
ఫింగర్ ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ డివైజ్‌లతో నేరగాళ్లకు చెక్
2 నెలల్లోనే 17 మంది వాంటెడ్ క్రిమినల్స్ గుర్తింపు
వీటితోనే ఎనిమిది అనాథ శవాల జాడ కనుగొన్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నేరస్తుల ఆట కట్టించటంలో తెలంగాణ పోలీసులు ఇతరులకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటున్నారు. ప్రస్తుతం వీరు వాడుతున్న ఫింగర్ ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ డివైస్‌లు నేరస్తులను గుర్తించటంలో అద్భుత ఫలితాలిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే పోలీస్ సిబ్బందితోపాటు స్పెషల్ బ్రాంచి (ఎస్‌బీ) సిబ్బంది ఈ డివైజ్‌లు వాడుతున్నారు. అనుమానితుల వేలిముద్రలను తీసుకుని పోలీస్ డేటాబేస్‌లోని వేలిముద్రలతో సరిపోల్చి చూస్తున్నారు.
దీంతో రియల్ టైంలోనే నేరస్తులను గుర్తించగలుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ఫిబ్రవరి 15 వరకు ఫింగర్‌ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ డివైజ్‌ల ద్వారా 17 మంది వాంటెడ్ క్రిమినల్స్‌ను గుర్తించారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల తనిఖీ సమయంలోనూ ఎస్‌బీ సిబ్బంది ఈ డివైజ్‌లను వినియోగిస్తున్నారు.
దరఖాస్తుదారుడు తనపై ఉన్న కేసుల వివరాలు దాచినా.. ఈ డివైజ్ ద్వారా పాత కేసులను గుర్తించవచ్చు. ఇటీవల ఇలా ఓ నేరస్తుడిని గుర్తించారు. అనాథ శవాల వివరాలు కనుక్కోవడం కోసం కూడా వీటిని వినియోగిస్తున్నారు. చనిపోయిన వారి వేలిముద్రల ఆధారంగా వారి వివరాలు గుర్తిస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు 8 అనాథ శవాల వివరాలు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment