విజయనగరం అర్బన్: కరోనా విస్తృతి కారణంగా ఉపాధ్యాయులు రోజూ బడులకు హాజరుకానక్కర లేదని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో విద్యాశాఖ ఈ నెలాఖరు వరకు ఉపాధ్యాయుల హాజరు షెడ్యూల్‌ను ప్రకటించింది. 10వ తేదీలోగా పాఠశాలల సమగ్ర నివేదిక యూ–డైస్‌లో పొందు పరిచాక 13వ తేదీ నుంచి వారంలో కొన్ని రోజులు మాత్రమే ఉపాధ్యాయులు బడులకు హాజరుకావాలని సూచించింది. మరోవైపు బ్రిడ్జికోర్సుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనకు కసరత్తు యధావిధిగా కొనసాగుతుంది.
కంటైన్మెంట్ జోన్లు పెరగడం వల్లే...
జిల్లాలో 2019–20 యు–డైస్ ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని 2,238 ప్రాథమిక పాఠశాలల్లో 1.2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 212 ప్రాధమికోన్న త పాఠశాలల్లో 47,764 మంది, 366 ఉన్నత పాఠశాలల్లో 1.5 లక్షల మంది చదువుతున్నారు. మొత్తం వివిధ కేడర్ ఉపాధ్యాయులు 10,650 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా కచ్చితంగా పాఠశాలలకు హాజరై యూడైస్‌నమోదు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఉపాధ్యాయులు సైతం రోజూ బడులకు వెళ్లి బయోమెట్రిక్ వేసుకుని రికార్డుల నిర్వహణ చేపడుతున్నారు. అయితే జిల్లాలో ఇటీవలి కాలంలో రోజురోజుకూ కంటైన్మెంట్‌జోన్లు పెరగుతున్నాయి. ఇప్పటికే అధికారుల లెక్కల్లో 92 ఉన్నట్టు తేలింది. దీనివల్ల ఉపాధ్యాయుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. కరోనా వ్యాప్తి, రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల పదిలోగా యూ–డైస్ పోర్టర్‌లో వివరాల నమోదు పూర్తి చేసుకోవాలి. 13వ తేదీ నుంచి రో జూ స్కూళ్లకి వెళ్లనక్కర లేకుండా కొత్త షెడ్యూల్ విడుదలైంది.
13 నుంచి పరిమిత రోజుల్లోనే డ్యూటీ...
పూర్తి స్థాయిలో పాఠశాలలు పునఃప్రారంభించే వరకు వారంలో కొన్ని రోజులు మాత్రమే టీచర్లు హాజరు కావాలని ఆ మేరకు షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు వారంలో ఒక రోజు (మంగళవారం), ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వారంలో రెండు రోజులు (సోమ, గురువారం) హాజరు కావాలని పేర్కొంది. జిల్లాలో ‘మనబడి నాడు నేడు’ పనులకు ఎంపికైన 1,053 స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎప్పటిమాదిరిగానే రోజూ హాజరై నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని సూచించింది.
యధావిధిగా బ్రిడ్జి కోర్సుల బోధన
జిల్లాలో కరోనా కారణంగా జిల్లా కేంద్రం, ఇతర మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు తక్కువ శాతంలోనే ఉపాధ్యాయులు హాజరవుతున్నట్టు గురువారం వచ్చిన హాజరు నివేదికలు చెపుతున్నాయి. జిల్లాలో నమోదైన 1,600 మంది ఉపాధ్యాయుల అత్యవసర సెలవుల్లో దాదాపు 700 మంది కరోనా కంటైన్మెంట్ జోన్‌ల సెలవులే ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో పాఠశాలలను తెరిచే అవకాశం కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు బ్రిడ్జి కోర్సుల ద్వారా పాఠ్యాంశాలను బోధించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. సాధారణ పరిస్థితులు నెలకొంటే ఆగస్టు 3వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తెరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ తరువా త సవరించిన సిలబస్ ప్రకారం పండుగ సెలవులను తగ్గించి పాఠ్యాంశాలు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దూరదర్శన్, ఎఫ్‌ఎం రేడియో, యూట్యూబ్ ఆధారంగా పాఠాలను విద్యాశాఖ బోధిస్తోంది. విద్యాపరంగా నిమగ్నం చేసేందుకు బ్రిడ్జ్‌కోర్సులు చేపడుతోంది.
నిబంధనల మేరకు హాజరవ్వాలి
పాఠశాల విద్యాశాఖ అదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులందరూ నిబంధనలమేరకు విధిగా హాజరుకావాలి. ఈ నెల 13 నుంచి హాజరు షెడ్యూల్ మారింది. ఆ మేరకు పాఠశాలలకు హాజరైతే సరిపోతుంది. అలా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు పాల్గొంటున్న బ్రిడ్జి కోర్సుల్లో సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి.
– జి.నాగమణి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment