ఆమె పేరు మృదుల. ఆమె మనసూ మాటా, అన్నీ మృదులమే. విశాఖపట్నంలోని ఒక ప్రయివేట్ స్కూల్‌లో సైన్స్ పాఠాలు చెబుతుందామె. ఆమె బాహ్య రూపాన్ని గురించి చెప్పుకోవాలంటే, అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆమె నవ్వు గురించీ, తలకట్టు గురించీనూ. ఆమె చిరునవ్వు, అప్పుడే వెలిగించిన దీపంలా ఉంటుంది. ఇంకొంచెం గట్టిగా నవ్విందంటే ఓ వేసవి సాయంకాలం సన్నగా మొదలైన వాన గుర్తొస్తుంది. మరి ఆపుకోలేనంతగా నవ్వితేనో? ఒక పున్నమి వెన్నెల రాత్రివేళ, సముద్రపు ఇసుకలో నిలబడినప్పుడు, కాళ్ళ కిందకి వచ్చిన అల ఒకటి అలాగే ఆగిపోయినట్టనిపిస్తుందిఇక ఆమె పొడవాటి జడ గురించి చెప్పాలంటే, ప్రకృతి కూడా తనను తానోసారి తడుముకోవాల్సిందే. ఆమె రోడ్డు మీద నడుస్తుంటే ఆ పొడవాటి జడ చిక్కుల్లో పడకుండా, ఏ చూపూ తప్పించుకోలేదు. ఇక స్కూల్‌లో అయితే, స్టాఫ్ రూమ్‌లోంచి బయటకు వచ్చి, క్లాస్ వైపునకు బయలుదేరితే చాలు, మిగతా క్లాసుల్లోని ఆడపిల్లలంతా తలలు తిప్పి కిటికీల్లోంచి బయటకి చూడాల్సిందే. పదో తరగతిలో ప్రణీత ఉందే... టీచరంత పొడవైన, ఒత్తయిన జుట్టు కోసమని, అమ్మానాన్నల్ని పీడించి పీడించి, కొనుక్కోని నూనె లేదు. వాడని షాంపూ లేదు. ఏడో తరగతి ఎర్ర జుట్టు రాగిణయితే, తెల్లారేసరికల్లా తన జుట్టు కూడా మృదులా టీచర్ జుట్టంత నల్లగా, పొడవుగా మారిపోవాలని, రోజూ నిద్రపోయేటప్పుడు దేవుడ్ని ప్రార్థిస్తుంది. ఇక అప్పుడప్పుడే ఆరో తరగతిలోకొచ్చిన ఉత్తేజ్ ఉరఫ్ నాని గాడు, అంత పొడవు జుట్టున్న అమ్మాయి దొరికితే గానీ ప్రేమల్లో, దోమల్లో పడకూడదని రోజుకోసారైనా గుర్తు చేసుకుంటాడు. ఇప్పటికి మృదుల రూపం మీ మనసుల్లోకి చేరే ఉంటుంది కదూ? సరే, ఇక ఆమె మనసు దాకా వెళ్ళొద్దాం రండి.
మృదుల, అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్నోసారి పరికించి చూసుకుంది. వెంటనే రాఘవ అన్న మాట గుర్తొచ్చింది. పెళ్లిచూపుల్లో అతను తన ముఖం వైపు ఒక్కసారే చూశాడట. మిగిలిన సమయమంతా తన జడనే చూస్తూ కూర్చున్నాడట. ‘‘ఇంప్రెస్ చెయ్యడం కోసమేగా జడనలా ముందుకు వేసుకున్నావు!’ అని ఏడిపిస్తుంటాడు. నెల్రోజుల్లో పెళ్లంటే ఏదో తెలియని భయంగా ఉంది. అమ్మమ్మ ఉంటే ఎంత బావుండేది. తనకి చిన్నప్పటినించీ అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే చనువు ఎక్కువ. ఇంత ఒత్తయిన, పొడవైన జడకట్టు కూడా అమ్మమ్మ దగ్గరనించే కదా, తనకు వారసత్వంగా వచ్చింది!ఎంత జాగ్రత్తగా నూనె రాసి, చిక్కు తీసి, జడ వేసేదో తనకి ప్రతిరోజూ. ఆఖరి రోజుల్లో, ఓపిక లేకపోయినా కూడా, మంచం మీంచే అనేది, ‘‘ఏమిటే ఆ పిచ్చవతారం, దువ్వెన్న తెచ్చుకో, జడేస్తాను’’ అని. ఇంకా ఇంకా చివరి రోజుల్లో అయితే, తను కనిపిస్తే చాలు, ముఖం వంకా, జుట్టు వంకా అదే పనిగా చూస్తూ ఉండేది, కళ్లనిండా ఏదో తీరని కోరికను నింపుకుని. ఆ మాయదారి క్యాన్సర్ మహమ్మారి ఆవిడని పీల్చి పిప్పి చేసిన దానికంటే, వయసుతోపాటైనా రాలిపోని జుట్టంతా, ఆ రోగానికి రాలిపోతుంటేనే అమ్మమ్మ ఎక్కువగా బాధపడిందనిపిస్తుంది. ఎప్పుడైనా కళ్ల నీళ్లు పెట్టుకునేది, ‘‘అంత చిన్నవయసులోనే ఆయన వదిలెళ్ళిపోయారే నన్ను. ఆసరాగా నిలబడేందుకు కొడుకులా లేరు. అప్పటినించీ మీ అమ్మే నాలోకమే తల్లీ. మీ నాన్న కూడా నన్ను సొంత తల్లిలా చూసుకుంటున్నాడమ్మా’’ అంటూనే మళ్ళీ పరధ్యానంలో పడేది, ‘‘ఈ పాడు జుట్టేమిటో ఇలా రాలిపోతోంది’’. అమ్మమ్మ పడిన నరకం పగవాళ్ళకి కూడా వద్దు.
నిట్టూరుస్తూ అక్కడనించి లేచి బయటపడి, స్కూల్‌కి బయలుదేరింది మృదుల. సాధారణంగా మొదటి క్లాస్ ఏడో తరగతిలోనే ఉంటుంది. వెళ్లి కూర్చుని, అటెండెన్స్ రిజిస్టర్ తెరవబోతూ, ఓసారి క్లాసంతా కలియజూసింది. వాళ్ళు పలికేముందే తెలిసిపోతుంది తనకు, ఎవరెవరు క్లాస్‌కి వచ్చారో, ఎవరు ఎగ్గొట్టారో! వసంత, వేణులతో పాటుగా భార్గవి కూడా కనిపించలేదు. ఆ అమ్మాయిని తలుచుకోగానే గుండె బరువెక్కింది మృదులకు. ఇంచుమించుగా ఏడాది నించేమో, ఆ అమ్మాయి సరిగా స్కూల్‌కి రావడం లేదు. పాపకి బోన్‌కి సంబంధించిన క్యాన్సర్ అని ప్రిన్సిపాల్ మేడంతో చెప్పి వెళ్లారట పాప తండ్రి.అప్పటినించీ అప్పుడప్పుడూ స్కూల్‌కి వస్తున్నా, రెండు నెలల నుంచీ పూర్తిగా రావడం మానేసిందాపిల్ల. ఎలా ఉందో ఏమిటో అనిపించింది. ఉదయం నించీ అమ్మమ్మ బాగా గుర్తొస్తున్నందుకేమో, మృదులమనసు మరింత భారంగా ఉంది. సాయంత్రం ప్రిన్సిపాల్ మేడమ్‌తో చెప్పి, భార్గవినోసారి చూసి రావాలని నిర్ణయించుకుంది.
ఫోన్ చేసి రావడం వల్లనేమో, బెల్ కొట్టగానే తలుపు తెరుచుకుంది. పాప తండ్రిలా ఉన్నాడు, ‘‘లోపలికి రండి మేడమ్’’ అన్నాడు. మొహమాటంగా నవ్వి లోపలికి అడుగుపెట్టింది. అయన తిన్నగా బెడ్ రూమ్‌లోకి దారి తీశాడు. వెనకాలే వెళ్ళింది. ఆ చిన్న రూమ్‌లో, పరుపు మీద పడుకుని నిద్రపోతోంది భార్గవి. ఆ పిల్లనలా చూడగానే విపరీతమైన ఆందోళన కలిగింది మృదులకి. ఆ కంగారుకి కడుపులో తిప్పడం మొదలైంది. ఊపిరి అందనట్టుగా అనిపిస్తుంటే తమాయించుకుని, గుండెల నిండా గాలి పీల్చుకుంది. మెల్లగా మంచం దగ్గరికి వెళ్లి, భార్గవి చెంపల్ని తాకింది. ఎంత చలాకీ అయిన పిల్ల! క్లాస్‌లో కూడా ఒక్క నిమిషమైనా నిశ్శబ్దంగా ఉండేది కాదు. ‘‘ఎలాగమ్మా ఇలా అయితే? చెప్పేది వినవు, చదవవు’’ అంటే, ‘‘ఏంటో మేడం, నాకు కదలకుండా కూర్చోవాలంటే చాలా కష్టం’’ అనేది. ఇప్పుడిలా ఇంత నిశ్శబ్దంగా ఉండటానికి, ఆ పిచ్చి పిల్ల ఎంత కష్టపడుతోందో పాపం.
‘‘రండి మేడమ్, హాల్లో కూర్చుందాం’’ అన్నాడు భార్గవి తండ్రి. వచ్చి కూర్చుందన్న మాటే గానీ గొంతు పెగలడం లేదు. మాట్లాడటమంత కష్టమైన పని ఇంకేదీ లేదనిపిస్తోంది. మనసంతా ఏదో తెలియని స్తబ్దత.ఎవరో ఒకామె టీ తీసుకొచ్చి ఇచ్చి, మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోవడాన్ని అలా పరధ్యానంగా చూస్తూ ఉండిపోయింది, ‘‘ఇప్పుడెలా ఉందంటారు?’’ అంది ఎలాగోలా చివరికి అయన వైపు తిరిగి. ‘‘ఇప్పుడు నయమే మేడమ్, కీమోథెరపీ పూర్తయ్యాక కంప్లీట్ రెమిషన్‌లో ఉంది. గండం గడిచినట్టే అని చెప్పారు డాక్టర్లు’’ అన్నాడాయన. ముడతలు పడిన ముఖంతో ముసలివాడిలా కనిపిస్తున్నాడు, ఆ మధ్య వయస్కుడు.పిల్లల్ని అలా చూడాల్సిన ఖర్మ ఏ తల్లితండ్రులకీ పట్టకూడదని అనిపించింది మృదులకి. ఆయన చెప్పిన విషయం, తన నిస్తేజాన్ని కొద్దిగా సడలించినట్టుగా అనిస్తుంటే, ‘‘ఎంత మంచి విషయం చెప్పారండీ! అయితే పాప త్వరలో స్కూల్‌కి కూడా రావచ్చేమో’’ అంది.‘‘డాక్టర్ గారు స్కూల్‌కి పంపొచ్చని చెప్పారు మేడమ్, అదే వెళ్లనంటోంది...’’ అంటూ ఆగిపోయాడాయన. మృదులకు ఏమీ అర్థం కాలేదు. ‘‘ఎందుకు మేడమ్, ఆదివారాలు మాత్రం సెలవు? నాకు ఇంటిదగ్గరేం తోచదు’’ అంటూ గారాలు పోయే భార్గవి, ఇప్పుడు స్కూల్‌కి రానంటోందా!‘‘అసలు ఆ పిల్ల ఒక్క క్షణం కుదురుగా ఉండేదా మేడమ్? స్కూల్ మానమన్నా మానేది కాదు. ఇంటికొచ్చినా కూడా, చదవమంటే చదవకుండా, పక్క వాళ్ళిళ్ళకు పోయి ఆడుతూనే ఉండేది. ఈ రోజు దానికి ఇలాంటి గతి పట్టింది. ఆ జుట్టు చూసి అందరూ ఏడిపిస్తారనిట, గుమ్మం కదిలి బయటకే వెళ్లడం లేదు’’ బాధగా తల దించుకున్నాడాయన.
అప్పుడు హఠాత్తుగా ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది, ఇందాక తను చూసిన భార్గవి రూపం. అక్కడక్కడా జుట్టూడిపోయి, తల నిండా ఏర్పడిన ఖాళీలతో. అంతే, మృదులకి వెంటనే అమ్మమ్మ గుర్తొచ్చేసింది.ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ‘‘మరోసారి వస్తా లెండి’’ అని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటపడింది.రాత్రయ్యే సరికల్లా మృదుల మనసు మరింత అల్లకల్లోలంగా తయారైంది. అంత చిన్న పాపకు ఎంత కష్టం? ఎంతటి మహామహులో, అనుభవజ్ఞులో కూడా తట్టుకోలేనంత శారీరకమైన బాధను అంత లేత శరీరం, మనసూ అసలెలా తట్టుకుంటాయి? ఎనిమిదేళ్లయిపోయినా తనకి ఆ రోజు బాగా గుర్తుంది. అమ్మమ్మ పోయిన పదోరోజు. చూడ్డానికొచ్చిన బాబాయ్‌తో నాన్న అంటున్న మాటలు అనుకోకుండా తన చెవిన పడ్డాయి. ‘‘పాపం, పెద్దావిడ నరకమే అనుభవించిందిరా, చివర్రోజుల్లో అయితే ఆ ట్రీట్మెంట్ అసలు తట్టుకోలేకపోయేది. అందుకే నిద్ర మాత్రలు మింగేసింది. