మ ఏ తల్లితండ్రులకీ పట్టకూడదని అనిపించింది మృదులకి. ఆయన చెప్పిన విషయం, తన నిస్తేజాన్ని కొద్దిగా సడలించినట్టుగా అనిస్తుంటే, ‘‘ఎంత మంచి విషయం చెప్పారండీ! అయితే పాప త్వరలో స్కూల్‌కి కూడా రావచ్చేమో’’ అంది.‘‘డాక్టర్ గారు స్కూల్‌కి పంపొచ్చని చెప్పారు మేడమ్, అదే వెళ్లనంటోంది...’’ అంటూ ఆగిపోయాడాయన. మృదులకు ఏమీ అర్థం కాలేదు. ‘‘ఎందుకు మేడమ్, ఆదివారాలు మాత్రం సెలవు? నాకు ఇంటిదగ్గరేం తోచదు’’ అంటూ గారాలు పోయే భార్గవి, ఇప్పుడు స్కూల్‌కి రానంటోందా!‘‘అసలు ఆ పిల్ల ఒక్క క్షణం కుదురుగా ఉండేదా మేడమ్? స్కూల్ మానమన్నా మానేది కాదు. ఇంటికొచ్చినా కూడా, చదవమంటే చదవకుండా, పక్క వాళ్ళిళ్ళకు పోయి ఆడుతూనే ఉండేది. ఈ రోజు దానికి ఇలాంటి గతి పట్టింది. ఆ జుట్టు చూసి అందరూ ఏడిపిస్తారనిట, గుమ్మం కదిలి బయటకే వెళ్లడం లేదు’’ బాధగా తల దించుకున్నాడాయన. అప్పుడు హఠాత్తుగా ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది, ఇందాక తను చూసిన భార్గవి రూపం. అక్కడక్కడా జుట్టూడిపోయి, తల నిండా ఏర్పడిన ఖాళీలతో. అంతే, మృదులకి వెంటనే అమ్మమ్మ గుర్తొచ్చేసింది.ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ‘‘మరోసారి వస్తా లెండి’’ అని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటపడింది.రాత్రయ్యే సరికల్లా మృదుల మనసు మరింత అల్లకల్లోలంగా తయారైంది. అంత చిన్న పాపకు ఎంత కష్టం? ఎంతటి మహామహులో, అనుభవజ్ఞులో కూడా తట్టుకోలేనంత శారీరకమైన బాధను అంత లేత శరీరం, మనసూ అసలెలా తట్టుకుంటాయి? ఎనిమిదేళ్లయిపోయినా తనకి ఆ రోజు బాగా గుర్తుంది. అమ్మమ్మ పోయిన పదోరోజు. చూడ్డానికొచ్చిన బాబాయ్‌తో నాన్న అంటున్న మాటలు అనుకోకుండా తన చెవిన పడ్డాయి. ‘‘పాపం, పెద్దావిడ నరకమే అనుభవించిందిరా, చివర్రోజుల్లో అయితే ఆ ట్రీట్మెంట్ అసలు తట్టుకోలేకపోయేది. అందుకే నిద్ర మాత్రలు మింగేసింది. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. బాగోదు కదా. మేమేదో సరిగా చూడలేదనుకుంటారు జనం. పాపం మృదమ్మ ఎంత సేవ చేసిందనీ! ఎప్పుడూ ఆవిడ దగ్గరే ఉండేది. దానిక్కూడా ఈ సంగతి తెలీనివ్వలేదురోయ్, దానికి ఆవిడంటే ప్రాణమని నీకు తెలుసు కదా. ఇలా చేసిందని తెలిస్తే తట్టుకోలేదు.’’ ఎవరైనా చూడ్డానికొచ్చినప్పుడు, ఎముకల పోగులాంటి శరీరాన్నైనా అలా వదిలేసి, గుండులా అయిపోయిన తలని దాచుకోవడానికి అమ్మమ్మ పడిన పాట్లు గుర్తొచ్చాయి మృదులకి, ఆ విషయం వినగానే. అర్ధరాత్రి దాటుతున్నా మృదులకి నిద్ర పట్టడం లేదు. మంచం మీద నిస్సహాయంగా పడున్న భార్గవి రూపంతో పాటుగా, రోడ్డు మీద దెబ్బ తగిలి కుంటుతున్న కుక్కపిల్లా, వెన్నెల లేని రాత్రుళ్ళూ, పేవ్మెంట్ మీద పడుకుని చలికి వణుకుతున్న ముసలి వాళ్ళూ, వాడిపోయిన పువ్వులూ, ప్లాస్టిక్ సంచుల పళంగా చెత్తని మింగేస్తున్న ఆవులూ, బీడు వారిపోయిన భూములూ, గాల్లో కలిసిపోతున్న విష వాయువులూ.... అలా ఏవేవో గుర్తొస్తున్నాయి. ఎన్నెనో ఆలోచనలు రాత్రంతా, ‘మన చేతిలో ఏమీ లేదా’. తెల్లారుతుండగానే లేచి తయారయిపోయింది. ‘‘అదేమిటమ్మా, ముందుగా అనుకోనైనా అనుకోలేదే. ఒక్కదానివీ ఎలా వెళ్తావు? రెండురోజులాగు. అందరం కలిసే వెళ్దాం’’ అంటూ తల్లి ఎంతగా చెప్తున్నా వినకుండా సింహాచలం బయలుదేరింది. దేవస్థానం కల్యాణకట్ట చేరుకుంది. ఎదురుగా కూర్చున్న మంగలాయన సందేహంగా చూస్తున్నంతసేపూ తల దించుకుని కూర్చునే ఉంది. పని చేస్తున్నా, ‘‘ఏం ఉంది తల్లీ జుట్టు, ఎలా ఇచ్చేస్తున్నావో గానీ’’ అంటూ అతను గొణుక్కోవడం వింటూనే ఉంది. ఇంటికి చేరగానే, ‘‘ఎంత పని చేశావే, నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని’’ అంటూ తల్లి నెత్తీ నోరూ బాదుకోవడాన్ని నిర్లిప్తంగా గమనించింది. ఇప్పుడే బాధా లేదు. ఏ దుఃఖమూ లేదు. ఉన్నదేదో పోతుందన్న భయం లేదు. మనసు నిండా ఒకటే ప్రశాంతత.తెల్లమొహాలేసుకుని చూస్తున్న పిల్లల మధ్యలోంచి క్లాస్‌లోకి ప్రవేశించింది మృదుల. ‘‘పిల్లలూ, మీకు తెలుసా? భార్గవి ట్రీట్మెంట్ ముగించుకుని ఇంటికొచ్చేసింది. చూడ్డానికి ఎవరెవరెళ్తున్నారు?’’.వెళ్లినవాళ్లంతా ఆ పిల్లకేం చెప్తారో తనకి తెలుసు. ఆమె పెదవుల నిండా చిరునవ్వు పరుచుకుంది. ఇప్పుడోసారి ఇలా బయటకి వచ్చి, నాతో పాటుగా ఆమె చిరునవ్వులోకి తొంగి చూడండి. అదిప్పుడు మునుపటిలా ఏవేవో అందమైన ప్రకృతి దృశ్యాల్ని గుర్తు చేయడం లేదు కదూ! అద్దంలా ఆమె మనసుని మాత్రమే ప్రతిబింబిస్తోంది. - భవానీ ఫణి -
హాజరు పలికేటప్పుడు జైహింద్ అనాల్సిందే
భోపాల్, మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికేటప్పుడు జైహింద్ అనడం తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాత్నా జిల్లాలో తొలుత దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విజయ్ షా గత డిసెంబర్లోనే కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై విజయ్ మాట్లాడుతూ.. ఇకపై ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి విద్యార్థులు ‘యస్ సార్, యస్ మేడమ్’కు బదులు జైహింద్ అనాలని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో దేశ భక్తి భావం పెరుగుతోందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకిస్తారని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా ఇరవై రెండు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. -
ఈ–హాజరు ఇక తప్పనిసరి
సాక్షి, అమరావతి : పాఠశాల విద్యాశాఖలో టీచర్లు, విద్యార్థులు, ఇతర అధికారులకు ‘ఈ–హాజరు’ను తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అన్ని జిల్లాల విద్యాధికారులు ప్రతి ఒక్క ఉద్యోగి హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీచేశారు. ఏపీ ఆన్లైన్, ఎన్ఐసీ, ఐటీ విభాగాల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ–హాజరు అప్లికేషన్ ద్వారా ఈ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేయడంతో పాఠశాల విద్యాశాఖ దీన్ని 100 శాతం పూర్తిచేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఇప్పటికే 67.32 శాతం బయోమెట్రిక్ యంత్రాలను పాఠశాలలు, విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయాలకు పంపారు. కొన్నిచోట్ల యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో బయోమెట్రిక్ హాజరులో సమస్యలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఈ–హాజరు నమోదు కావడంలేదు. కొన్ని చోట్ల సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడం, కేంద్రీకృత సర్వర్ వ్యవస్థ సామర్థ్యం తక్కువగా ఉండటం వంటి సమస్యలతో కూడా పలు పాఠశాలలు, కార్యాలయాల్లో ఈ–హాజరు నమోదుకావడం లేదు. జిల్లాల వారీగా ఈ హాజరు ఇలా.. జిల్లాలవారీగా పాఠశాలల్లో టీచర్ల ఈ–హాజరు నమోదు ఎలా ఉందో పాఠశాల విద్యాశాఖ ఇటీవల విశ్లేషించింది. అక్టోబర్ 31వ తేదీకి సంబంధించి ఆయా కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ–హాజరు నమోదు లెక్కలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 41,601 ప్రభుత్వ స్కూళ్లుండగా 27,808 స్కూళ్లలో బయోమెట్రిక్ యంత్రాలు అమర్చారు. ఈ స్కూళ్లలో 1,45,087 మంది టీచర్లుండగా.. అక్టోబర్ 31వ తేదీ నాటి గణాంకాల ప్రకారం 75.47 శాతం వరకూ ఈ–హాజరు నమోదైంది. మిగతా సిబ్బంది హాజరు నమోదుకాలేదు. సాంకేతిక లోపాలు, యంత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో పాటు టీచర్లు సెలవులు తీసుకోవడం, గైర్హాజరు వంటి కారణాలతో నమోదుకాలేదు. శ్రీకాకుళం జిల్లా ఈ–హాజరులో ముందు వరుసలో ఉంది. సమస్యల పరిష్కారానికి క్షేత్ర బృందాలు ఈ–హాజరు నమోదులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి సాంకేతిక బృందాలను విద్యాశాఖ ఏర్పాటుచేస్తోంది. రోజూ ఏపీ ఆన్లైన్, సీఎం డ్యాష్‌బోర్డు, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పోర్టల్ ద్వారా ఈ–హాజరును పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 48 గంటల్లో దాన్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా టీచర్ ఈ–హాజరు నమోదు కాకుంటే ఆతని మొబైల్‌కు ఎస్సెమ్మెస్ అలర్ట్ వస్తుంది. మున్సిపల్ స్కూళ్ల ఈ హాజరు పర్యవేక్షణకు నోడల్ టీమ్‌ను ఏర్పాటుచేశారు. హాజరు తక్కువగా ఉన్న స్కూళ్లకు సంబంధించి ఎంఈవోలు, డీఈవోలు పర్యవేక్షించి నివారణ చర్యలు చేపట్టాలి. టీచర్లతో పాటు విద్యార్థులకూ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తున్నారు. ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ హాజరుకు ఏర్పాట్లు చేశారు. ఆఫ్‌లైన్‌లో స్థానిక డేటా బేస్ ఆధారంగా విద్యార్థుల హాజరు నమోదయ్యేలా ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. శుక్రవారం నుంచి ఇది అందుబాటులోకి రానుంది.