అటెండెన్స్‌ ఇక ఆధునికంగా..  | Sakshi
Sakshi News home page

అటెండెన్స్‌ ఇక ఆధునికంగా.. 

Published Mon, Feb 26 2024 4:45 AM

GHMC ends fingerprints policy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్‌ ప్రింట్స్‌ బయోమెట్రిక్‌ స్థానే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత ఫేషియల్‌ రికగ్నిషన్‌ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్‌ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్‌ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల  క్రితం వేలిముద్రల బయోమెట్రిక్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్‌ఎఫ్‌ఏ పరిధిలో ఉండే 21 మంది కార్మికులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు.

అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్‌ఎఫ్‌ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కార్మికులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్‌ బయోమెట్రిక్‌ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్‌ఎఫ్‌ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్‌ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్‌ ప్రింట్స్‌ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్‌ రికగ్నిషన్‌ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. 

ప్రత్యేక యాప్‌తో.. 
ఫేషియల్‌ రికగ్నిషన్‌ను మొబైల్‌ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్‌ తయారు చేస్తారు. యాప్‌ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్‌ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్‌ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్‌ చేస్తారు. 

25 వేల మందికి వర్తింపు.. 
జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్‌ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్‌ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులు గ్రూపులుగా పనులు చేస్తారు.

కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కార్మికుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్‌ అయ్యేలా ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది.  

రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు..
2017లో మే 21 తేదీ నుంచి జూన్‌ 20 వరకు బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్‌ బయో మెట్రిక్‌ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్‌ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్‌ఎంసీ తాజాగా ఫేషియల్‌ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది.  

Advertisement
Advertisement