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. బాగోదు కదా. మేమేదో సరిగా చూడలేదనుకుంటారు జనం. పాపం మృదమ్మ ఎంత సేవ చేసిందనీ! ఎప్పుడూ ఆవిడ దగ్గరే ఉండేది. దానిక్కూడా ఈ సంగతి తెలీనివ్వలేదురోయ్, దానికి ఆవిడంటే ప్రాణమని నీకు తెలుసు కదా. ఇలా చేసిందని తెలిస్తే తట్టుకోలేదు.’’ ఎవరైనా చూడ్డానికొచ్చినప్పుడు, ఎముకల పోగులాంటి శరీరాన్నైనా అలా వదిలేసి, గుండులా అయిపోయిన తలని దాచుకోవడానికి అమ్మమ్మ పడిన పాట్లు గుర్తొచ్చాయి మృదులకి, ఆ విషయం వినగానే. అర్ధరాత్రి దాటుతున్నా మృదులకి నిద్ర పట్టడం లేదు. మంచం మీద నిస్సహాయంగా పడున్న భార్గవి రూపంతో పాటుగా, రోడ్డు మీద దెబ్బ తగిలి కుంటుతున్న కుక్కపిల్లా, వెన్నెల లేని రాత్రుళ్ళూ, పేవ్‌మెంట్ మీద పడుకుని చలికి వణుకుతున్న ముసలి వాళ్ళూ, వాడిపోయిన పువ్వులూ, ప్లాస్టిక్ సంచుల పళంగా చెత్తని మింగేస్తున్న ఆవులూ, బీడు వారిపోయిన భూములూ, గాల్లో కలిసిపోతున్న విష వాయువులూ.... అలా ఏవేవో గుర్తొస్తున్నాయి. ఎన్నెనో ఆలోచనలు రాత్రంతా, ‘మన చేతిలో ఏమీ లేదా’.
తెల్లారుతుండగానే లేచి తయారయిపోయింది. ‘‘అదేమిటమ్మా, ముందుగా అనుకోనైనా అనుకోలేదే. ఒక్కదానివీ ఎలా వెళ్తావు? రెండురోజులాగు. అందరం కలిసే వెళ్దాం’’ అంటూ తల్లి ఎంతగా చెప్తున్నా వినకుండా సింహాచలం బయలుదేరింది. దేవస్థానం కల్యాణకట్ట చేరుకుంది. ఎదురుగా కూర్చున్న మంగలాయన సందేహంగా చూస్తున్నంతసేపూ తల దించుకుని కూర్చునే ఉంది. పని చేస్తున్నా, ‘‘ఏం ఉంది తల్లీ జుట్టు, ఎలా ఇచ్చేస్తున్నావో గానీ’’ అంటూ అతను గొణుక్కోవడం వింటూనే ఉంది. ఇంటికి చేరగానే, ‘‘ఎంత పని చేశావే, నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని’’ అంటూ తల్లి నెత్తీ నోరూ బాదుకోవడాన్ని నిర్లిప్తంగా గమనించింది. ఇప్పుడే బాధా లేదు. ఏ దుఃఖమూ లేదు. ఉన్నదేదో పోతుందన్న భయం లేదు. మనసు నిండా ఒకటే ప్రశాంతత.తెల్లమొహాలేసుకుని చూస్తున్న పిల్లల మధ్యలోంచి క్లాస్‌లోకి ప్రవేశించింది మృదుల. ‘‘పిల్లలూ, మీకు తెలుసా? భార్గవి ట్రీట్మెంట్ ముగించుకుని ఇంటికొచ్చేసింది. చూడ్డానికి ఎవరెవరెళ్తున్నారు?’’.వెళ్లినవాళ్లంతా ఆ పిల్లకేం చెప్తారో తనకి తెలుసు. ఆమె పెదవుల నిండా చిరునవ్వు పరుచుకుంది. ఇప్పుడోసారి ఇలా బయటకి వచ్చి, నాతో పాటుగా ఆమె చిరునవ్వులోకి తొంగి చూడండి. అదిప్పుడు మునుపటిలా ఏవేవో అందమైన ప్రకృతి దృశ్యాల్ని గుర్తు చేయడం లేదు కదూ! అద్దంలా ఆమె మనసుని మాత్రమే ప్రతిబింబిస్తోంది.
- భవానీ ఫణి
అద్దం లాంటి నవ్వు
Published Sun, Sep 2 2018 1:49 AM | Last Updated on Sun, Sep 2 2018 1:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment