సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి | Software Couple Lost Their Lives In The Simhachalam Wall Collapse Tragic Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Published Wed, Apr 30 2025 10:18 AM | Last Updated on Wed, Apr 30 2025 12:13 PM

Software Couple Lost Their Lives In The Simhachalam Incident

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం కొండపై తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.

అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోం) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.

ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

https://www.sakshi.com/video/news-videos/home-minister-anitha-fake-comments-simhachalam-incident-2437785

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement