ఫెవికాల్ వేలి ముద్రలు!
లెక్చరర్ల ‘అటెండెన్స్’లో వృత్తివిద్యా కాలేజీల మాయాజాలం
►బయోమెట్రిక్ మిషన్లను సైతం ఏమారుస్తున్న యాజమాన్యాలు
► విధులకు రాకున్నా వచ్చినట్టుగా నకిలీ వేలి ముద్రలు
►వందలాది కాలేజీల్లో ఇదే మోసం
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 42 మంది లెక్చరర్లు ఉన్నారు. ఇందులో నిత్యం సగానికిపైగా గైర్హాజరవుతారు. కొందరైతే కాలేజీ ముఖం చూడరు! కానీ బయోమెట్రిక్ మిషన్లలో మాత్రం ప్రతిరోజు వేలిముద్రలు సమర్పిస్తారు. కాలేజీకి వచ్చినట్లు హాజరుపట్టీలో ఉంటుంది. వ్యక్తి లేకుండా వేలిముద్రలెలా సమర్పిస్తారు? ఆశ్చర్యమేస్తుంది కదూ.. కాలేజీ యాజమాన్యం మాయాజాలం అదే మరి!...ఈ తతంగం ఒకట్రెండు కాలేజీల్లోనే కాదు.. వందలాది వృత్తివిద్యా కాలేజీల్లో ఇదే తీరు. లెక్చరర్లు రాకున్నా వచ్చినట్టు చూపిస్తుండటంతో ఉన్నత విద్యా శాఖ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తుండగా.. కాలేజీ యాజమాన్యాలు దాన్ని కూడా ఏమార్చేస్తున్నాయి. దీంతో లెక్చరర్లకు చేసే ఖర్చును మిగుల్చుకుంటూ... బోధనను గాలికొదిలేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 310 వృత్తి విద్యా కాలేజీలున్నాయి. ఇందులో 210 ఇంజనీరింగ్ కాలేజీలు కాగా.. మిగతావి ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర కాలేజీలు. కోర్సులకు తగినట్లు ఫ్యాకల్టీ ఉంటేనే వాటికి అనుమతి లభిస్తుంది. ఈ క్రమంలో నిర్దేశిత సంఖ్యలో బోధకులను నియమించుకోవాల్సి ఉండగా.. అంకెల గారడీతో వారిని భర్తీ చేసుకున్నట్లు రికార్డులు సృష్టిస్తూ దొడ్డిదారిలో అనుమతులు పొందుతున్నాయి.
సర్టిఫికెట్లు సమర్పిస్తే లెక్చరరే!
లెక్చరర్ల నియామకాల్లో కాలేజీలు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నాయి. వాస్తవానికి కాలేజీ వేళలో పూర్తిస్థాయిలో పనిచేసే లెక్చరర్లను మాత్రమే నియమించుకోవాలి. అలాకాకుండా పలు కాలేజీ యాజమాన్యాలు నిర్వహణ ఖర్చును తగ్గించుకునేందుకు ఒక్కో లెక్చరర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. మరోవైపు సంఖ్యను సర్దుబాటు చేసేందుకు నకిలీ లెక్చరర్లను సృష్టిస్తున్నాయి. కొందరు పూర్వ విద్యార్థులనే లెక్చరర్లుగా నియమించుకున్నట్లు రికార్డులు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పూర్వ విద్యార్థుల నుంచి సర్టిఫికెట్లను అట్టిపెట్టుకుని వారినే పూర్తిస్థాయి లెక్చరర్లుగా లెక్కల్లో చూపుతున్నాయి. కాలేజీ యాజమాన్యం వద్ద సర్టిఫికెట్లు పెట్టినందుకు సదరు విద్యార్థులకు నెలకు రూ.4 వేల నుంచి రూ.8 వేల దాకా చెల్లిస్తున్నాయి. దీంతో తరగతి గదిలో పాఠం చెప్పని, కాలేజీ ముఖం చూడని వారంతా సీనియర్ లెక్చరర్‌గా చెలామణి అవుతున్నారు.
వేలి ముద్రలో ఇలా మాయ..
వేలిముద్రల విషయంలో అక్రమాలకు కాలేజీలు కొత్త పద్ధతి పాటిస్తున్నాయి. లెక్చరర్లుగా జాబితాలో పేర్లు చేర్చిన తర్వాత వారి వేలిముద్రలను కొత్త పరిజ్ఞానంతో స్వీకరిస్తారు. సదరు వ్యక్తి వేలికి ప్రత్యేకమైన రసాయనాన్ని పూసి దానిపై ఫెవికాల్‌ను మందంపాటిగా రుద్దుతారు. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత క్రమపద్ధతిలో తొలగిస్తారు. దీంతో ఆ వ్యక్తి వేలిముద్రలు మందంపాటి ఫెవికాల్ తొడుగుకు వచ్చేస్తాయి. అలా వచ్చిన వేలిముద్రలను బయోమెట్రిక్ మిషన్లో ప్రవేశపెట్టి హాజరు నమోదు చేస్తారు. ఈ వ్యవహారాన్ని సాఫీగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కాలేజీలో ఒక ఉద్యోగిని కూడా నియమించుకుంటున్నారు.
అంతా కనికట్టు..
ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం బయోమెట్రిక్ హాజరు విధానం కొనసాగుతోంది. లెక్చరర్ల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ హాజరు తీరు ఆధారంగా కాలేజీల నిర్వహణను ఉన్నత విద్యాశాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ హాజరు తీరులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. లెక్చరర్లు విధులకు హాజరు కానప్పటికీ అటెండెన్స్ మాత్రం పూర్తిస్థాయిలో నమోదవుతోంది. బయోమెట్రిక్ మిషన్లలో వేసే వేలిముద్రలను ఏమార్చుతున్నారు. ఇదే సమాచారాన్ని సంబంధిత ఉన్నత శాఖలకు పంపుతూ నిర్వహణ పక్కాగా ఉన్నట్లు గణాంకాలు చూపుతున్నారు.
పైన చిత్రంలోని బాక్సుల్లో కనిపిస్తున్నవి ఫెవికాల్‌తో తయారుచేసిన వేలి ముద్రల తొడుగులు. వీటిని కింద ఉన్నచిత్రంలో కనిపిస్తున్న గన్‌లాంటి పరికరానికి తొడుగుతారు. ఆ గన్‌లోంచి ఓ లిక్విడ్ వచ్చి తొడుగులు ఉబ్బుతాయి. వాటిని తీసుకెళ్లి బయోమెట్రిక్ మిషన్‌పై నొక్కుతారు. దీంతో కాలేజీకి లెక్చరర్ రాకుండానే వచ్చినట్టుగా నమోదు చేసి బురిడీ కొట్టిస్తారు..